cold intensity of Andhra pradesh
-
కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంచుతోపాటు పొగమంచు కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో మంగళవారం తెల్లవారుజామున 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగుల మండలం కుంతలంలో 4.1, చింతపల్లి మండలం చింతపల్లిలో 4.2, జీకే వీధిలో 4.3, డుంబ్రిగూడలో 4.4, జి.మాడుగుల, హకీంపేటలో 4.7, పాడేరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలోని చాలాప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ తరహాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా ఆగలిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం, అనంతపురం జిల్లా బెళుగుప్పలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చలితో గజ గజ! రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడంటే?
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఉధృతమవుతోంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా, పర్వత ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా రికార్డవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆ జిల్లాలోని హుకుంపేటలో 3.7, చింతపల్లిలో 4.9, అరకులోయలో 5.1 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజనులో హుకుంపేటలో నమోదైన 3.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యల్పం. అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, నంద్యాల, కాకినాడ, వైఎస్సార్ జిల్లాలు చలితో వణుకుతున్నాయి. ఈశాన్య, ఉత్తర గాలుల వల్లే... ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత అధికంగా ఉంది. అటు నుంచి ఉత్తర గాలులు మన రాష్ట్రంపైకి వీస్తున్నాయి. వీటికి ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చల్ల గాలులు కూడా తోడవుతున్నాయి. వీటి ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ఉధృతి పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద శనివారం ‘సాక్షి’కి తెలిపారు. వాయవ్య గాలులు కూడా మొదలైతే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని, జనవరి ఆరంభం నుంచి చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. చలికి పొగమంచు తోడు... ప్రస్తుతం చలి ఉధృతికి పొగమంచు కూడా తోడవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. సముద్రం పైనుంచి ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల వల్ల పొగమంచు ఏర్పడుతోంది. ఈ పొగమంచు దట్టంగా అలముకోవడం వల్ల రోడ్లపై ముందు వెళుతున్న వాహనాలు కనిపించక ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనచోదకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
చలి తీవ్రత పెరిగే అవకాశం!
సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం గానీ, ఉపరితల ఆవర్తనం గానీ, ద్రోణుల జాడ గానీ లేవు. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులేర్పడ్డాయి. సోమవారం గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మంగళ, బుధ, గురువారాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోకి దిగువ స్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణిస్తూ చలి తీవ్రతను పెంచుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో పలుచోట్ల సాధారణ కంటే 2–4 డిగ్రీలు అధికంగాను నమోదవుతున్నాయి. కాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కళింగపట్నంలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
Andhra Pradesh: రాష్ట్రంపై చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గతానికి భిన్నంగా రాష్ట్రంలో చలి ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది. శీతాకాలంలో చలి వాతావరణం సాధారణమే అయినా ఈసారి దాని తీవ్రత ఎక్కువైంది. అన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. విజయవాడ వంటి వెచ్చని ప్రదేశాలను కూడా ఈ శీతాకాలం వణికిస్తోంది. 50 ఏళ్ల తర్వాత విజయవాడలో రెండు రోజుల కిందట 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మామూలుగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుంది. శీతాకాలం కూడా అంత తీవ్రమైన చలి వాతావరణం కనిపించదు. కానీ ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఈనెల 18వ తేదీ నుంచి వరుసగా 13.5 నుంచి 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచే చలి తీవ్రత పెరిగి ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే ఉంది. 2 నుంచి 4 డిగ్రీలకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతాయి. విశాఖ మన్యంలో 8 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలుంటాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆ ప్రాంతాలు చలికి గడ్డకడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లోను చలితీవ్రత పెరిగింది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌లో ఈ నెల 18న 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 5.4 డిగ్రీలు గురువారం ఉదయం విశాఖ జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలు నమోదైంది. పెదబయలు, డుంబ్రిగూడల్లో 5.7, జి.మాడుగులలో 5.9, జీకే వీధిలో 6.5, చింతపల్లి 7.7లో, హకుంపేటలో 7.8, పాడేరులో 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేరోజు కర్నూలు నగరంలో 14.2 డిగ్రీలు, విజయవాడలో 14.6, అనంతపురంలో 15.2, తిరుపతిలో 15.8, ఒంగోలు, ఏలూరుల్లో 15.9, శ్రీకాకుళం, కడపల్లో 16.2, గుంటూరులో 16.3, విశాఖపట్నంలో 18.2, కాకినాడలో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి కారణాలివే.. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కిలోమీటర్ల ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలితీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు గాలులు ఉత్తర భారతదేశం నుంచి మన రాష్ట్రానికి నేరుగా వీస్తున్నాయి.తేమ తక్కువగా ఉండడం వల్ల చలిగాలులు పెరిగాయి. చలితీవ్రత మరో 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 15వ తేదీ వరకు మామూలు చలి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చలిలో తిరగవద్దు చలి గాలుల వల్ల శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చలిలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలి ముక్కు, చెవులకు తాకకుండా జాగ్రత్త వహించాలి. – డాక్టర్ గోపీచంద్, పల్మనాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్ -
AP: వణుకుతున్న 'రాష్ట్రం'
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. గ్రామాలు, నగరాలు గజగజ వణుకుతున్నాయి. విజయవాడ నగరంలో చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో బుధవారం తెల్లవారుజామున 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. 50 ఏళ్ల తరువాత విజయవాడలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ చెబుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది. 1970లో డిసెంబర్ 14న అత్యల్పంగా 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 1995, 1984, 2010 సంవత్సరాల్లో 13.7, 13.4, 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం నగరంలో చలితీవ్రత పెరిగింది. రాబోయే రెండురోజులు నగరంలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా అంతా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోను చలిగాలులు కొనసాగుతున్నాయి. బుధవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 5.4 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. పెదబయలులో 5.7, ముంచంగిపుట్టులో 6.3, డుంబ్రిగూడలో 6.8, అరకు వ్యాలీలో 7, గుంటూరులో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్య భారతదేశం నుంచి చల్లటిగాలులు నేరుగా ఏపీ వైపు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మంగళవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 3.9, డుంబ్రిగూడ 4.4, జీకే వీధి 4.8, ముంచంగిపుట్టు 5.1, పెదబయలు 5.2, హుకుంపేట 5.9, పాడేరులో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌లో 7.1 డిగ్రీలు నమోదైంది. విజయవాడలోనూ చలి తీవ్రత పెరగడంతో మంగళవారం 13.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 13.6 నమోదైంది. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరులో 14.2, తిరుపతిలో 15.9, విశాఖలో 18.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మంచు దుప్పటి
సాక్షి, విశాఖపట్నం/బి.కొత్తకోట: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ కలవరపెడుతున్నాయి. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనికి తోడు ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాయలసీమలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 5 గంటలకు 3.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఎముకలు కొరికేలా చలి పెరిగిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జి.మాడుగులలో 4.7, అరకులో 5.3, ముంచంగిపుట్టులో 5.8, పాడేరులో 6.1, మారేడుమిల్లిలో 9.6, మడకశిరలో 10, తిరుమల, పెదబయలులో 10.2, హుకుంపేట, కునుర్పి, రొద్దాంలో 10.7, ఆలూరులో 11.3, మదనపల్లెలో 11.7, మంత్రాలయంలో 11.9, ఓబులదేవర చెరువులో 12, వై.రామవరంలో 12.1, గుమ్మగుట్టలో 12.4, బేతంచెర్ల, గుత్తిలో 12.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హార్సిలీ హిల్స్‌పై తిరుమల కంటే తక్కువగా.. రాయలసీమలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో సోమవారం నమోదయ్యాయి. బి.కొత్తకోట మండలంలో సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో గల హార్సిలీ హిల్స్‌పై కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీలుగా నమోదైంది. హార్సిలీ హిల్స్ కంటే తిరుమల కొండలు తక్కువ ఎత్తు కావడంతో ఇక్కడ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: కోస్తా తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఉత్తర గాలులు వీస్తుండడం.. వీటికి అనుబంధంగా రాయలసీమ మీదుగా వీస్తున్న ఈశాన్య గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 3–5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖ, రాయలసీమలోని పశ్చిమ ప్రాంతాల్లో 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు. చలి గాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకూ రోడ్లపైకి ప్రజలు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విశాఖ మన్యంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో 5.8 డిగ్రీలు, అరకు లోయలో 9.6, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 21న వాయుగుండంగా మారనుంది. ఇది థాయ్‌లాండ్ వైపుగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గడం, దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పడిపోతే అతి శీతల గాలులు(కోల్డ్వేవ్స్)గా ప్రకటిస్తారు. ఏజెన్సీలో పలు చోట్ల ఈ తరహా కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టులో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. డుంబ్రిగుడలో 8, అరకు, జి.మాడుగుల, లంబసింగిలో 9, పెదబయలులో 9.5, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దీనికి తోడు మధ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నాయి. బుధవారం నుంచి చలి గాలుల తీవ్రత పెరుగుతుందని, మొత్తంగా శీతాకాలం పూర్తిగా ప్రవేశించినట్లేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ పరిస్థితులే కనిపిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా ఉన్నట్లు కనిపించినా.. ఈశాన్య గాలులు వీస్తుండటం, మంచు ప్రభావంతో చలి వణికించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. -
చలి మొదలైంది..!
సాక్షి, అమరావతి బ్యూరో/ మహారాణిపేట (విశాఖ దక్షిణ)/ పాడేరు: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి ఊపందుకుంటోంది. పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు చలిగాలుల తీవ్రత ఉంటోంది. అతిశీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగిలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఘాట్ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత 21.4 కాగా 16.2, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 21.8కి 16.6 డిగ్రీలు రికార్డయ్యాయి. విశాఖపట్నంలో 4, కాకినాడలో 3.3, తునిలో 3.1, విజయవాడలో 2.7, నర్సాపురం, బాపట్ల, కడపలలో 2, మచిలీపట్నం, కర్నూలులో 1.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి 1–2 డిగ్రీలు అధికంగా రికార్డు కావడం గమనార్హం. ► తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతోపాటు ఉత్తరాది నుంచీ చలి గాలులు వీస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రంలో చలి ప్రభావం మొదలవడానికి కారణమని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా సోమవారం ‘సాక్షి’కి చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి దక్షిణ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
రాష్ట్రంలో పెరుగుతున్న చలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తున్నాయి. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా రెండు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఆంధ్రలో చలి.. తెలంగాణలో వేడి
మారుతున్న వాతావరణం.. నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల విశాఖపట్నం, సాక్షి: వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండురోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్నాయి. వాస్తవానికి ఈ సమయంలో తెలంగాణలో చలి ప్రభావం కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో సాధారణ వాతావరణం కనిపిస్తోంది. ఫలితంగా అక్కడ పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే రికార్డవుతుండగా, ఒకట్రెండు చోట్ల మాత్రం 1నుంచి2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. అదే సమయంలో కోస్తాంధ్రలో సాధారణంకంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. అందువల్ల కోస్తాంధ్రలో చలి ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు రాయలసీమలోనూ 2నుంచి3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా అక్కడ కూడా చలి ప్రభావం కనిపించడం లేదు. గడచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యల్పంగా హకీంపేటలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఎప్పుడూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్‌లో 18 డిగ్రీలు రికార్డయింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, కళింగపట్నంలలో అత్యల్పంగా 13 డిగ్రీలు నమోదు కావడం విశేషం. ఇవి సాధారణంకంటే 5 డిగ్రీలు తక్కువ. విశాఖపట్నంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత (-3 డిగ్రీలు) నమోదయింది. ఉత్తరాది నుంచి వస్తున్న గాలులు బలంగా లేకపోవడం, అదే సమయంలో తూర్పు గాలులు మొదలుకావడం వల్ల చలి ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రిటైర్డు అధికారి ఆర్.మురళీకృష్ణ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని చెప్పారు.