
15 వరకు ఆస్ట్రేలియాలో.. క్రీడలకు ప్రోత్సాహం, శిక్షణపై అధ్యయనం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
19 నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యాటక అభివృద్ధిపై పరిశీలన
21 నుంచి 23 వరకు దావోస్‌లో.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్న రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. 13న ఆస్ట్రేలియా వెళ్లనున్న ఆయన.. అక్కడ క్వీన్స్‌ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
15న సీఎం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మళ్లీ ఈ నెల 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పర్యాటక పాలసీని ప్రకటించిన నేపథ్యంలో... సింగపూర్‌లో పర్యాటకాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తారు.
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి సింగపూర్ ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తోందన్న అంశాన్ని అధ్యయనం చేస్తారు. అనంతరం ఈ నెల 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. దావోస్ పర్యటనకు సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు.
