సాక్షి, విశాఖపట్నం: మూడు వారాల నుంచి కొద్దిరోజుల కిందటి వరకు దడపుట్టించిన వడగాడ్పులు తగ్గుముఖం పట్టాయి. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ సమాచారం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉండటంతో పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు కూడా వీచాయి. నిప్పులు చెరిగే ఎండలకు జనం అల్లాడిపోయారు. 4 రోజుల కిందటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది.
అల్పపీడన ద్రోణి, విండ్ డిస్కంటిన్యూటీ (గాలికోత)ల కారణంగా అకాల వర్షాలు మొదలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఆకాశంలో మబ్బులు కమ్మి ఒకింత చల్లదనాన్ని పంచుతున్నాయి. ఈ పరిణామాలతో పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వరకు ఒకింత ప్రభావం చూపుతున్నా ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం పలుచోట్ల సాధారణంగాను, కొన్నిచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువగాను నమోదవుతున్నాయి. ఫలితంగా నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఎండలు విజృంభించడం లేదు.
వడగాడ్పులు లేవు. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి/గాలులకోత పశ్చిమ విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మునుపటికంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు వారం రోజులపాటు కొనసాగుతాయని, అందువల్ల అప్పటివరకు వడగాడ్పులు వీచే అవకాశాల్లేవని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది.
మే నెల సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్ ఆఖరి వరకు ఇంకెంత ఉష్ణతీవ్రతను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఈ సమాచారం ఊరటనిచ్చే అంశమని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మధ్యాహ్నం వేళ వరకు ఒకింత ఉష్ణ తీవ్రత అనిపించినా ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment