
చాపాడు : కాలేజీకి బైక్‌లో వెళుతుండగా ఎదురుగా గేదె అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లెకు చెందిన కామనూరు సుభాష్ చంద్ర బోస్(17) అనే విద్యార్థి చాపాడు సమీపంలోని సీబీఐటీలో పాలిటెక్నిక్ డిప్లమో సీఎంబీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇతనితో పాటు చియ్యపాడుకు చెందిన కోగటం శృతికుమార్ కూడా చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో సుభాష్‌చంద్రబోస్ తన అక్క, బావలు ఉంటున్న చియ్యపాడుకు శుక్రవార సాయంత్రం వచ్చాడు. శనివారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఇదే గ్రామంలో ఉన్న తన స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకుని చాపాడు మండలం పల్లవోలు వద్ద గల సీబీఐటీ కాలేజీకి బయలు దేరాడు. చాపాడు దాటుకుని రెండు నిమిషాల్లో కాలేజీకి చేరుకునే లోపే రోడ్డుపై గేదె అడ్డు వచ్చింది. దీంతో బైక్ గేదెన తగిలి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన సుభాష్ చంద్రబోస్ అక్కడికక్కడే మృతి చెందగా శృతికుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చేతికందే కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సుభాష్ కుటుంబీకులు రోదించారు. మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో వెళ్లే వాహనదారులు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం