రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్‌లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు.
సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం.
ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్‌లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.
గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి.
గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది.
మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి.
అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు.
అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే!
ప్రకృతి వికృతి
Published Fri, May 31 2024 4:39 AM | Last Updated on Fri, May 31 2024 4:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment