
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, భారత్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన భారత్.. దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏయే రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించిన భారత సైనిక అధికారులు.. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని.. దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ (Pakistan) కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) రద్దు చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని స్కర్దు, గిల్గిత్‌కు నడిచే విమాన సర్వీసులను పీఐఏ నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.