చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌ను కప్పేసిన మంచు
సాక్షి, విశాఖపట్నం/బి.కొత్తకోట: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ కలవరపెడుతున్నాయి. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనికి తోడు ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాయలసీమలోనూ చలి తీవ్రత పెరుగుతోంది.
శీతల గాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 5 గంటలకు 3.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఎముకలు కొరికేలా చలి పెరిగిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జి.మాడుగులలో 4.7, అరకులో 5.3, ముంచంగిపుట్టులో 5.8, పాడేరులో 6.1, మారేడుమిల్లిలో 9.6, మడకశిరలో 10, తిరుమల, పెదబయలులో 10.2, హుకుంపేట, కునుర్పి, రొద్దాంలో 10.7, ఆలూరులో 11.3, మదనపల్లెలో 11.7, మంత్రాలయంలో 11.9, ఓబులదేవర చెరువులో 12, వై.రామవరంలో 12.1, గుమ్మగుట్టలో 12.4, బేతంచెర్ల, గుత్తిలో 12.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హార్సిలీ హిల్స్‌పై తిరుమల కంటే తక్కువగా..
రాయలసీమలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో సోమవారం నమోదయ్యాయి. బి.కొత్తకోట మండలంలో సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో గల హార్సిలీ హిల్స్‌పై కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీలుగా నమోదైంది. హార్సిలీ హిల్స్ కంటే తిరుమల కొండలు తక్కువ ఎత్తు కావడంతో ఇక్కడ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment