సాక్షి ప్రతినిధి, కడప: చరిత్రాత్మక నిర్మాణమైన గండికోట, స్వదేశీ దర్శన్– 2.0 కింద ఎంపిక కావడంతో ప్రపంచస్థాయి పర్యాటక శోభ దక్కనుంది. వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న గండికోటను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. అబ్బురపరిచే నిర్మాణాలు, కోట, ప్రాకారాలు, ఆలయాలు, గుర్రపుశాలలు, జైలు, ధాన్యాగారాలు, కోనేరు ఇలా ఎన్నో నిర్మాణాలను చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్న గండికోటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు గండికోటలో 7 స్టార్ హోటల్ నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు స్థల పరిశీలన చేపట్టారు. 3 ప్రాంతాల్లో పర్యటించి తుదకు కోట సమీపంలో నిర్మించేందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గండికోట వద్ద 1110 ఎకరాలు భూమిని టూరిజం అభివృద్ధి కోసం కేటాయించింది.
రూ.150 కోట్లతో వసతుల కల్పన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వదేశీ దర్శన్ ద్వారా రూ.150 కోట్లతో గండికోటలో పర్యాటక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇటీవల స్వదేశీ దర్శన్–2.0 పథకం క్రింద 36 పర్యాటక ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా అరకు, లంబసింగి సర్క్యూట్, గండికోట, హార్సిలీహిల్స్, తిరుపతి తదితర ప్రాంతాలకు చోటు కల్పించింది.
ఆయా ప్రాంతాలల్లో అభివృద్ధి చేపట్టేందుకు కేంద్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. సాంస్కృతిక, పౌర సమాజ స్థితిగతులు మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
120 విల్లాల నిర్మాణానికి సన్నాహాలు
ఒబెరాయ్ సంస్థ గండికోటలో రూ.250 కోట్లతో 120 విల్లాలు నిర్మించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోన్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. మరోవైపు స్వదేశీ దర్శన్ ద్వారా పర్యాటల కోసం వాచ్‌టవర్లు, రిసార్ట్స్, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్టులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్‌లైట్ షోలు, అందుబాటులోకి రానున్నాయి. కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నారు.
గండికోటకు ప్రపంచ స్థాయి పర్యాటక శోభ!
Published Sun, Feb 26 2023 5:13 AM | Last Updated on Sun, Feb 26 2023 2:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment