ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒబెరాయ్ సంస్థ విశాఖలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుకొచ్చింది. రిసార్ట్‌తో పాటు స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి మండలం అన్నవరం సాగరతీరంలో ఒబెరాయ్ సంస్థకు స్థలాన్ని కేటాయించేందుకు పర్యాటక శాఖ సమాయత్తమవుతోంది. పాడేరులోనూ టూరిజం సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రముఖ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించేందుకు మొగ్గు చూపుతుండటంతో.. టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా హోటల్స్ రంగంలో దిగ్గజమైన ఒబెరాయ్ హోటల్ విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజరామన్ శంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు చోట్ల తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
అన్నవరంలో 7 స్టార్ హోటల్
భీమిలి సమీపంలోని అన్నవరం సముద్రతీరంలో తమ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒబెరాయ్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారులతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. ఇటీవలే జిల్లా టూరిజం అధికారులతో కలిసి విశాఖపట్నం బీచ్ పరిసరాలను సందర్శించారు. బీచ్ ఒడ్డున టూరిజం శాఖకు ఎక్కడెక్కడ ఎంత మేర భూములున్నాయో వాటన్నింటినీ పరిశీలించారు. చివరిగా అన్నవరం సాగరతీరం ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు నచ్చడంతో.. ఆ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అన్నవరంలో పర్యాటక శాఖకు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. వీటిలో 40 ఎకరాలను ఒబెరాయ్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ 7 స్టార్ హోటల్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. వీటితో పాటు రిసార్టులు కూడా ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తోంది.
పాడేరులో టూరిజం సెంటర్
విశాఖతో పాటు ఏజెన్సీ ప్రకృతి అందాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. పాడేరు రీజియన్ పరిధిలో టూరిజం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ మన్యంలోని అందాలను తిలకించేందుకు ఆసక్తిగా వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు.. ఆ ప్రాంతంలో ఏఏ వనరులు, వసతులు కావాలని కోరుకుంటారో.. వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో అందించేలా టూరిజం సెంటర్ ఉండబోతోంది. రిసార్టులు, హోటల్, టూరిజం ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలన్నీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఒబెరాయ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ పట్నంలో రూ.300కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ సిద్ధమవుతోంది. (క్లిక్: తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు)
ఒబెరాయ్ గ్రూప్స్ అంటే.?
భారత్‌కు చెందిన ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్లను విస్తరించిన సంస్థ. 5 స్టార్ లేదా 7 స్టార్ హోటల్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోంది. ఐదు దేశాల్లోని 20కిపైగా నగరాల్లో హోటళ్లను, 2 క్రూయిజ్ షిప్‌లను ఒబెరాయ్ సంస్థ నిర్వహిస్తోంది. 1934 నుంచి హోటల్స్ రంగంలో సేవలందిస్తూ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. భారత్‌లో ముంబయి, గుర్‌గావ్, చెన్నై, భువనేశ్వర్, కోచ్చి, ఆగ్రా, జైపూర్, ఉదయ్‌పూర్, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే హోటళ్లను నడుపుతోంది. తాజాగా విశాఖలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో మరోసారి ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన కోసం నగరానికి రానున్నట్లు పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. (క్లిక్: ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!)
Comments
Please login to add a commentAdd a comment