COP27 Conference
-
Tuvalu: ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశం.. ఉనికి మాటేమిటి?!
తాజాగా ఈజిప్టులో ముగిసిన కాప్ 27 సదస్సు మరోసారి ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలపై చర్చకు వేదిక అయ్యింది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో జరిగిన ఈ సమావేశం చివరకు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోగలిగినందుకు సంతోషించాల్సిందే. పర్యావరణ మార్పుల వల్ల నష్టపోతున్న బడుగు దేశాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. వాస్తవంగా ప్రపంచం పర్యావరణ ప్రమాదం బారిన పడటానికి ప్రధాన కారణం కాలుష్య కారకాలుగా మారిన ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే. గ్రీస్‌హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల పైనే ఉంటుంది. అది ఒక చర్చనీయాంశం. ఈ సమావేశం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం ‘టువాలు’. ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరిగిన కాప్ 27 సమావేశంలో టువాలు ప్రపంచం ముందు ఒక సవాలుగా నిలబడింది. ప్రపంచ బాధ్యతను గుర్తు చేసింది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన అంశమే. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే మరో 60, 70 ఏళ్ళల్లో ఈ ద్వీప దేశం జల సమాధి కాకుండా ఎవరూ ఆపలేరు. టువాలు మొత్తం 9 ద్వీపాల సమూహం. హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒకదాని వెంట ఒకటిగా చిన్న చిన్న దీవులు బారులు తీరి ఉంటాయి. దేశం మొత్తం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే సుమారు 6400 ఎకరాలు. 2022 జనాభా అంచనా ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 11 వేల 200. బ్రిటన్ నుండి 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 542 మీటర్ల ఎత్తున ఉంటే... సముద్రం ఒడ్డునే ఉన్న విశాఖపట్నం 45 మీటర్ల ఎత్తున ఉంది. దీన్ని బట్టి టువాలు పరిస్థితిని అంచనా వేయవచ్చు. సముద్ర మట్టానికి ఇంకా తక్కువలో ఉన్న మరో ద్వీప దేశం మాల్దీవులు. సముద్ర మట్టాలు పెరుగుతున్న కొద్దీ ఈ దేశాల ఉనికి ప్రమాదం దిశగా పయనిస్తున్నట్లే. టువాలు కంటే ఆర్థికంగా కాస్త బలమైన మాల్దీవులు తమ దేశాన్ని కాపాడు కోవటానికి తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. 20 వేల మంది జనాభాకు కృత్రిమంగా నిర్మిస్తున్న ఫ్లోటింగ్ సిటీ ఆవాసంగా మారనుంది. ఇటువంటి ఏర్పాట్లు చేసుకునే స్థోమత టువాలుకి లేదు. అందుకే అది తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భౌగోళిక స్వరూపం, రోడ్లు, నిర్మాణాలు.. మొత్తంగా తన అస్తిత్వాన్ని భద్ర పరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తమ దేశాన్ని వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికత ఉపయోగించి ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశంగా అయినా మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇక్కడే కొన్ని కీలకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ దేశంలోని జనాభాకు భౌతికంగా భూ మండలంపై ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. పోనీ ఏదో ఒక దేశం స్వాగతించినా వీరు ఆ దేశానికి వలసదారులు, లేదంటే ఆ దేశ పౌరులు అనే హోదాను మాత్రమే పొందగలుగుతారు. మరి టువాలు సార్వభౌమత్వం సంగతి ఏంటి? స్వయం పాలనకు అవకాశం కోల్పోవటమేనా? దేశం సముద్రంలో మునిగిపోతే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పుడు ఉన్న హక్కులు, మెరైన్ సరిహద్దు పరిధిలో ఉండే సహజ వనరులను కోల్పోక తప్పదా? భౌతికంగా కనిపించని టువాలును ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంటుందా? టువాలు ఇవాళ ప్రపంచం ముందు ఒక ప్రశ్నగా నిలబడి ఉంది. (క్లిక్ చేయండి: ముందు నుయ్యి... వెనుక గొయ్యి) - రెహాన సీనియర్ జర్నలిస్ట్ -
COP27: కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే
ఈజిప్టులో జరిగిన ‘కాప్ 27’ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ ఈసారి హాట్ టాపిక్! వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన ఈ పేమెంట్ ఓవర్‌డ్యూ. అయితే ఈ దేశాలు తాము అంగీకరించిన విషయాల్లోనూ వెనకడుగు వేస్తుండటంతో వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉండటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించే విధానాలు రావాలి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టు, కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే! ఈజిప్టులోని షర్మ్ అల్–షేఖ్లో నవంబరు ఆరున మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 27వ సమావేశాలు ముగిశాయి. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైౖమేట్ ఛేంజెస్ (యూఎన్ఎఫ్సీసీసీ) ఆధ్వర్యంలో నడిచిన ఈ సమావేశాల్లో తీవ్ర చర్చోపచర్చలు, వాదోప వాదాలు జరిగి, ఒక్కరోజు పొడిగింపు తరువాత నవంబరు 20వ తేదీ తెల్లవారుజామున ముగిశాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేదెలా అన్న అంశంపై ఏటా జరిగే ‘కాప్’ సమావేశాల్లో ఈసారి ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ అంశంపై తీవ్రస్థాయి ప్రతిష్టంభన ఏర్ప డింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావనను సంక్షి ప్తంగా పేమెంట్ ఓవర్‌డ్యూ అని పిలుస్తున్నారు. ఈ అంశంపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. నవంబరు 18నే ముగియాల్సిన చర్చలు ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా కొనసాగాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్ కలుగచేసుకుని, కార్యాచరణకు దిగాల్సిన సమయ మిదేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘‘కాప్27 సమావేశాలు నవం బరు 18నే ముగియాల్సి ఉండింది. అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక రోజుపాటు పొడిగించారు’’ అని భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఏళ్లుగా జరుగుతున్న చర్చలు తరచూ ఆయా దేశాలు, వర్గాల మధ్య కలహాలు, జగడాలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ దేశాలు, వర్గాలు సంకుచితమైన భావాలతో... ఇతరులపై పైచేయి సాధించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా మారిపోయాయి. ‘‘వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగిపోకుండా స్థిరీకరించాల్సి ఉంది’’ అన్న యూఎన్ ఎఫ్‌సీసీసీ ఆర్టికల్ 2 లక్ష్యాన్ని 30 ఏళ్లయినా అందుకోలేకపోవడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణమని చెప్పాలి. ఈ ఏడాది జూన్ రెండున స్టాక్‌హోమ్+ 50 సమావేశాల్లోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ వాతావరణ అత్యయిక పరిస్థితిపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మూప్పేట ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏటికేడాదీ ప్రజ లను చంపేయడమే కాకుండా... నిరాశ్రయులను చేస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు మనం మన తీరుతెన్నులు మార్చుకోవాలి. ప్రకృతిపై చేస్తున్న మతిలేని ఆత్మహత్యా సదృశమైన పోరును ఆపాలి’’ అని ఆంటోనియో గుటెరస్ విస్పష్టంగా పేర్కొ న్నారు. ఈ హెచ్చరికలు 1992లో యూఎన్ఎఫ్సీసీసీ... రియో సద స్సులో ఆమోదించిన తీర్మానాన్ని ధ్రువీకరించాయని చెప్పాలి. ‘‘ప్రపం చంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి... ఎక్కువ కాలం కొనసాగేది కాదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రకృతిని జయించాలన్న మానవ కాంక్ష మన మనగడనే ప్రశ్నార్థకం చేసే స్థితికి తీసుకొచ్చింది’’ అన్నది ఆ రియో సదస్సు తీర్మానం. ‘ఎన్విజనింగ్ అవర్ ఎన్విరాన్ మెంటల్ ఫ్యూచర్’ పేరుతో 2002లో వెలువడ్డ ఓ పుస్తకంలోనూ ‘‘పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన హెచ్చరికలు వెలువడు తున్న ఈ తరుణంలో మన భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసు కోవాల్సిన చర్యలకు తగినంత సమయం లేదన్నది గుర్తించాలి’’ అని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. యూఎన్ఎఫ్సీసీసీలో దాదాపు 198 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాతావరణ మార్పులన్నవి మానవాళికి అత్యంత ఆందోళ నకారి అని అంగీకరిస్తూ అందరితోనూ తొలినాళ్లలోనే ఒక ఒప్పందం చేసింది ఈ సంస్థ. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ప్యారిస్ ఒప్పందాల ద్వారా యూఎన్ఎఫ్సీసీసీ వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు మూడు చట్టపరమైన ఆయుధాలు కలిగి ఉంది. రియో సదస్సు జరిగి ముప్ఫై ఏళ్లయిన సందర్భం ఇది. 2050 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలన్న శాస్త్రీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఇదే అవకాశం. ఎందుకంటే... ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ద ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైౖమేట్ ఛేంజ్’ విడుదల చేసిన ఆరవ అంచనా నివేదిక కూడా... గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. గత నెలలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్‌కు చెందిన ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా ప్యారిస్ ఒప్పందం అమలులో వెనుకబడుతున్నామనీ, లక్ష్యాన్ని అందుకు నేందుకు నమ్మ దగ్గ మార్గమేదీ లేని నేపథ్యంలో వాతావరణ పెను విపత్తును నివారిం చేందుకు అత్యవసరంగా ఓ విస్తృతమైన మార్పు అనివార్యం అవు తుందనీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల సమస్య అనేది ఇప్పుడు కేవలం ఒక ఆందోళనకరమైన అంశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తాన్ని పీడించగలదని అందరూ గుర్తించాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకూ చేసిన కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించేలా విధానాలు లేకుండా పోయాయి. భూమ్మీద అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికా వాతావరణ మార్పులపై పోరు విషయంలో కప్పదాట్లు వేయడం, 2019లో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తరువాత 2021లో మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించడం అభివృద్ధి చెందిన దేశాల తీరుకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాకుండా... వాతా వరణ మార్పులపై జరిగిన ఒప్పందాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపు తుంది కూడా. అంతర్జాతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఒడిదుడుకులకు గురయ్యేందుకు యూఎన్ఎఫ్సీసీసీ తన ప్రధాన సిద్ధాంతం నుంచి కొంత పక్కదారి పట్టడమే కారణమని అనిపిస్తుంది. వాతావరణ మార్పుల సమస్య అందరిదైనా... బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని చెప్పే సిద్ధాంతం మాత్రమే కాకుండా... క్యోటో ప్రోటో కాల్లోని కొన్ని కీలకాంశాల్లో సడలింపులు, ప్యారిస్ ఒప్పందంలోనూ బాధ్యతల విషయంలో ఆయా దేశాలు తమకు తగ్గ నిర్ణయం తీసు కుంటాయని చెప్పడం... వెరసి వాతావరణ మార్పులపై మనిషి పోరు నిర్వీర్యం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయేందుకు కారణమని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన అంశాల నుంచి వెనక్కు వెళ్లడం... వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలు నేతృత్వం వహించాలని యూఎన్ఎఫ్సీసీసీ చేసిన ప్రకటనను వెక్కిరించేదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తీరు యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్యాలకు పూర్తిగా భిన్నమన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యూఎన్ ఎఫ్‌సీసీసీ నిబంధనల ప్రకారం... అభివృద్ధి చెందిన దేశాలు నేతృత్వం వహించేందుకూ; అవసరమైన అంశాల్లో తామిచ్చిన హామీల అమలు జరుగుతున్నదా లేదా అన్నది సమీక్షించేందుకూ తగిన ఏర్పాట్లు చేయాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఈజిప్టులో ఇటీవల ముగిసిన కాప్ 27 సమావేశాల సారాంశమూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తగిన చర్యలు తీసుకోకపోతే ప్యారిస్ ఒప్పందం ప్రకారం జాతీయంగా నిర్దే శించుకున్న కంట్రిబ్యూషన్స్ వల్ల తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభివృద్ధి చెందుతున్న దేశాలూ త్వరలో గుర్తిస్తాయి. ఈ విషయాల న్నింటినీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై చర్చలను నిర్వహించడానికి మాత్రమే పరిమితమైన జనరల్ అసెంబ్లీ సమస్య మరింత తీవ్రమైనది అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. యూన్ఎఫ్సీసీసీతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలుకు, భవిష్యత్తు కార్యాచరణకు తగిన తీర్మానాలు చేయాలి. భరత్ హెచ్. దేశాయి, వ్యాసకర్త ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, జేఎన్‌యూ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Cop27: ఉత్తమాటల ఊరేగింపు
ఆచరణలో ఆశించిన పురోగతి లేనప్పుడు మాటల ఆర్భాటాల వల్ల ఉపయోగం ఏముంటుంది! ఈజిప్టులోని రేవుపట్నమైన షర్మ్ ఎల్–షేక్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) సారథ్యంలోని ‘పర్యా వరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్–కాప్–27) ఆదివారం ముగిశాక అదే భావన కలుగుతోంది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందం కింద పెట్టుకున్న లక్ష్యాలపై వేగంగా ముందుకు నడిచేందుకు ప్రపంచ దేశాలు కలసి వస్తాయనుకుంటే అది జరగలేదు. అది ఈ ‘కాప్– 27’ వైఫల్యమే. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై స్పష్టమైన హామీ లభించక పోవడంతో సదస్సుతో అందివచ్చిన అవకాశం చేజారినట్టయింది. అలాగని అసలు శుభవార్తలేమీ లేవని కాదు. కాలుష్యకారక ధనిక దేశాల వల్ల పర్యావరణ మార్పులు తలెత్తి, ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న అమాయకపు దేశాల కోసం ‘నష్టపరిహార నిధి’ విషయంలో గత ఏడాది ఓ అంగీకారం కుదిరింది. దానిపై ఈసారి ఒక అడుగు ముందుకు పడింది. అది ఈ సదస్సులో చెప్పుకోదగ్గ విజ యమే. వెరసి, కొద్దిగా తీపి, చాలావరకు చేదుల సమ్మిశ్రమంగా ముగిసిన సదస్సు ఇది. సదస్సు ఫలితాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది అందుకే! పుడమితల్లి ఇప్పటికీ ‘అత్యవసర గది’లోనే ఉంది. గ్రీన్హౌస్ వాయువులను తక్షణమే గణనీయంగా తగ్గించా ల్సిన అవసరాన్ని ‘కాప్ గుర్తించలేదు’ అన్నది ఆయన మాట. అదే భావన ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. పారిశ్రామికీకరణ అనంతరం విపరీతంగా కర్బన ఉద్గారాలకు కారణమైన ధనిక దేశాలు ‘నష్టపరిహార నిధి’కి ఒప్పుకోవడం కూడా ఆషామాషీగా ఏమీ జరగలేదు. 134 వర్ధమాన దేశాల బృందమైన ‘జి–77’ ఈ అంశంపై కట్టుగా, గట్టిగా నిలబడడంతో అది సాధ్యమైంది. ఈ నిధి ఆలోచన కనీసం 3 దశాబ్దాల క్రితం నాటిది. ఇన్నాళ్ళకు అది పట్టాలెక్కుతోంది. దాన్నిబట్టి వాతావరణ మార్పులపై అర్థవంతమైన బాధ్యత తీసుకోవడానికి ధనిక దేశాలు ఇప్పటికీ అనిష్టంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. పైపెచ్చు, ‘వాతావరణ బాధ్యతల నాయకత్వం’ వర్ధమాన ప్రపంచమే చేపట్టాలన్న అభ్యర్థన దీనికి పరాకాష్ఠ. చిత్రమేమిటంటే – ఈ నష్టపరిహార నిధిని ఎలా ఆచరణలోకి తెస్తారన్న వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం! ఆ నిధిని ఎలా సమకూర్చాలి, ఎప్పటికి అమలులోకి తేవాలనేది పేర్కొనలేదు. వాటిని ఖరారు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సదస్సు తీర్మానంలో చెప్పారే తప్ప, దానికీ తుది గడువేదీ పెట్టకపోవడం విడ్డూరం. అంతేకాక, దీర్ఘకాలంగా తాము చేసిన వాతావరణ నష్టానికి బాధ్యత వహించడానికి ఇష్టపడని ధనిక దేశాలు వర్తమాన ఉద్గారాలపైనే దృష్టి పెట్టనున్నాయి. ఆ రకంగా వర్ధమాన దేశాలకు ఇది కూడా దెబ్బే. ఇక, పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకే భూతాపోన్నతిని నియంత్రించాలని చాలాకాలంగా ‘కాప్’లో చెప్పుకుంటున్న సంకల్పం. ఈసారీ అదే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే దశలవారీగా శిలాజ ఇంధన వినియోగాన్ని ఆపేయడం కీలకం. గ్లాస్గోలో జరిగిన గడచిన ‘కాప్–26’లోనే ఇష్టారాజ్యపు బొగ్గు వినియోగాన్ని దశలవారీగా ఆపేందుకు అంగీకరించారు. తీరా దానిపై ఇప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరనే లేదు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై భారత్ తన వాణి బలంగా వినిపిస్తూ వచ్చింది. పునరుద్ధరణీయ ఇంధనాల వైపు వెళతామంటూ మన దేశం ఇప్పటికే గణనీయమైన హామీలిచ్చింది. కాకపోతే, ఒక్క బొగ్గే కాకుండా చమురు, సహజ వాయువులను సైతం శిలాజ ఇంధనాల్లో చేర్చాలని పట్టుబట్టింది. చివరకు మన డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావనా లేకుండానే ముసాయిదా ఒప్పందం జారీ అయింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తడంతో, యూరోపియన్ దేశాలు మళ్ళీ బొగ్గుపైనే ఆధారపడే విధానాలకు తిరిగొచ్చాయి. శిలాజ ఇంధన వినియోగ లాబీదే పైచేయిగా మారింది. ఇది చాలదన్నట్టు వచ్చే ఏడాది జరిగే ‘కాప్’ సదస్సుకు చమురు దేశమైన యూఏఈ అధ్యక్షత వహించనుంది. కాబట్టి, భూతాపోన్నతిని నియత్రించేలా ఉద్గారాలను తగ్గించడమనే లక్ష్యం కాస్తా చర్చల్లో కొట్టుకుపోయింది. నవంబర్ 18కే ఈ సదస్సు ముగియాల్సి ఉంది. అయితే, పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరక సదస్సును మరో రోజు పొడిగించారు. కానీ, సాధించినదేమిటంటే ‘నిధి’ ఏర్పాటు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి. ఆ మాటకొస్తే, ఒక్క కరోనా ఉద్ధృతి వేళ మినహా... 1995లో బెర్లిన్‌లోని ‘కాప్–1’ నుంచి ఈజిప్ట్‌లోని ఈ ఏటి ‘కాప్–27’ వరకు ఇన్నేళ్ళుగా కర్బన ఉద్గారాలు నిర్దయగా పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. మన నివాసాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ సదస్సులతో గణనీయ లాభాలుంటాయనే అత్యాశ లేకున్నా, తాజా ‘కాప్–27’ అంచనాలను అధఃపాతాళానికి తీసుకెళ్ళింది. నియంతృత్వ పాలనలోని దేశంలో, ప్రపంచంలోని అతి పెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారక సంస్థ స్పాన్సర్‌గా, 600 మందికి పైగా శిలాజ ఇంధన సమర్థక ప్రతినిధులు హాజరైన సదస్సు – ఇలా ముగియడం ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో ఇదే అతి పెద్ద ఫ్లాప్ షో అన్న మాట వినిపిస్తున్నది అందుకే. ఈ పరిస్థితి మారాలి. ఏటేటా పాడిందే పాడుతూ, వివిధ దేశాధినేతల గ్రూప్ ఫోటోల హంగామాగా ‘కాప్’ మిగిలిపోతే కష్టం. వట్టి ఊకదంపుడు మాటల జాతరగా మారిపోతే మన ధరిత్రికి తీరని నష్టం. -
‘పరిహార నిధి’కి సై
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లో ని షెర్మ్–ఎల్–షేక్ నగరంలో నిర్వహించిన భాగస్వామ్య పక్షాల సదస్సు(కాప్–27) ముగిసింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలన్నీ దశలవారీగా తగ్గించుకోవాలంటూ భారత్ ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది. వాతావరణ మార్పులు, తద్వారా సంభవించే విపత్తుల వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తూ ఒప్పందానికి రావడం చరిత్రాత్మకమని భారత్ అభివర్ణించింది. ఇలాంటి ఒప్పందం కోసమే ప్రపంచం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం కాప్–27 సదస్సు శుక్రవారమే ముగిసిపోవాలి. కానీ, కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంతోపాటు ‘లాస్ అండ్ డ్యామేజీ ఫండ్’పై చర్చించాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని పలు దేశాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఒక రోజు ఆలస్యంగా ముగిసింది. కాప్–27 అధ్యక్షుడు సమీ షౌక్రీ ముగింపు ఉపన్యాసం చేశారు. తలవంచిన బడా దేశాలు పరిహార నిధి కోసం భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బడా దేశాల నిర్వాకం వల్ల తాము బలవుతున్నామని వాపోతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులు విషయంలో సంపన్న దేశాలదే ప్రధాన పాత్ర. పరిహార నిధి ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అమెరికా సహా పలు సంపన్న దేశాలు తొలుత వ్యతిరేకించాయి. ప్రపంచంలో ఎక్కడ విపత్తులు చోటుచేసుకున్నా చట్టప్రకారం తామే పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళనే ఇందుకు కారణం. కానీ, చైనా సహా ఇతర చిన్నదేశాలు, ద్వీప దేశాలు గట్టిగా గొంతెత్తడంతో బడా దేశాలు తలవంచక తప్పలేదు. పరిహార నిధిపై ఒప్పందం కుదరకుండా తాము కాప్–27 నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని పేద దేశాలు తేల్చిచెప్పడం గమనార్హం. పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి చమురు, గ్యాస్ సహా శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించుకోవాలన్న భారత్ సూచన పట్ల కాప్–27లో అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) తదితర దేశాలు అంగీకారం తెలపడం కీలక పరిణామం అని చెప్పొచ్చు. అయితే, దీనిపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. పర్యావరణ విపత్తులు పెచ్చరిల్లుతుండడంతో సమీప భవిష్యత్తులోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పునరుత్పాక ఇంధన వనరులపై ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కాప్–27లో నిపుణులు సూచించారు. బొగ్గు వాడకాన్ని నిలిపివేస్తూ స్వల్ప ఉద్గారాల ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని ‘షెర్మ్–ఎల్–షేక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్’ పిలుపునిచ్చింది. వ్యవసాయం, ఆహార భద్రత విషయంలో క్లైమేట్ యాక్షన్‌పై కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. కాప్–27లో ఆయన మాట్లాడారు. కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను కేవలం సన్న, చిన్నకారు రైతులపైనే మోపకూడదని చెప్పారు. కాప్–27 నిర్ణయాలు, ఒప్పందాలపై ఆఫ్రికా నిపుణుడు మొహమ్మద్ అడోవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
COP 27: కాప్ 27లో కాక!
షెర్మెల్ షేక్ (ఈజిప్ట్): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. దాంతో శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారమూ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్ట్ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఒక దశలో అవి వాకౌట్ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగుతుండటంతో ప్రాంగణమంతా బోసిపోయి కన్పిస్తోంది. మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు శనివారం సాయంత్రం ప్రకటించారు. అయితే దానిపైనా ఏకాభిప్రాయం ఇంకా కుదరాల్సే ఉంది! ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు, ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి చర్చాంశాన్నీ తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’’ అంటూ వర్ధమాన దేశాలు ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్నాయి. -
'ఆ సామర్థ్యాలున్నాయని 78శాతం మంది యూత్ నమ్ముతున్నారు'
ఈజిప్ట్ వేదికగా జరుగుతున్న వాతావరణ సదస్సు ‘కాప్– 27’తో భూతాపం, పర్యావరణంలో జరుగుతున్న మార్పులు, అడవుల పరిరక్షణ... మొదలైన విషయాలపై నాలుగు మాటలు గట్టిగానే వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ ముఖచిత్రమైన యువతలో వాటి పట్ల ఆసక్తి ఏ మేరకు ఉంది? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. గత కాలం సంగతి ఎలా ఉన్నా... ఈతరం మాత్రం పర్యావరణానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించడం, అవగాహన పెంచుకోవడం మాత్రమే కాదు ‘గ్రీన్కాలర్ జాబ్’ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది... సోషల్‌మీడియా విస్తృతి వల్ల వాతావరణ సంక్షోభం గురించిన అవగాహన, చర్చ అనేవి అంతర్జాతీయ సదస్సులు, జర్నల్స్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యావరణ సంక్షోభంపై మాటాముచ్చట పెరుగుతోంది. ఈ క్రమంలో యువతరంలో కొంతమంది పర్యావరణహిత ఉపాధి అవకాశాలపై అధిక ఆసక్తి చూపుతున్నారు. ముంబైకి చెందిన దిశా సద్నాని పర్యావరణ ప్రేమికురాలు. రెగ్యులర్ జాబ్ కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగం అయ్యే ఉద్యోగం చేయాలనేది దిశ కల. ప్రస్తుతం ఒక కార్పోరెట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న దిశ నీటి నుంచి పారిశుధ్యం వరకు రకరకాల ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన 25 సంవత్సరాల శౌర్య శర్మ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. క్లైమెట్ కన్సల్టెన్సీకి సంబంధించిన ఉద్యోగం చేయాలనేది శర్మ కల. అయితే‘పేరు గొప్ప ఊరు దిబ్బ’లాంటి ఉద్యోగాలు, నాలుగు గోడల మధ్య ఉపన్యాసాలకే పరిమితం అయ్యే ఉద్యోగాలు చేయడం అతడికి ఇష్టం లేదు. ఊరూవాడా తిరగాలి. ప్రజలతో కలిసి పనిచేయాలి. పర్యావరణ పరిరక్షణలో నిర్మాణాత్మక అడుగు వేయాలనేది అతడి కల. బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్–బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డాటా ఎనలటిక్స్ సంస్థ ‘యూ గోవ్’ పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలపై 18–35 ఏళ్ల వయసు ఉన్న వారిపై యూకే, యూఎస్, ఇండియా, పాకిస్థాన్, ఘనా... మొదలైన దేశాల్లో ఒక అధ్యయనం నిర్వహించింది. పర్యావరణ సంక్షోభానికి సంబంధించిన పరిష్కారాలు వెదికే శక్తిసామర్థ్యాలు తమ తరానికి ఉన్నాయని యూత్‌లో 78 శాతం మంది నమ్ముతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ‘గ్రీన్ జాబ్’ చేయడానికి 74 శాతం మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న యువత సంఖ్య తక్కువగా ఉంది. భవిష్యత్ మాత్రం ఆశాజనకంగా ఉంది. కంపెనీల విషయానికి వస్తే... ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి కేవలం పర్యావరణ ప్రేమ మాత్రమే ప్రమాణంగా తీసుకోవడం లేదు. సాంకేతిక సామర్థ్యానికీ పెద్దపీట వేస్తున్నాయి. సస్టెయినబిలిటీ మేనేజర్, సేఫ్టీ మేనేజర్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్ అనేవి మన దేశంలో టాప్–3 గ్రీన్‌జాబ్స్. సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్ రంగాలు ‘గ్రీన్ టాలెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలు సస్టెయినబిలిటీ ఎనాలసిస్ట్, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, సోలార్ డిజైనర్స్. అర్బన్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఆఫీసర్స్, ఎన్విరాన్మెంట్ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్... మొదలైన నిపుణులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పునరుత్పాదకశక్తి, ఆరోగ్యం–భద్రత, సౌరశక్తి, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి సహజ వనరుల క్షీణతను నివారించడం... మొదలైనవి ‘గ్రీన్ స్కిల్స్’కు ముఖ్యకేంద్రాలుగా ఉన్నాయి. మన దేశంలోని అగ్రశ్రేణి కళాశాలలు, యూనివర్శిటీలు పర్యావరణానికి సంబంధించిన ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టాయి. వాటిలో కొన్ని... గ్రీన్ ఎకానమీ ఫర్ బిజినెస్, ఎన్విరాన్మెంటల్ లా, క్లైమెట్ చేంజ్, క్లైమెట్ సైన్స్ అండ్ పాలసీ, గ్రీన్ ఎకనామీ, గ్రీన్ ఇన్నోవేషన్ ఫ్రమ్ నాలెడ్జ్ టు యాక్షన్, వేస్ట్ మేనేజ్మెంట్. యువతరం సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా కొత్తరకం ఉద్యోగాలపై ఆసక్తి ప్రదర్శించడం విశేషం అయితే ‘గ్రీన్ జాబ్’లు చేయాలనుకోవడం స్వాగతించ తగిన పరిణామం. ఇది చాలదు... ఇంకా పర్యావరణహిత ఉద్యోగాలలో కదలిక మొదలైంది. అయితే అది ఇంకా విస్తృతం కావాలి. పర్యావరణ స్పృహ అనేది జీవన విధానంగా మారాలి. క్లైమెట్ స్ట్రాటజీపై యువతరం దృష్టి పెట్టాలి. తమవైన పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి. వాతావరణానికి సంబంధించి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి కంపెనీ స్పెషల్ క్లైమెట్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో యువతరం క్రియాశీల పాత్ర పోషించాలి. – షీతల్ పర్మార్, పర్యావరణ అంశాల బోధకురాలు, అహ్మదాబాద్ -
COP27: వేదికను వీడిన రిషి సునాక్.. అంతా షాక్
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న ఆయన.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించబోయే సాయం, భావితరాల సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఓ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కాప్27 సదస్సులో సోమవారం ఓ నాటకీయ పరిణామం జరిగింది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఆ హాల్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడ ఉన్నవాళ్లంతా. COP27 సదస్సులో భాగంగా.. ఫారెస్ట్స్ పార్ట్నర్షిప్ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిమిషంపాటు చెవిలో ఏదో చెప్పాడు. అయినా సునాక్ అలాగే స్టేజ్ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపే మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా.. హడావిడిగా సునాక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్సైట్ నిర్వాహకుడు లియో హిక్‌మ్యాన్ తెలిపారు. UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX — Leo Hickman (@LeoHickman) November 7, 2022 సహాయకులు ఏం చెప్పారు? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింకా అక్కడే ఉన్నారా? బ్రిటన్‌కు వెళ్లారా? దానిపై డౌనింగ్ స్ట్రీట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఐరాస నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును ‘కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్’(COP27)గా వ్యవహరిస్తుంటారు. ఈజిప్ట్‌లో రిసార్టుల వనంగా పేరున్న షెర్మ్–ఎల్–షేక్‌లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. ఇదిలాఉంటే.. 42 ఏళ్ల రిషి సునాక్‌కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఇదీ చదవండి: రిషి సునాక్‌పై విమర్శల పర్వం! -
2022 హీట్ దెబ్బ.. వేల మంది దుర్మరణం
కోపెన్‌హగ్: మునుపెన్నడూ లేని రేంజ్లో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు యూరప్‌ను అతలాకుతలం చేశాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అదీ యూరప్‌లోనే 15 వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది. వడగాల్పులకు ముఖ్యంగా స్పెయిన్, జర్మనీ దారుణంగా ప్రభావితం అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జూన్ నుంచి ఆగష్టు మధ్య యూరప్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ఇదే అత్యధిక కావడం గమనార్హం. దేశాల నుంచి సమర్పించిన నివేదికల ఆధారంగా కనీసం 15వేల మంది మరణించారని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో రీజినల్ డైరెక్టర్ ఫర్ యూరప్ అయిన హాన్స్ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు. స్పెయిన్‌లో 4వేల మరణాలు, పోర్చుగల్‌లో వెయ్యి, యూకేలో 3,200 మరణాలు, జర్మనీలో 4,500 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జూన్, జులై మధ్యకాలంలో 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు బ్రిటన్‌కు ముచ్చెమటలు పోయించాయి. వేడిమి వల్ల ఒత్తిళ్లు, శరీరం చల్లదనంగా ఉండకపోవడం.. తదితర కారణాలతోనే మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ ఉన్నవాళ్లకు అధిక వేడిమి మరింత ప్రమాదమని నిపుణులు తెలిపారు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ సమస్యలు.. మరిన్ని వ్యాధులు, మరణాలకు దారితీస్తుందని WHO పేర్కొంది. ఇదీ చదవండి: నరకకూపం.. ప్రమాదం అంచున ప్రపంచం