
నెత్తురు చిందకుండా, నష్టం జరగకుండా యుద్ధం సాగుతుందనీ, ముగుస్తుందనీ ఎవరూ అనుకోరు. ప్రత్యర్థిని చిత్తు చేద్దామని ఇరుపక్షాలూ విశ్వప్రయత్నం చేస్తాయి. కానీ అనేక కారణాలవల్ల ఎవరో ఒకరినే విజయం వరిస్తుంది. ఇందులో సరైన అంచనాలకు రాలేకపోవటం దగ్గరనుంచి స్థానిక వాతావరణ స్థితిగతుల వరకూ చాలా వుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా మన విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో మనకు కలిగిన నష్టాలగురించి వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి.
యాదృచ్ఛికంగానే కావొచ్చుగానీ... మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శనివారం సింగపూర్‌లో మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. ఆ అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు వదలటం లేదా వారితో చర్చించి ఎప్పుడు ఏ విధంగా చెప్పాలో సలహా తీసుకోవటం సరైన విధానం. విదేశీ గడ్డపై చెప్పటమైతే ఎంతమాత్రమూ సరికాదు. పైగా ఆయన సింగపూర్ వెళ్లింది ఏటా జరిగే అంతర్ ప్రభుత్వాల భద్రతా వ్యవహారాలపై నిర్వహించే ‘షాంగ్రీ లా డైలాగ్’ కోసం.
అందులో పాకిస్తాన్ త్రివిధ దళాల చీఫ్ కూడా పాల్గొన్నారు. ఒకపక్క మన ఎంపీల అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ ఆగడాల గురించీ, వాటిని నిలువరించక తప్పని స్థితి గురించీ వివరించటానికి వేర్వేరు దేశాల్లో పర్యటిస్తున్నాయి. కనుక జనరల్ చౌహాన్ ప్రకటన ఏ రకంగా చూసినా సమయం, సందర్భం లేనిది. కొందరు మాజీ సైనికాధికారులూ, నిపుణులూ చెప్పినట్టు పాకిస్తాన్‌కు మన దళాలు కలిగించిన భారీ నష్టంతోపాటు దీన్నీ చెప్పివుంటే ఇంత వివాదమయ్యేది కాదేమో!
గత నెల 7 నుంచి పదో తేదీ వరకూ సాగించిన దాడుల్లో మన నష్టం ఏపాటో చెప్పాలని విపక్షాలు కోరుతున్నాయి. దాడి చేయటానికొచ్చిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఆధారంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ డిమాండ్ మొదలుపెట్టారు. మన సైనిక దళాలు సాధిస్తున్న విజయాలను ఎన్డీయే ప్రభుత్వం తన సత్తాకు ప్రతీకగా చెప్పుకోవటాన్ని నిరోధించేందుకు విపక్షాలు ఈ ప్రయత్నం చేసివుండొచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడిచేయాలనే అంశాలను పూర్తిగా త్రివిధ దళాలకు అప్పగించాక వాటిపై అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం ఎవరు చేసినా తప్పే. యుద్ధంలో తొలి క్షతగాత్ర సత్యమేనంటారు.
ఎందుకంటే అవతలి పక్షాన్ని చావుదెబ్బ తీశామని, అనేకమంది శత్రు సైనికుల్ని హతమార్చామని, కీలక స్థావరాలు ధ్వంసం చేశామని ప్రభుత్వాలు చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా వున్నదే. యుద్ధం ముగిసిన కొన్నాళ్లకుగానీ వాస్తవ గణాంకాలు బయటకు రావు. మన విపక్షాలు అంతవరకూ ఆగలేకపోయాయి. పాక్ మీడియా వార్తల్ని విశ్వసించి మన ప్రభుత్వాన్ని నిలదీయటం మొదలుపెట్టాయి. ఇదంతా రాజకీయంగా బీజేపీకి లాభిస్తుందన్న ఆందోళనే దీనికి కారణం.
ఎప్పుడూ లేనివిధంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సామాజిక మాధ్యమాల్లో, చానెళ్లలో మన సేనలు పాకిస్తాన్ నగరాలను నేలమట్టం చేయటం మొదలుకొని పలు విజయాలు సాధించినట్టు ప్రచారం సాగింది. ఇదెంత ముదిరిందంటే... ఒక దశలో మన ప్రభుత్వం ఖండించాల్సి వచ్చింది కూడా. మరోపక్క యుద్ధంవల్ల కలిగే అనర్థాల గురించి చెప్పిన మాజీ సైనికాధికారులనూ, వారి కుటుంబసభ్యులనూ దూషించటం, ఉగ్రవాదుల దుర్మార్గానికి భర్తను కోల్పోయిన యువతి ముస్లింలపై ద్వేషం వద్దని అన్నందుకు ఆమెను దుర్భాషలాడటం వంటి వైపరీత్యాలూ చోటుచేసుకున్నాయి.
కొందరైతే దాడులు నిలిపేస్తున్నట్టు ప్రకటించిన మన విదేశాంగ శాఖ కార్యదర్శిపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా నోరుపారేసుకున్నారు. యుద్ధకాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలనూ, సలహాలనూ పాటించటం తప్ప ఉన్మాదం ఆవహించినట్టు ఊగిపోవటం సరైంది కాదు. ఇందువల్ల మన జవాన్లకు వీసమెత్తు ఉపయోగం లేదు సరికదా... ప్రజల్లో తప్పుడు భావాలు వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది. దాడులు ఎప్పుడు మొదలెట్టాలో, ఎప్పుడు ఆపాలో, ఏ దశలో ఏం చేయాలో నిర్ణయించటానికి ప్రభుత్వం ఉన్నప్పుడు గుంపులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం అనర్థదాయకం.
చౌహాన్ చెబుతున్న ప్రకారం నాలుగు రోజుల దాడుల్లో తొలి రెండు రోజులూ మనకు నష్టం వాటిల్లింది. వెంటనే లోపాలు గుర్తించి సరిచేసుకోవటం పర్యవసానంగా ఆ తర్వాత మన జెట్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగాయని ఆయన అన్నారు. ఏ లోపమూ చోటుచేసుకోకుండా, ఏ నష్టమూ జరగకుండా మనం కోరుకున్న ప్రకారం అంతా జరిగిపోవాలనుకునేవారికి ఇది నిరాశ కలిగించవచ్చు. బీజేపీ అగ్ర నాయకులంతా ఈ విజయాలను తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపు కావొచ్చు.
కానీ దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో సంయమనం పాటించటం అందరి బాధ్యత. దాడులు ప్రారంభించటానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరిన ప్రభుత్వం ముగించటానికి ముందు కూడా ఆ పనే చేసివుంటే బాగుండేది. కనీసం మన దళాలు సాధించిన విజయాలు, మన నష్టాల గురించి ఈ నెల్నాళ్లలోనైనా అఖిలపక్షం నిర్వహిస్తే సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ తరహా ఉదంతాలు ఇకపై పునరావృతం కాకూడదనుకుంటే కేంద్రం ఆ పని చేయాలి. అందులో అధికార, విపక్షాల వ్యవహారశైలి గురించీ, కొన్ని శక్తులనుంచి అతిగా వచ్చిన స్పందనల గురించీ తన వైఖరేమిటో చెప్పాలి. కష్టకాలంలో సంయమనం పాటించటం ఎంత ముఖ్యమో వివరించాలి.