‘పరిహార నిధి’కి సై | COP27: Sameh Shoukry urges countries to reinforce UNFCCC credibility as talks drag on | Sakshi
Sakshi News home page

‘పరిహార నిధి’కి సై

Published Mon, Nov 21 2022 5:11 AM | Last Updated on Mon, Nov 21 2022 5:11 AM

COP27: Sameh Shoukry urges countries to reinforce UNFCCC credibility as talks drag on - Sakshi

ప్రసంగిస్తున్న సమీ షౌక్రీ

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లో ని షెర్మ్‌–ఎల్‌–షేక్‌ నగరంలో నిర్వహించిన భాగస్వామ్య పక్షాల సదస్సు(కాప్‌–27) ముగిసింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలన్నీ దశలవారీగా తగ్గించుకోవాలంటూ భారత్‌ ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది.

వాతావరణ మార్పులు, తద్వారా సంభవించే విపత్తుల వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తూ ఒప్పందానికి రావడం చరిత్రాత్మకమని భారత్‌ అభివర్ణించింది. ఇలాంటి ఒప్పందం కోసమే ప్రపంచం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం కాప్‌–27 సదస్సు శుక్రవారమే ముగిసిపోవాలి. కానీ, కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంతోపాటు ‘లాస్‌ అండ్‌ డ్యామేజీ ఫండ్‌’పై చర్చించాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని పలు దేశాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఒక రోజు ఆలస్యంగా ముగిసింది.  కాప్‌–27 అధ్యక్షుడు సమీ షౌక్రీ ముగింపు ఉపన్యాసం చేశారు.

తలవంచిన బడా దేశాలు  
పరిహార నిధి కోసం భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. బడా దేశాల నిర్వాకం వల్ల తాము బలవుతున్నామని వాపోతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులు విషయంలో సంపన్న దేశాలదే ప్రధాన పాత్ర. పరిహార నిధి ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అమెరికా సహా పలు సంపన్న దేశాలు తొలుత వ్యతిరేకించాయి. ప్రపంచంలో ఎక్కడ విపత్తులు చోటుచేసుకున్నా చట్టప్రకారం తామే పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళనే ఇందుకు కారణం. కానీ, చైనా సహా ఇతర చిన్నదేశాలు, ద్వీప దేశాలు గట్టిగా గొంతెత్తడంతో బడా దేశాలు తలవంచక తప్పలేదు. పరిహార నిధిపై ఒప్పందం కుదరకుండా తాము కాప్‌–27 నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని పేద దేశాలు తేల్చిచెప్పడం గమనార్హం.   

పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి  
చమురు, గ్యాస్‌ సహా శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించుకోవాలన్న భారత్‌ సూచన పట్ల కాప్‌–27లో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) తదితర దేశాలు అంగీకారం తెలపడం కీలక పరిణామం అని చెప్పొచ్చు. అయితే, దీనిపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. పర్యావరణ విపత్తులు పెచ్చరిల్లుతుండడంతో సమీప భవిష్యత్తులోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పునరుత్పాక ఇంధన వనరులపై ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కాప్‌–27లో నిపుణులు సూచించారు.

బొగ్గు వాడకాన్ని నిలిపివేస్తూ స్వల్ప ఉద్గారాల ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని ‘షెర్మ్‌–ఎల్‌–షేక్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌’ పిలుపునిచ్చింది. వ్యవసాయం, ఆహార భద్రత విషయంలో క్లైమేట్‌ యాక్షన్‌పై కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ సూచించారు. కాప్‌–27లో ఆయన మాట్లాడారు. కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను కేవలం సన్న, చిన్నకారు రైతులపైనే మోపకూడదని చెప్పారు. కాప్‌–27 నిర్ణయాలు, ఒప్పందాలపై ఆఫ్రికా నిపుణుడు మొహమ్మద్‌ అడోవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement