low temperature
-
మన్యం గజగజ..!
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజుజిల్లా): చలికాలం ప్రారంభంలోనే మన్యం ప్రాంతంలో చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శుక్రవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.5డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13.9డిగ్రీలు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 14డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కారణంగా సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చలి మరింత వణికిస్తోంది. గిరిజన గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో చలిమంటలు కనబడుతున్నాయి. స్వెట్టర్ల వినియోగం క్రమేణా పెరుగుతోంది. అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇక అర్ధర్రాతి అయితే దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఘాట్ ప్రాంతంలో దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ఉదయం 9 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో మంచు తెరలు వీడడం లేదు. ప్రజలు హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు, వారపు సంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. -
మంచు దుప్పటి
సాక్షి, విశాఖపట్నం/బి.కొత్తకోట: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ కలవరపెడుతున్నాయి. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనికి తోడు ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాయలసీమలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 5 గంటలకు 3.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఎముకలు కొరికేలా చలి పెరిగిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జి.మాడుగులలో 4.7, అరకులో 5.3, ముంచంగిపుట్టులో 5.8, పాడేరులో 6.1, మారేడుమిల్లిలో 9.6, మడకశిరలో 10, తిరుమల, పెదబయలులో 10.2, హుకుంపేట, కునుర్పి, రొద్దాంలో 10.7, ఆలూరులో 11.3, మదనపల్లెలో 11.7, మంత్రాలయంలో 11.9, ఓబులదేవర చెరువులో 12, వై.రామవరంలో 12.1, గుమ్మగుట్టలో 12.4, బేతంచెర్ల, గుత్తిలో 12.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హార్సిలీ హిల్స్‌పై తిరుమల కంటే తక్కువగా.. రాయలసీమలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో సోమవారం నమోదయ్యాయి. బి.కొత్తకోట మండలంలో సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో గల హార్సిలీ హిల్స్‌పై కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీలుగా నమోదైంది. హార్సిలీ హిల్స్ కంటే తిరుమల కొండలు తక్కువ ఎత్తు కావడంతో ఇక్కడ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ఢిల్లీని కమ్ముకున్న మంచు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో డిసెంబరులో సోమవారం(30న)ను అత్యంత చలిదినంగా భారతవాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 119 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా డిసెంబర్లో 9.4 డిగ్రీ సెల్సియస్‌ల అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. సఫ్దర్జంగ్లో సోమవారం 9.4 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ట్విట్టర్లో వెల్లడించారు. దీని ప్రభావం విమానరాకపోకలపై పడింది. మంచుకారణంగా సోమవారం ఉదయం ఢిల్లీలో 20 విమానాలను దారిమళ్ళించారు. 530 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.∙మంచుకురుస్తుండటంతో రైళ్ళ రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. 30 రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నట్టు నార్తర్న్ రైల్వే ప్రకటించింది. మరోవైపు, దట్టమైన పొగమంచు కారణంగా గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఢిల్లీలో చలి పెరిగింది! ఢిల్లీలో రెండో అత్యంత శీతల డిసెంబర్‌గా 2019 డిసెంబర్ నిలిచింది. ఇందుకు కారణాలను వాతావరణ నిపుణులు విశ్లేషించారు. ఢిల్లీకి ఉత్తరంగా ఉన్న కొండప్రాంతాల్లో డిసెంబర్ నెలలో భారీగా మంచు కురవడానికి, చలికాలంలో అక్కడ వర్షాలు కురవడానికి కారణమైన పశ్చిమ తుపాను గాలులు(వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్) గత 10 రోజులుగా వీయకపోవడం అందుకు కారణమని పేర్కొన్నారు. ఆ గాలులు ఢిల్లీ వైపు వీచే అతి శీతల గాలుల దిశను మారుస్తాయని, అవి రాకపోవడం వల్ల ఢిల్లీలో చలి తీవ్రస్థాయికి చేరిందని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ సమాచార కేంద్ర డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు. ఉత్తరాది పీఠభూమి ప్రాంతంపై.. పంజాబ్ నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు 2 వేల నుంచి 3 వేల అడుగుల ఎత్తులో దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరలేకపోతున్నాయని, ఈ డిసెంబర్ చలికి అది కూడా కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌లో పనిచేస్తున్న నిపుణుడు మహేశ్ పాలవత్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం యూపీ నుంచి ఢిల్లీ వైపు వీస్తున్న తూర్పు గాలులు కూడా అత్యంత శీతలంగా ఉన్నాయన్నారు. ఈ తూర్పుగాలుల్లోని తేమ కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడుతోందన్నారు. -
ఢిల్లీ-హైదరాబాద్ విమానం రద్దు
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. పొగ మంచుతో వెలుతురు మందగించడంతో 54 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 రైలు సర్వీసులను రద్దు చేశారు. నాలుగు అంతర్జాతీయ విమానాలు, ఐదు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ-హైదరాబాద్ విమాన సర్వీసు రద్దు చేశారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగత్రలు రోజురోజుకు తగ్గుతుండడంతో హస్తినవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు, చలిగాలులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
లంబసింగిలో ‘0’ డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరు: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా డిసెంబరు మూడోవారం నాటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొనడంతో ఏజెన్సీలోని ప్రజలు వణుకుతున్నారు. ఆదివారం పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో సున్నా డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 4 డిగ్రీలు, పర్యాటక ప్రాంతమైన పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలులు విజృంభించాయి. శనివారం మినుములూరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడివద్ద 3 డిగ్రీలు నమోదవగా ఒక రోజు వ్యవధిలోనే మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొనడం, దట్టమైన పొగమంచు, చలిగాలుల తీవ్రతతో మన్యంవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2 రోజుల నుంచి చలి విజృంభిస్తుండడంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పర్యాటకులు సైతం వణికించే చలిని తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉదయం 10 గంటల తర్వాత సూర్యోదయం అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని మారేడుమిల్లి ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోంది. చలికి ముగ్గురి మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతను తట్టుకోలేక తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పొలాకి సూరమ్మ (62) అనే వృద్ధురాలు ఆదివారం మృతిచెందింది. గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత పెరగడంతో తట్టుకోలేక ఆమె మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు తహశీల్దార్ డీవీ బ్రహ్మాజీరావుకు సమాచారం అందించారు. విషయూన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఆయన చెప్పారు. కాగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన వేగుళ్ల నారాయణమూర్తి(80), రాజవొమ్మంగికి చెందిన ఇసుకపల్లి అప్పారావు(75) చలిగాలులకు తట్టుకోలేక ఆదివారం మృతిచెందారు.