swadeshi darshan
-
గండికోటకు ప్రపంచ స్థాయి పర్యాటక శోభ!
సాక్షి ప్రతినిధి, కడప: చరిత్రాత్మక నిర్మాణమైన గండికోట, స్వదేశీ దర్శన్– 2.0 కింద ఎంపిక కావడంతో ప్రపంచస్థాయి పర్యాటక శోభ దక్కనుంది. వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న గండికోటను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. అబ్బురపరిచే నిర్మాణాలు, కోట, ప్రాకారాలు, ఆలయాలు, గుర్రపుశాలలు, జైలు, ధాన్యాగారాలు, కోనేరు ఇలా ఎన్నో నిర్మాణాలను చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్న గండికోటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు గండికోటలో 7 స్టార్ హోటల్ నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు స్థల పరిశీలన చేపట్టారు. 3 ప్రాంతాల్లో పర్యటించి తుదకు కోట సమీపంలో నిర్మించేందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గండికోట వద్ద 1110 ఎకరాలు భూమిని టూరిజం అభివృద్ధి కోసం కేటాయించింది. రూ.150 కోట్లతో వసతుల కల్పన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వదేశీ దర్శన్ ద్వారా రూ.150 కోట్లతో గండికోటలో పర్యాటక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇటీవల స్వదేశీ దర్శన్–2.0 పథకం క్రింద 36 పర్యాటక ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా అరకు, లంబసింగి సర్క్యూట్, గండికోట, హార్సిలీహిల్స్, తిరుపతి తదితర ప్రాంతాలకు చోటు కల్పించింది. ఆయా ప్రాంతాలల్లో అభివృద్ధి చేపట్టేందుకు కేంద్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. సాంస్కృతిక, పౌర సమాజ స్థితిగతులు మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 120 విల్లాల నిర్మాణానికి సన్నాహాలు ఒబెరాయ్ సంస్థ గండికోటలో రూ.250 కోట్లతో 120 విల్లాలు నిర్మించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోన్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. మరోవైపు స్వదేశీ దర్శన్ ద్వారా పర్యాటల కోసం వాచ్టవర్లు, రిసార్ట్స్, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్టులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్లైట్ షోలు, అందుబాటులోకి రానున్నాయి. కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నారు. -
ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ... తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది. మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి. షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు. కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది. (చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు) -
ధూళికట్ట స్థూపం..అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం!
మన రాష్ట్రంలో దాదాపు 40 బౌద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో ధూళికట్ట బౌద్ధస్థూపం అతి పురాతనమైంది. ప్రతి యేటా బుద్ధ పూర్ణమి రోజున జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బౌద్ధమతస్థులు బుద్ధ జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. ధూళికట్ట బౌద్ధ స్థూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని బౌద్ధ స్థూపం గత చారిత్రక వైభవానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా ఉన్న బౌద్ధ స్థూపానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, పెద్దపల్లి : ఘనమైన చరిత్ర కలిగిన ధూళికట్ట బౌద్ధస్థూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. అందులో భాగంగా స్థానిక ఎంపీ బాల్క సుమన్ తన నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుతం బౌద్ధ స్థూపం చుట్టూ తొమ్మిది ఎకరాలు చదును చేస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నారు. చుట్టూ కంచె, విద్యుత్ సరఫరా, బోర్వెల్ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, రక్షణకు సిబ్బంది నియామకం, రక్షణ సిబ్బందికి ఓ గది, వరండా ఏర్పాటు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లాంటి పనులు చేస్తున్నారు. ఇక రెండో దశలో స్వదేశీ దర్శన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.20 కోట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రూ.20 కోట్లు మంజూరైతే బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి అందులో బుద్ధుని శిల్పాలు, గతంలో ఇక్కడ బయటపడి, వేర్వేరు చోట్ల ఉన్న ఆధారాలు తెప్పించి ఉంచాలని నిర్ణయించారు. సందర్శకులకు విశ్రాంతి గదులు, బౌద్ధస్థూపం చుట్టూ సుందరవనం, హుస్సేనిమియా వాగు ఒడ్డున బౌద్ధ విగ్రహం, పౌంటైన్ నిర్మాణం, చిన్న పిల్లల కోసం పార్క్ తదితరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళి కలు సిద్ధం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులున్న బౌద్ధభిక్షు లను కూడా ఈ బౌద్ధ స్థూపం వద్దకు తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రోడ్డు అత్యవసరం.. చారిత్రక బౌద్ధ స్థూపం వెలుగు చూసి సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బౌద్ధ స్థూపం చుట్టూ హుస్సేనిమియా వాగు, రైతుల పంటపొలాలు ఉండడంతో అక్కడకు వాహనాలు కాదుకదా.. నడక కూడా కష్టంగానే మారింది. దీనికోసం వడ్కాపూర్, కోనరావుపేట, ధూళికట్ట.. మూడు వైపుల నుంచి రోడ్లు వేయడానికి ఎంపీ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిలు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే బౌద్ధ స్థూపానికి పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది. -
ఏటూరునాగారం పర్యాటకధామం
ట్రైబల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా ఎంపిక * తాడ్వాయి అడవి, బొగతా జలపాతం, లక్నవరం చెరువు, మేడారం, మల్లూరు, దామరవాయిలకు చోటు * 'స్వదేశీ దర్శన్' పథకం కింద ప్రాజెక్టును మంజూరు చేసిన కేంద్రం * గిరిజన ఇతివృత్తంతో భారీ ప్రణాళిక సిద్ధం చేసిన పర్యాటకాభివృద్ధి సంస్థ * రూ.120 కోట్లతో తొలిదశ పనులు.. రూ.92 కోట్లు కేటాయించిన కేంద్రం * రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు, రోడ్ల నిర్మాణం * ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు ఏర్పాట్లు * విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఏర్పాట్లకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మండు వేసవిలోనూ కనువిందు చేసే అద్భుత జలపాతం.. పదివేల ఏళ్ల నాడు మానవ సమూహం జీవించిన ప్రాంతం.. దట్టమైన అడవిలో 15 అడుగుల ఎత్తయిన భారీ రాళ్లతో అబ్బురపరిచే సమాధులు.. గుట్టపైనుంచి గలగలాపారే నీటి జాడలు... పక్కనే పదడుగుల ఎత్తయిన మూలవిరాట్టుతో అలరారే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.. అద్భుత ఇంజినీరింగ్ ప్రతిభ దాగిన లక్నవరం సరస్సు... స్థానికులకు తప్ప ఇతర ప్రపంచం దృష్టి అంతగా పడని ఈ అద్భుతాలన్నీ కొలువుదీరిన వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి ఇక పర్యాటక శోభ రానుంది. ఇంతకాలం మావోయిస్టులకు పెట్టనికోటగా, ఎదురుకాల్పులు-పోలీసు కూంబింగ్ల హడావుడితో మారుమోగే ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలోని ప్రత్యేకతలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'స్వదేశ్ దర్శన్' పథకంలో భాగంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ ప్రాంతాన్ని గిరిజన ఇతివృత్తంతో ‘ట్రైబల్ సర్క్యూట్’గా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రూ. 120 కోట్లతో తొలిదశ పనులను చేపట్టనుండగా... కేంద్రం రూ. 92 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 కోట్లు ఇవ్వనున్నాయి. మిగతా సొమ్మును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద సమకూర్చుతారు. అన్నీ అద్భుతాలే.. వరంగల్ జిల్లా ములుగు ప్రాంతం ఈ ప్రాజెక్టుకు ‘ప్రవేశ మార్గం’గా ఉండనుంది. రెస్టారెంట్లు, రోడ్డు పక్కన సౌకర్యాలు (వే సైడ్ ఎమినిటీస్) ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద రెస్టారెంట్లు, మంచి రోడ్లు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ సరస్సు చిన్నచిన్న దీవులతో మనోహరంగా ఉంటుంది. ఆ దీవుల అనుసంధానంగా ఇప్పటికే దీనిపై వేలాడే వంతెనను నిర్మించారు. కానీ ఇక్కడ పెద్దగా వసతులు లేవు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఇక్కడ వసతులు కల్పిస్తారు. బోటింగ్, జెట్టీలు ఏర్పాటు చేస్తారు. దీనికి చేరువలోనే ప్రఖ్యాత రామప్ప గుడి, రామప్ప చెరువు ఉన్నాయి. సమీపంలో దట్టమైన అడవితో అలరారే తాడ్వాయిని సాహస క్రీడలకు కేంద్రంగా మార్చుతారు. అక్కడ రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు, గైడ్లను అందుబాటులో ఉంచుతారు. ఏటూరు నాగారానికి చేరువగా ఖమ్మం జిల్లా పరిధిలోని వాజేడు మండలంలో కొలువుదీరిన బొగతా జలపాతానికి వెళ్లేలా రోడ్డు నిర్మిస్తారు. తెలంగాణ నయగారాగా పేరొందిన ఈ జలాపాతం వద్ద రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు నిర్మిస్తారు. సెక్యూరిటీ పోస్టు ఏర్పాటు చేస్తారు. క్రీస్తుపూర్వం నాటి వందల సమాధులున్న దామరవాయి వద్ద విజ్ఞాన కేంద్రాన్ని, నాటి మానవ మనుగడ ఎలా ఉండేదో తెలిపే వీడియో, ఆడియో ప్రదర్శనశాల, మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తారు. నిరంతరం నీటి గలగలలు వినిపించే మల్లూరులో పర్యాటకుల విడిది ఏర్పాటు చేస్తారు. ట్రెక్కింగ్ లాంటి సాహస క్రీడలకు వసతులు కల్పిస్తారు. ఇక్కడి పురాతన హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చి దాని విశిష్టతను తెలిపే ఏర్పాట్లు చేస్తారు. ప్రఖ్యాత గిరిజన జాతర జరిగే మేడారం వద్ద ప్రత్యేక గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేయటంతో పాటు సాధారణ రోజుల్లో పర్యాటకులు వస్తే ఉండేందుకు అవసరమైన వసతులు కల్పిస్తారు.