పాడేరు–లంబసింగి రహదారికి పచ్చజెండా  | Green flag for Paderu Lambasingi road | Sakshi
Sakshi News home page

పాడేరు–లంబసింగి రహదారికి పచ్చజెండా 

Published Wed, Jun 14 2023 5:27 AM | Last Updated on Wed, Jun 14 2023 5:27 AM

Green flag for Paderu Lambasingi road - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు రహదారులు, ఒక రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్‌వోబీ) నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాడేరు–లంబసింగి రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీతారాంపురం–దుత్తలూరు రహదారితోపాటు ఓ ఆర్‌వోబీ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.545 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఖరారు చేసింది.   

దుత్తలూరు రోడ్డుకు రూ.267 కోట్లు 
ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో సీతారామపురం నుంచి దుత్తలూరు వరకు 36.40 కి.మీ. మేర పావడ్‌ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. అందుకోసం రూ.267 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఖరారు చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని చిన్నతిప్ప సముద్రం సమీపంలోని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఆర్‌వోబీ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. సేతు భారతం ప్రాజెక్ట్‌ కింద ఈ రెండు లేన్ల ఆర్‌వోబీ నిర్మాణానికి రూ.72.50 కోట్లతో టెండర్లను ఖరారు చేసింది.   

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ రహదారులను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మీదుగా అరకుకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రం పాడేరు నుంచి లంబసింగికి కూడా రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఆంధ్రా కశ్మిర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పాడేరు–లంబసింగి మధ్య 48 కి.మీ. మేర పావడ్‌ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.206 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఇటీవల ఖరారు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించి 2024 మార్చి కల్లా పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement