
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్‌ఏ)గా నియమిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్‌ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌కు ఎన్‌ఎస్‌ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది.
ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు.
దీంతో పాక్ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ గల్లంతైంది. భారత్ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి.
బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు, పాక్ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్ మాలిక్‌కు పాక్ ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.