
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా 25వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా హనుమకొండ 21.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ప్రణాళికా విభాగం వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా అర్లి ప్రాంతంలో గరిష్టంగా 44.4 డిగ్రీ సెల్సీయస్, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 43.1 డిగ్రీ సెల్సీయస్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 42.9 డిగ్రీ సెల్సీయస్, మంచిర్యాల జిల్లా వెల్గటూరులో 42.8 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే గురువారం సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment