Temperatures
-
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
చలికాలంలోనూ ‘ఎండలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రివేళ చలి పెరిగిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ప్రస్తుత సమయంలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దిగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టం నిజామాబాద్ ః 32.4 శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 32.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట అదిలాబాద్‌లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రాష్ట్రంలోని దాదా పు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, మెదక్, హనుమకొండల్లో 3 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదైంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తాజా పరిస్థితుల్లో కుమ్రుంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉదయం పూట పొగమంచుకు అవకాశం ఉంటుందని సూచించింది. -
Andhra Pradesh: ఏజెన్సీ గజగజ
ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు ఘాట్‌లో చలితీవ్రత మరింత ఎక్కువైంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీవ్యాప్తంగా ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. సాయంత్రం నుంచే అన్ని వర్గాల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. ఘాట్ ప్రాంతాల్లో చలి మరింత ఇబ్బంది పెడుతోంది.– సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
మొదలైన ‘గజగజ’!.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఈసారి వణికించే చలి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత శీతాకాలంలో చలితీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి నెలల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతాయని సూచించింది. లానినొ పరిస్థితుల కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత అక్టోబర్ నెలలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవుతుంటాయి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆ తర్వాత ఒక్కసారిగా పతనం కావడంలాంటి పరిస్థితులు ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు (లానినొ) నమోదవుతుండడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, ఉదయం వేళల్లో తీవ్రమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గతంలో, తాజాగా 2022లో కూడా రాష్ట్రంలో ఈ తరహా లానినొ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీ సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 4 డిగ్రీలకు పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలుసోమవారం రాష్ట్రంలోని పలు ప్రధాన కేంద్రాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 35.6 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా దుండిగల్‌లో 20.7 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. పలు జిల్లాలకు వర్ష సూచనరాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఏపీ తీర ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీలో అధికంగా ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. -
రాష్ట్రంలో మూడేళ్లుగా చలి తక్కువే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అత్యంత చలి రోజులు నమోదు కాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా గత ఐదేళ్లతో పోలిస్తే 2023లోనే నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, అత్యధిక చలి నమోదైన రోజుల వివరాలను కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక–2024 వెల్లడించింది.2014లో సగటున మూడ్రోజులు మాత్రమే అత్యంత చలి నమోదైందని, 2018లో సగటున ఏనిమిది రోజులు అత్యంత చలి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2019లో కేవలం ఒకరోజు మాత్రమే అత్యంత చలి నమోదైతే.. 2020లో ఆరు రోజులపాటు అత్యంత చలి నమోదైంది. అదే 2021 నుంచి 2023 వరకు ఒక్కరోజు కూడా అత్యంత చలి నమోదు కాలేదుఇక 2023లో దేశంలో ఢిల్లీ, హరియాణ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధిక చలి రోజులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. 2023లో ఢిల్లీలో అత్యధికంగా సగటున ఐదు రోజులు అత్యంత చలి రోజులు నమోదైంది. వరుసగా రెండ్రోజులు 45 డిగ్రీలుంటే హీట్ వేవ్..ఎక్కడైనా రెండ్రోజులపాటు గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే హీట్‌వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2న ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 2017 మే 17న ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31 2018లో నెల్లూరు జిల్లా మర్రిపాడు, డిచ్చిపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2019 మే 26న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మేలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021 మేలో ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 45.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 2022లో అత్యధికంగా తిరుపతిలో 45.9 డిగ్రీలు, 2023లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామీణ ప్రాంతంలో 2023 మే 16న అత్యథికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.అత్యధిక ఉష్ణోగ్రతల తీరూతెన్ను ఇలా..ఇక రాష్ట్రంలో 2014లో సగటున 16 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆ తరువాత 2023లోనే సగటున 15 రోజుల పాటు ఇవి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలోకెల్లా బిహార్‌లో 18 రోజులపాటు అత్యధిక వేడి రోజులు నమోదయ్యాయి. ఆ తరువాత ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛతీస్‌గఢ్ తమిళనాడు రాష్ట్రాలున్నాయని నివేదిక పేర్కొంది. -
నేడు మరో అల్పపీడనం!
మహారాణిపేట (విశాఖ): బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు. ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు. -
కుండపోత.. ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వాన.. కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్‌లో మాత్రం మండే ఎండ, ఆపై ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్‌పైనో, కారులోనో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించిన వారికి ఈ వింతైన అనుభవం ఎదురవుతోంది. గతంలో ఒకచోట వర్షం పడుతుంటే ఆ పక్కనున్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతోనే ఒక్కసారిగా అతివృష్టి, లేకుంటే తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని, జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రపంచంలోని పర్యావరణ నిపుణులు గొంతెత్తి చెబుతున్న ఒకేఒక్క మాట ‘ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’. సీజన్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పుడు పర్యావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ, వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం నమోదవుతూ వస్తోంది. ఉదాహరణకు అదిలాబాద్‌లో ప్రస్తుత సీజన్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీ సెల్సీయస్ నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం ఏకంగా 34.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీ సెల్సీయస్ కాగా..సోమవారం 34.6 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. రామగుండంలో 31.1 డిగ్రీ సెల్సీయస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతకు గాను 34.2 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ సోమవారం నాడు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వాటికి తీవ్ర ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 49.62 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం నాటికి 56.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర సగటును పరిశీలిస్తే సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలే గణాంకాలను గణనీయంగా పెంచేశాయన్న మాట. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఈ అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే కొన్నిచోట్ల అతి తక్కువ వర్షాలు లేదా అసలు వర్షమే లేకపోగా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయన్న మాట. వాతావరణంలోనూ ఇదే తరహా భిన్నమైన పరిస్థితులు నెలకొంటుండటం గమనార్హం. పట్టణీకరణ పేరిట వనరుల విధ్వంసం పట్టణీకరణ పేరిట ఇప్పుడు వనరుల విధ్వంసం విపరీతంగా పెరుగుతోంది. పట్టణీకరణ వల్ల నీటివనరులు పెద్దయెత్తున ఆక్రమణలకు గురవుతుండగా.. చెట్లు, పుట్టలను ఇష్టారాజ్యంగా తెగనరికేస్తున్నారు. మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ప్రారంభమై ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెంది అంతకంతకకూ విస్తరిస్తున్నా.. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వందలాది చెరువులతో కళకళలాడిన హైదరాబాద్, ఇప్పుడు నీటి సమస్యతో సతమతమవుతోందని, చెరువులు కబ్జాల పాలుకావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వనరులు కబ్జాలపాలు కావడంతో నీటి ప్రవాహం దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయని, చివరకు నిల్వ చేయాల్సిన నీరు సముద్రం పాలుకావడంతో నీటి సమతుల్యత దెబ్బతింటోందని వివరిస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ స్పేస్ నిబంధనలు గాలికొదిలి అనేక అంతస్తులతో భారీ నిర్మాణాలు చేపట్టడం, విచ్చలవిడి లేఅవుట్లతో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఓపెన్ స్పేస్ ఏరియా ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కడాన్ని గుర్తు చేస్తున్నారు. పెరగని సాగు విస్తీర్ణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోతతో కూడిన విభిన్న వాతావరణం నెలకొనడం పంటల సాగుపైనా ప్రభావం చూపించింది. వానాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. ఈ నెల 14వ తేదీ వరకు 1.03 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయాల్సి ఉంది. కానీ 94 లక్షల ఎకరాల మేర మాత్రమే పంటలు సాగవడం గమనార్హం. నీటి వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి హైదరాబాద్ లాంటి నగరానికి అతి త్వరలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న చెరువులు ఇప్పుడు వందల్లోకి పడిపోయాయి. నీటి నిల్వలకు కేంద్రంగా ఉండే చెరువుల సంఖ్య తగ్గిపోతుండగా కాలువలన్నీ కబ్జాలపాలవుతున్నాయి. ఉదాహరణకు ఫిరంగిరనాలా అనే కాలువతో శివారు ప్రాంతాల్లోని 22 చెరువులు నీటితో నిండేవి. కానీ ఈ నాలా కబ్జాకు గురైంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ నాలాను పునరుద్ధరిస్తే దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతాయి. అదేవిధంగా నగరంలో ఉన్న చెరువులు, ప్రధాన కాలువలను పునరుద్ధరించి పరిరక్షిస్తే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. – ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం... నగరీకరణలో అత్యంత కీలకం సమగ్ర ప్రణాళిక. కానీ ఇప్పుడు కేవలం కట్టడాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉంది. అడ్డగోలు కట్టడాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారడం తప్ప మెరుగైన జీవావరణం ఏవిధంగా సాధ్యమవుతుంది. అందకే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు హైదనాబాద్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలి. – సుబ్బారావు, పర్యావరణ నిపుణులు వర్షాకాలంలోనూ ఎండ వేడిమి...పగటిపూటే కాకుండా రాత్రిళ్లు కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో ఏసీలు, కూల ర్లను రోజంతా వాడక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఆదివారం (ఆగస్టు 18న) 273.665 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా.. గతేడాది ఇదే రోజున 254.123 మిలియన్ యూనిట్ల వినియోగమే నమోదు కావడం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 17 వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం. -
హీట్ వేవ్స్.. హాట్ సేల్స్
అల్పపీడన ద్రోణి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం ‘చల్ల’దనం కోసం పరుగులు తీస్తున్నారు. ఇందుకోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: సాధారణంగా వేసవి తరువాత ఏసీల అమ్మకాల్లో తగ్గుదల సహజం. కానీ సెప్టెంబర్ వస్తున్నా రికార్డు స్థాయిలో ఏసీల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో తయారీ కంపెనీలు భారీ లాభాల బాట పడుతున్నాయి. ఈ వేసవిలో ఏసీ అమ్మకాల్లో 60 నుంచి 70 శాతం వృద్ధి నమోదు కాగా జూలై నుంచి జరుగుతున్న అమ్మకాల్లో కూడా 30 నుంచి 40 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) నెలల్లో పలు ఏసీ కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో లాభాలు రెండు రెట్లు పెరిగాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలకు భారీ లాభాలు అత్యధిక వాటా కలిగిన వోల్టాస్ లాభం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.355 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో వోల్టాస్ రికార్డు స్థాయిలో 10 లక్షల యూనిట్లు విక్రయించింది. బ్లూస్టార్ లాభం కూడా రెండు రెట్లు పెరిగి రూ.169 కోట్లకు చేరింది. గతేడాది రూ.62 కోట్ల నష్టాలను ప్రకటించిన హావెల్స్ ఈ ఏడాది రూ.67 కోట్ల లాభాలను ప్రకటించడం గమనార్హం. 2023లో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఏసీల అమ్మకాలు జరిగితే 2024లో 1.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లియన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) ప్రెసిడెంట్ సునిల్ వచాని తెలిపారు.ఆన్లైన్ రిటైల్ సంస్థల పోటీ ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోతున్నామంటూ కొన్ని కంపెనీలు వాపోతున్నాయి. 2037 నాటికి ప్రతి 15 సెకన్లకు ఒక ఏసీ 2011 తర్వాత ఈ స్థాయిలో ఏసీల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారని, 2037 నాటికి ప్రతీ 15 సెకన్లకు ఒక ఏసీ విక్రయించే స్థాయికి ఇండియా ఎదుగుతుందని ప్రపంచబ్యాంకు అంచనా వేస్తోంది. 95 శాతం తొలిసారి కొంటున్నవారే దేశవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో వినియోగదారులు ఏసీలు, రిఫ్రిజరేటర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ఇప్పుడు ఏసీ అన్నది లగ్జరీ సాధనంగా కాకుండా బతకడానికి తప్పనిసరి వస్తువుగా మారిపోయిందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో సొంత ఏసీ వినియోగం చాలా తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో కేవలం 8 శాతం మందికి మాత్రమే సొంత ఏసీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున చల్లదనం కోసం ప్రతీ వ్యక్తి 272 కేడబ్ల్యూహెచ్ విద్యుత్‌ను వినియోగిస్తుంటే, మన దేశంలో అది కేవలం 69 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఈ ఏడాది తమ సంస్థ అమ్మిన ఏసీల్లో 95 శాతం మంది తొలిసారిగా కొన్నవారే ఉన్నారని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇందులో 65 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉన్నారు. -
AP: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వర్షాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాలతో పాటు కనీస వర్షపాతం నమోదు కాని రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నట్టు జనం వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉక్కపోత కారణంగా వేసవి తరహాలో గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీల వినియోగం ఆగస్టులో తీవ్రంగా పెరిగినట్టు తేలింది. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపానుకు రెండు రోజుల ముందు ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో పీడనం తగ్గినప్పుడు గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువ దాహంగా ఉండటం కనిపిస్తుందంటున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనంతపురంలోని రేకుల కుంట వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉక్కపోత ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావమే. వాతావరణంలో మార్పులు కూడా కొంత మేరకు ఈ పరిస్థితికి కారణం’ అని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు. -
మండుటెండల మహోపద్రవం
గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది. ఒక్క జూన్‌లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక. నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది. ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం. సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ. దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం. మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది. -
మూడు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నాయి. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వానలు, జల్లులు పడుతుండగా... మంగళ, బుధ, గురువారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రుతుపవనాలు రాష్ట్రం మీదుగా సోమవారం మహారాష్ట్రలోని నాసిక్, సుకుమా తదితర ప్రాంతాలకు సైతం విస్తరించాయి. దీంతో అటు దక్షిణ మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్‌పేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్ (ఫోన్ నంబర్లు: 040–21111111, 9001136675)ను ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.4 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. -
తెలంగాణ రాష్ట్రమంతా నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 3న రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రెండ్రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ లోని నారాయణపేట, ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్ప టికీ.. ఆశాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని ఆ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే నిజామాబాద్‌లో 40.1 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.5 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్‌గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్‌పూర్ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది. ‘‘ ఈ రెండు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో బిగించిన సెన్సార్లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్ ఏడబ్ల్యూఎస్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్‌పుర్‌లో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్‌ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. -
చల్లని రేయే వేడెక్కెనులే!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చల్లని రాత్రులు కరువవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని 140కి పైగా భారత నగరాల్లో 60 శాతానికి పైగా రాత్రులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బృందం జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. నేచర్ సిటీస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిళ్లు పెరుగుతున్న వేడిమి వర్షపాతం, కాలుష్యంతో సహా వాతావరణంలోని ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్‌కోట్ నగరాలు తీవ్ర పట్టణ ప్రభావ రాత్రులను అనుభవిస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, పూణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వేడి రాత్రుల తాకిడి బాగానే ఉంది. అర్బన్ హీట్ ఐలాండ్‌కు పట్టణీకరణే కారణం అర్బన్ హీట్ ఐలాండ్‌కు విపరీతమైన పట్టణీకరణే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించారు. పట్టణీకరణలో భాగంగా కాంక్రీటు, తారు (రోడ్లు, పేవ్మెంట్లను నిర్మాణాలతో) ఉపరితలాలు పగటిపూట వేడిని గ్రహించి నిల్వ చేసి, సాయంత్రం ఆ వేడిమిని తిరిగి బయటకు విడుదల చేస్తాయి. తద్వారా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. గత రెండు దశాబ్దాలుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి పట్టణీకరణ, స్థానిక వాతావరణ మార్పు ఎంతవరకు దోహదపడిందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిచారు. 37.73 శాతం పట్టణీకరణ జరిగితే దశాబ్దానికి సగటున 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాయువ్య, ఈశాన్య భారతంలోనే.. దేశంలోని వాయువ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువ పెరుగుదల కనిపించింది. వేగవంతమైన అభివృద్ధి, పట్టణాల విస్తరణ వేగంగా జరుగుతున్న తూర్పు, మధ్య భారతీయ నగరాల్లో కూడా రాత్రిపూట వేడి పెరుగుతోందని తేల్చారు. రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి సగటున 0.53 డిగ్రీలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల నగరాలకే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా ప్రతి దశాబ్దానికి సగటున 0.26 డిగ్రీలు పెరుగుతున్నట్లు గుర్తించారు. అంటే దేశం మొత్తం వేడెక్కుతున్న రేటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయని నివేదిక సూచిస్తోంది. 2050 నాటికి పట్టణాల్లో 80 కోట్ల మందిపెరిగిన మానవ కార్యకలాపాలు, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక ఉత్పత్తి అధిక స్థాయిలో గ్రీన్హౌస్ వాయువులకు దోహదం చేస్తున్నాయి. ఇవి పట్టణాల్లో పగటితో పాటు రాత్రిళ్లు వేడిమిని మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 2050 నాటికి దేశ జనాభాలో పట్టణ జనాభా 68 శాతానికి చేరుతుందని అధ్యయనం పేర్కొనడం మరింత ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) ఇండియా రాస్ సెంటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. ప్రస్తుతం దేశ జనాభాలో 36 శాతం అంటే దాదాపు 40 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటే.. ఇది 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇది రాత్రి వేడిమి మరింత పెరగడానికి దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లోనూ పచ్చదనం పెంపు ద్వారా పగటి వేడిని నిరోధించవచ్చని, రాత్రిపూట వేడిని నిరోధించడానికి ఈ విధానం పనికిరాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా భారీ భవంతులు, తారు, సిమెంట్ రోడ్లతో కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడం, చెరువులు కనుమరుగు కావడంతో రాత్రిపూట నగరాలు అస్సలు చల్లబడట్లేదని న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక సైతం వెల్లడించడం గమనార్హం. -
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్‌లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్‌లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
Monsoon 2024: నేడు కేరళకు నైరుతి ఆగమనం.. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఒకటి నుంచి వర్షాలు..రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రోహిణి భగభగలు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిత్రమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. పగలంతా ఎండలు మండిపోతుండగా, రాత్రికి మాత్రం కాస్త చల్లని వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత చిరాకు కలిగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించి 5 రోజులు కావస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా..అంటే 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కానీ ఈసారి కాస్త తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రెండు మూడు చోట్ల 43కు అటుఇటుగానే నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. హనుమకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో సాధారణంగా 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో తక్కువగా 25, 26, 27 డిగ్రీల మేరకే నమోదు అవుతున్నాయి. బుధవారం కనిష్టంగా నల్లగొండలో 25.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతోనే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలావుండగా రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 46.4 డిగ్రీ సెల్సీయస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, ఆసిఫాబాద్‌లో 45.2 డిగ్రీ సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కేరళను తాకనున్న నైరుతి బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు గురువారం కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. కేరళను తాకిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. -
రోహిణి తీవ్రత లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వేళ రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడి ఎప్పట్నుంచో ఉంది. ఈ కార్తె వస్తోందంటేనే జనం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఏప్రిల్ నుంచే మొదలవడంతో రోహిణి కార్తె ప్రవేశిస్తే ఇంకెంతలా ఉష్ణతాపం పెరిగిపోతుందోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రోహిణి కార్తె ఈనెల 25న ప్రవేశించింది. ఆ సమయానికి బంగాళాఖాతంలో ‘రెమాల్’ తుపాను కొనసాగుతుండడంతో రోహిణి తీవ్రత కనిపించ లేదు. మరోవైపు రాష్ట్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన గాలిలో కొద్దిపాటి తేమ ఇంకా ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంపైకి గంటకు 30–40 కి.మీల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవి భానుడి ప్రతాపాన్ని అదుపు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటున్నాయి. వాస్తవానికి రోహిణి కార్తె రోజుల్లో ఉష్ణోగ్రతలు 42–46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. దీంతో పలు చోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఇవి సాధారణంకంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికం. రానున్న మూడు రోజులు కూడా దాదాపు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగానే పెరగడం వల్ల వడగాడ్పులు గాని, తీవ్ర వడగాడ్పులు కూడా వీచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, నెలాఖరు వరకు వడగాడ్పులకు ఆస్కారం లేదని వెల్లడించింది. రోహిణి కార్తె ఎండలపై భీతిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది ఊరటనివ్వనుంది. సీమలో పిడుగుల వాన.. మరోవైపు దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నెలాఖరు వరకు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
ఐదు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మధ్య బంగాళాఖాతంలో చురుకుగా కదులుతున్నాయి. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారాంతంలోగా కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఆరు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల కదలికల ఆధారంగా రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. చాలా చోట్ల సాధారణం.. కొన్నిచోట్ల అత్యధికం..ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనవల్ల రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా కొన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబూగలో 45.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.9, జగిత్యాల జిల్లా తిర్యాణిలో 44.9, ఆసిఫాబాద్ జిల్లా వెల్గటూరులో 44.8, జగిత్యాల జిల్లా జైనలో 44.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 44.7 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
సాక్షి, నెట్వర్క్: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. దీంతో అనేకచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన హడలెత్తించింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మరోవైపు తగ్గేదేలే అన్నట్టు పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. 45 డిగ్రీ సెల్సీయస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం నాగర్‌కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదం నింపాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. తాడూరుకు చెందిన రైతు బెల్లె మల్లేష్ (38) గ్రామ శివారులోని తన సొంత పొలంలో రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మల్లేష్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (45), రాములు (53) షెడ్‌పై పని చేస్తుండగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ముగ్గురు, అదే సమయంలో తండ్రి వద్దకు వచి్చన మల్లేష్ కూతురు అనూష (12) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు.. చిన్న నాగులు, పార్వతమ్మ, బి.రాజు, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మరోవైపు నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి గేట్ వద్ద ఈదురు గాలుల ప్రభావంతో రేకుల షెడ్‌పై ఉన్న రాయి వచ్చి వికారాబాద్ జిల్లా బషీర్‌బాగ్ మండలం నలవెల్లి గ్రామానికి చెందిన క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ (38)కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వేణుగోపాల్ కిరాయికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్ (12), మారేపల్లికి చెందిన వెంకటయ్య (52) పొలంలో పిడుగుపాట్లకు గురై మరణించారు. ఇలావుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎడ్ల బండిపై పిడుగు పడింది. ఈ ఘటనలో రెండు దుక్కిటెడ్లు మృతిచెందగా రైతు ఎల్కరి సత్తన్నకు గాయాలయ్యాయి. ఇద్దరు మిత్రుల విషాదాంతం మేడ్చల్ జిల్లా కీసరలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి మోటార్ సైకిల్‌పై పడటంతో దానిపై ఉన్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), అదే మండలంలోని దన్రెడ్డిగూడెంలో ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ధనుంజయ్ (46) అనే ఇద్దరు స్నేహితులు మరణించారు. శామీర్‌పేటలో ఉన్న తమకు తెలిసిన వారికి మామిడికాయలు ఇచ్చేందుకు వెళ్తుండగా..కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గోడలు కూలి బాలుడు, వ్యాపారి మృతి హైదరాబాద్‌లోని మియాపూర్, ఓల్డ్ హాఫిజ్‌పేట సాయినగర్‌లో ఆదివారం గాలివానకు గోడ కూలి పడటంతో అబ్దుల్ సమద్ (3) మృతి చెందాడు. డ్రై క్లీనింగ్ చేయడంతో పాటు రోడ్ల ప్రక్కన దుస్తులను అమ్ముకుంటూ జీవించే యూపీకి చెందిన నసీముద్దీన్ కనోదియా, షబానా దంపతుల కుమారుడు సమద్ ఆదివారం సాయంత్రం రేకుల గదిలో నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న రఫీయుద్దీన్ బిల్డింగ్‌పై నుండి ఇటుక గోడకూలి రేకులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఘటనలో ఓ భవనం పై నుండి ఇటుక గోడకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యాపారి రషీద్ (45)పై పడటంతో తీవ్రంగా గాయపడిన అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మరణించాడు. ఈ దుర్ఘటన కూడా ఆదివారం మియాపూర్ ఓల్డ్ హాఫిజ్పేటలోని సాయినగర్ కాలనీలోనే చోటు చేసుకుంది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ ఆర్టీసీ డిపోలో పెద్ద వృక్షం కూలిపడటంతో బస్సు ధ్వంసమైంది. కోళ్లఫారం గోడ కూలి ఇద్దరు మృతి సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కోళ్ల ఫారం గోడకూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ మండలం ఘన్‌పూర్‌కు చెందిన గంగ గౌరిశంకర్ (30), గంగ మాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, చంద్రిక, చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40) క్షీరసాగర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు. అంతా కలిసి సరదాగా పొలంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో తల దాచుకునేందుకు దారిలో ఉన్న ఓ కోళ్ల ఫారం వద్దకు వెళ్లారు. గాలుల ధాటికి ఫారం గోడ కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో గంగ గౌరిశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు మాధవి, శ్వేత, ఇంద్రజ, చంద్రిక తీవ్రంగా గాయపడ్డారు.అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రుద్రూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రూర్లో కారుపై, అంబం శివారులో ఆటో, రెండు బైకులపై చెట్లు విరిగిపడ్డాయి. బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్ట్ విద్యుత్ స్తంభంతో పాటు పలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హస్నాపూర్ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ఇళ్లు, కోళ్ల ఫారాల రేకులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ధర్మారెడ్డి పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కాంటా చేసిన వెయ్యి బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. కొండమల్లేపల్లి మండ లం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు 2 గడ్డివాములు దగ్ధమ య్యాయి. వికారాబాద్ జిల్లాలో గాలివానకు పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పరిగి మండల పరిధి రూప్సింగ్ తండాలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. -
రాష్ట్రంలో మళ్లీ పెరిగిన వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. శనివారం నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా డోంగ్లి 44.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 44.7 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ జిల్లా వయల్పూర్ 44.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశముందని వివరించింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే....గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 44.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది. తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది.శనివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం అదిలాబాద్ 44.0 మెదక్ 42.7 నిజామాబాద్ 42.4 హైదరాబాద్ 39.9 హకీంపేట్ 39.8 నల్లగొండ 39.5 దుండిగల్ 39.5 రామగుండం 38.8 హనుమకొండ 38.0 మహబూబ్‌నగర్ 37.5 ఖమ్మం 36.0 భద్రాచలం 31.6 -
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా 25వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా హనుమకొండ 21.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ప్రణాళికా విభాగం వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా అర్లి ప్రాంతంలో గరిష్టంగా 44.4 డిగ్రీ సెల్సీయస్, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 43.1 డిగ్రీ సెల్సీయస్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 42.9 డిగ్రీ సెల్సీయస్, మంచిర్యాల జిల్లా వెల్గటూరులో 42.8 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే గురువారం సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్‌కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు. రుతుపవనాలకు అనుకూలంగా..నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్‌లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.