cease fire violation
-
Sudan: ప్చ్.. అంత చేసినా సీన్ మారలేదా?
వారంపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ బలగం(RSF).. మళ్లీ కయ్యానికి దిగాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మళ్లీ తలపడడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా దౌత్యంతో ఎట్టకేలకు వారంపాటు కాల్పుల విరమణకు సూడాన్‌లో అంతర్యుద్ధానికి దిగిన ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే.. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ విరమణ అమలులోకి రాగా.. కాసేపటికే ఇరు వర్గాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. చాలా ప్రాంతాల్లో మళ్లీ కాల్పులకు, వైమానిక దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా రాజధాని ఖార్తోమ్‌లో ఈ దాడులు హోరాహోరీగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇరువర్గాలతో పలుదఫాలుగా చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాల ద్వారా కాల్పుల విమరణకు ఒప్పించాయి అమెరికా, సౌదీ అరేబియాలు. తద్వారా తీవ్ర మారణ హోమం నుంచి వీలైనంత మేర ప్రజల్ని తప్పించాలని భావించాయి. అంతేకాదు.. గతంలో కాల్పుల విమరణ ఉల్లంఘనలా తరహా కాకుండా ఈసారి ఇరువర్గాలు కచ్చితంగా పాటిస్తాయని ఈ సందర్భంగా ఆ దేశాలు భావించాయి. అందుకు తగ్గట్లే ఆర్ఎస్ఎఫ్ నేత మొహమ్మద్ హమ్దాన్ డగాలో.. సౌదీ అరేబియా, అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్ ద్వారా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. కానీ, పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు. పక్కా ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించి ఇరువర్గాలు మళ్లీ తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్మీ, పారామిలిటరీ బలగం ఆర్ఎస్ఎఫ్ మధ్య ఆధిపత్య పోరులో సూడాన్ సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఐదువారాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో వందల మంది మరణించగా.. లక్షల మంది చెల్లాచెదురు అయ్యారు. -
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్‌లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు. -
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ చెలరేగిందిలా..
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు ఇప్పటివరకూ 222 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఈ ఏడాది పాక్ సైన్యం సరిహద్దుల్లో 1900 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడగా ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ను రద్దు చేసిన 25 రోజుల్లోనే పాక్ 222 సార్లు కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగిందని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు తెలిపాయి. ఆగస్ట్ 5 నుంచి పాకిస్తాన్ సగటున రోజుకు 10 కాల్పుల విరమణ ఉల్లంఘనలకు దిగిందని వెల్లడైంది. పాక్ సైన్యం కవ్వింపు చర్యలతో ఇరు పక్షాల మధ్య కాల్పుల ఘటనలకు దారితీసి ఉద్రిక్తతలు పెరిగాయి. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మలిచేందుకు పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పాటు సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ప్రేరేపిస్తోంది. పాక్ ఆగడాలను భారత సేనలు దీటుగా తిప్పికొట్టడంతో నిరాశలో కూరుకుపోయిన పాక్ తన కుయుక్తులకు పదునుపెడుతూనే ఉంది. మరోవైపు గుజరాత్ తీరంలోకి సముద్ర మార్గం ద్వారా పాక్ కమాండోలు, ఉగ్రవాదులు ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
యుద్ధానికి పాక్ సన్నాహాలు
ఇస్లామాబాద్ : ఇండో-పాక్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత మెరుపుదాడులపై తీవ్ర అసహనంతో ఊగిపోతున్న పాక్ ప్రతిదాడులకు సిద్ధమని పేర్కొనడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతల గాంభీర్య ప్రకటనలకు తోడు అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సేనలు, ట్యాంక్‌లు మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో పదిమంది జవాన్లు గాయపడ్డారు. పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. భారత సేనలు ప్రతిఘటించడంతో పాక్ వైపు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. మంజికోట్,పూంచ్, నౌషెరా, రాజోరి, అఖ్నూర్, సియోల్‌కోట్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. -
మీ ఇష్టం ఇక చెలరేగిపోండి
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో పాకిస్థాన్ కవ్వింపు చర్యలపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇకపై సహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులను ధీటుగా స్పందించాలని.. ఇందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు సైన్యాధికారులకు(కమాండర్) ఆదేశాలు జారీ చేసింది. ‘గత కొన్ని వారాలుగా సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రాను రాను ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. దానికి భారత్ కూడా గట్టి సమాధానమే ఇస్తోంది. ఇకపై దూకుడు మరింత పెంచండి. పాక్ సైన్యం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించినా, ఉగ్రవాదులకు దాడులకు-చొరబాటులకు యత్నించినా మీరూ ధాటిగానే సమాధానం ఇవ్వండి. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఎంతటికైనా తెగించండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. చర్యలకు దిగినా... సైన్యం మీకు పూర్తి సహకారం అందిస్తుంది’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తాజాగా సరిహద్దులో దాడులు తీవ్ర తరం కావటం చూస్తున్నాం. జమ్ము లోని రాజౌరీ ఉగ్రదాడిలో నలుగురు సైనికులు, సుంజువాన్ మిలిటరీ స్టేషన్ పై ఉగ్రదాడిలో ఓ పౌరుడు సహా ఆరుగురు సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో ఇకపై ఉపేక్షించాల్సిన అవసరం లేదని భారత సైన్యం నిర్ణయించుకున్నట్లు స్పష్టమౌతోంది. భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ‘పాక్ ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించటం తెలిసిందే. -
నౌషెరాలో పాక్ కాల్పులు
రాజౌరి: నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ గురువారం మరోమారు ఉల్లంఘించింది. తెల్లవారుజామున నౌషెరా సెక్టార్లో కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరోకరు గాయాలపాలయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.