World Economic Forum Conference
-
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
ప్రతి ఒక్కరికీ అందుబాటులో.. సమగ్ర ఆరోగ్యవ్యవస్థ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కోవిడ్ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,000 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజు సమావేశాల సందర్భంగా సోమవారం ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్.. కోవిడ్ లాంటి విపత్తును ఎవరూ ఊహించలేదు. మన తరం మునుపెన్నడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ లాంటి విపత్తు మరోసారి తలెత్తితే సమర్థంగా నివారించేందుకు బలీయమైన వ్యవస్థ కావాలి. కోవిడ్ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. సమగ్ర ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. కోవిడ్, తదనంతర పరిణామాలన్నీ మనకు కనువిప్పు లాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ అత్యాధునిక ఆస్పత్రులు లేకున్నా.. అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టైర్–1 నగరాలు ఏపీలో లేనందున ప్రైవేట్ రంగంలో అత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమయ్యాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా 44 దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో ఇందుకోసం బలమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు వైద్య, ఆరోగ్య రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరూ సమష్టిగా ఇంటింటి సర్వే చేపట్టడంతో తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును తగ్గించగలిగాం. భారత్‌లో నమోదైన సగటు మరణాల శాతం 1.21 కాగా ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63% నమోదైంది. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలను సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్ కాలేజీలు ఏర్పాటైనప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే ఆ మెడికల్ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడే మేం ఎదురుచూస్తున్న అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. దీనికి మూడేళ్ల కాలపరిమితి విధించుకున్నాం. మొత్తం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16 వేల కోట్లు సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. 25 లక్షల మందికి ఉచిత వైద్యం హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టారు. దాదాపు వెయ్యి చికిత్సా విధానాలు ఇందులో కవర్ అవుతున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి 2,446 చికిత్స విధానాలకు వర్తింప చేస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు అందచేసి లబ్ధిదారుల ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల కుటుంబాలు ఉండగా 1.44 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. గత మూడేళ్లుగా 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందచేశాం. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోవిడ్ లాంటి మహమ్మారులు చెలరేగినప్పుడు ప్రధానంగా నివారణ, నియంత్రణ, చికిత్సపై దృష్టి పెట్టాలి. వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ.. ఈ మూడూ సమాంతరంగా అందుబాటులోకి రావాలి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు నెలకొల్పుతున్నాం. తద్వారా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వారు రోజు విడిచి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్లుగా గ్రామాల్లో ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ సేవలు అందించడంతో పాటు విలేజ్ క్లినిక్‌ను మెడికల్ హబ్‌గా వినియోగించుకుంటారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్ గ్రాడ్యుయేట్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీస్నర్, ఆశా వర్కర్లు ఉంటారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి -
లండన్ నుంచి దావోస్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం లండన్ నుంచి దావోస్ బయల్దేరారు. నాలుగు రోజుల పాటు లండన్‌లోని పలు ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం కేటీఆర్ లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి జ్యూరిక్ వెళ్లారు. అక్కడ ఆయనకు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. ప్రపంచం లోని వివిధ ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 26న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరంలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. -
స్టార్టప్‌లతో కర్బన ఉద్గారాలు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు చేయూతనిస్తే ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఉద్గారాల్లో నెట్ జీరోస్థాయిని సాధించేందుకు క్లీన్ ఎనర్జీ వనరులను పెంచడంతోపాటు గ్రీన్ సొల్యూషన్లపై పాఠ్యాంశాల ద్వారా అవగాహన కల్పించాలని, ఆ దిశగా తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 9వ రీజినల్ యాక్షన్ గ్రూప్ వర్చువల్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఇంధన వనరులు, విద్యుచ్ఛక్తి నుంచి గ్రీన్ పవర్, గ్రీన్ ట్రాన్సిషన్ దిశగా పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసి పనిచేయాలని పేర్కొన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమన్నారు. ముఖ్యంగా గ్రీన్ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ చురుగ్గా ముందుకు పోతోందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్ పవర్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ స్టోరేజ్ సొల్యూషన్స్ పాలసీ రాష్ట్రంలో గ్రీన్ విద్యుత్, గ్రీన్ సొల్యూషన్స్ వైపు తెలంగాణను తీసుకుపోతున్నదని పేర్కొన్నారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశం ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ శక్తిలో 4.2 గిగా వాట్ల సామర్థ్యంతో 10.30 శాతం కలిగి ఉండటం, గ్రీన్ సొల్యూషన్స్, క్లీన్ ఎనర్జీ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కేటీఆర్ తెలిపారు. రానున్న సంవత్సరంలో సుమారు ఆరు గిగా వాట్ల స్థాయికి రాష్ట్రంలో సోలార్ ఉత్పత్తి పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పచ్చదనం పెంపుదలకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన అవసరాల కోసం సోలార్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనం రంగంపై ఫోకస్ చేస్తూనే హరితహారం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకుపోతున్నదని కేటీఆర్ తెలిపారు. డ్రోన్లతో సీడ్ బాంబింగ్ చేస్తూ, పచ్చదనం పెంచేందుకు టెక్నాలజీని ఆసరాగా తీసుకుంటున్నామని, ఈ దిశగా తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాలను ఉదహరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె అధ్యక్షత వహించిన ఈ వర్చువల్ సదస్సులో బంగ్లాదేశ్ మాల్దీవులు, యూఏఈ వంటి దేశాల మంత్రులతోపాటు పలు వాహన, ఇంధన రంగ కంపెనీల అధినేతలు పాల్గొన్నారు. -
విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం
న్యూఢిల్లీ: భారత్, చైనాలు పరస్పరం మునుపెన్నడూ ఎరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో గురువారం వర్చువల్‌గా ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రెండు దేశాలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వివాద పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ‘మునుపెన్నడూ లేని పరిస్థితిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. అయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని అర్థమవుతుంది’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనాతో సరిహద్దు వివాదం ముగిసేందుకు ముందుగా, క్షేత్రస్థాయిలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ‘వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్’ కింద మరో విడత చర్చలు త్వరలో జరుగుతాయని తెలిపారు. తదుపరి రౌండ్ కమాండర్ స్థాయి చర్చల కన్నా ముందే అవి ఉంటాయన్నారు. ఇరుదేశాల కమాండర్ స్థాయి 6వ విడత చర్చలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని పరస్పర సమీప ప్రాంతాల వద్దకు మరిన్ని బలగాలను పంపకూడదని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టవద్దని ఆ చర్చల్లో నిర్ణయించారు. చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది: తైవాన్ తైపీ: తమ దేశ ఎయిర్ డిఫెన్సు జోన్లోకి చైనా నిఘా విమానాలు అక్రమంగా ప్రవేశించడంతో తైవాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తైవాన్ డిప్యూటీ మినిస్టర్ చియ్ చుయ్ షెంగ్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రయోగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. భావసారుప్యత ఉన్నదేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ద్వీప దేశమైన తైవాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ, తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. -
ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు రెడీ
దావోస్ (స్విట్జర్లాండ్): భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నట్టు పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మంత్రిని కాకపోతే ఎయిరిండియాకు బిడ్డింగ్ ‘‘నేను ఇప్పుడు మంత్రిని కాకపోయి ఉంటే ఎయిరిండియాకు బిడ్డింగ్ వేసే వాడిని. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతో ఎయిరిండియాకు ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. దీంతో ఇది బంగారు గని కంటే తక్కువేమీ కాదు’’ అని ఎయిరిండియా, బీపీసీఎల్ ప్రైవేటీకరణపై ఎదురైన ప్రశ్నకు మంత్రి గోయల్ బదులిచ్చారు. సదస్సులో ఇతర ముఖ్యాంశాలు... ►సమాచార గోప్యత (డేటా ప్రైవసీ)ను మానవ హక్కుగా చూడాలని, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అనుమతి మేరకే పెద్ద ఎత్తున డేటాను వినియోగం సమాజానికి మంచిదన్నారు. ►స్థిరమైన ఇంధన పరివర్తన దిశగా బ్యాటరీలకు సంబంధించి నూతన నియమాలను నిర్ణయించేందుకు అమరరాజా బ్యాటరీస్ సహా అంతర్జాతీయంగా 42 సంస్థలు అంగీకారం తెలిపాయి. ►బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో ఈ విషయమై సెంట్రల్ బ్యాంకులకు సాయపడేందుకు డబ్ల్యూఈఎఫ్, 40 దేశాల కేంద్ర బ్యాంకులతో కూడిన కమ్యూనిటీ ఓ కార్యాచరణను రూపొందించింది. ►పర్యావరణ అనుకూలమైన, నైతిక ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు స్పందించేందుకు వీలుగా అన్ని రంగాల్లోని వ్యాపార సంస్థలకు సాయపడే విధంగా రూపొందించిన బ్లాక్ చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రపంచ ఆర్థిక వేదికలో ఆవిష్కరించారు. ►డిజిటల్ ట్యాక్స్ సమస్యల పరిష్కార ప్రణాళికకు 137 దేశాలు మద్దతిచ్చినట్లు ఓఈసీడీ చీఫ్ ఆంగెలాగురియా చెప్పారు. ►ప్రభుత్వ విధానాల పరంగా స్పష్టత, నిలకడ ఉండాలని, న్యాయ సంస్కరణలు కావాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు కోరుతున్నట్లు టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. -
కేటీఆర్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక ఆహ్వానం మేరకు గురువారం జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ లీడర్స్’ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ‘సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం–సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశా నికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల విధానరూపకర్తలైన సీనియర్ మంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్ ఒక్కరే ఉండటం అరుదైన గౌరవమని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశం కోసం మంత్రి కేటీఆర్‌కి డబ్ల్యూఈఎఫ్ ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించినట్టు పేర్కొంది. ప్రపంచ లీడర్లందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ అంశాలపైన మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు డబ్ల్యూఈఎఫ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం డబ్ల్యూఈఎఫ్ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సెర్బియా, పోలాండ్ తదితర దేశాల ప్రధానులతోపాటు బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేసియా, బోట్సా్వనా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్రమంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. మూడో రోజు దావోస్‌లో కేటీఆర్.. దావోస్‌లో వరుసగా మూడో రోజు కేటీఆర్ పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సౌదీ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్లా ఆల్ స్వాహతో సమావేశమై హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు రావాలని ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, డెన్మార్క్‌కు చెందిన మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ నోవో నోర్ డిస్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తోతో సమావేశమయ్యారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్), బయోఆసియాతో భాగస్వామ్యానికి సంబంధించి నోవో నోర్ డిస్క్ కంపెనీతో చర్చించారు. మైక్రాన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మహోత్ర, కోకోకోలా సీఈవో జేమ్స్ క్వెన్సి, ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్విక్కితో సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరం తమకు ప్రాధాన్యత ప్రాంతమని జేమ్స్ క్వెన్సి కేటీఆర్‌కు తెలిపారు. ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సనొఫి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్‌తో సమావేశమై హైదరాబాద్‌లో ఔషధ రంగ కంపెనీల ఏర్పాటుకు ఉన్న సానుకూల అంశాలతోపాటు డిజిటల్ డిస్కవరీ రంగంలో వస్తున్న వినూత్నమైన ట్రెండ్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అనేక అంశాలపై చర్చించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎస్ఎంఈ, స్టార్టప్ శాఖల మంత్రి యంగ్ సున్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మైఖేల్ పుంకే, సాఫ్ట్ బ్యాంక్ సీనియర్ మేనేజింగ్ పార్ట్నర్ దీప్ నిషార్, నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాన్సన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, యానిమల్ హస్బండ్రీ రంగాల్లో చేపట్టిన పలు ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలపై క్రిస్ జాన్సన్‌తో చర్చించారు. -
కృత్రిమ మేధపై కలసికట్టుగా..
దావోస్ (స్విట్జర్లాండ్): స్వేచ్ఛతో కూడిన ఉచిత ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అందించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) నియంత్రణపై ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో భాగంగా సుందర్ పిచాయ్ ప్రసంగించారు. గోప్యత అన్నది ఖరీదైన వస్తువేమీ కాదంటూ ప్రతి ఒక్కరికీ ఆ రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ అందరికీ అవసరం. డేటా సార్వభౌమత్వం ప్రతీ దేశానికి ముఖ్యమైనది. కనుక ప్రపంచంలో ఏ దేశంలో అయినా డేటా పరిరక్షణకు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్నెట్ నిజానికి ఒక ఎగుమతి వస్తువు. యూట్యూబ్‌లో ఒక భారతీయ పౌరుడు ఒక వీడియోను పోస్ట్ చేస్తే దాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సౌందర్యం ఇదే’’ అని పిచాయ్ చెప్పారు. ఆధునిక ప్రపంచంలో ఏఐ అద్భుత పాత్రను పోషిస్తుందన్నారు. ఏఐ రిస్క్‌ల గురించి అవగాహన ఉందని, ఇది బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ‘‘సంప్రదాయ కంప్యూటర్లు చేయలేని ఎన్నో పనులను క్వాంటమ్ కంప్యూటర్లు చేయగలవు. వీటి సాయంతో ప్రకృతి మెరుగ్గా మారేలా ప్రేరేపించొచ్చు. వాతావరణం, ప్రకృతి మార్పుల గురించి మెరుగ్గా అంచనా వేయొచ్చు. టెక్నాలజీలో క్వాంటమ్ భవిష్యత్తులో పెద్ద ఆయుధంగా మారుతుంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కలయిక అద్భుతంగా ఉంటుంది’’ అని పిచాయ్ చెప్పారు. ఏఐపై ఒక కం పెనీ లేక ఒక దేశమో పనిచేయడం కాకుండా కలసికట్టుగా పనిచేసే అంతర్జాతీయ విధానం అవసరమని సూచించారు. గూగుల్ శక్తి పెరిగితే ప్రమాదకరమా..? ఈ ప్రశ్నను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్‌ష్వాబ్ సంధించారు. దీనికి పిచాయ్ స్పందిస్తూ.. ‘‘ఇతరులు కూడా మాతో సమానంగా మంచి పనితీరు చూపించినప్పుడే మేము సైతం మంచిగా పనిచేయగలం. సరైన పరిశీలన అనంతరమే మా స్థాయి విషయంలో ముందడుగు ఉంటుంది. మా వెంచర్ల ద్వారా ఏటా వందలాది స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం’’ అని తెలిపారు. ప్రజల జీవితాలను టెక్నాలజీతో ఏవిధంగా మెరుగుపరచొచ్చన్న దానిపై గూగుల్ పనిచేస్తుందని భవిష్యత్తు ప్రణాళికలపై బదులిచ్చారు. సదస్సులో ఇతర అంశాలు.. ► డబ్ల్యూఈఎఫ్ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సీ విజయ్‌కుమార్ పనిచేయనున్నట్టు డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. ► ప్రపంచ ఆర్థిక వేదిక పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ► కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో దావోస్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా
దావోస్: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సాయపడతానంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ బుధవారం తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్ వివాదంపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు. కాగా, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్ అంశం భారత్–పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ని కలుసుకోవడం తనకు చాలా ఇష్టమనీ, అయితే ఆమె తన కోపాన్ని అమెరికాపై ప్రదర్శించవద్దంటూ ట్రంప్ సూచించారు. అనేక దేశాలు అమెరికా కంటే ఎక్కువ కాలుష్యంతో నిండిఉన్నాయనీ గ్రెటా ఆ ప్రాంతాలపై దృష్టిసారించడం మంచిదని హితవు పలికారు. ట్రంప్ ఉపన్యాసాన్ని ప్రశాంతంగా కూర్చుని విన్న గ్రెటా ‘‘మా ఇళ్లు ఇంకా మంటల్లో కాలుతున్నాయి’’ అని వ్యాఖ్యానించింది. -
ఈ–కామర్స్ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం!
దావోస్: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, రక్షణాత్మక విధానాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల వాణిజ్య రంగంలో గతంలో కంటే సవాళ్లు మరింత క్లిష్టమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు నిజానికి రాజకీయ సమస్య అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుంటెరస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వీటిని సవ్యంగా పరిష్కరించలేకపోతే పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను దేశాలు త్వరితంగా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) చీఫ్ క్రిస్టీనా లగార్డ్ సూచించారు. అందుకే అం తర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించామన్నా రు. కాగా, కృత్రిమ మేధ నియంత్రణకు నిబంధనల ను రూపొందించాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని పేర్కొన్నారు. డిజిటల్ డిక్లరేషన్... డిజిటల్ యుగంలో నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనే డిజిటల్ ప్రతినకు 40కు పైగా అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ డిజిటల్ డిక్లరేషన్‌పై మన దేశానికి చెందిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తొలి సంతకం చేశారు. ఎరిక్సన్, ఐబీఎమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, నోకియా, శామ్సంగ్, షార్ప్, వెరిజాన్, వొడాఫోన్, షియోమి తదితర సంస్థలు ఈ డిజిటల్ డిక్లరేషన్‌కు సంఘీభావం తెలిపాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్.. 6,200 కోట్ల డాలర్లు ప్రతీ ఏడాదీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 5 కోట్ల టన్నులుగా (ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా తయారైన వాణిజ్య విమానాల బరువు కంటే ఇది అధికం) ఉన్న ఈ–వేస్ట్ 2050 కల్లా 12 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ఏటా పేరుకుపోతున్న ఈ–వ్యర్థాల విలువ 6,200 కోట్ల డాలర్ల మేర ఉంటుందని, ఇది మొత్తం ప్రపంచ వెండి ఉత్పత్తి విలువకు మూడు రెట్లకు సమానమని వివరించింది. ప్రతి ఏటా ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఉత్పత్తుల్లో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు తెలియజేసింది. -
కశ్మీర్‌పై అంతర్జాతీయ చర్చ!
దావోస్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ దావోస్‌లో అన్నారు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ విభేదాలకు కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణాలేనని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అసిఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచం ముక్కలుగా విడిపోవడానికి కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణమే’ అని అన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సమిట్ నినాదమైన ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు చైనా, అటు అమెరికాతో తమ ద్వైపాక్షిక బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ), చైనా–పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) తదితర ప్రాజెక్టులతో గత కొన్నేళ్లలో చైనాతో పాక్ బంధం మరింత బలపడిందని అబ్బాసీ చెప్పారు. -
‘అమెరికా ఫస్ట్’ అంటే..!
దావోస్: ‘అమెరికా ఫస్ట్(తొలుత అమెరికా)’ అనే తన నినాదాన్ని ‘అమెరికా మాత్రమే’ అనే అర్థంలో చూడకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా సాధించిన అభివృద్ధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. అయితే, తన తొలి ప్రాధాన్యత అమెరికానేనని పునరుద్ఘాటించారు. ‘అమెరికా ఫస్ట్ అంటే అమెరికా మాత్రమే అని కాదు. అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచమూ వృద్ధి చెందుతుంది’ అని అన్నారు. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన దావోస్‌లో కీలక ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై అమెరికా పోరు కొనసాగిస్తుందని, అఫ్గానిస్తాన్‌ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారనివ్వబోమన్నారు. పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నాం.. ఏడాది కాలంగా తాను తీసుకున్న నిర్ణయాల్ని ట్రంప్ ప్రస్తావించారు. ‘వరుసగా స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి ఇంతవరకూ అదనంగా 7 ట్రిలియన్ డాలర్లు మార్కెట్లలోకి వచ్చి చేరాయి. స్వేచ్ఛా వాణిజ్యానికి అమెరికా మరోసారి సిద్ధమని చెప్పేందుకు నేనిక్కడి వచ్చా. అమెరికాలో వ్యాపారానికి, ఉద్యోగాలకు, పెట్టుబడులకు ఇదే మంచి సమయం. నేనెప్పుడూ అమెరికా ఫస్ట్ విధానాన్ని నమ్ముతాను. ప్రపంచ నేతలు కూడా వారి దేశం విషయంలో అలాగే భావించాలి. అధ్యక్షుడిగా దేశం, ఉద్యోగులు, కంపెనీల ప్రయోజనాల్ని ఎల్లప్పుడూ పరిరక్షించాల్సి ఉందన్నారు. ఏదైనా ఒక దేశం నిబంధనల్ని ఉల్లంఘిస్తే స్వేచ్ఛా వాణిజ్య విధానం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మీడియా రూపం అప్పుడు తెలిసింది ఉగ్రవాదం విషయంలో అమెరికా పౌరుల్ని, సరిహద్దుల్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలకు వెనకాడమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘దుర్మార్గపు పాలన, ఉగ్రవాదం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మిత్రదేశాలు తమ భద్రతను పటిష్టం చేసుకోవాలి’ అని సూచించారు. అమెరికాలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సందర్భంలో రెండు పాత చట్టాల్ని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. ‘అమెరికాలోని మధ్య తరగతి ప్రజల కోసం భారీగా పన్నులు తగ్గించాం. కార్పొరేట్ వర్గాలకు కూడా ఊరట కల్పించాం. పన్ను తగ్గింపుతో ఒక కుటుంబ వార్షిక ఆదాయం 4 వేల డాలర్లు పెరుగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. విద్యుత్ స్వయం సమృద్ధి, ఇంధన భద్రత కోసం ఇంధన ఉత్పత్తిపై విధించిన కట్టుబాట్లను ఎత్తివేస్తున్నామని అన్నారు. వ్యాపారవేత్తగా ఉన్నప్పుడూ మీడియా ఎప్పుడూ తనను ప్రేమించేదని, అయితే మీడియా ఎంత మోసపూరితమో రాజకీయాల్లోకి వచ్చాక, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకే తెలుసుకోగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో బిల్ క్లింటన్ అనంతరం దావోస్‌కు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. సెనెట్‌లో హెచ్–1బీ వీసాల పెంపు బిల్లు వాషింగ్టన్: ప్రతిభావంతులకు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించేలా హెచ్–1బీ వీసా వార్షిక కేటాయింపుల్ని పెంచాలని ప్రతిపాదిస్తూ అమెరికన్ సెనెట్‌లో ఇద్దరు రిపబ్లికన్లు సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. ‘ హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని, హెచ్1–బీ వీసాదారులు ఉద్యోగాలు మారేందుకు సమయం కేటాయించాలని ప్రతిపాదించారు. వీసాల వార్షిక పరిమితిని 85 వేలకు పెంచాలని, అవసరమైతే 1.95 లక్షలకు పెంచాలని సూచించారు. కాగా, నిపుణులైన ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు వీసా లాటరీ విధానానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా పథకంలో ఏడాదికి 50 వేల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తున్నారు. ఈ విధానం అమెరికా భవిష్యత్తుకు లాభదాయకం కాదని ట్రంప్ వాదిస్తున్నారు. -
నేటి నుంచి దావోస్ సదస్సు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నేటి నుంచి ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం ప్రారంభ ఉత్సవాలు ముగిశాక.. మంగళవారం నుంచి అధికారికంగా మొదలయ్యే ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఉపన్యాసం ఇస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు రుచికరమైన భారతీయ వంటకాలు వడ్డించడంతో పాటు.. సదస్సు జరిగినన్ని రోజులు యోగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్ ఆల్స్ పర్వతాల మధ్య ఉన్న విడిది కేంద్రం దావోస్‌లో జరగనున్న ఈ 48వ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి వ్యాపార, రాజకీయ, కళలు, విద్యా, సామాజిక రంగాలకు చెందిన 3 వేల మందికి పైగా నేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారత్ నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ చోదక శక్తి అన్న అంశాన్ని ఈ సమావేశాల్లో మోదీ నొక్కి చెప్పనున్నారు. డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లౌస్ స్వాబ్ సోమవారం సాయంత్రం సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆస్ట్రేలియన్ నటి కేట్ బ్లాన్‌చెట్, ప్రముఖ సంగీతకారుడు ఎల్టన్ జాన్‌లను ‘క్రిస్టల్’ అవార్డులతో సత్కరించనున్నారు. దేవెగౌడ తర్వాత మోదీనే.. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగంతో సదస్సు అధికారికంగా ప్రారంభమవుతుంది. ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ అనేది సదస్సు ప్రధాన ఎజెండా. 1997లో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ అనంతరం దావోస్ సదస్సుకు హాజరవుతున్న మొదటి భారత ప్రధాని మోదీనే. భారత్ స్వేచ్ఛా వాణిజ్య దేశమని, ప్రపంచ వ్యాప్త పెట్టుబడుల కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రపంచ దేశాలకు ప్రధాని స్పష్టం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేవలం 24 గంటలు మాత్రమే ప్రధాని దావోస్‌లో ఉంటారు. సోమవారం సాయంత్రం ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీఈవోలకు విందు ఇస్తారు. ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 20 కంపెనీలు, 40 విదేశీ కంపెనీల సీఈవోలు పాల్గొంటారు. అలాగే అంతర్జాతీయ వ్యాపార కూటమికి చెందిన 120 మంది సభ్యులతో మోదీ సమావేశమవుతారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంజే అక్బర్, జితేందర్ సింగ్‌లు కూడా దావోస్ సదస్సులో పాల్గొంటున్నారు. అలాగే భారతీయ పరిశ్రమల విభాగం సీఐఐ నేతృత్వంలోని సీఈవోల బృందంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీం ప్రేమ్‌జీ, రాహుల్ బజాజ్, ఎన్.చంద్రశేకరన్, చందా కొచ్చర్, ఉదయ్ కొటక్, అజయ్ సింగ్‌లు సదస్సుకు హాజరవుతున్నారు. మోదీతో పాటు సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, షారుక్ ఖాన్లు కూడా ప్రసంగిస్తారు. -
దావోస్‌లో నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
దావోస్: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐదు రోజుల పాటు జరగనుంది. మన దేశం తరఫున కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ నీతి ఆయోగ్ అధ్యక్షుడు పనగరియా, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొంటున్నారు. భారత సర్కారు చేపట్టిన డీమానిటైజేషన్, అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పాలన ప్రపంచం వికేంద్రీకరణకు దారితీస్తుందన్న ఆందోళనలు ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి. ముఖ్యంగా భారత్‌పై ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర సర్కారు చేపట్టిన చర్యలు, పన్నుల సంస్కరణ కార్యక్రమాల(జీఎస్టీ)పై ప్యానలిస్టులు చర్చించనున్నారు. మనదేశం నుంచి 100కుపైగా సీఈవోలు హజరవుతారు. టాటా గ్రూపు కొత్త చైర్మ న్గా ఇటీవలే ఎంపికైన ఎన్.చంద్రశేఖరన్ కూడా పాలు పంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 3,000 మందికిపైగా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరిలో 1,200 మంది కంపెనీల సీఈవోలు కావడం విశేషం. బ్రిటిష్ ప్రధాని థెరెస్సా మే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, స్విస్ ప్రెసిడెంట్ డోరిస్‌లూథర్డ్, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితర ప్రముఖులూ ఈ వేదికపై ఆసీనులు అవుతున్నారు. ఆర్థిక అసమానత్వం, సామాజిక విభజన, పర్యావరణ ముప్పు అన్నవి రానున్న పదేళ్లలో ప్రపంచం ఎదుర్కోనున్న పెద్ద సవాళ్లుగా డబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టిన స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేయడమేగాక.. అడ్వాన్సుగా రూ.70 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రతినిధి బృందం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనుంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననుంది.