![Chandrababu Govt Liquor licenses were issued by extorting huge commissions](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/BABU_WHISKEY-FLYINGR.jpg.webp?itok=r6EGF72N)
ఇప్పటికే భారీగా కమీషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు జారీ
ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం
ఏటా రూ.వందల కోట్ల ముడుపులు ముట్టజెప్పేందుకు డీల్..
దాంతో మార్జిన్ 14 శాతానికి పెంచేందుకు ‘పచ్చ’జెండా.. ‘ఏఆర్‌టీ’ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇక మద్యం ధరలు భారీగా పెంపు
మూడు కేటగిరీల మీద 10–20 శాతం పెంచుతూ ఉత్తర్వులు
క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా భారం
మందుబాబుల జేబులు గుల్ల.. పక్కాగా కథ నడిపిన ‘ముఖ్య’నేత
సాక్షి, అమరావతి: మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ‘ముఖ్య’నేతకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు..! అందుకే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు..! 40 ఇయర్స్ ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు! ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ(TDP) సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా బెదిరించి సీఐల నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చ ముఠాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ‘ముఖ్య’నేత అంతటితో సంతృప్తి చెందలేదు.
మద్యం సిండికేట్‌తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా రూ.వందల కోట్లు కమీషన్ వసూలు చేసుకునేందుకు ‘ఛీర్స్’ చెప్పారు! ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14 శాతానికి పెంచేందుకు ‘పచ్చ’జెండా ఊపారు! ఈమేరకు ‘ఏఆర్‌టీ’ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు(liquor prices) భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరగనుంది. అంతిమంగా మందుబాబులపై ఈ భారం పడనుంది. ఒక్క డీల్‌తో ఈ కుతంత్రం కథను నడిపించిన తీరు ఇదిగో ఇలా ఉంది...
ముందస్తు పన్నాగం..
అటు నుంచి నరుక్కురావడం అంటే ఏమిటో ‘ముఖ్య’నేత మరోసారి చేతల్లో చూపించారు. మద్యం దోపిడీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన తీరే అందుకు తాజా నిదర్శనం. కూటమి సర్కారు గతేడాది అక్టోబరు నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో అడ్డుకుని టీడీపీ సిండికేట్‌కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కట్టబెట్టింది. 2024 అక్టోబరు నుంచి రెండేళ్లపాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీ ముడుపులు కొల్లగొట్టారు.
![దందాకు పచ్చజెండా .. మద్యం ప్రియులకు బాదుడు](https://www.sakshi.com/s3fs-public/inline-images/k_9.jpg)
మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాకు రూ.5 చొప్పున కమీషన్ కింద లెక్కించి ముందుగానే రెండేళ్ల మద్యం అమ్మకాలపై ఏకమొత్తంగా భారీ కమీషన్ల మూటలు కరకట్ట బంగ్లాకు చేరేలా కథ నడిపారు. అనంతరమే మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ‘ముఖ్య’నేత అంతటితో ఆగలేదు. మద్యం దందాలో మరింత పిండుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో.. మద్యం విక్రయాలపై తమకు మార్జిన్ పెంచాలని సిండికేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు మద్యం అమ్మకాలపై వాస్తవంగా వస్తున్న 10 శాతం లాభం మార్జిన్ సరిపోవడం లేదనే వాదనను అందుకుంది. తమకు వాస్తవంగా 14 శాతం మార్జిన్ వచ్చేలా చూడాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
మూటలు ఇస్తేనే మార్జిన్ పెంచుతాం...
– మెలిక పెట్టిన ‘ముఖ్య’ నేత
మార్జిన్ పెంచాలని మద్యం సిండికేట్ నుంచి డిమాండ్ మొదలైన తరువాత ‘ముఖ్య’నేత అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టారు. మరి మార్జిన్ పెంచితే ‘నాకేంటి..?’ అని ఆయన సూటిగానే అడిగేసినట్లు సమాచారం. దీంతో ‘ముఖ్య’నేత ఆంతర్యం ఏమిటన్నది మద్యం సిండికేట్‌కు అర్థమైంది. ఈ అంశంపై తర్జన భర్జనల తరువాత ‘ముఖ్య’నేతతో డీల్ కుదుర్చుకున్నారు.
తమ మార్జిన్‌ను వాస్తవంగా 14 శాతానికి పెంచితే అందుకు తగిన కమీషన్ ఇస్తామంటూ మంతనాలు సాగించారు. ‘ముఖ్య’నేత కోరుకున్నదీ... సిండికేట్ ఇస్తానన్నది ఒకటే కావడంతో డీల్ కుదిరింది. దాంతో మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను వాస్తవంగా 14 శాతం వచ్చేలా చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం కూడా పొందారు.
‘ముఖ్య’నేతకు ఏటా మూట..!
మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే మద్యం దుకాణదారులకు మార్జిన్ 14 శాతం వచ్చేటట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ మేరకు మద్యం దుకాణదారులకు ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి అందులో మూడో వంతు తనకు కమీషన్‌గా ఇవ్వాల్సిందేనని ‘ముఖ్య’నేత పట్టుబట్టారు. అందుకు మద్యం సిండికేట్ సమ్మతించింది.
అంటే మద్యం సిండికేట్ ‘ముఖ్య’నేతకు ఏటా రూ.వెయ్యి కోట్ల మూట ముట్టజెప్పనుందన్నది స్పష్టమవుతోంది. ఈ డీల్ ద్వారా ‘ముఖ్య’నేత సొంత ఖజానాకు ఏటా రూ.వెయ్యి కోట్లు చేరనుండగా టీడీపీ మద్యం సిండికేట్ రూ.2 వేల కోట్ల వరకు అదనపు లాభం కొల్లగొట్టనుందన్నది తేటతెల్లమవుతోంది. డీల్ కుదరడంతో ఈ పన్నాగానికి ముగింపుగా మద్యం ధరలపై అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్‌టీ)సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా మద్యం దుకాణదారులకు 14 శాతం మార్జిన్ వచ్చేలా చేశారు.
ధరలు భారీగా పెంపు...
రాష్ట్రంలో రూ.99కి అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్‌పై మినహా మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై ధరలను మూడు కేటగిరీల కింద పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ధరల పెంపు ప్రభావం భారీగా ఉండనుంది. అంతిమంగా మందుబాబులపై భారీగా భారం పడనుంది.
ఈ ఏడాది రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీరు కేసుల విక్రయాలు జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు పెంపు అంటే మద్యం ప్రియులపై భారీ ఆర్థిక భారం పడనుందన్నది సుస్పష్టం. ‘ముఖ్య’ నేత కమీషన్ల కోసం ఇంత కథ నడిపించడం పట్ల ఎక్సైజ్ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దోపిడీ కోసం అటు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి... ఇటు మద్యం సిండికేట్ నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తూ... మరోవైపు మద్యం ధరలు పెంచి మందు బాబుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment