
న్యూయార్క్: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది.
తాజాగా ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్ లేవనెత్తింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్ బాధితుల’ కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇటీవల అంగీకరించడాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ను ఎందుకు క్షమించాలి. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
VIDEO | Speaking at launch of Victims of Terrorism Associations Network, Deputy Permanent Representative of India in UN, Yojna Patel, said: "It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless… pic.twitter.com/I0tMhjjcmW
— Press Trust of India (@PTI_News) April 29, 2025
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సోవియట్ యూనియన్ యుద్ధం, భారత్‌లో జరిగిన 9/11 దాడుల్లో పాల్గొనకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేది. భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.