సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : కేరళలోకి ప్రవేశించిన రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. గత 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరగడంతో రెండు రోజుల్లోనే అవి రాయలసీమను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి రుతుపవనాలు ఆంధ్రా ప్రాంతానికి రావడానికి సాధారణంగా 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను ప్రభావంతో రుతుపవనాలు బంగాళాఖాతంలో శ్రీలంక కింది భాగం నుంచి విస్తరిస్తున్నాయి. 3 రోజుల్లోనే అవి పైభాగానికి వచ్చి శుక్రవారం తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉంది. నిప్పుల వానలా రాష్ట్రంలో ఎండలు రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పూర్తిగా విస్తరించే వరకు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు నిప్పుల వానను తలపిస్తున్నాయి. జూన్ రెండో వారం మొదలైనా భానుడి ప్రతాపం కొనసాగుతోంది.
రోహిణి కార్తె వెళ్లాక వచ్చే మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం మృగశిర కార్తె ప్రవేశించినా రోహిణి కార్తె ఎండలనే తలపిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43–45 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పలుచోట్ల వడగాడ్పులు, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. కోస్తాలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణం ఎగువ ప్రాంతంలో ఉన్న గాలుల్లో కూడా పొడి శాతం ఎక్కువ ఉంది. దీనివల్లే ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ఏప్రిల్‌లో వచ్చిన మోకా తుపాను బంగాళాఖాతంలో ఉన్న తడి గాలులన్నింటినీ లాగేసుకోవడంతో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను వల్ల కొంత వేడి వాతావరణం ఉంటుంది. దీనికితోడు రాజస్థాన్ నుంచి వచ్చే గాలులు కూడా పొడిగానే ఉంటున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
శుక్రవారం అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, కాకినాడ జిల్లా కరపలో 45.3, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 45.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కొండాయిగూడెంలో 45.2 డిగ్రీలు, గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment