చేసిన బాసలు చెదిరిపోతే ఎలా? | Sakshi Editorial On Dubai Conference of Parties | Sakshi
Sakshi News home page

చేసిన బాసలు చెదిరిపోతే ఎలా?

Published Sun, Dec 3 2023 4:41 AM | Last Updated on Sun, Dec 3 2023 4:41 AM

Sakshi Editorial On Dubai Conference of Parties

‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌’ (కాప్‌) సమావేశాలు దుబాయ్‌లో ప్రారంభమయ్యాయి. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు ఇవి. ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్‌ఈపీ గ్యాప్‌ రిపోర్ట్‌’ సైతం ప్యారిస్‌ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా పుడమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్‌గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్‌కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం.అంత స్థాయికి చేరడం భూమిని కాష్ఠం చేసినట్లే. ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే మొదలైన కాప్‌–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. 

వాతావరణం విషయంలో ఎన్నో రికార్డులు బద్ధలైన సంవత్సరం ఇది.ఇంకో నెల మాత్రమే ఉన్న 2023లో వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షించుకునేందుకు ఉద్దేశించిన ‘కాప్‌– 28’ సమావేశాలూ మొదలయ్యాయి. అంతర్జాతీయ సమాజం ఏదో ఒక అత్యవసర చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందన్న ప్రమాద ఘంటికలూ వినిపిస్తున్న తరుణమిది!

ఐక్యరాజ్య సమితి సమావేశం (కాప్‌–28) ఇంకోటి దుబాయ్‌లో నవంబరు 30వ తేదీ మొదలైంది. ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌’ (కాప్‌) అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నవి. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలూ, వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచదేశాలన్నీ కూర్చుని సమీక్షి స్తారిక్కడ. మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమా అని ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటయ్యాయి.

ఇందులో ఒకటి 2015 నాటి ‘ప్యారిస్‌ ఒప్పందం’. అత్యవసరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాలు కోకొల్లలు. అన్నింటి లక్ష్యం మాత్రం ఒక్కటే. సురక్షితమైన భూమి! ఈ అంతర్జాతీయ నిర్ణయాలు, చట్టాలు లేకపోయి ఉంటే భూమి సగటు ఉష్ణోగ్రతలు 2,100 నాటికి కనీసం నాలుగు డిగ్రీ సెల్సియస్‌ వరకూ పెరిగి పోతాయి. అయితే ఇప్పుడేదో చాలా గొప్పగా జరిగిపోతుందని కాదు.

ఎందుకంటే భూమి ఇప్పటికీ ప్రమాదం నుంచి బయటపడలేదు మరి!ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్‌ఈపీ గ్యాప్‌ రిపోర్ట్‌’ కూడా ప్యారిస్‌ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా భూమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్‌గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్‌కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం.

2021 నాటి ‘గ్లాస్‌ గౌ’ సమావేశాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేస్తామని ప్రపంచం ప్రతిన బూనింది! షరతుల్లేని వాగ్దానాల విషయానికి వస్తే... ఇవి కూడా పూర్తిస్థాయిలో అమలైన పక్షంలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది 2.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఐపీసీసీ 2022 నాటి నివేదిక కూడా దేశాల ఆర్థికసాయంలో మూడు నుంచి ఆరు రెట్లు తక్కువగా అందినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం.

భూమి సగటు ఉష్ణోగ్రతలు 2.9 డిగ్రీ సెల్సియస్‌కు పెరగ డమంటే భూమిని కాష్ఠం చేసినట్లే! ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మనిషిపై వీటి ప్రభావం కూడా అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఊహించుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఇది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే దుబాయ్‌లో మొదలైన కాప్‌–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. 

ఐరాస వాతావరణ చర్చలే సరిపోవు...
వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే కేవలం చర్చలు సరిపోవు. ప్యారిస్‌ ఒప్పందం ఏకాభిప్రాయంపై ఏర్పడని కారణంగా... నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైన వ్యవస్థ లేక పోవడం వల్ల మనం అనుకున్నంత వేగంగా పురోగతి సాధించ లేకపోయాం. ఈ ఒప్పందంలో కేవలం కొన్ని వాగ్దానాలూ, ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి.

కొంత వినూత్నంగా ఆలోచించ గలిగితే ఇంతకంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని అప్పట్లోనే చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు కానీ పట్టించు కున్నది కొందరే! ఏదో ప్రజల ఆందోళనను కొంత నెమ్మదింప జేసేందుకా అన్నట్లు గొప్ప గొప్ప ప్రకటనలైతే జారీ అయ్యాయి. ఈ ప్రకటనలు మఖలో వచ్చి పుబ్బలో పోయే రకాలు. 

2021లో జరిగిన గ్లాస్‌గౌ సమావేశాల్లో... ‘దశల వారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించాలి’ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తొలగించాలన్న విషయానికి భారత్‌ అభ్యంతరం తెలిపింది. ఫలితంగా దశలవారీగా అన్న పదం వచ్చి చేరింది. అయితే భారత్‌లోనే కాదు... చాలా దేశాల్లోనూ బొగ్గు వాడకం తగ్గనూ లేదు. పూర్తిగా నిలిచిపోనూ లేదు. 

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే దానికి సర్వతోముఖ ప్రయత్నాలు అవసరం. భాగస్వాములందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐరాస చర్చలు ఈ అంశంపై నియమ నిబంధనలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టడం
మంచిది. దుబాయ్‌లో జరిగే చర్చలు మన లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాలి. అలాగే దేశాలు తగిన చర్యలు తీసుకునేలా చేయాలి. కాప్‌–28 లక్ష్యం ఇదే కావాలి. 

తొలిసారి ప్రపంచస్థాయి సమీక్ష...
దుబాయ్‌లో జరుగుతున్న కాప్‌–28 సమావేశాల్లో మొట్ట మొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై తాజా సమీక్ష ఒకటి చేపట్టనున్నారు. ‘గ్లోబల్‌ స్టాక్‌ టేక్‌’ ద్వారా ప్యారిస్‌ ఒప్పందం అమలు విషయంలో ఇప్పటికి మనం సాధించింది ఏమిటి? సాధించాల్సింది ఏమిటన్న స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధ మయ్యాయి. ఆశయాలకు, ఆచ రణకు మధ్య అంతరాన్ని విస్ప ష్టంగా ఈ నివేదికల్లో పేర్కొ న్నారు. 

కాప్‌–28 ఇంకో ముంద డుగు వేసి ప్రపంచం నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్న విష యాన్ని స్పష్టం చేయాలి. ప్రస్తుత వాగ్దానాలు సరిపోవని, ఆర్థిక సహకారం తగినంత అందని నేపథ్యంలో వీటి అమలు కూడా అసాధ్యమన్న విషయాన్ని సుస్పష్టం చేయాలి.

కాప్‌–28 ద్వారా ప్రపంచానికి అందించాల్సిన సందేశం ఇంకోటి కూడా ఉంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, అందుకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడంపై ఎక్కువ దృష్టి పెట్టక పోవడం మంచిది. ఎందుకంటే గతంలో కాప్‌ సమావేశాలు మిగిలిన విషయాలను పక్కనబెట్టి కేవలం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకన్నట్లు భారీ భారీ లక్ష్యాలు ప్రకటించి చతికిలబడ్డాయి కాబట్టి! ఈ రకమైన భారీ లక్ష్యాలు చాలాసార్లు ఆయా దేశాల ఆశయాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. జాతీయ రాజకీయాలు పరిస్థి తులు (కొన్ని సందర్భాల్లో చట్టపరమైన అంశాల) అసలైన, ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయే కానీ.. అంతర్జాతీయ ఒత్తిడి కాదు. 

ఈ లక్ష్యాలకు అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞాన, మానవ వనరుల పరమైన సాయం లభించినప్పుడు మాత్రమే వాస్తవంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. తద్వారా మన విశ్వాసం మరింత పెరుగుతుంది. మరింత ఉన్నత స్థాయి లక్ష్యాల కోసం పనిచేసే స్థైర్యం లభిస్తుంది. 

లక్ష్యాలకన్నా ఆచరణ మిన్న
వాతావరణ మార్పులను తట్టుకునేందుకు చేయాల్సిన పనుల విషయంలోనూ కొంచెం పట్టువిడుపు ధోరణి అవసరం. మరింత కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే సంప్ర దాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని, ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాప్‌–28 వేదికగా పిలుపునివ్వాలి. దీనికీ శిలాజ ఇంధనాల వాడకం తగ్గేందుకూ మధ్య పొంతన కుదిరేలా చూడాలి. అంటే.. లక్ష్యాలను నిర్దేశించడం కాకుండా మార్పు జరిగేందుకు, సక్రమ అమలుకు పూనికగా నిలవాలి అని అర్థం.

దీనికి అదనంగా కాప్‌–28 బాధ్యతల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేశాల అంతర్గత లక్ష్యాలు కావచ్చు. దేశాల మధ్య కావచ్చు అన్నింటి విషయంలో సమదృష్టి పాటించడం అవసరం. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించాలంటే వ్యవస్థలకు వ్యవస్థలు మారాల్సి ఉంటుంది. ఇది కొంత విధ్వంసాన్నయితే సృష్టిస్తుంది. దీని ప్రభావం కూడా దిగువ వర్గాలపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా న్యాయమైన, అందరినీ కలుపుకొనిపోయే ఏర్పాట్లు అవసరం. ప్రత్యామ్నాయ జీవ నోపాధులతో పాటు తమదన్న భావనను కల్పించడం కీలక మవుతుంది. 

కాప్‌–28 సమా వేశాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి అమలును చురు కుగా పర్యవేక్షించడం ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత తక్షణ కర్తవ్యం కావాలి. ఐక్యరాజ్య సమితి పరిధిలో.. బయట కూడా చేసిన వాగ్దానాలు నెరవేరేలా చూసేందుకు ఒక ప్రణాళిక కూడా అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలనేవి ప్రభుత్వాల్లోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆచరించినప్పుడు వాటికి సార్థకత. అలాగే ఈ చర్యలు ప్రభావశీలంగా ఉండాలంటే భాగస్వాములందరి చర్యలూ, తోడ్పాటు అత్యవసరం. 

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాతావరణ సంబంధిత వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. అంతర్జాతీయ కోర్టుల్లోనూ హై ప్రొఫైల్‌ కేసులు విచారణలో ఉన్నాయి. ఇదంతా బాధ్యత ఎవరిదన్న విషయంపైనే! దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా తాము చేసిన వాగ్దానాలు కచ్చితంగా, సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలి. తద్వారా మానవాళిని పరిరక్షించాలి. 
లావణ్యా రాజమణి 
వ్యాసకర్త ప్రొఫెసర్,ఇంటర్నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ లా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement