అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee) మారకం విలువ ఇటీవల భారీగా క్షీణిస్తోంది. అయినా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర పోటీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇంకా అధిక విలువ కలిగి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Rajan) పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో రూపాయి భవిష్యత్తు గమనంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. అనేక ఇతర కరెన్సీలు కూడా ఇదే ధోరణిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్) ఇప్పటికీ అధిక విలువను సూచిస్తోందన్నారు. ఈ ఓవర్ వాల్యుయేషన్ రూపాయి మరింత పతనం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధిక విలువ కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఆర్‌బీఐ జోక్యం తగదు
రూపాయి విలువను కాపాడేందుకు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. ప్రాథమిక ఆర్థిక సర్దుబాట్లకు ప్రతిస్పందనగా, కరెన్సీ విలువను పెంచేలా కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని, స్వల్పకాలిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి క్షీణత, అమెరికా డాలర్ బలపడటం, ఇతర ప్రపంచ ఆర్థిక అంశాలు సహజ మార్కెట్ ప్రతిస్పందనగానే భావించాలని రాజన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటా
అమెరికా కరెన్సీ యుద్ధం
ప్రపంచ కరెన్సీలను అమెరికా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇతర దేశాలపై ఆర్థిక సుంకాలు విధించడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీలపై పెరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకర్లకు ఆందోళన కలిగిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment