లంబసింగిలో ‘0’ డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరు: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా డిసెంబరు మూడోవారం నాటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొనడంతో ఏజెన్సీలోని ప్రజలు వణుకుతున్నారు. ఆదివారం పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో సున్నా డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 4 డిగ్రీలు, పర్యాటక ప్రాంతమైన పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలులు విజృంభించాయి.
శనివారం మినుములూరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడివద్ద 3 డిగ్రీలు నమోదవగా ఒక రోజు వ్యవధిలోనే మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొనడం, దట్టమైన పొగమంచు, చలిగాలుల తీవ్రతతో మన్యంవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2 రోజుల నుంచి చలి విజృంభిస్తుండడంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పర్యాటకులు సైతం వణికించే చలిని తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉదయం 10 గంటల తర్వాత సూర్యోదయం అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని మారేడుమిల్లి ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోంది.
చలికి ముగ్గురి మృతి
సాక్షి నెట్‌వర్క్: చలి తీవ్రతను తట్టుకోలేక తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పొలాకి సూరమ్మ (62) అనే వృద్ధురాలు ఆదివారం మృతిచెందింది. గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత పెరగడంతో తట్టుకోలేక ఆమె మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు తహశీల్దార్ డీవీ బ్రహ్మాజీరావుకు సమాచారం అందించారు. విషయూన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఆయన చెప్పారు. కాగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన వేగుళ్ల నారాయణమూర్తి(80), రాజవొమ్మంగికి చెందిన ఇసుకపల్లి అప్పారావు(75) చలిగాలులకు తట్టుకోలేక ఆదివారం మృతిచెందారు.