జమ్మలమడుగు : గండికోటలో ఒబెరాయ్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గండికోటలో రిసార్టు నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని లీజుకు కేటాయించింది. గత వారం రోజులుగా ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు ఇక్కడే ఉంటూ కేటాయించిన భూమిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు సైతం కేటాయించిన భూమిలో రహదారి ఏర్పాటుకు సంబంధించిన సర్వేలు పూర్తిచేశారు.
రూ.250 కోట్లతో 120 విల్లాలు..
చరిత్రాత్మకంగా పేరుగాంచిన గండికోట పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒబెరాయ్ హోటల్ యజమాన్యం రూ.250 కోట్లతో 120 విల్లాలను నిర్మించనుంది. గత ఏడాది అక్టోబర్ 11వతేదీన గండికోటలో మొదటి సారిగా ఒబేరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్సు సీఈఓ అర్జున్‌సింగ్ పర్యటించి నాలుగు ప్రదేశాలను చూసి వెళ్లారు. అనంతరం ఈ ఏడాది జనవరి 28వతేదీన విక్రమ్‌జిత్ సింగ్ ఒబెరాయ్, శంకర్, కల్లో కుండు, ఎం.ఏ.ఎల్.రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్‌లు గండికోటలో పర్యటించారు. ఈ ప్రాంతం వారికి నచ్చడంతో పెన్నానదికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రిసార్టు నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
7వతేదీన శంకుస్థాపనకు సన్నాహాలు..
ఒబెరాయ్ హోటల్స్ యాజమాన్యం ఈనెల 7వతేదీన విల్లాల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా సీఎం పర్యటన ఖరారు కాకున్నా కచ్చితంగా వస్తారనే భావనతో ముందస్తుగా మండల పరిధిలోని దప్పెర్ల సమీపంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరాజుతోపాటు, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, ఆర్డీఓ జి.శ్రీనివాసులు ఈ ప్రాంతంలో పర్యటించి పనులు వేగంగా జరిగేలా సహకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment