లీజ్ కమ్ రెంట్ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఒబెరాయ్ హోటల్ సీఈవో తదితరులు
తిరుపతి అలిపిరి/ జమ్మలమడుగు/మధురపూడి(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి అలిపిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను ఒబెరాయ్ హోటల్‌కు లీజ్ కమ్ రెంట్ విధానంలో కేటాయించే విషయమై ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు టూరిజం ఎండీ కన్నబాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డులోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటట్ ప్రతినిధులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు.
గండికోటలో స్థలం పరిశీలన
వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఒబెరాయ్ బృందం పర్యటించింది. ఒబెరాయ్ హోటల్ సీఈవో, ఎండీ విక్రమ్ ఒబెరాయ్, కార్పొరేట్ అఫెర్స్ ప్రెసిడెంట్ శంకర్, ఫైనాన్స్ ఆఫీసర్ కల్లోల్ కుందా,ఎంఏఎల్ రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.
గతేడాది ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం గండికోటలో రిసార్టులను ఏర్పాటు చేస్తామని, భూమిని కేటాయించాలని కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్ యాజమాన్యానికి 50 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో రూ.250 కోట్లతో 120 విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఒబెరాయ్ బృందం గండికోటలోని వివిధ ప్రాంతాలను పరిశీలించింది. పెన్నానదిలోయ అందాన్ని తిలకించారు.
పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో కలెక్టర్ల చర్చ
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన హేవలాక్ బ్రిడ్జి, పర్యాటక కేంద్రమైన పిచ్చుక లంక అభివృద్ధిపై ఒబెరాయ్ గ్రూప్ ప్రతి నిధులతో తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లు కె.మాధవీలత, హిమాన్షుశుక్లా, ఎంపీ మార్గాని భరత్‌రామ్ చర్చించారు.
తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తూ మధురపూడి విమానాశ్రయంలో ఆగిన ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులతో శనివారం రాత్రి సమావేశమై పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని విస్తరించవచ్చని వివరించారు. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment