
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వరుసగా మూడో సంవత్సరం సరైన ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెరిగాయి. 2016 సంవత్సరం నుంచి ఆహారం అందుబాటులేని వారి సంఖ్య అదనంగా 1.5 పెరిగింది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారం అందుబాటులో లేనివారి సంఖ్య 82 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వార్షిక ఆహార భద్రతా నివేదిక వెల్లడించింది. పదేళ్ల క్రితం ప్రపంచంలో ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉండేవో ఇప్పుడు ఆ స్థాయికి చేరకున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది. పౌష్టికాహార లోపంతో పుడుతున్న పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది.
ముఖ్యంగా దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు సరైన ఆహారం అందుబాటులోలేక అలమటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోని మహిళలు పిల్లలనుకనే వయస్సులో పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఓ మహిళ పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి 2014 వరకు వరుసగా ఆహార కొరత తగ్గుతూ రాగా, 2015 నుంచి మళ్లీ కొరత అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని, దీనికి వాతావరణ మార్పులే కారణమని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. ఆహార కొరత కారణంగా ప్రాంతీయ అస్థిరతలు, అలజడి పెరిగి సంఘర్షణలు కూడా జరుగుతాయని హెచ్చరించింది.
మధ్య అమెరికాలో కరువు పరిస్థితులు తలెత్తి పంటల దిగుబడి తగ్గడంతో అమెరికా సరిహద్దుల్లో వలసల అలజడి మొదలైందని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత యాభై ఏళ్లుగా భూ వాతావరణం వేడెక్కుతూ వస్తోందని, ముఖ్యంగా 2014, 2015, 2016 సంవత్సరాల్లో భూ వాతావరణం గణనీయంగా వేడెక్కిందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడుతున్నాయని తెలిపింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం ఉండాలని, ఆ విషయమై వ్యవసాయ రంగంలో ఆధునిక పరిశోధనలు పెరగాలని సమితి అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో పరిశోధనల కోసం ప్రపంచ దేశాలు కేవలం మూడు శాతం ఆర్థిక వనరులను ఖర్చు చేయడం శోచనీయమని సమితి అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment