
హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తేలుస్తుంది
సీఎం లేఖకు మేం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు
కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
ఈ విషయాన్ని మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం
న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు
న్యాయమూర్తుల కమిటీ ఏం నివేదిక ఇస్తుందో ఎవరికీ తెలియదు
ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దాం.. తదుపరి విచారణ మూడు నెలలు వాయిదా
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు తామేమీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తమపై బాధ్యత లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని తాము చాలా స్పష్టంగా చెబుతున్నామంది.
న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరంది. అందుకు తాము ఎంత మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. ఆ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో తెలియదని, అందువల్ల కమిటీ నివేదిక కోసం వేచి చూడటం మంచిదని పిటిషనర్లకు సూచించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు విషయంలో అభిప్రాయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి గత ఏడాది నవంబర్ 20న లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ కర్నూలులో భవనాలను పరిశీలించనుందని న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు తాండవ యోగేష్, తురగా సాయి సూర్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుంది
విచారణ మొదలు కాగానే ధర్మాసనం స్పందిస్తూ, బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా? లేదా? దేశంలో పలు చోట్ల హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు ఎలా జరిగింది? అందుకు అనుసరించిన విధి విధానాలు ఏమిటి? వంటి అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది.
కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంది. క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపింది. కమిటీ నివేదిక వచ్చాక ఆ నివేదికపై న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టులో చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఒకవేళ కమిటీ నివేదికపై అభ్యంతరం ఉంటే, దానిని సవాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ దృష్ట్యా పిల్‌ను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కమిటీ నివేదిక తర్వాత సవాలు చేసుకోవాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆప్షన్ ఇచ్చింది. అయితే యోగేష్ తమ పిల్‌ను పెండింగ్‌లో ఉంచాలని పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.
ఇదే అంశంపై న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను కూడా యోగేష్ తదితరుల పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అమరావతి రాజధాని విషయంలో ఇదే హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని, ఆ తీర్పును పరిశీలించాలని యోగేష్ కోరగా, తాము ఇప్పుడు పరిశీలించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment