గ్రూప్‌–2 అభ్యర్థులతో 'బాబు బంతాట' | Group-2 candidates Fires On Chandrababu govt | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'

Published Sun, Feb 23 2025 2:21 AM | Last Updated on Sun, Feb 23 2025 9:48 AM

Group-2 candidates Fires On Chandrababu govt

ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలోని ఇసుక తోట వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న అభ్యర్ధిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు

నేటి మెయిన్స్‌ పరీక్షపై తీవ్ర గందరగోళం 

ట్వీట్‌తో లోకేశ్, ఆడియోతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే యత్నం

తొమ్మిదినెలలుగా ఏమార్చి.. సర్కారు మొద్దునిద్ర 

బాబు సర్కార్‌ను నమ్మి నిండా మునిగామంటున్న గ్రూప్‌–2 అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల బాయ్‌కాట్‌ కాదు.. పాల్గొని ఈ సర్కార్‌ను ఓడించాలంటున్న అభ్యర్థులు

ఏర్పాట్లు పూర్తి.. నేడు యథాప్రకారం గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్ష

రాత్రి పొద్దుపోయాక పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ ప్రకటన

డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్‌ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్‌ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు.  
– గ్రూప్‌–2 అభ్యర్థిని

సాక్షి, అమరావతి:  గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్‌ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. 

ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్‌ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. 

వాస్తవానికి రోస్టర్‌ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్‌ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్‌–2 మెయిన్స్‌ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్‌ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. 

ప్రభుత్వ తీరుపై గ్రూప్‌ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్‌ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్‌కాట్‌ ఎలక్షన్‌’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్‌ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్‌ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది.  


‘బాయ్‌కాట్‌ ఎలక్షన్‌’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. 
గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్‌ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేయాలని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. 

ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్‌–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. 



పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

ఇదే సమయంలో రోస్టర్‌ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్‌ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్‌ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం.  

ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? 
గ్రూప్‌–2 రిజర్వేషన్లలో రోస్టర్‌ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్‌డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్‌–2 మెయిన్స్‌ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. 

ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. 

ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తు­న్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.  


అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే  
‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్‌ కేలండర్‌ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్‌డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్‌ కమిషన్‌ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్‌ చైర్మన్‌ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. 

ఇందులో గ్రూప్‌–2తో పాటు గ్రూప్‌–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్‌–2 మెయిన్స్‌ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.

ఇప్పటికిప్పుడు మెయిన్స్‌ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్‌  
గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్‌ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్‌ అఫిడవిట్‌ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్‌ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ చైర్మన్‌ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం.  

నేడు గ్రూప్‌–2 మెయిన్స్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధం
గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్‌–2 నిర్వహిస్తారు. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. 

పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్‌ కమిషన్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

గ్రూప్‌–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగం
విజయనగరం క్రైమ్‌: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్‌–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహా­రం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్య­ర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసు­కెళ్లి విడిచిపెట్టారు. 

రోస్టర్‌ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరు­ద్యో­గులు భగ్గుమంటున్నారు. గ్రూప్‌–2 పరీక్షల్లో రోస్టర్‌ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తు­న్నారు. 

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తడంతో వన్‌­టౌన్, టుటౌన్‌ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.

ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..
నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్‌ర్‌ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్‌ నిర్వహిస్తోంది. మా భవిష్యత్‌ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.
    – గ్రూప్‌–2 అభ్యర్థి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement