కోపెన్‌హగ్: మునుపెన్నడూ లేని రేంజ్‌లో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు యూరప్‌ను అతలాకుతలం చేశాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అదీ యూరప్‌లోనే 15 వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది.
వడగాల్పులకు ముఖ్యంగా స్పెయిన్, జర్మనీ దారుణంగా ప్రభావితం అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జూన్ నుంచి ఆగష్టు మధ్య యూరప్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ఇదే అత్యధిక కావడం గమనార్హం. దేశాల నుంచి సమర్పించిన నివేదికల ఆధారంగా కనీసం 15వేల మంది మరణించారని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో రీజినల్ డైరెక్టర్ ఫర్ యూరప్ అయిన హాన్స్ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు.
స్పెయిన్‌లో 4వేల మరణాలు, పోర్చుగల్‌లో వెయ్యి, యూకేలో 3,200 మరణాలు, జర్మనీలో 4,500 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జూన్, జులై మధ్యకాలంలో 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు బ్రిటన్‌కు ముచ్చెమటలు పోయించాయి. వేడిమి వల్ల ఒత్తిళ్లు, శరీరం చల్లదనంగా ఉండకపోవడం.. తదితర కారణాలతోనే మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ ఉన్నవాళ్లకు అధిక వేడిమి మరింత ప్రమాదమని నిపుణులు తెలిపారు.
కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ సమస్యలు.. మరిన్ని వ్యాధులు, మరణాలకు దారితీస్తుందని WHO పేర్కొంది.
ఇదీ చదవండి: నరకకూపం.. ప్రమాదం అంచున ప్రపంచం
Comments
Please login to add a commentAdd a comment