Oberoi Hotels Group
-
రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్
ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీయ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ 'పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్' (Prithvi Raj Singh Oberoi) ఈ రోజు కన్నుమూశారు. 1939లో సిమ్లాలో మొదలైన ఒబెరాయ్ హోటల్స్ ప్రస్థానం ప్రస్తుతం ఏడు దేశాలకు విస్తరించింది. దీని వెనుక ఒబెరాయ్ కృషి ఏమిటి, ఆయన సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈస్ట్ ఇండియా హోటల్స్ బాధ్యతలు 1929లో జన్మించిన 'ఒబెరాయ్' పాఠశాల విద్యను డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉన్నత చదువుకులు చదువుకున్నాడు. తన తండ్రి 'మోహన్ సింగ్ ఒబెరాయ్' మరణం తరువాత 'ఈస్ట్ ఇండియా హోటల్స్' (East India Hotels) బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత దీనిని ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టారు. ఒక్క ఆలోచన నిజానికి పర్యాటకులు ఒక దేశాన్ని సందర్శిస్తున్నారంటే.. వారికి బస చేసుకోవడానికి తప్పకుండా అనువైన హోటల్స్ కావాలి. ఈ విషయాన్ని గ్రహించిన 'ఒబెరాయ్' లగ్జరీ హోటల్స్ ప్రారంభించారు. 1939లో సిమ్లాలో ఒబేరాయ్ హోటళ్ల ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ఏడు దేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో (ఆతిధ్య రంగం) తిరుగులేని వ్యక్తిగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. రెండు హోటళ్లతో ప్రారంభమై తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఒబెరాయ్ గ్రూప్ 1934లో కేవలం రెండు హోటళ్లతో ప్రారంభమైంది. మన దేశంలో మొదటి ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించిన ఘనత ఒబెరాయ్ గ్రూప్‌దే కావడం విశేషం. ఈ ఘనత పీఆర్ఎస్ ఒబేరాయ్ సొంతమే. పీఆర్ఎస్ ఒబెరాయ్ 2013 వరకు ఈఐహెచ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి హాస్పిటాలిటీ రంగంలో దినదినాభివృద్ధి చెందాడు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ గత ఏడాది మే 03న ఈఐహెచ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పీఆర్ఎస్ ఒబేరాయ్ కొడుకు 'విక్రమ్ ఒబెరాయ్' ఈఐహెచ్ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం సంపద (నెట్‌వర్త్) బికీగా ప్రసిద్ధి చెందిన పీఆర్ఎస్ ఒబెరాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో దేశ రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన 'పద్మవిభూషణ్'తో గౌరవించింది. ఫోర్బ్స్ ప్రకారం పీఆర్ఎస్ ఒబెరాయ్ సంపద రూ. 3829 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు - ధర తెలిస్తే అవాక్కవుతారు! కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా విస్తరించిన ఒబెరాయ్ హోటల్స్ ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, జమ్మలమడుగు, విశాఖపట్టణ ప్రాంతాల్లో ఒబెరాయ్ హోటల్స్ కోసం శంకుస్థాపన చేశారు. ఇవన్నీ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. -
ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. 2002లో అతను తన తండ్రి మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణం తర్వాత ఐఈహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 వరకు సంస్థ సీఈఓగా కొనసాగారు. మే 2022 వరకు పృథ్వీ రాజ్ సింగ్ ఈఐహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన పదవిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేనల్లుడు అర్జున్ సింగ్ ఒబెరాయ్‌ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించారు. ఒబెరాయ్ ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన కుమారుడు ఒబెరాయ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. పృథ్వీ రాజ్ సింగ్ ఇండియా, యూకే, స్విట్జర్లాండ్‌లో చదువు పూర్తిచేశారు. 1967లో దిల్లీలో ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్‌ని స్థాపించారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2008లో ఒబెరాయ్‌కు పద్మవిభూషణ్ లభించింది. 2008లో బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. లగ్జరీ హోటళ్లలో కలిస్తున్న వసతులకుగాను 2010లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నవంబర్ 2010లో కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు. ఫిబ్రవరి 2013లో ది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 2015లో సీఎన్‌బీసీ టాప్ 15 భారతీయ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎంపికయ్యారు. -
9న ఒబెరాయ్ హోటల్స్‌కు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అన్నవరం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల విస్తీర్ణంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్–2023)లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒబెరాయ్ గ్రూప్ చేసుకున్న ఎంవోయూ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అన్నవరంలో ఏర్పాట్లుపై కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సమీక్షించారు. టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి అన్నవరంలో ఒబెరాయ్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అన్నవరం వద్ద రూ.350 కోట్లుతో 7స్టార్ లగ్జరీ రిసార్టులను నిర్మించనున్నారు. చదవండి: తొలి సంతకం.. చరిత్రాత్మకం.. రైతులకు ‘పవర్’ -
గండికోటలో.. ఒబెరాయ్ అడుగులు
జమ్మలమడుగు : గండికోటలో ఒబెరాయ్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గండికోటలో రిసార్టు నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని లీజుకు కేటాయించింది. గత వారం రోజులుగా ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు ఇక్కడే ఉంటూ కేటాయించిన భూమిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు సైతం కేటాయించిన భూమిలో రహదారి ఏర్పాటుకు సంబంధించిన సర్వేలు పూర్తిచేశారు. రూ.250 కోట్లతో 120 విల్లాలు.. చరిత్రాత్మకంగా పేరుగాంచిన గండికోట పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒబెరాయ్ హోటల్ యజమాన్యం రూ.250 కోట్లతో 120 విల్లాలను నిర్మించనుంది. గత ఏడాది అక్టోబర్ 11వతేదీన గండికోటలో మొదటి సారిగా ఒబేరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్సు సీఈఓ అర్జున్‌సింగ్ పర్యటించి నాలుగు ప్రదేశాలను చూసి వెళ్లారు. అనంతరం ఈ ఏడాది జనవరి 28వతేదీన విక్రమ్‌జిత్ సింగ్ ఒబెరాయ్, శంకర్, కల్లో కుండు, ఎం.ఏ.ఎల్.రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్‌లు గండికోటలో పర్యటించారు. ఈ ప్రాంతం వారికి నచ్చడంతో పెన్నానదికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రిసార్టు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. 7వతేదీన శంకుస్థాపనకు సన్నాహాలు.. ఒబెరాయ్ హోటల్స్ యాజమాన్యం ఈనెల 7వతేదీన విల్లాల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా సీఎం పర్యటన ఖరారు కాకున్నా కచ్చితంగా వస్తారనే భావనతో ముందస్తుగా మండల పరిధిలోని దప్పెర్ల సమీపంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరాజుతోపాటు, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, ఆర్డీఓ జి.శ్రీనివాసులు ఈ ప్రాంతంలో పర్యటించి పనులు వేగంగా జరిగేలా సహకరిస్తున్నారు. -
గండికోటకు ప్రపంచ స్థాయి పర్యాటక శోభ!
సాక్షి ప్రతినిధి, కడప: చరిత్రాత్మక నిర్మాణమైన గండికోట, స్వదేశీ దర్శన్– 2.0 కింద ఎంపిక కావడంతో ప్రపంచస్థాయి పర్యాటక శోభ దక్కనుంది. వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న గండికోటను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. అబ్బురపరిచే నిర్మాణాలు, కోట, ప్రాకారాలు, ఆలయాలు, గుర్రపుశాలలు, జైలు, ధాన్యాగారాలు, కోనేరు ఇలా ఎన్నో నిర్మాణాలను చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్న గండికోటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు గండికోటలో 7 స్టార్ హోటల్ నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు స్థల పరిశీలన చేపట్టారు. 3 ప్రాంతాల్లో పర్యటించి తుదకు కోట సమీపంలో నిర్మించేందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గండికోట వద్ద 1110 ఎకరాలు భూమిని టూరిజం అభివృద్ధి కోసం కేటాయించింది. రూ.150 కోట్లతో వసతుల కల్పన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వదేశీ దర్శన్ ద్వారా రూ.150 కోట్లతో గండికోటలో పర్యాటక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇటీవల స్వదేశీ దర్శన్–2.0 పథకం క్రింద 36 పర్యాటక ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా అరకు, లంబసింగి సర్క్యూట్, గండికోట, హార్సిలీహిల్స్, తిరుపతి తదితర ప్రాంతాలకు చోటు కల్పించింది. ఆయా ప్రాంతాలల్లో అభివృద్ధి చేపట్టేందుకు కేంద్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. సాంస్కృతిక, పౌర సమాజ స్థితిగతులు మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 120 విల్లాల నిర్మాణానికి సన్నాహాలు ఒబెరాయ్ సంస్థ గండికోటలో రూ.250 కోట్లతో 120 విల్లాలు నిర్మించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోన్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. మరోవైపు స్వదేశీ దర్శన్ ద్వారా పర్యాటల కోసం వాచ్టవర్లు, రిసార్ట్స్, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్టులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్లైట్ షోలు, అందుబాటులోకి రానున్నాయి. కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నారు. -
భీమిలిలో ఒబెరాయ్ గ్రూపునకు 40 ఎకరాలు కేటాయింపు
తగరపువలస: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా ఆ స్థలాన్ని ఆదివారం గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) విక్రమ్ ఒబెరాయ్, సంస్థ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాజారామన్ శంకర్, ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి కల్లోల్ కుందులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. రాబోయే రోజుల్లో విశాఖలో జరగనున్న పలు ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున వారికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్రెడ్డి, విశాఖ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి, భీమిలి ఆర్డీఓ భాస్కరరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఒబెరాయ్ హోటల్‌కు 20 ఎకరాల కేటాయింపు
తిరుపతి అలిపిరి/ జమ్మలమడుగు/మధురపూడి(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి అలిపిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను ఒబెరాయ్ హోటల్‌కు లీజ్ కమ్ రెంట్ విధానంలో కేటాయించే విషయమై ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు టూరిజం ఎండీ కన్నబాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డులోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటట్ ప్రతినిధులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గండికోటలో స్థలం పరిశీలన వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఒబెరాయ్ బృందం పర్యటించింది. ఒబెరాయ్ హోటల్ సీఈవో, ఎండీ విక్రమ్ ఒబెరాయ్, కార్పొరేట్ అఫెర్స్ ప్రెసిడెంట్ శంకర్, ఫైనాన్స్ ఆఫీసర్ కల్లోల్ కుందా,ఎంఏఎల్ రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. గతేడాది ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం గండికోటలో రిసార్టులను ఏర్పాటు చేస్తామని, భూమిని కేటాయించాలని కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్ యాజమాన్యానికి 50 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో రూ.250 కోట్లతో 120 విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఒబెరాయ్ బృందం గండికోటలోని వివిధ ప్రాంతాలను పరిశీలించింది. పెన్నానదిలోయ అందాన్ని తిలకించారు. పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో కలెక్టర్ల చర్చ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన హేవలాక్ బ్రిడ్జి, పర్యాటక కేంద్రమైన పిచ్చుక లంక అభివృద్ధిపై ఒబెరాయ్ గ్రూప్ ప్రతి నిధులతో తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లు కె.మాధవీలత, హిమాన్షుశుక్లా, ఎంపీ మార్గాని భరత్‌రామ్ చర్చించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తూ మధురపూడి విమానాశ్రయంలో ఆగిన ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులతో శనివారం రాత్రి సమావేశమై పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని విస్తరించవచ్చని వివరించారు. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
విశాఖలో 7 స్టార్ హోటల్ ఏర్పాటుకు ప్రణాళిక
ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒబెరాయ్ సంస్థ విశాఖలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుకొచ్చింది. రిసార్ట్‌తో పాటు స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి మండలం అన్నవరం సాగరతీరంలో ఒబెరాయ్ సంస్థకు స్థలాన్ని కేటాయించేందుకు పర్యాటక శాఖ సమాయత్తమవుతోంది. పాడేరులోనూ టూరిజం సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రముఖ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించేందుకు మొగ్గు చూపుతుండటంతో.. టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా హోటల్స్ రంగంలో దిగ్గజమైన ఒబెరాయ్ హోటల్ విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజరామన్ శంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు చోట్ల తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అన్నవరంలో 7 స్టార్ హోటల్ భీమిలి సమీపంలోని అన్నవరం సముద్రతీరంలో తమ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒబెరాయ్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారులతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. ఇటీవలే జిల్లా టూరిజం అధికారులతో కలిసి విశాఖపట్నం బీచ్ పరిసరాలను సందర్శించారు. బీచ్ ఒడ్డున టూరిజం శాఖకు ఎక్కడెక్కడ ఎంత మేర భూములున్నాయో వాటన్నింటినీ పరిశీలించారు. చివరిగా అన్నవరం సాగరతీరం ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు నచ్చడంతో.. ఆ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అన్నవరంలో పర్యాటక శాఖకు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. వీటిలో 40 ఎకరాలను ఒబెరాయ్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ 7 స్టార్ హోటల్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. వీటితో పాటు రిసార్టులు కూడా ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తోంది. పాడేరులో టూరిజం సెంటర్ విశాఖతో పాటు ఏజెన్సీ ప్రకృతి అందాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. పాడేరు రీజియన్ పరిధిలో టూరిజం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ మన్యంలోని అందాలను తిలకించేందుకు ఆసక్తిగా వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు.. ఆ ప్రాంతంలో ఏఏ వనరులు, వసతులు కావాలని కోరుకుంటారో.. వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో అందించేలా టూరిజం సెంటర్ ఉండబోతోంది. రిసార్టులు, హోటల్, టూరిజం ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలన్నీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఒబెరాయ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ పట్నంలో రూ.300కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ సిద్ధమవుతోంది. (క్లిక్: తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు) ఒబెరాయ్ గ్రూప్స్ అంటే.? భారత్‌కు చెందిన ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్లను విస్తరించిన సంస్థ. 5 స్టార్ లేదా 7 స్టార్ హోటల్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోంది. ఐదు దేశాల్లోని 20కిపైగా నగరాల్లో హోటళ్లను, 2 క్రూయిజ్ షిప్‌లను ఒబెరాయ్ సంస్థ నిర్వహిస్తోంది. 1934 నుంచి హోటల్స్ రంగంలో సేవలందిస్తూ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. భారత్‌లో ముంబయి, గుర్గావ్, చెన్నై, భువనేశ్వర్, కోచ్చి, ఆగ్రా, జైపూర్, ఉదయ్‌పూర్, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే హోటళ్లను నడుపుతోంది. తాజాగా విశాఖలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో మరోసారి ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన కోసం నగరానికి రానున్నట్లు పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. (క్లిక్: ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!) -
సీఎం జగన్‌ను కలిసిన ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాజారామన్ శంకర్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం జగన్‌ను రాజారామన్ కలిశారు. ఈ మేరకు ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ప్రణాళికలు గురించి సీఎం జగన్‌కు వివరించారు. ఏపీలో ఒబెరాయ్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. అన్ని హోటల్స్ కూడా 7 స్టార్ సౌకర్యాలతో విల్లాల మోడల్లో రూపకల్పన చేయనుంది ఒబెరాయ్ గ్రూప్. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్ లో హోటల్స్ ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపించిన ఒబెరాయ్ గ్రూప్,.. పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్ నిర్వహించేందుకు కూడా తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించింది. -
ఆతిథ్య పరిశ్రమకు రారాజు
భారతదేశ ఆతిథ్య రంగానికి కురువృద్ధుడాయన. ఆతిథ్య పరిశ్రమలో ఎన్నో మెట్లు అధిరోహించిన చాలామందికి గురుతుల్యుడయ్యారు. దేశంలో పరాయి పాలన కొనసాగుతున్న కాలంలోనే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి హోటల్ పరిశ్రమలో ప్రపంచ స్థాయి దిగ్గజాలకే దిగ్భ్రమ కలిగించిన ధీశాలి ఆయన. అట్టడుగు స్థాయి నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి ఆకాశమే హద్దుగా చరిత్ర సృష్టించిన వ్యాపారవేత్త మోహన్‌సింగ్ ఒబెరాయ్. ఆతిథ్య పరిశ్రమకు పెద్దదిక్కు, ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాయ్‌బహదూర్ మోహన్‌సింగ్ ఒబెరాయ్ 1898 ఆగస్టు 15న అవిభక్త భారతదేశంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని భవున్ గ్రామంలో జన్మించారు. మోహన్‌సింగ్ ఆరునెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు. అష్టకష్టాలు అనుభవిస్తూనే రావల్పిండిలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్ కాలేజీ నుంచి ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో కాలేజీ చదువును కొనసాగించలేక చిన్నా చితకా పనులు చేసుకుంటూ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ నేర్చుకున్నారు. అప్పట్లో పంజాబ్ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో 1922లో ప్రాణాలు అరచేత పట్టుకుని సిమ్లా చేరుకున్నారు. సిమ్లాలోని సెసిల్ హోటల్లో చిరుద్యోగంలో చేరారు. ఆతిథ్యరంగంతో అలా మొదలైన ఆయన అనుబంధం కడ వరకు కొనసాగింది. తొలి అడుగులు... సిమ్లాలోని ద సెసిల్ హోటల్లో బెల్ బాయ్‌గా అట్టడుగు స్థానం నుంచి ఒబెరాయ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ హోటల్లో బస చేసిన అపరిచిత వ్యక్తి ఒకరు అర్ధరాత్రి ఒబెరాయ్‌ను పిలిచి వంద పేజీల రాతప్రతిని ఇచ్చి ఉదయం ఐదు గంటలకల్లా టైపు చేసి ఇవ్వమని చెప్పారు. అక్షరదోషాలు లేకుండా చెప్పిన సమయానికంటే ముందే శ్రద్ధతో పని పూర్తి చేసినందుకు మెచ్చి వంద రూపాయలు బహుమతిగా ఇచ్చాడా అతిథి. అది అప్పట్లో ఒబెరాయ్ రెండు నెలల జీతానికి సమానం. అంత పెద్ద మొత్తాన్ని టిప్‌గా ఇచ్చిన ఆ లక్ష్మీపుత్రుడు.. పండిట్ మోతీలాల్ నెహ్రూ అనే విషయం అప్పుడు ఒబెరాయ్‌కు తెలియదు. తనకు సంబంధం లేని విధులను కూడా శ్రద్ధతో చక్క»ñ డుతున్న ఒబెరాయ్ సమర్థతను హోటల్ మేనేజర్ గ్రోవ్ గమనించారు. తాను కొనుగోలు చేసిన క్లార్క్స్ హోటల్లో మేనేజర్‌గా నియమించారు. దీంతో ఒబెరాయ్ జీవితం మలుపు తిరిగింది. హోటల్ నిర్వహణకు అవసరమైన అన్ని మెలకువలనూ ఒబెరాయ్ ఇక్కడి నుంచే ఒంటబట్టించుకున్నారు. తొలి ఐదు నక్షత్రాల హోటల్... గ్రోవ్ మరణంతో 1934లో అమ్మకానికొచ్చిన క్లార్క్స్ హోటల్‌ను భార్య నగలు, ఆస్తులు తెగనమ్మి కొనుగోలు చేశారు. 1938లో కలకత్తాలో 500 గదుల హోటల్‌ను అద్దెకు తీసుకోని అనతికాలంలోనే లాభాల బాట పట్టించారు. 1943లో అసోసియేటెడ్ హోటల్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌ను కొనుగోలు చే సి ఆతిథ్య పరిశ్రమలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1965లో న్యూఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలి ఐదు నక్షత్రాల హోటల్‌ను ప్రారంభించి తన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే ఊపులో 1973లో ముంబైలో 35 అంతస్థుల ఒబెరాయ్ షెరటాన్ హోటల్ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. విమానాల్లో భోజన సేవలను అందించే కార్యకలాపాలను 1959లో తొలిసారి ఒబెరాయ్ సంస్థే ప్రారంభించింది. ప్రపంచ టాప్ టెన్ జాబితాలో... ఇవీన్నీ ఒకెత్తయితే దేశవిదేశాల్లోని రాజప్రాసాదాలు, పురాతన కట్టడాలను పునరుద్ధరించి అద్భుతమైన హోటళ్లుగా తీర్చిదిద్దారు. సిమ్లాలోని సెసిల్, కలకత్తాలోని ఒబెరాయ్ గ్రాండ్, కైరోలోని చారిత్రక మెనాహౌస్ వంటివి మచ్చుకు కొన్ని. ప్రజా వ్యతిరేకతను సైతం ఖాతరు చేయకుండా మెల్బోర్న్లోని చారిత్రక కట్టడం విండ్సర్ను కొనుగోలు చేశారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దుబాయ్, ఇంగ్లాండ్, ఈజిప్ట్, మారిషస్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాల్లో ముప్పయికి పైగా లగ్జరీ హోటళ్లను నెలకొల్పారు. సేవారంగంలోనూ కృషి వ్యాపార విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా సేవారంగంలోనూ ఇతోధికంగా కృషి చేశారు ఒబెరాయ్. శారీరక, మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. 1962, 1972లలో రాజ్యసభకు, 1968లో లోక్‌సభకు ఎన్నికై, చట్టసభల్లోనూ తన వంతు సేవలందించారు. ఆతిథ్య రంగంలో దేశంలోనే తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తన దార్శనికతతో దేశంలోని ఆతిథ్య పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఒబెరాయ్ నూటమూడేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించి, 2002 మే 3న కన్నుమూశారు. పారిశ్రామికవేత్తగా ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2001లో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.