
సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం గానీ, ఉపరితల ఆవర్తనం గానీ, ద్రోణుల జాడ గానీ లేవు. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులేర్పడ్డాయి.
సోమవారం గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మంగళ, బుధ, గురువారాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోకి దిగువ స్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణిస్తూ చలి తీవ్రతను పెంచుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో పలుచోట్ల సాధారణ కంటే 2–4 డిగ్రీలు అధికంగాను నమోదవుతున్నాయి. కాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కళింగపట్నంలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment