raghuram Rajan
-
రూపాయి పడినా ఇంకా విలువైనదే..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee) మారకం విలువ ఇటీవల భారీగా క్షీణిస్తోంది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో ఇతర పోటీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇంకా అధిక విలువ కలిగి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Rajan) పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో రూపాయి భవిష్యత్తు గమనంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదుఅమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. అనేక ఇతర కరెన్సీలు కూడా ఇదే ధోరణిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (ఆర్ఈఈఆర్) ఇప్పటికీ అధిక విలువను సూచిస్తోందన్నారు. ఈ ఓవర్ వాల్యుయేషన్ రూపాయి మరింత పతనం అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు సూచిస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధిక విలువ కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఆర్బీఐ జోక్యం తగదురూపాయి విలువను కాపాడేందుకు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. ప్రాథమిక ఆర్థిక సర్దుబాట్లకు ప్రతిస్పందనగా, కరెన్సీ విలువను పెంచేలా కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని, స్వల్పకాలిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి క్షీణత, అమెరికా డాలర్ బలపడటం, ఇతర ప్రపంచ ఆర్థిక అంశాలు సహజ మార్కెట్ ప్రతిస్పందనగానే భావించాలని రాజన్ తెలిపారు.ఇదీ చదవండి: ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటాఅమెరికా కరెన్సీ యుద్ధంప్రపంచ కరెన్సీలను అమెరికా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇతర దేశాలపై ఆర్థిక సుంకాలు విధించడానికి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీలపై పెరుగుతున్న ఈ ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకర్లకు ఆందోళన కలిగిస్తుందన్నారు. -
ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. తగినన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉపాధి కల్పనకు కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. దేశంలో నిరుద్యోగం పోవాలంటే.. ఉపాధి కల్పన తప్పకుండా జరగాలి. తయారీ రంగాలను తప్పకుండా ప్రోత్సహించాలని రాజన్ పేర్కొన్నారు.ఏడు శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టిస్తోందా? అనే ప్రశ్నకు, రఘురామ్ రాజన్ సమాధానమిస్తూ.. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన అప్రెంటిస్‌షిప్ పథకాలను స్వాగతిస్తున్నామని రాజన్ అన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎన్రోల్మెంట్ ఆధారంగా ప్రభుత్వం మూడు ఉపాధి ఆధారిత పథకాలను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.ఇదీ చదవండి: వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..వియత్నాం, బంగ్లాదేశ్‌లను ఉదాహరణలుగా చెబుతూ.. వస్త్రాలు, తోలు పరిశ్రమలో వృద్ధి సాధిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. భారత్ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన వ్యయానికి సంబంధించినంతవరకు ప్రైవేట్ రంగం ఇంకా ఎందుకు వెనుకబడి ఉందని అడిగిన ప్రశ్నకు రాజన్, ఇది ఒక చిన్న మిస్టరీ అని అన్నారు.యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గించడం వల్ల సెంట్రల్ బ్యాంకులు సముచితంగా భావించే వేగంతో ముందుకు సాగడానికి మరింత అవకాశం లభించిందని అన్నారు. -
రాజకీయాల్లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్?
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్ కాంగ్రెస్ చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాజాగా మరోమారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. దీనిపైన రాజన్ స్పందించారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కంటే నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. నేను విద్యా వేత్తని. ‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’. కానీ ప్రజలు ఇప్పటికీ నా మాటల్ని నమ్మడం లేదు. పాలిటిక్స్ అంటే నా భార్యకు, నాకుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నారు.అనంతరం భారత్, అమెరికా తదితర దేశాల్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, చిన్న పరిశ్రమల ముందున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలపై రాజన్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలతో పాటు ఇతర అంశాలే అందుకు కారణం. దీనికి తోడు అధిక వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ వృద్ది ఆశించిన స్థాయిలో ఉండదని తెలిపారు.‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’ అంటే పరోక్షంగా రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇంగ్లీష్‌లో ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. -
అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 'భారత్' ఒకటి. అదే సమయంలో అత్యంత పేద దేశం కూడా.. అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2024లో నిరుద్యోగిత రేటు 8.1%గా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) పేర్కొన్న విషయాన్ని రాజన్ హైలైట్ చేశారు.భారతదేశంలోని శ్రామిక జనాభాలో కేవలం 37.6 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు. పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిలోకి రావడం వల్ల భారత్‌కు మేలు జరుగుతుందన్నారు. యువకులకు కావలసిన ఉపాధి కల్పించగలిగితే.. దేశం మరింత వేగంగా డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.భారత్ క్రమంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో చేరుతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా 2047 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని రఘురామ్ రాజన్ అన్నారు.ఇక అసలు సమస్య ఏమిటంటే.. 2047-2050 నాటికి దేశంలో వృద్ధాప్యం పెరుగుతుంది. అప్పటికి భారతీయులంతా ధనవంతులు కాగలరా? అని రాజన్ అన్నారు. ప్రస్తుత జనాభా డివిడెండ్ శాశ్వతంగా ఉండదని, జనాభా వయస్సు పెరిగే కొద్దీ.. వర్క్‌ఫోర్స్‌లో సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు.Can India lift itself from the doldrums of a jobs crisis? Can the country grow rich before it grows old?My conversation with Raghuram Rajan, former head of India’s central bank and coauthor of “Breaking the Mold: India’s Untraveled Path to Prosperity” pic.twitter.com/hPz75GRE16— Fareed Zakaria (@FareedZakaria) May 19, 2024 -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
ఆర్బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఇటీవల తాను గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎంత జీతం తీసుకునే వారనే విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజ్ షమానీ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో RBI గవర్నర్ల జీతాలు ఎలా ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' (Raghuram Rajan)ను అడిగిన ప్రశ్నకు, తాను గవర్నర్‌గా పనిచేసిన రోజుల్లో ఏడాదికి రూ. 4 లక్షలను జీతభత్యాలను పొందినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గవర్నర్ల జీతాలు ఎలా ఉంటాయనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్నపుడు ధీరూభాయ్ అంబానీ నివాసానికి దగ్గరగా ఉన్న 'మలబార్ హిల్స్' అనే పెద్ద ఇంట్లో తనకు నివాసం కల్పించినట్లు వెల్లడించారు. అది కేంద్రం నాకు అందించిన అతిపెద్ద ప్రయోజనం అని చెప్పారు. 2013 నుంచి 2016 మధ్య RBI గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ క్యాబినెట్ సెక్రటరీతో సమానమైన జీతాన్ని పొందినట్లు వెల్లడిస్తూ.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత పెన్షన్ వంటివి రాలేదని వెల్లడించారు. పెన్షన్ రాకపోవడానికి కారణం, తాను సివిల్ సర్వెంట్లు కావడం వల్ల, సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ రావడం అని కూడా వివరించారు. ఇదీ చదవండి: నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..! రఘురామ్ రాజన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసి బయటకు వచ్చిన తరువాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈయన 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పేరుతో ఓ బుక్ కూడా లాంచ్ చేశారు. -
దేశానికి కీలక ఆస్తి మానవ వనరులే
రాయదుర్గం: మానవ వనరులపై సకాలంలో దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్’ పుస్తకంపై ఐఎస్బీ ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఖేమ్కా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, రాబోయే దశాబ్దాలలో దేశాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆస్తిగా మానవ వనరులని చెప్పవచ్చని, పెద్ద సంఖ్యలో వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశంలో అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, అయితే వాటిని అమలు చేయడంలోనే లోపం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఎస్బీ లాంటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సృష్టించడం కంటే ఉద్యోగాలు చేయడంపైనే దృష్టి సారించారని రఘురాం రాజన్ పేర్కొన్నారు. విద్యార్థులంతా సంస్థలను స్థాపించి తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఐఎస్బీ ఒకటని, ఈ విద్యాసంస్థ దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే సత్తా కలిగిన విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహ రచయిత రోహిత్ లాంబా, పలువురు ఐఎస్బీ ఫ్యాకల్టి, విద్యార్థులు పాల్గొన్నారు. -
దుబారా తగ్గాలి..పన్నేతర ఆదాయం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో క్రమశిక్షణ, నిశిత పరిశీలన, వ్యూహాత్మక వినియోగం కీలకమని.. ఆర్థిక నిర్వహణను బట్టే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు సాధ్యమవుతాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఆ దిశలో పనిచేయాలని.. దుబారా తగ్గించుకుని, ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యూహాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చారు. రఘురాం రాజన్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, దేశంలో ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రఘురాం రాజన్ పలు సూచనలు చేశారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లండి రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లాలని, ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టాలని రఘురాం రాజన్ సూచించినట్టు తెలిసింది. మైనింగ్‌తోపాటు నాలా చార్జీల్లాంటి పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పినట్టు సమాచారం. కొత్త వాహనాలు కొనడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం వంటి దుబారా ఖర్చుల జోలికి వెళ్లవద్దని.. సంక్షేమ పథకాల అమలు కారణంగా అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పథకాల కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రఘురాం రాజన్ తన అనుభవాలను సీఎం బృందంతో పంచుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
‘ఐ డోంట్ కేర్’! ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలపై విమర్శలు
ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ పురోగతికి సంబంధించి వెలుబుచ్చిన అభిప్రాయాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుందనే భావనను ప్రశ్నిస్తూ రాజన్ చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాఘురామ్ రాజన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాను దేశ ఆర్థిక మంత్రి లేదా ప్రధానమంత్రి అయితే రాబోయే దశాబ్దంలో దేశ అభివృద్ధిలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ భారతదేశం సూపర్ పవర్ హోదాను పొందడం పట్ల ఉదాసీనతను వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ దార్శనికతకు అనుగుణంగా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చడంపైనే తన దృష్టి ఉందని ఆయన ఉద్ఘాటించారు. అది నాకు అసలు విషయమే కాదు.. ‘భారతదేశం సూపర్ పవర్ (అగ్రరాజ్యం)గా ఉండటం గురించి నేను పట్టించుకోను, అది నాకు అసలు విషయమే కాదు. జాతిపిత కోరుకున్నట్లు ప్రతి భారతీయుడిని సంతోషంగా ఉంచడమే నా కర్తవ్యం’ అని రఘురామ్ రాజన్ అన్నారు. రఘురామ్ రాజన్ వెలుబుచ్చిన ఈ అభిప్రాయంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు రాజన్ దృక్పథాన్ని తీవ్రంగా ఖండించారు. సూపర్ పవర్ స్థితిని సాధించడం అంటే పేదరికాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణను, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కాదా అని ప్రశ్నించారు. దేశ మొబైల్ ఫోన్ ఎగుమతులపైనా రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్లు, సెమీకండక్టర్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై రఘురామ్ రాజన్‌కు సరైన అవగాహన లేదని మండిపడ్డారు. ఇదీ చదవండి: ఎన్పీఎస్ నుంచి నెలవారీ ఆదాయం Raghuram Rajan: "I don't care about India being a superpower, to me that's not the point. It's about what the father of the nation wanted." Being a superpower means lesser poverty, healthier lives, longer life spans, less suffering for a Billion people but of course Rajan… pic.twitter.com/PxzFF9uBjI — Cogito (@cogitoiam) June 18, 2023 -
హిందూ వృద్ధి రేటు అనడం అపరిపక్వమే: ఎస్బీఐ
న్యూఢిల్లీ: భారత్ ప్రమాదకర హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు.. తప్పుడు భావనతో, పక్షపాతంతో, అపరిపక్వంగా ఉన్నాయని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ పేర్కొంది.1950 నుంచి 1980 వరకు భారత్ జీడీపీ వృద్ధి అత్యంత తక్కువగా, సగటున 3.5 శాతంగా కొనసాగింది. దీన్ని హిందూ వృద్ధి రేటుగా భారత ఆర్థికవేత్త అయిన రాజ్ కృష్ణ సంబోధించారు. దీంతో తక్కువ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణిస్తుంటారు. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందనడం తొందరపాటే..
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
రాహుల్ గాంధీ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్తాన్‌లో కొనసాగుతుంది. ఇంతవరకు రాహుల్ యాత్రలో ఎంతోమంది సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అందులో భాగంగా రాహుల్ భారత్ జోడో యాత్రలో తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో... ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు సాగుతున్న ఈ యాత్రలోకి జాయిన్ అయ్యే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం అని ట్వీట్ చేశారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్‌తో రఘరామ్ రాజన్ ఏదో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రలో పాల్గొనడంపై బీజీపీ పలు విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్‌గా అభివర్ణించుకుంటున్నారని పేర్కొంది. రఘురామ్ రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన్ను అవకాశవాదిగా బీజేపీ నేత అమిత్ మాల్వియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్లో ముగియునున్న భారత్ జోడో యాత్రలో ఇప్పటి వరకు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్థార్లు జాయిన్ అయ్యారు. వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, స్వయం-స్టైల్ గాడ్ మాన్ నామ్‌దేవ్ దాస్ త్యాగి (కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందారు), నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఉన్నారు. Former Governor of RBI, Dr. Raghuram Rajan joined Rahul Gandhi in today’s #BharatJodoYatra pic.twitter.com/BQax4O0KSF — Darshnii Reddy ✋🏻 (@angrybirddtweet) December 14, 2022 (చదవండి: పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!.. ప్రతిపక్ష నేత ఎంపికపై ఉత్కంఠ) -
అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు: రఘురామ్ రాజన్
భారత ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్)నిల్వలు తగినంత ఉండడంతో పాటు వీదేశి అప్పులు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. అందుకే శ్రీలంక, పాకిస్తాన్లో ఉన్న సమస్యలు దేశంలో లేవని చెప్పారు. ఫారెక్స్ నిల్వల విషయంలో ఆ రెండు దేశాలు పూర్తిగా విఫలమయ్యాయని దీని కారణంగానే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. రేట్లను పెంచడం గురించి రాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఉందని, అది తగ్గించేందుకు ఆర్బీఐ వడ్డీ రేటును పెంచిందన్నారు. ప్రపంచంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, త్వరలో భారత్‌లో కూడా తగ్గుతుందన్నారు. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం జూలై 22తో ముగిసిన వారానికి విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 571.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2022 మార్చి చివరి నాటికి, భారతదేశం విదేశి రుణం $620.7 బిలియన్లకు చేరుకుంది. జీడీపీ(GDP) నిష్పత్తికి విదేశీ రుణం 2021 మార్చి చివరి నాటికి 21.2 శాతం నుంచి 2022 మార్చి చివరి నాటికి 19.9 శాతానికి తగ్గింది. శ్రీలంకలో వద్ద ఫారెక్స్ నిల్వలు ఇటీవల $50 మిలియన్ల కంటే తక్కువగా పడిపోయాయి. తద్వారా దేశం విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపివేయవలసి వచ్చింది. పాకిస్థాన్‌లోనూ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం, జూలై 22, 2022తో ముగిసిన వారానికి పాకిస్తాన్ ఫారెక్స్ నిల్వలు $754 మిలియన్లు తగ్గి $8.57 బిలియన్లకు చేరుకున్నాయి. పాలసీ చదవండి: భారత్‌కు ఉబర్ గుడ్‌బై, స్పందించిన సీఈవో -
వడ్డీరేట్లు పెంచడం దేశద్రోహం ఏమీ కాదంటున్న ఆర్థికవేత్త
దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, బ్యాంకువడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం అనేది సర్వ సాధారణంగా జరిగే నిర్ణయమే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగే చేస్తాయి. ఇవాళ కాకపోతే రేపయినా మనం చేయక తప్పదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నాయి. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని ద్రేశద్రోహం (యాంటీ నేషనల్) అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ లింక్డ్ఇన్ పోస్టులో రఘురాం రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. ఈ సమయంలో ఉక్రెయిన్- రష్యా యుద్ధం రావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. దీంతో మార్చిలో చిల్లర ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 6.95 శాతానికి చేరగా టోకు ద్రవ్యోల్బణం 14.55ని టచ్ చేసింది. అయితే ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుకు సుముఖంగా లేదు. దీంతో పలు బ్యాంకులు నేరుగా కాకపోయినా పరోక్ష పద్దతిలో వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో బ్యాంకుల వడ్డీ రేట్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను ఉద్దేశించి రఘురాం రాజన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. చదవండి: బిగ్ షాక్: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు! -
భారత్ స్పందన మారాలి
న్యూఢిల్లీ: ధరల ఒత్తిళ్లకు తగ్గట్టు భారత సెంట్రల్ బ్యాంకు తన విధానాన్ని మార్చుకోవాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా సరఫరా చైన్‌లో ఏర్పడిన అవరోధాల ఫలితంగా ధరల ఒత్తిళ్లకు భారత్ సన్నద్ధం కావాలన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో వైఫల్యం అయితే అది ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు లక్ష్యాలకు విఘాతమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు ఆర్బీఐ కట్టుబడి ఉండాలన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలని.. మరీ అయితే 2 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చంటూ ఆర్బీఐకి కేంద్ర సర్కారు ఎప్పుడో నిర్ధేశించిన లక్ష్యాన్ని రాజన్ పరోక్షంగా ప్రస్తావించారు. కరోనా సంక్షోభంలోనూ రేట్లను పెంచకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ఆర్బీఐ చక్కని పాత్రనే పోషించినట్టు చెప్పారు. ‘‘అన్ని సెంట్రల్ బ్యాంకుల మాదిరే మనం కూడా ముందుకు వచ్చి నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. పాత విధానం ఇప్పటికీ పనిచేస్తుందా? అని ప్రశ్నించుకోవడంతోపాటు అవసరమైతే మార్పులు చేసుకోవాలి’’ అని రాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ ఎగువ పరిమితి స్థాయి 6 శాతాన్ని రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో మించిపోవడంతో రాజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ మంటలు తాత్కాలికమేనా? అన్న ప్రశ్నకు రాజన్ బదులిస్తూ.. ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణానికి తాజా ఒత్తిళ్లు అదనంగా పేర్కొన్నారు. యుద్ధ ప్రభావాలను కూడా కలిపి చూస్తే మరింతగా పెరిగిపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వృద్ధిపై ఆందోళన..? భారత్ వృద్ధి పథంపై ఆందోళనగా ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘‘2014 తర్వాత నుంచి కనిష్ట చమురు ధరల వల్ల భారత్ లాభపడింది. కానీ ఇప్పుడు తిరిగి చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన వృద్ధి పనితీరు కొంత కాలంగా బలహీనంగా ఉందన్నది వాస్తవం. 2016 డీమోనిటైజేషన్ తర్వాత నుంచి బలమైన రికవరీ లేదు. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటు అనే మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంతో జాగ్రత్తగా వీటిని నిర్వహించాల్సి ఉంటుంది’’ అని రాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కీలక బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పొద్దు: ఆర్బీఐ ముంబై: డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, సీవీవీ నంబర్లు వంటి కీలకమైన గోప్యనీయ బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. ప్రజా ప్రయోజనార్థం ఆర్థిక మోసాల తీరుతెన్నులపై ’బి(ఎ)వేర్’ పేరిట రూపొందించిన బుక్‌లెట్‌లో ఈ విషయాలు వివరించింది. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సాధనాలతో అంతగా పరిచయం లేని సామాన్యులను మోసగించేందుకు నేరగాళ్లు కొంగొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని సూచించింది. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏ సంస్థకూ అధికారం ఇవ్వలేదు కాగా, తన నియంత్రణలోని సంస్థలపై ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏ సంస్థకూ అధికారం ఇవ్వలేదని ఆర్బీఐ ప్రకటన ఒకటి స్పష్టం చేసింది. ఈ మేరకు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొంది. నియంత్రిత సంస్థలపై ఫిర్యాదులు, విచారణకు ఎటువంటి ఫీజులూ చెల్లించనక్కర్లేదని పేర్కొంది. జ్టి్టpట:// ఠీఠీఠీ.టbజీ.ౌటజ.జీn కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ను (సీఎంఎస్) పోర్టల్ ప్రజా ఫిర్యాదులకు వినియోగించుకోవచ్చని తెలిపింది. -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు..!
రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రిప్టో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. తాజాగా క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000కు పైగా క్రిప్టోకరెన్సీ చెలామణీలో ఉందని, రాబోయే రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుత క్రిప్టో ధరలు పూర్తిగా నీటి బుడగలాంటిదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న క్రిప్టో క్రేజ్‌ను 17వ శతాబ్దం నాటి నెదర్లాండ్స్ తులిప్ మానియాతో అభివర్ణించారు. చదవండి: క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్ హవా అన్ రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్..! క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్‌తో రఘురాం రాజన్ పోల్చారు. చిట్‌ఫండ్స్ నుంచి డబ్బులు పొందిన వారిలాగే క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా రాబోయే రోజుల్లో బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు వ్యాల్యూ లేదన్నారు. క్రిప్టోలో కొన్ని మాత్రమే చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని..వాటిలో కూడా క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాడతారని తెలిపారు. భారత్‌లోని 15-20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు సుమారు 5.39 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీను కల్గి ఉన్నారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చదవండి: క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే! -
కరోనా సంక్షోభంపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి గత ఏడాది మహమ్మరి కంటే చాలా ఘోరమైనదని రుజువు చేసింది. ఎందుకంటే కేసులు, మరణాలు సంఖ్య విపరీతమైన వేగంతో పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 3.5 లక్షలకు పైగా కరోనా కేసులు, 3,400 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో వరుసగా 13 రోజులు నుంచి 3 లక్షలకు పైగా కేసులను నమోదవుతున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. బయట పతిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అని. 2020లో కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కూడా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య ఒక లక్షకు చేరలేదు. కానీ, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. అత్యవసర హెల్త్‌కేర్ పరికరాలు, మెడికల్ ఆక్సిజన్, హాస్పిటల్ పడకలు, ఔషధాల కొరత వంటివి కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడానికి కరణమయ్యాయి. దీంతో దేశంలో ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారింది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 సంక్షోభం గురించి చాలా మంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. కరోనా మహమ్మరి విజృంభించకుండా నివారించడానికి అధికారులు సకాలంలో స్పందించలేదని నిపుణులు ఆరోపించారు. నిపుణుడు మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, కోవిడ్ -19 మళ్లీ ఎందుకు పుంజుకుందో కొన్ని కారణాలను మీడియాతో పంచుకున్నాడు. సరైన నాయకత్వం లేకపోవడం? 2020లో కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకొని తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. "సరైన నాయకత్వం లేకపోవడం, దూరదృష్టి కలిగి ఉండకపోవడం" వల్లనే దేశంలో కరోనా మహమ్మరీ తిరిగి విజృంభించడానికి ప్రధాన కారణాలు అని తెలిపారు. "మీరు ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటే, మీరు కరోనా తగ్గలేదని ప్రజలను హెచ్చరించి ఉంటే, ఇంకా కరోనా తగ్గలేదని లేదని చేయాల్సిన పని పూర్తి కాలేదని గుర్తించి ఉంటే" అని బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో రాజన్ పేర్కొన్నారు. "ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో వైరస్ తిరిగి వచ్చిందని ఉదాహరణకు, బ్రెజిల్ వంటి దేశాల్లో మళ్లీ విస్తరించిందని, వైరస్ తిరిగి రూపాంతరం చెందినట్టు గ్రహించి ఉండాలి" అని రాజన్ తెలిపారు. కరోనా వైరస్ పై జరిగిన పోరాటంలో దేశం విజయవంతమైందని చాలా మంది భారత ప్రభుత్వ అధికారులు ఇంతకుముందు ప్రకటించినట్లు తెలిపారు. అయితే, దేశంలో కేసులు మళ్లీ తిరిగి మార్చి నుంచి పెరగడం ప్రారంభించాయి. తర్వాత నెల ఏప్రిల్‌లో వేగంగా విజృంభించింది అని అన్నారు. ప్రస్తుతం రాజన్ చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతానికి, మీ ఆజాగ్రత్త వల్ల దేశం కోవిడ్ -19తో భాదపడుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం వల్ల కొన్ని పరిశ్రమల సంస్థలు, వైద్య నిపుణులు కొన్ని వారాలు దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది విధించిన లాక్డౌన్ వల్ల దేశ ఆర్దిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినట్లు కాబట్టి లాక్డౌన్ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే కోవిడ్ -19 పరిస్థితి చెయ్యి దాటి పోతుందని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ -
కరోనా సంక్షోభంపై రాజన్ విశ్లేషణ..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ జూన్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 23.9 శాతం క్షణించడంపై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అధికార యంత్రాంగం కీలక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజన్ చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందని, కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సరిపోదని అభిపప్రాయపడ్డారు. అయితే దేశ వృద్ధి రేటు మెరుగవ్వాలంటే యువత ఆశయాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని తెలిపారు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కార్మిక రక్షణ చట్టాలను రద్దు చేయడం ద్వారా పరిశ్రమ, ఉద్యోగులలో చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశ ఎగుమతులు వృద్ధి చెందే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ కంటే ముందే ప్రపంచం కోలుకుంటుందని తెలిపారు. మరోవైపు చిన్న కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నిధులను వేగంగా సమకూర్చాలని పేర్కొన్నారు . బాండ్ మార్కెట్ల ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకొని అవసరమైన రంగాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అయితే మెట్రో నగరాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల అమ్మకంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వాలని తెలిపారు. కరోనా సంక్షోభంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ఎమ్‌ఎన్‌ఆర్‌జీఏ) ద్వారా గ్రామీణ ప్రజలకు కొంత స్వాంతన కలగనుందని, కానీ మెట్రో నగరాలలో ఆదాయం లేని వారికి ఎమ్‌ఎన్‌ఆర్‌జీఏ వర్తించదు కనుక ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రఘురామ్ రాజన్ కోరారు. -
ఆర్థిక వ్యవస్థపై రాజన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వలస కార్మికుల ఉచిత ఆహార ధాన్యాలకు సరిపోతాయని.. ఉచిత నగదు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజన్ స్పష్టం చేశారు. కార్మికులకు ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వివిద రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోకపోతే.. ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం రేటింగ్ ఏజన్సీలు ఇచ్చే నివేదికలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. బ్యాంక్‌లు, సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. చదవండి: కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే! -
ఆచితూచి పునరుద్ధరణ
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తివేత విషయంలో భారత్ చాలా తెలివిగా వ్యవహరించాలని ఉద్యోగాలను కాపాడేందుకు వీలైనంత వేగంగా ఆచితూచి పునరుద్ధరించాల్సి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రూ.65 వేల కోట్ల వరకూ ఖర్చు చేయాలని సూచించారు. కోవిడ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని, పరిణామాలపై రాజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. దేశంలోని అన్ని వర్గాల వారిని దీర్ఘకాలం సాయం అందించే సామర్థ్యం భారత్‌కు లేదని, లాక్డౌన్ పొడిగించడం ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని రాజన్ స్పష్టం చేశారు. కోవిడ్ నుంచి బయటపడ్డార ప్రపంచం మొత్తమ్మీద ఆర్థిక వ్యవస్థలోని అన్ని విషయాల్లో పునరాలోచన ఉంటుందని, భారత్ దీన్ని అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తన గొంతు వినిపించాలని రాజన్ సూచించారు. -
లాక్డౌన్ విరమణపై రాజన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తోనే కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించలేమని భారత్‌లో ఆర్థిక వ్యవస్థను తెరిచేముందు పెద్ద ఎత్తున ప్రజలకు వైరస్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్ స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ వద్ద ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నందున భారత్ లాక్డౌన్ నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం సహా పలు అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించారు.అధికార వికేంద్రీకరణతోనే కరోనా మహమ్మారితో డీలా పడిన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించవచ్చని రాజన్ పేర్కొన్నారు. ఉత్పత్తి ఫలాలను ప్రజలకు పంచేందుకు బదులు అవకాశాలను ప్రజల ముందుకు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రజల అవసరాలను మెరుగ్గా అవగాహన చేసుకోగలిగే స్ధానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలన్నారు. కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పూర్తిగా పడకేసిన క్రమంలో రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నుంచి సమర్ధవంతమైన వ్యూహంతో బయటకు వచ్చిన అనంతరం ఆర్థిక వ్యవస్థను అత్యంత జాగరూకతతో తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా మంచి నాణ్యతతో కూడిన ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించాలని సూచించారు. చదవండి : కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే! లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆహారం,సంక్షేమంపై రూ 65,000 కోట్లు వెచ్చించాల్సి ఉందని, భారత జీడీపీ 200 లక్షల కోట్లు కావడంతో ఇది ఏమాత్రం భారం కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట సమయాల్లో అసమానత్వాలను సరిచేయాల్సిన అవసరం ఉందని రాజన్ అన్నారు. నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఈ అంతరాలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా విడుదల చేయాలని కోరారు. వీలైనంత ఎక్కువమంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ఆర్థిక సాయం, ఆహారం సమకూరాలని అన్నారు. భారత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి కొత్తగా కరోనా వైరస్ కేసులు వెలుగుచూడకుండా నియంత్రించాలని సూచించారు. మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తే అది మరింత విపరిణామాలకు దారితీస్తుందని, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని రాజన్ హెచ్చరించారు. -
ఆర్ధిక మాంద్యంపై కరోనా ప్రభావం
-
దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్
సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి కరోనా మహమ్మారి విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విస్తరణ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. షికాగో బిజినెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా ఉన్న రాజన్ దేశం స్వాతంత్ర్యం తరువాత 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి, తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. 'ఇటీవలి కాలంలో భారతదేశపు గొప్ప సవాలు' అనే పేరుతో తన బ్లాగులో ఈ విషయాలను పేర్కొన్నారు. ( కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు) ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008-09 నాటి కంటే నేడు తీవ్రంగా వుంది. 2008-09లో అదొక తీవ్రమైన డిమాండ్ షాక్. ఆ సమయంలో కార్మికులు యధావిధిగా పనులకు వెళ్లారు. మన దేశానికి సంబంధించి పలు సంస్థలు బలమైన వృద్ధిని సాధించాయి. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇపుడు కుదేలై ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాయని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆర్థిక సంక్షోభంపై పోరాడటానికి సాధ్యమైన చర్యలను కూడా ఆయన సూచించారు. లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇపుడు దృష్టి పెట్టాలని రాజన్ బ్లాగులో పేర్కొన్నారు. భౌతిక దూరం లాంటి కీలక జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని సూచించారు. తయారీదారులు తమ మొత్తం సరఫరా గొలుసును తిరిగి కొనసాగించడానికి, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఆవైపుగా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రణాళికలను రూపొందించడం, ఆమోదించడంతో పాటు సమర్ధవంతంగా అమలయ్యేలా పరిపాలన విభాగం చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కూడా నిరుపేదల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, మానవత్వంతో వారిని ఆదుకోవడం సరైన పని అని రాజన్ ప్రధానంగా సూచించారు. చదవండి : కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట -
కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు
సాక్షి, ముంబై : దేశంలో వేగంగా కరోనా వైరస్ మహమ్మారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నరు రఘు రామ్ రాజన్ స్పందించారు. ఈ సంక్షోభ సమయంలో ఆర్బీఐ పోషించాల్సిన పాత్రపై కొన్ని సూచనలు చేశారు. వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలకు క్రెడిట్ ఇవ్వడం అవసరం ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కష్ట సమయంలో పేదలు మనుగడ సాగించడానికి తాత్కాలిక ఆదాయ బదిలీ పథకాన్ని అమలు చేయాలని రఘురామ్ రాజన్ సూచించారు. ఇండియా టుడే న్యూస్ తో ప్రత్యేకంగా సంభాషించిన ఆయన ఇప్పటికే బలహీనమైన భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ మహమ్మారి కరోనావైరస్ దెబ్బ పడిందని, ఈ ప్రభావాన్ని ఆర్బీఐ, కేంద్రం మృదువుగా డీల్ చేయాలని అభిప్రాయపడ్డారు. చిన్న మధ్యతరహా సంస్థలతో పాటు పెద్ద సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఇందుకు ప్రభుత్వం పాక్షిక హామీలు ఇవ్వాలి. అదే సమయంలో కొన్ని ప్రోత్సాహకాలను అందించాలి, తద్వారా బ్యాంకులు క్రెడిట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యత సడలింపును అనుసరిస్తున్న ఇతర కేంద్ర బ్యాంకుల వైఖరిని ఆర్ బీఐ కూడా అనుసరించాలని సూచించారు. అయితే చెడురుణాల బెడద అధికంగా ఉన్నందు వల్ల ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి అన్నారు. దీర్ఘకాలిక పథకాలకు ఇది సమయం కాదు, దీనికి తగినంత నిధులు కూడా లేవు కనుక, సాధ్యమైనంతవరకు తాత్కాలిక ఆదాయ మద్దతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో మొదటి ప్రాధాన్యత వైద్య సదుపాయాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ఆ తరువాత ఎక్కువగా ప్రభావితమైన ప్రజలకు కొన్నినెలల పాటు నగదు సాయం చేరాలి. తద్వారా అల్పాదాయ వర్గాల వారికి ఊరట లభించాలి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో లభ్యమవుతున్న మెడికల్ వనరులను అందింపుచ్చుకోవాలన్నారు. తక్షణం మనకు దొరికిన చోట అవసరమైన అన్ని సరఫరాలను తీసుకోవాలన్నారు. ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి దేశంలాగానే మనం కూడా ప్రతి మార్గాన్ని అన్వేషించాలని తెలిపారు. ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులను అధిగమించేందుకు స్వయం సమృద్ధిగా ఉన్నారా అనే ప్రశ్న సంక్షోభం లేవనెత్తుతున్నప్పటికీ, ఇది స్వల్ప కాలానికి సంబంధించిన అంశమేనని రఘురామ్ రాజన్ వెల్లడించారు. కాగా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చామని, ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి అని ఆర్బీఐ ప్రకటించిన సంగతి విదితమే. -
హీరోయిన్‌కు ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ జేఎన్‌యూ వ్యవహారంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నిరసనపై స్పందించారు. జేఎన్‌యు హింసకు స్పందించిన దీపికాకు మద్దతు తెలపడంతో పాటు, ఆమె చేసిన సైలెంట్ ప్రొటెస్ట్‌పై ఆయన తన అభిమానం చాటారు. అంతేకాదు తన కుటుంబానికి వేధింపులు ఉన్నప్పటికీ నిష్పాక్షికంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో దీపికా పదుకొనేను పోల్చారు. కొంతమంది వ్యక్తులు తమ చర్యల ద్వారా సత్యం, స్వేచ్ఛ ,న్యాయం లాంటివే కాకుండా త్యాగం చేయవలసిన ఆదర్శాలను చూపిస్తారన్నారు భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) లోకి ముసుగు దుండగుల ముఠా ప్రవేశించి, ఆపై గంటల తరబడి వినాశనం సృష్టించి, విద్యార్థులు అధ్యాపకులపై దాడి చేయడంతోపాటు, పోలీసుల నిర్లక్ష్యం అనే వార్త తీవ్ర ఆందోళన కరమైందని లింక్డిన్లోని ఒక బ్లాగులో రాజన్ వ్యాఖ్యానించారు. జేఎన్‌యూ బాధితులను కలవడం ద్వారా అటు పుష్ప గుచ్ఛాలను, ఇటు ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఆమె మనందరికీ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. తన తాజా చిత్రం 'ఛపాక్' ప్రమాదంలో పడుతుందని తెలిసీ కూడా జేఎన్‌యూ బాధితులకు అండగా నిలిచేందుకు ఆమె వెనుకాడలేదన్నారు. అలాగే జేఎన్‌యూ ఆందోళనలో కీలక పాత్ర పోషిస్తున్న యువతను కూడా రాజన్ ప్రశంసించారు. విభిన్న విశ్వాసాలు కలిగిన యువకులు ఒక్కటిగా కలిసి కవాతు చేయడం, హిందూ,ముస్లింలు మన జాతీయ జెండా వెనుక ఐక్యం కావడం సంతోషకరమన్నారు. తమ సొంత లాభం కోసం కృత్రిమ విభజనలను ప్రేరేపించే స్వార్థరాజకీయ పరులను తిరస్కరించడం చాలా ఆనందంగా ఉందని రాజన్ అన్నారు. తద్వారా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకాశవంతంగా నిలుస్తుందనే విషయాన్ని తేల్చి చెప్పారన్నారు. మహాత్మాగాంధీ ప్రాణత్యాగం చేసిన దేశ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం యువత పోరాడుతోంది. స్వేచ్ఛను కాపాడటం కోసం వీరు కవాతు చేస్తున్నారు. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న స్వేచ్ఛా స్వర్గం కోసం ఉద్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉన్నత విశ్వవిద్యాలయాలు కూడా అక్షరాలా యుద్ధభూమిగా మారిపోయాయి. ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో వివక్ష, ఉదాసీనత రెండింటి పాత్ర ఉందనీ, నాయకత్వాన్ని నిందించడం చాలా సులభమే అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యత కూడా ఉందని ఆయన రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యం అంటే హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. స్వాత్రంత్యం అంటే ఎన్నికల రోజున మాత్రమే గుర్తుకువచ్చేది కాదు, ప్రతి రోజు రావాలి అని రాజన్ రాశారు. ఈ సందర్భంగా నిజాన్ని చూపించడం కోసం కృషి చేస్తున్న మీడియా సంస్థలను, రాజీనామా చేసిన అధికారులను కూడా ఆయన ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి నిరాకరించిన మాజీ ఎన్నికల సంఘం ఏకైక అధికారి అని లావాసాను పరోక్షంగా గుర్తు చేసుకున్నారు రఘురామ రాజన్. -
భారత్‌లో వృద్ధి మాంద్యం..
న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం ‘వృద్ధి మాంద్యం’ పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించాలంటే పెట్టుబడులు, భూ.. కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పెట్టుబడులతో పాటు వృద్ధికి కూడా ఊతం లభించగలదని రాజన్ తెలిపారు. దేశ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి, పోటీ దేశాలకు దీటుగా ఎదగడానికి .. ఉపయుక్తంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ‘ప్రస్తుత ప్రభుత్వంతో సమస్యేమిటంటే .. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ప్రణాళికలు.. అన్నీ కూడా ప్రధాని చుట్టూ ఉండే కొద్ది మంది, ప్రధాని కార్యాలయం నుంచి వస్తుంటాయి. ఒక పార్టీ రాజకీయ, సామాజిక ఎజెండాను అమలు చేయడానికి ఇలాంటి విధానం పనికొస్తుంది కానీ.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఇది పనిచేయదు. ఇందుకు రాష్ట్రాల స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో ఎకానమీ ఎలా పనిచేస్తుందన్న దానిపై అపార పరిజ్ఞానం అవసరమవుతుంది‘ అని రాజన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణంగా నడిచినప్పటికీ.. ఆర్థిక విధానాల సరళీకరణను స్థిరంగా ముందుకు తీసుకెళ్లాయన్నారు. ‘తీవ్ర స్థాయిలో అధికార కేంద్రీకరణ, మంత్రులకు అధికారాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా.. పీఎంవో దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సంస్కరణలు జోరందుకుంటున్నాయి. పీఎంవో దృష్టి మిగతా అంశాలవైపు మళ్లిన మరుక్షణం.. సంస్కరణల జోరూ తగ్గిపోతోంది‘ అని రాజన్ అన్నారు. ముందుగా సమస్యను గుర్తించాలి.. ఆర్థిక మందగమనానికి మందు కనుగొనాలంటే.. ముందుగా సమస్య తీవ్రతను గుర్తించడం దగ్గర్నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందని రాజన్ తెలిపారు. ‘సమస్య పరిమాణాన్ని గుర్తించాలి. సమస్య తాత్కాలికమేనని.. ప్రతికూల వార్తలు, అననుకూల సర్వేలను తొక్కి పెట్టి ఉంచితే అది పరిష్కారమైపోతుందనే ఆలోచనల నుంచి బైటికి రావాలి. విమర్శించే ప్రతి ఒక్కరికీ రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం మానుకోవాలి. దేశం వృద్ధి మాంద్య పరిస్థితుల మధ్యలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఒత్తిడి ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత జీడీపీ వృద్ధి రేటు.. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టమైన 4.5%కి పడిపోయిన నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సంస్కరణలు తేవాలి.. రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇన్ఫ్రా రంగాలు.. వాటికి రుణాలిచ్చిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయని రాజన్ చెప్పారు. బ్యాంకుల్లో మొండి బాకీలు కూడా తోడవడంతో రుణ వితరణ వృద్ధి ఉండటం లేదన్నారు. సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అందరి రుణభారం, యువతలో నిరుద్యోగిత పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ సమీకరణ, కార్మిక చట్టాలపరమైన సంస్కరణలు, స్థిరమైన పన్నులు.. నియంత్రణా వ్యవస్థల విధానాలు అమలు చేయాలని రాజన్ సూచించారు. -
‘మందగమనానికి రాజన్ మందు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మూలధనం, భూమి, కార్మిక మార్కెట్లు, పెట్టుబడులు, వృద్ధిని సరళీకరించేలా సంస్కరణలు అవసరమని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. పోటీతత్వాన్ని పెంపొందించడం, దేశీయ సమర్ధతను మెరుగుపరిచేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని కోరారు. ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరుగుతుందనే దాన్ని ముందుగా మనం అర్ధం చేసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ గురించి ప్రస్తావించాలని వ్యాఖ్యానించారు. నిర్ణాయక వ్యవస్థలోనే కాదు సలహాలు ప్రణాళికలు సైతం ప్రధాని చుట్టూ, ప్రధాని కార్యాలయంలో చేరిన కొద్ది మంది నుంచే వస్తున్నాయని రాజన్ స్పష్టం చేశారు. ఇది పార్టీ రాజకీయ, సామాజిక అజెండాకు ఉపకరిస్తున్నా ఆర్థిక సంస్కరణల విషయంలో ఫలితాలను ఇవ్వడం లేదని పెదవివిరిచారు. రాష్ట్రస్ధాయిలో కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై వీరికి పెద్దగా అవగాహన ఉండటం లేదని అన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణ సర్కార్లు అయినా తదుపరి ఆర్థిక సరళీకరణను స్ధిరంగా ముందుకు తీసుకువెళ్లాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కనిష్ట ప్రభుత్వం..గరిష్ట పాలన నినాదంతో అధికారంలోకి వచ్చినా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని చెప్పుకొచ్చారు. ప్రతి విమర్శకులకూ రాజకీయ దురుద్దేశం అంటగట్టడం సరికాదని, మందగమనం తాత్కాలికమనే భావనను విడనాడాలని రఘురాం రాజన్ హితవుపలికారు. -
ఆ రంగాలు మరింత సంక్షోభంలోకి: రాజన్
సాక్షి, ముంబై : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఇండియా టుడే పత్రికలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. రియల్టీ, కన్స్ట్రక్షన్, మాన్యుఫాక్చర్ కంపెనీలకు పెద్దమొత్తంలో రుణాలిచ్చే (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్ 50 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్బీఐ వాటి పనితీరును, వాటి ఎసెట్ క్వాలిటీని కూడా సమీక్షించాలని సూచించారు. కాగా షాడో బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా ఉన్న టాప్ 50 నాన్-బ్యాంక్ ఫైనాన్షియర్లను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అలాగే అతి ముఖ్యమైన పెద్ద ఎన్బీఎఫ్సీలు కుప్పకూలకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. కాగా నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని సుమారు యూఎస్డీ 66 బిలియన్ల మేర బకాయిలు ఉన్నటు ఇటీవల ఓ సర్వే తెలియజేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ స్పందిస్తూ సుమారు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడం లేదని వెల్లడించారు. -
నిర్మలా సీతారామన్‌కు రాజన్ కౌంటర్
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు యూపీఎ ప్రభుత్వంతో పాటు అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌లే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు రఘరామ్ రాజన్ దీటుగా బదులిచ్చారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకూ తన పదవీకాలం సాగగా, ఎక్కువ కాలం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే పనిచేశానని గుర్తుచేశారు. బ్యాంకింగ్ రంగ ప్రక్షాళనకు తాను చర్యలు చేపట్టి అవి అసంపూర్తిగా ఉండగానే తాను ఆర్బీఐ గవర్నర్‌గా వైదొలిగానని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తాను కేవలం ఎనిమిది నెలలు పనిచేస్తే ప్రస్తుత ప్రభుత్వం కిందే 26 నెలలు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించానని సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రఘురామ్ రాజన్ల జోడీ వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత దుస్థితి దాపురించిందని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. మరోవైపు ఈ అంశంపై రాజకీయ చర్చకు తాను దిగదలుచుకోలేదని స్పష్టం చేశారు. పటిష్ట ఆర్థిక వృద్ధి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రక్షాళన అవసరమని తాను అదే పనిచేశానని తెలిపారు. ఆర్థిక సంక్షోభానికి ముందు తీసుకున్న రుణాలు పేరుకుపోవడంతో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగాయని, వాటిని ప్రక్షాళన చేసి బ్యాంకులకు తిరిగి మూలధన సమీకరణకు తోడ్పడకుంటే సమస్యలు ఎదురవుతాయని, తాను ఈ ప్రక్రియను చేపట్టి సగంలోనే ముగించాల్సి వచ్చిందని రాజన్ చెప్పారు. దేశం ప్రస్తుతం ఆర్థిక మందగమనంలో ఉందని చెబుతూ వృద్ధి రేటును పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్‌తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ రంగాల్లో సమస్యల తక్షణ పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు రంగ పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ సూచించారు. భారత్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు లెక్కింపు విధానంపై తాజాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంలో చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన అరవింద్ సుబ్రమణ్యం జీడీపీ లెక్కలపై చేసిన విమర్శలనూ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక టీవీ చాన ల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ♦ భారత్ వృద్ధికి సంబంధించి ప్రైవేటు సంస్థల నుంచి వేర్వేరు అంచనాలు వెలువడ్డాయి. వాటిలో అధికభాగం అంచనాలు ప్రభుత్వ అంచనాలకన్నా తక్కువగా ఉన్నా యి. మొత్తంగా చూస్తే, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉన్నట్లు భావిస్తున్నా. ♦ 2018–19తో భారత్ ఆర్థిక వృద్ధి 6.8%. 2014–15 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. ప్రభుత్వం 2019–2020లో 7 శాతం వృద్ధి అంచనావేస్తున్నా... అంతకన్నా తక్కువగానే ఉంటుందన్నది పలు ప్రైవేటు సంస్థల అంచనా. ♦ పలు వ్యాపారాల గురించి ఆందోళన కలిగించే వార్తలే ఉంటున్నాయి. తమకు ఉద్దీపన చర్యలు ఏదో ఒక రూపంలో కావాలని పలు రంగాలు కోరుతున్నాయి. ♦ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రుణాలు నిజానికి సంస్కరణగా భావించకూడదు. ఇది వ్యూహాత్మక చర్య మాత్రమే. ♦ ప్రస్తుత వృద్ధికన్నా రెండు, మూడు శాతం అధిక వృద్ధి రేటు సాధన ఎలా అన్న అంశంపైనే మనం దృష్టి సారించాలి. దీనికి పలు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల తక్షణ పరిష్కారం జరగాలి. విద్యుత్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం ఇందులో కీలకం. -
అలా చేస్తే నా భార్య వదిలేస్తుంది: రాజన్
న్యూఢిల్లీ : రాజకీయాల్లోకి వస్తే తన భార్య వదిలేస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. రాజకీయాల కన్నా తనకు కుటుంబ జీవతమే ముఖ్యమన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నేను రాజకీయాల్లోకి వెళ్తే.. నా భార్య నాతో సంసారం చేయనని చెప్పింది. రాజకీయాలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి. బలమైన కారణం ఏది లేకపోయినప్పటికి నాకు మాత్రం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. కొందరు తమ వ్యాక్చాతుర్యంతో ఓట్లను పొందుతారు. అలాంటి నైపుణ్యం నాకు లేదు. నేను ఏ పార్టీకి మద్దతుగా ఉండను. నా రచనలు అన్నీ పార్టీలకు అతీతంగానే ఉంటాయి. నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తిలేదు. నాకు ఉద్యోగం అంటేనే ఇష్టం. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో నేను సంతోషంగా ఉన్నాను. కాంగ్రెస్ కనీస ఆదాయ పథకంతో ఎన్నో లాభాలున్నాయి. పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారే తీసుకుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి దక్కుతుందని చాలా ఊహాగాలను వస్తున్నాయి. వాటిని నేను ఆపలేను. నేనెక్కడుంటే అక్కడ వాతావరణం సంతోషంగా ఉండేలా చూసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్‌గా రాజన్ సేవలందించిన విషయం తెలిసిందే. రాజన్ పదవీకాలాన్ని పొడిగించడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. విపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా రాజన్నే ఎంపిక చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీస ఆదాయ పథక రూపకల్పన విషయంలో సలహాలు, సూచనలు తీసుకున్న ప్రముఖ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఉన్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వివరణనిచ్చారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. -
అవకాశముంటే.. మళ్లీ వస్తా..
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గానీ గెలిస్తే తాను ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయన్న వార్తలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘ది థర్డ్ పిల్లర్’ పేరిట రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్‌గా రాజన్ సేవలందించారు. రాజన్ పదవీకాలాన్ని పొడిగించడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. విపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా రాజన్నే ఎంపిక చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీస ఆదాయ పథక రూపకల్పన విషయంలో సలహాలు, సూచనలు తీసుకున్న ప్రముఖ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఉన్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వివరణనిచ్చారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, అయితే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సదా సిద్ధమని రాజన్ చెప్పారు. స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి.. ఒకవేళ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు గానీ చేపట్టిన పక్షంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ముఖ్యంగా స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని రాజన్ చెప్పారు. ‘నాతో సహా చాలా మంది ఆర్థికవేత్తలు.. విధానాలపరంగా తీసుకోతగిన చర్యల గురించి రాశారు. అవి పుస్తకరూపంలో రాబోతున్నాయి. ఇక నా విషయానికొస్తే.. నిల్చిపోయిన చాలా ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యేందుకు ఉపయోగపడేలా స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి పెడతాను’అని ఆయన పేర్కొన్నారు. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, సాధ్యమైనంత వేగంగా వాటిని మళ్లీ రుణ వృద్ధి బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అటు వృద్ధికి దోహదపడేలా 2–3 కీలక సంస్కరణలను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తానన్నారు. ‘ఈ సంస్కరణల జాబితాలో వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తగ్గించేందుకు అనుసరించతగిన విధానాలు కచ్చితంగా ఉంటాయి. ఇక రెండోది.. స్థల సమీకరణ సమస్య. రాష్ట్రాల స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడం, ఆయా రాష్ట్రాలు తమకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునేందుకు స్వేచ్ఛనివ్వడం ఇందుకు ఉపయోగపడగలదు. ఇలా స్థల సమీకరణ సమస్యల పరిష్కారం, బ్యాంకుల ప్రక్షాళన, వ్యవసాయాన్ని పునరుద్ధరించేందుకు కీలక విధానాల రూపకల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తాను’ అని రాజన్ చెప్పారు. -
7% వృద్ధి రేటు అనుమానమే!
న్యూఢిల్లీ: భారత్ ఏడు శాతం వృద్ధి రేటు సాధనపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి గణాంకాలపై ఉన్న సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తగిన ఉద్యోగాల కల్పన జరగని పరిస్థితుల్లో 7 శాతం వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గణాంకాల విషయంలో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి నిష్పక్షపాత కమిటీ ఏర్పాటు అవసరమనీ ఆయన సూచించడం గమనార్హం. భారత్ వాస్తవ వృద్ధిని కనుగొనడానికి గణాంకాల మదింపు ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ అవసరం అన్నారు. సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెం బర్ 2016 వరకూ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజన్, తాజాగా ఒక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ∙నాతో ఇటీవల ఒక మంత్రి (పేరు వెల్లడించలేదు) మాట్లాడారు. తగిన ఉపాధి కల్పన లేనప్పుడు మనం ఎలా 7 శాతం వృద్ధి సాధించగలమని ఆయన అడిగారు. ఈ కారణాన్ని చూపిస్తే, మనం ఏడు శాతం వృద్ధిని సాధించే అవకాశం కనపించడం లేదు. ∙వృద్ధి రేట్ల సమీక్ష అనంతరం, ఆయా గణాంకాల పట్ల అనుమానాలు పెరిగాయి. వీటిమీద సందేహాలు తొలగాలి. ఇందుకు సంబంధించి నిష్పాక్షిక కమిటీ ఏర్పడాలి. గణాంకాల పట్ల విశ్వాసం మరింత పెరగాలి. (2018 నవంబర్‌లో కేంద్ర గణాంకాల శాఖ కాంగ్రెస్ హయాంలోని యూపీఏ కాలంలో జీడీపీ వృద్ధిరేట్లను తగ్గించింది. మోదీ పాలనలో గడచిన నాలుగేళ్ల జీడీపీ వృద్ధి రేట్లను యూపీఏ కాలంలో సాధించిన వృద్ధిరేట్లకన్నా ఎక్కువగా సవరించింది). ∙వివాదాస్పద పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్) వంటి తన నిర్ణయాల వల్ల జరిగిన మంచి చెడులను ప్రభుత్వం సమీక్షించి, మున్ముందు ఎటువంటి తప్పులూ జరక్కుండా చూసుకోవాలి. -
కనీస ఆదాయ పధకం సరైందే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : కనీస ఆదాయ హామీ పధకంతో పేదరికంపై మెరుపు దాడులు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ్ పధకంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పధకం స్ఫూర్తి మంచిదే అయినా దేశంలో వాస్తవ ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుంటే ఇంతటి భారీ వ్యయం సాధ్యం కాదని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ పధకం క్షేత్రస్ధాయిలో వృద్ధికి ఊతమిస్తుందని ఆయన అంగీకరించారు. ఈ పధకాన్ని భారత ఆర్థిక వ్యవస్థ ఎంతమేరకు భరిస్తుందనేది ప్రశ్నార్దకమన్నారు. న్యాయ్ పధకానికి ఏటా రూ 3.34 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని, ఇది దేశ బడ్జెట్లో 13 శాతమని ఆయన పేర్కొన్నారు. ఈ స్ధాయిలో నిధులు అవసరం కాగా ప్రభుత్వం వాటిని ఎలా సర్దుబాటు చేస్తుందనేది చూడాలన్నారు. ఇక ప్రస్తుతమున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తూనే ఈ పధకాన్ని చేపట్టడం కష్టసాధ్యమన్నారు. ఈ పధకాన్ని సమర్ధంగా అమలు చేయగలిగితే విప్లవాత్మక ఫలితాలు చేకూరుతాయన్నారు. ప్రజలు సొంతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారన్నారు. దేశంలో ప్రస్తుతం ద్రవ్య లోటును పరిగణనలోకి తీసుకుంటే కనీస ఆదాయ హామీ పధకం సాధ్యం కాదన్నారు. -
హెచ్చార్డీ మంత్రిగా వారుంటేనే మంచిది : ఆర్బీఐ మాజీ గవర్నర్
దావోస్ : భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ విద్యావిధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మనం యువతరాలను మాత్రమే నిర్మించగలుగున్నాం. కానీ, ప్రపంచంతో పోటీ పడేవిధంగా వారిని తయారు చేయలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్‌కు అతి ముఖ్యమైన ‘మానవ వనరుల అభివృద్ధి’ అనే అంశాన్ని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. మానవ వనరుల అభివృధ్ది శాఖ (హెచ్చార్డీ)కు అత్యంత సమర్థులు మంత్రిగా కొనసాగాలని ఆకాక్షించారు. నాణ్యమైన విద్యతోనే భారత యువత అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) లో పాల్గొనేందుకు వచ్చిన రాజన్ ఓ జాతీయ మీడియాతో ఈ విషయాలు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్‌లో భారత్ చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దాటిపోవచ్చు. మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం కంటే మెరుగైన స్థానంలో నిలవొచ్చునని, దేశాల మధ్య ఇలాంటి పోటీ మంచిదే’ అని రాజన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పాటు పనిచేసిన సంగతి తెలిసిందే. -
నిధులు మళ్లిస్తే ఆర్బీఐ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: ఆర్బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి గనక బదిలీ చేస్తే అది కేంద్ర బ్యాంకు రేటింగ్ తగ్గడానికి దారితీస్తుందని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి ప్రస్తుతం ఏఏఏ రేటింగ్ ఉండగా, ఇది తగ్గితే నిధుల వ్యయాల భారం పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. ఆర్బీఐ నుంచి అదనపు నిధుల బదలాయింపు కేంద్రానికి జరిగితే రేటింగ్ తగ్గడానికి దారితీస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘అది ఎంత మొత్తం బదలాయిస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదో అంశం కాదు. ఏదో ఒక సమయంలో మాత్రం ఇది ఓ అంశంగా మారుతుంది. ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ కూడా చర్చల ద్వారా దీనికి ముగింపు పలకాలి. మనది ‘బీఏఏ’ దేశం. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. ఏదో ఒక సమయంలో అంతర్జాతీయ లావాదేవీల నిర్వహణ కోసం అధిక క్రెడిట్ రేటింగ్ అవసరపడుతుంది’’ అని రాజన్ చెప్పారు. ‘మీరు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారా’ అన్న ప్రశ్నకు... ప్రభుత్వానికి మరింత మొత్తం చెల్లించాలన్న ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని బదులిచ్చారు. ‘‘ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న సమయంలో నేను కూడా ఎంత మొత్తం నిధులు కలిగి ఉండాలన్న అంశంపై ఆర్బీఐకి లేఖ రాశాను. ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చాక కమిటీ ఏర్పాటు చేయగా, లాభం మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సరిపడా క్యాపిటల్ మన దగ్గర ఉన్నట్టు చెప్పింది. నేను గవర్నర్‌గా ఉన్న ఆ మూడు సంవత్సరాల్లో ఆర్బీఐ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది. అయితే, లాభాలకు మించి చెల్లించాలన్నది డిమాం డ్. కానీ, అలా చెల్లించరాదని మాలేగామ్ కమిటీ అభిప్రాయపడింది’’ అని రాజన్ వివరించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం ప్రపంచ ఆర్థిక రంగం 2017లో వృద్ధి క్రమంలో ఉంటే, నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) కారణంగా భారత ఆర్థిక వృద్ధి కుంటుపడిందని రాజన్ పేర్కొన్నారు. వృద్ధి తగ్గుముఖం పట్టిందని తిరిగి నిర్ధారించిన అధ్యయనాలను తాను చూసినట్టు చెప్పారు. దీనితోపాటు జీఎస్టీ అమలు ప్రభావం కూడా వృద్ధిపై పడినట్టు అభిప్రాయపడ్డారు. 2017–18లో మన జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో జీఎస్టీ మంచిదేనని, స్వల్ప కాలంలో మాత్రం సమస్యలు ఉంటాయన్నారు. తన హయాంలో నోట్ల రద్దుపై అభిప్రాయాన్ని కోరారని, ఇది చెడ్డ ఆలోచనని చెప్పినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజన్ 2013 నుంచి 2016 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆర్థిక అస్థిరత రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ హెచ్చరిక సింగపూర్: ఆర్బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ హెచ్చరించింది. 2019 జనవరిలో జరిగే ఆర్బీఐ సమావేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఐ స్వతంత్రత సహా పలు అంశాల విషయంలో ప్రభుత్వంతో పొసగక ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ప్రస్తుతం ఆర్బీఐ స్వతంత్రత విషయంలో, ముఖ్యంగా పాలసీ అమలులో ఏ మార్పూ లేదని ఎస్అండ్పీ పేర్కొంది. ఎన్పీఏల గుర్తింపు, రీక్యాపిటలైజేషన్, పరిష్కారం, సంస్కరణలపై సెంట్రల్ బ్యాంకు దృష్టి సారించి ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇది కచ్చితంగా రిస్క్ అని అభిప్రాయపడింది. ‘‘మాజీ గవర్నర్ రాజన్ ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టిన తర్వాత నుంచి, ఆర్బీఐ తీసు కున్న చర్యలు బ్యాంకింగ్ రంగలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాయి’’అని ఎస్అండ్పీ తెలిపింది. -
ఆర్బీఐ స్వతంత్రతను గౌరవించాల్సిందే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు మధ్య రగులుతున్న వివాదంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. రిజర్వ్ బ్యాంక్‌ను కారులోని సీటుబెల్ట్తో పోలుస్తూ... వాహనదారు (కేంద్రం) గానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని కచ్చితంగా గౌరవించాల్సిందేనని, ఉదారంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వం ఒకవేళ ఒత్తిడి తెచ్చినా నిరాకరించేందుకు దానికి పూర్తి స్వేచ్ఛ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దేశానికి కీలకమైన సంస్థను కాపాడటమే బోర్డు ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తప్ప ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేయడం కాదని ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పలు అంశాలపై కేంద్రం, ఆర్బీఐకి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్రీయ బ్యాంకు స్వతంత్రతను గౌరవించకపోతే ప్రభుత్వం.. ఆర్థిక మార్కెట్లు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందంటూ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. దీనికి ప్రతిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీఐపై ప్రభుత్వం కీలకమైన ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో బ్యాంకులు మళ్లీ రుణ కార్యకలాపాలు సజావుగా సాగించేలా కఠినమైన మొండిబాకీల కట్టడి నిబంధనలను సడలించడం తదితర అంశాలపై ఆర్బీఐకి సూచనలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా కేంద్రం, ఆర్బీఐ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీట్ బెల్ట్ లేకుంటే ప్రమాదమే .. ‘ఆర్బీఐ అనేది ఒక సీట్ బెల్ట్ లాంటిది. డ్రైవింగ్ సీట్లో ఉండే డ్రైవర్.. అంటే ప్రభుత్వం ఒకోసారి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవచ్చు. కానీ, దీన్ని పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకోసారి ప్రమాదాలు చాలా తీవ్రంగానూ ఉండొచ్చు‘ అని రాజన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ప్రధానంగా అధిక వృద్ధిపై దృష్టి పెడుతుంటాయని, ఆర్బీఐ మాత్రం ఆర్థిక స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని రాజన్ చెప్పారు. ఈ రెండింటి మధ్య పొంతన కుదరక సాధారణంగానే పలు సందర్భాల్లో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య వివాదాలు రేగుతుంటాయని, తాజాగా కూడా అలాంటి పరిస్థితే తలెత్తిందని చెప్పారు. ‘మరింత ఉదారంగా వ్యవహరించేలా ఆర్బీఐపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. కానీ, ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉండే రిస్కులను కూడా ఆర్బీఐ నిశితంగా పరిశీలించాలి. ఆర్బీఐకి ఆర్థిక స్థిరత్వ సాధన అనేది ఒక బాధ్యత. కాబట్టి నో చెప్పే అధికారం కూడా ఉంటుంది. అలాగని ఆర్బీఐ ఏదో ఊసుపోక నో చెప్పదు. పరిస్థితులన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఆర్థిక అస్థిరతకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని భావించిన పక్షంలోనే తిరస్కరిస్తుంది. ప్రభుత్వం, ఆర్బీఐకి మధ్య ఇలాంటివి కొత్తేమీ కాదు. ప్రభుత్వం అనేక మార్లు దీన్ని పరిశీలించండి.. దాన్ని పరిగణనలోకి తీసుకోండి అంటూ ఆర్బీఐని కోరుతూనే ఉండొచ్చు. కానీ అంతిమంగా ఆర్థిక స్థిరత్వ నియంత్రణ సంస్థగా ఆ బాధ్యతలు మీవే కాబట్టి, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం అంటూ ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వమే ఒకింత వెనక్కి తగ్గొచ్చు‘ అని రాజన్ పేర్కొన్నారు. ‘డిప్యూటీ గవర్నర్లు, గవర్నర్లను నియమించుకున్నప్పుడు ప్రభుత్వం వారి మాట వినాలి. వారిని నియమించుకున్నదే అందుకు కదా. వారు మీకు సేఫ్టీ బెల్ట్ లాంటి వాళ్లు‘ అని రాజన్ చెప్పారు. నవంబర్ 19న ఆర్బీఐ బోర్డు సమావేశం కానుంది. ద్రవ్యోల్బణం మెరుగు.. ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణ పరిస్థితి చాలా మెరుగ్గానే ఉందని, ఇందుకు ప్రభుత్వం, ఆర్బీఐని అభినందించవచ్చని రాజన్ చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత వృద్ధి రేటు అత్యధికంగా ఉంటోందని, అయితే.. ఉద్యోగాల కల్పనపై మరింత కసరత్తు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ‘ద్రవ్యలోటు విషయాన్ని తీసుకుంటే.. కేంద్ర ప్రభుత్వ లోటు తగ్గుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలది పెరుగుతోంది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా స్థూలంగా ద్రవ్య లోటు పరిస్థితులు మెరుగవడం కన్నా.. మరింత దిగజారాయి‘ అని రాజన్ పేర్కొన్నారు. ఇక బలహీన ఎగుమతులు, భారీ ముడి చమురు ధరల కారణంగా కరెంటు అకౌంటు లోటు కూడా పెరుగుతోందని ఆయన చెప్పారు. చమురు రేట్లు ఇటీవల కాస్త తగ్గినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్పరమైన రిస్కులను పక్కన పెట్టలేమన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రభుత్వం ప్రయోగించిందన్న అంశంపై స్పందిస్తూ.. రెండు పక్షాలు.. ఒకరి అభిప్రాయాలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలని రాజన్ చెప్పారు. ప్రభుత్వ అభిప్రాయాలను ఆర్బీఐ వింటూనే ఉంటుందని, కానీ అంతిమంగా తన బాధ్యతరీ త్యా జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఆర్బీఐ బోర్డు ప్రధాన లక్ష్యం సంస్థను పరిరక్షించడమే. ఇతరుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం కాదు. ఆర్బీఐ ఒకవైపు సంస్థను పరిరక్షిస్తూనే మరోవైపు విస్తృతమైన, సముచితమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బోర్డు లక్ష్యం రాహుల్ ద్రావిడ్ తరహాలో వివేకవంతంగా, ఆలోచనాన్వితంగా వ్యవహరించేట్లు ఉండాలి. నవజోత్ సిద్ధూలా దూకుడుగా కాదు. (తప్పుగా అనుకోవద్దు.. సిద్ధూని నేను ఎంతగానో గౌరవిస్తాను)‘ అని రాజన్ పేర్కొన్నారు. లిక్విడిటీ సమస్యలపై ఆర్బీఐ దృష్టి పెట్టాలి.. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటుండటంపై మాట్లాడుతూ.. లిక్విడిటీ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజన్ చెప్పారు. వ్యవస్థలో తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా చూడటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ‘మార్కెట్లలో కొంత ఆందోళన నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. అయితే, మొత్తం అసెట్స్‌లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 17 –18% మాత్రమే కనుక.. ఇది పరిష్కరించలేనంత పెద్ద సమస్యేమీ కాదని నా అభిప్రాయం. కాకపోతే నిధుల కొరత, దివాలా సమస్యలను కాస్త జాగ్రత్తగా పరిశీలించి చూడాలి‘ అని రాజన్ పేర్కొన్నారు. ‘ఒకవేళ దివాలా పరిస్థితే ఉంటే.. ప్రైవేట్ నిర్వహణలో ఉన్న ఆయా సంస్థలు.. గట్టెక్కించాలంటూ వెంటనే ప్రభుత్వం దగ్గరకు పరిగెత్తుకెళ్లడం కాకుండా ముందు తమ సామర్ధ్యం మేరకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేయాలి. తను జోక్యం చేసుకోవాలా లేదా అని ప్రభుత్వం ఆలోచించడానికి ముందే.. తమంతట తామే సమస్య నుంచి బైటపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్న భరోసా ఆయా సంస్థలు కల్పించగలగాలి‘ అని రాజన్ పేర్కొన్నారు. -
రాజన్ సూచనలు శిరోధార్యం
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే అలవాటున్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరో సారి కుండబద్దలు కొట్టారు. బ్యాంకుల మొండి బకాయిలకు మూలాలు ప్రభుత్వ నిర్ణయాల్లో, తీరు తెన్నుల్లో ఉన్నాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక సహజంగానే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీకి రాజన్ ఇచ్చిన నోట్‌ను తమకనుకూలంగా మలచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. అత్యధిక శాతం మొండి బకాయిలకు 2006–08 మధ్యనే బీజం పడిందని నివేదికలో ఆయనన్న మాటలను ఆసరా చేసుకుని కాంగ్రెస్‌పై బీజేపీ దాడి ప్రారంభించగా... కొంపముంచే ఆస్కారమున్న ఎగవేతదార్ల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంఓ) పంపానని ఆయన చెప్పడాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపింది. ఆ జాబితాపై మోదీ సర్కారు దృష్టి పెట్టి ఉంటే ఎగవేతదార్లు దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని ఆ పార్టీ అంటోంది. ఆ రెండు పార్టీలూ ఇలా పరస్పర విమర్శలకు దిగడంలో వింతేమీ లేదు. అయితే రఘురాం రాజన్ చెప్పిన అంశాలు అనేకం ఉన్నాయి. పాలనా వ్యవస్థలో నిర్ణయ ప్రక్రియ మంద గిస్తున్న వైనం అందులో ప్రధానమైనది. అలాగే వివిధ బ్యాంకుల చీఫ్‌లు రిటైరైన చాన్నాళ్లకుగానీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవటాన్ని, తిరిగొస్తాయో రావో తెలియకుండా రుణ మేళాలు నిర్వహిస్తున్న తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇవి గత యూపీఏ ప్రభుత్వానికీ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికీ కూడా సమంగా వర్తిస్తాయి. బొగ్గు గనుల కేటాయింపులో లేదా మరే ఇతరచోట్లనో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోతోంది. ఆరోపణల అతీగతీ తేలడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంటే, కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వివిధ శాఖలు జంకుతున్నాయి. ఆ నిర్ణ యాలపై కూడా భవిష్యత్తులో ఆరోపణలు వెల్లువెత్తి దర్యాప్తు మొదలుపెడితే చిక్కుల్లో పడతామన్న భయాందో ళనలు నిర్ణయరాహిత్యానికి దారితీస్తున్నాయి. పర్యవసానంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడిక క్కడ ఆగిపోతు న్నాయి. ఉత్పాదన ప్రారంభం కాకపోవడంతో తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీలు కూడా చెల్లించ లేని స్థితి ఏర్పడుతోంది. ఫలితంగా అప్పులిచ్చిన బ్యాంకులు కుదేలవుతున్నాయి. ఇది ఒక పార్శ్వం కాగా, మరొకటి బ్యాంకుల సోమరితనం. తమను రుణం అడుగుతున్న సంస్థ పని తీరు, అది ప్రతిపా దిస్తున్న ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, మార్కెట్లో దానికుండే విజయావకాశాలు సొంతంగా మదింపు వేసుకోకుండా ఆ సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరించే బ్యాంకు ఇస్తున్న నివేదికను విశ్వసించి రుణాలి వ్వడానికి ఉబలాటపడుతున్నాయి. ముందూ మునుపూ ఆ సంస్థ వైఫల్యం చెందితే రుణం వసూలు కాక లబోదిబో మంటున్నాయి. రఘురామ్ రాజన్ 2006–08 కాలాన్ని ప్రస్తావించి చెప్పారుగానీ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరుల ఉదంతాలు గమనిస్తే అవి అనంతరకాలం కూడా కొనసా గాయని అర్ధమవుతుంది. కేవలం బ్యాంకుల అసమర్ధతే ఇందుకు కారణమని చెప్పటం అర్ధసత్యమే అవుతుంది. బ్యాంకుల్లో కీలక స్థానాల్లో ఉన్నవారి అవినీతి కూడా ఇందుకు దోహదపడుతోంది. సాధా రణ పౌరులు రుణం కోసం వెళ్లినప్పుడు సవాలక్ష ప్రశ్నలు వేసి, ఇచ్చే రుణానికి రకరకాల హామీలు కోరే బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తల ముందు మాత్రం మోకరిల్లుతాయి. అప్పు తీసుకున్న సంస్థ తిరిగి చెల్లిస్తున్నట్టు రికార్డుల్లో కనిపించటం కోసం వాటికి తిరిగి అప్పులిచ్చి జమ రాసుకుంటున్నారు. ఇదంతా ఎప్పటికో బద్దలయ్యాక అందరూ చేతులెత్తేస్తున్నారు. చివరకు పాలనాపరంగా తమ అస మర్ధత ఎక్కడ బయటపడుతుందో నన్న భయంతో ప్రభుత్వాలు బ్యాంకులకు వేలాది కోట్ల రూపా యలు తరలించి గండం నుంచి గట్టెక్కుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల్లో వృత్తిగత నిపుణులు లేకపోవడాన్ని, వాటి సారథులు రిటైరై నప్పుడు వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడాన్ని కూడా రాజన్ ప్రస్తావించారు. ఈ రెండు సమస్యలూ కూడా కీలకమైనవి. అధికారంలో ఉండేవారు తమకనుకూలమైనవారితో బోర్డుల్ని నింపేస్తున్నాయి. ఫలితంగా బ్యాంకుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోంది. అసంబద్ధ నిర్ణ యాలు బ్యాంకుల్ని ముంచేస్తున్నాయి. ఎగవేతదార్లకు రాజకీయ నేతలతో ఉండే పరిచయాల వల్ల వారికి సులభంగా కొత్త రుణాలు వస్తున్నాయి. బోర్డులు పటిష్టంగా ఉంటే ఈ బాపతువారి ఆట కడుతుంది. 2014లో రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా బ్యాంకింగ్ రంగ నిపు ణుడు పీజే నాయక్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డుల గురించి అది విలువైన సూచ నలు చేసింది. షేర్ హోల్డర్లు ఎన్నుకునే ఇండిపెండెంట్ డైరెక్టర్లు బోర్డులో ఉండాలని సూచించింది. వారిని ప్రభుత్వమే నియమించే ప్రస్తుత విధానాన్ని రద్దు చేయాలని కోరింది. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతానికి మించరాదన్న దాని సిఫార్సు జాతీయ బ్యాంకుల పరోక్ష ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్న విమర్శలొచ్చినా బోర్డుల్లో వృత్తిరంగ నిపుణులుండాలని, నిర్ణయాలకు వారిని బాధ్యుల్ని చేయాలని నాయక్ కమిటీ చేసిన సిఫార్సు విలువైనది. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఆ కమిటీ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక బ్యాంకు సార థులుగా ఉండేవారి రిటైర్మెంట్ ఎప్పుడో ప్రభుత్వానికి అవగాహన ఉంటుంది. కనుక చాలా ముందుగానే వారి వారసుల్ని నిర్ణయించవచ్చు. ఇందులో ఎంతో జాప్యం చోటుచేసుకుంటోంది. ఫలితంగా పాలన కుంటుపడుతోంది. కీలక నిర్ణయాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితి మరెంతకాలమో కొనసాగరాదన్న రాజన్ సూచన గమనించదగ్గది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ నిక్కచ్చిగా మాట్లాడే రాజన్‌ను మొండి బకా యిలపై అభిప్రాయాలు కోరడం మంచిదైంది. ఆయన చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసు కుంటే మన బ్యాంకుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అంతేతప్ప రాజకీయ పక్షాల పరస్పర విమర్శల వల్ల దేశానికి ఒరిగేది శూన్యం. -
అతి విశ్వాసమే మొండిబాకీలకు కారణం
న్యూఢిల్లీ: బ్యాంకర్లు అతినమ్మకంతో వ్యవహరించడం, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మందగించడంతో పాటు ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావడమే మొండిబాకీలు(ఎన్పీఏ) పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మురళీ మనోహర్ జోషి సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీకి పంపిన నోట్లో ఈ మేరకు వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులు మొదలైన వాటిపై అనుమానాలు, విచారణనెదుర్కొనాల్సి రావొచ్చన్న భయాలతో.. అప్పట్లో యూపీఏ, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాల్లో నిర్ణయాల ప్రక్రియ మందగించిందని రాజన్ పేర్కొన్నారు.ఫలితంగా ప్రాజెక్టులు నిల్చిపోయి వాటి వ్యయాలు పెరిగిపోవడం, రుణాలపై వడ్డీలు చెల్లించలేని పరిస్థితి తలెత్తిందన్నారు. దేశంలో విద్యుత్ కొరత నెలకొన్నప్పటికీ పలు విద్యుత్ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటం.. ప్రభుత్వ నిర్ణయాల ప్రక్రియ ఇప్పటికీ వేగం అందుకోలేదనడానికి నిదర్శనమన్నారు. రాజన్ 2016 సెప్టెంబర్ దాకా మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సేవలందించారు. మొండిబాకీల సమస్యను ముందుగా గుర్తించి, పరిష్కార ప్రయత్నాలు చేశారంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆయన్ను ప్రశంసించిన నేపథ్యంలో ఎన్పీఏల అంశాన్ని సంక్షిప్తంగా వివరించాలంటూ రాజన్‌ను పార్లమెంటరీ కమిటీ కోరింది. దీని ప్రకారమే ఆయన తాజా నోట్ రూపొందించారు. 2006–08లో బీజం.. చాలామటుకు మొండిబాకీలకు 2006–08 మధ్య కాలంలో బీజం పడిందని ఆయన చెప్పారు. అప్పట్లో విద్యుత్ ప్లాంట్ల వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులు సకాలంలో, నిర్దేశిత బడ్జెట్లో పూర్తయిపోవడం.. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం తదితర సానుకూల ధోరణులతో బ్యాంకులు అత్యంత ఆశావాదంతో వ్యవహరించి రుణాలిచ్చేశాయని ఆయన పేర్కొన్నారు. ‘బ్యాంకులు ఇలాంటి సందర్భాల్లోనే తప్పులు చేస్తుంటాయి. గత కాలపు వృద్ధిని, పనితీరును భవిష్యత్‌కు కూడా అన్వయించుకుని .. ప్రమోటర్ల వాటా తక్కువ ఉన్న ప్రాజెక్టులకు కూడా భారీగా రుణాలిచ్చేందుకు సిద్ధమవుతుంటాయి. సొంతంగా తాము ప్రాజెక్టులను మదింపు చేయకుండా.. ప్రమోటర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నివేదిక ఆధారంగా కూడా కొన్నిసార్లు బ్యాంకులు రుణాలిచ్చాయి. మీకు ఎంత కావాలో చెప్పండి రుణమిస్తాం అంటూ బ్యాంకులు తన వెంట పడుతున్నాయంటూ ఒక ప్రమోటర్ స్వయంగా నాతో చెప్పడం దీనికి ఉదాహరణ‘ అని రాజన్ పేర్కొన్నారు. అయితే, చారిత్రకంగా చూస్తే ఆ స్థాయి వృద్ధి దశలో ఉన్న చాలామటుకు దేశాల్లో ఇలాంటి అసంబద్ధ ధోరణులు సర్వసాధారణమేనని ఆయన వివరించారు. ఎన్పీఏ సమస్యకు కొంత అవినీతి కూడా కారణమై ఉండొచ్చని రాజన్ చెప్పారు. అయితే అతివిశ్వాసం, చేతగానితనం, అవినీతి అన్నింటినీ వేర్వేరుగా చూసి.. ప్రత్యేకంగా ఇదే కారణమని చెప్పలేమని పేర్కొన్నారు. ‘ఈ బాకీల్లో కొన్నింటికి సంబంధించి బ్యాంకర్లు అతివిశ్వాసంతో వ్యవహరించారని, స్వతంత్రంగా మదింపు చేయలేదన్నది సుస్పష్టం. ఇందుకోసం ఎస్బీఐ క్యాప్స్, ఐడీబీఐ బ్యాంక్ వంటి వాటిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇలా కీలకమైన విశ్లేషణలను అవుట్సోర్సింగ్ చేయడమనేది వ్యవస్థాగతమైన బలహీనతే. దీనివల్ల వర్గాలు ప్రభావితం చేసే అవకాశాలు పెరుగుతాయి‘ అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటివి తలెత్తకూడదంటే.. ఎన్పీఏల సమస్య మళ్లీ తలెత్తకూడదంటే.. తీసుకోతగిన చర్యలు కొన్నింటిని రాజన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) గవర్నెన్స్‌ను, ప్రాజెక్టుల మదింపు ప్రక్రియను మెరుగుపర్చాలని, ఎప్పటికప్పుడు ఆయా రుణాలను పర్యవేక్షిస్తుండాలని పేర్కొన్నారు. అలాగే పీఎస్‌బీలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడం, రికవరీ ప్రక్రియను పటిష్టపర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీఎంవోకు ఫ్రాడ్ కేసుల లిస్టు.. ఎన్పీఏలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాల పరిమాణం భారీగా పెరుగుతోందని రాజన్ పేర్కొన్నారు. ఫ్రాడ్ కేసుల విషయంలో బ్యాంకులు, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం కోసం తన హయాంలో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ఒకరిద్దరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హై ప్రొఫైల్ కేసుల జాబితాను ప్రధాని కార్యాలయానికి (పీఎంవో)కి కూడా పంపినట్లు ఆయన వివరించారు. అయితే, ఈ విషయంలో ఏదైనా పురోగతి ఉందా లేదా అన్నది తనకు తెలియదని, దీనిపై సత్వరం దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఉందని రాజన్ చెప్పారు. పీఎస్బీల్లో ఆర్బీఐ నామినీ ఉన్నంత మాత్రాన అవి పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ అజమాయిషీలోనే ఉందనుకోవడం అపోహేనని ఆయన పేర్కొన్నారు. కేవలం నిబంధనలకు అనుగుణంగా ఆయా బ్యాంకులు ప్రక్రియలు పాటిస్తున్నాయా లేదా అన్నది మాత్రమే నామినీలు చూస్తారే తప్ప.. వాణిజ్య రుణాల వ్యవహారాల్లో వారికి పెద్దగా అనుభవమేమీ ఉండదని రాజన్ తెలిపారు. -
రాజన్‌పై మరోసారి ఆరోపణల వెల్లువ
న్యూఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అందరికి సుపరిచితమే. ఆయన పనితీరుపై ఓ వైపు నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. మరోవైపు భేష్ అన్నవారు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రెండో సారి రాజన్‌ను కొనసాగించాలని మద్దతు కూడా తెలిపారు. కానీ రాజన్ ముక్కుసూటితనం, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు రెండో సారి ఆయనకు ఆర్బీఐ గవర్నర్ పదవి వరించకుండా పోయింది. తాజాగా రఘురామ్ రాజన్ మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృద్ధి రేటు పడిపోవడానికి కారణం రాజన్ అప్పట్లో తీసుకొచ్చిన విధానాలేనని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆరోపించారు. బ్యాంకింగ్ రంగంలోని ఎన్పీఏలు పెరగడంతో, వృద్ధి రేటు పడిపోయిందని కుమార్ అన్నారు. 2015 చివరి క్వార్టర్ నుంచి 2016 వరకు వృద్ధి రేటు క్షీణించిందని చెప్పారు. దీనికి గల కారణం రఘురామ్ రాజన్ అనుసరించిన విధానాలేనని, పెద్ద నోట్ల రద్దు కాదని వ్యాఖ్యానించారు. ఎన్పీఏలను గుర్తించడానికి ఆర్బీఐ కొత్త మెకానిజం తీసుకొచ్చిందని, ఆ మెకానిజంతో మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్పీఏలు 4 లక్షల కోట్ల రూపాయలుంటే, 2017 మధ్యకు ఇవి రూ.10.5 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్ని కేసుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమ క్రెడిట్ కూడా కిందకి పడిపోయిందన్నారు. కొన్నేళ్లలో నెగిటివ్ వృద్ధి కూడా నమోదైందని తెలిపారు. అయితే వృద్ది రేటు నెమ్మదించడానికి, పెద్ద నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదని కుమార్ తేల్చేశారు. ఇక స్థూల తరహా పరిశ్రమ తీసుకున్నా.. వృద్ధి రేటు ఒక శాతం మేర పడిపోయిందని, కొన్ని నెలలు రెండున్నర శాతం తగ్గిందని, మరికొన్ని త్రైమాసికాలు నెగిటివ్ కూడా నమోదైందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రిపోర్టుపై స్పందిస్తూ... డిమానిటైజేషన్‌ను బ్లాక్‌మనీ, బినామీ లావాదేవీలను నిర్మూలించడానికి తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. -
ఆందోళనకర స్థాయిలో పతనం కాలేదు
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ ఆందోళనకరమైన స్థాయిలో పడిపోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్)పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. ఈ పరిమాణం పెరిగిన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. జూలైలో భారత్ వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) ఐదేళ్ల గరిష్ట స్థాయి 18 బిలియన్ డాలర్లకు చేరడం, దీనితో క్యాడ్‌పై నెలకొన్న భయాల నేపథ్యంలో రాజన్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం–ద్రవ్యలోటు కట్టడిలోనే ఉం ది. సమస్య క్యాడ్‌తోనే. చమురు అధిక ధరల ప్రతికూలత క్యాడ్‌పై పడుతోంది. దీనికి దేశం అధిక డాలర్ల బిల్లును వెచ్చించాల్సి వస్తోంది. ♦ ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాల వంటి కీలక స్థూల ఆర్థిక అంశాలపై ప్రతిదేశం సారించాల్సిన సమయం ఇది. ♦ ఇక ఎన్నికల సమయం అయినందున భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ప్రభుత్వ వ్యయాలు గాడితప్పకుండా చర్యలు తీసుకోవాలి. ♦ భారత్ వృద్ధి గణాంకాలను వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. వృద్ధి 7.5% స్థాయిలో ఉంటుందన్నది నా అభిప్రాయం. ♦ ఇక బ్యాంకింగ్ మొండి బకాయిల సమస్య తీవ్రమైనది. దీని పరిష్కార దిశలో బ్యాంకింగ్ పాలనా యంత్రాంగాల మెరుగుదల కీలకం. ♦ అధిక చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత కారణంగా భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతానికి విస్తరిస్తుందని అంచనా. 2017–18లో ఇది 1.5 శాతం. ♦ రూపాయి ఇప్పటికీ అధిక విలువలో ఉందని, డాలర్‌తో పోలిస్తే 70–71 స్థాయి రూపాయికి తగిన విలువనేది విశ్లేషకుల వాదన. -
వాణిజ్య ఘర్షణలతో ప్రపంచ వృద్ధికి దెబ్బ
న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణలతో రెండు విధాల నష్టపోవాల్సి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. పరిస్థితి వేగంగా చేజారిపోతే అది ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగిస్తుందన్నారు. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై ట్రంప్ సర్కారు భారీ టారిఫ్‌లు వేయడంతో ఆ దేశానికి చైనా, తదితర దేశాలతో వాణిజ్య వివాదానికి దారితీసిన విషయం విదితమే. ‘‘ఈ సమయంలో అతి పెద్ద రిస్క్... పెరిగిపోతున్న వడ్డీరేట్లతోపాటు వాణి జ్యంపై అవాంఛనీయ పరిస్థితులే. వచ్చే కొన్ని నెలల్లో వాణిజ్య వివాదాలు దావానలంలా మారితే కచ్చితంగా అది ప్రపంచ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుంది. కీలకమైన ప్రశ్న ఏంటంటే... ఈ బేరసారాలు, టారిఫ్‌ల హెచ్చరికలు వాస్తవ చర్చలకు దారితీసి ఇరువురికీ లాభదాయకంగా మారతాయా అన్నదే? లేక ఎవరికి వారు తమ స్థాయిలకే పరిమితమై తలుపులు మూసేసుకుని, హెచ్చరికలనే కొనసాగిస్తే అది ఇరువైపులా నష్టపోవాల్సిన పరిస్థితికి దారితీస్తుంది’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. -
నేను ఆ రేసులో లేను
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని తాను భావించడంలేదని రాజన్ స్పష్టం చేశారు. షికాగో యూనివర్శిటీ ఉద్యోగంలో చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అంతేకాదు వాస్తవానికి తాను ప్రొఫెషనల్ సెంట్రల్ బ్యాంకర్ని కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్ పేరు ఇటీవల వార్తల్లో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని నివేదికలు వెలువడ్డాయి. బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనున్న ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న రఘురామ్ రాజన్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. -
మరోసారి వార్తల్లో రాజన్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గుర్తున్నారా? ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ అందించిన సమాచారం ప్రకారం బీఓఈ గవర్నర్ పదవి రేసులో రాజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చికాగోకి చెందిన ఎకనామిస్ట్ , రఘురామ్ రాజన్ టాప్‌లిస్ట్‌లో ఉన్నారని నివేదించింది. ఆర్బీఐ గవర్నర్‌గా తనదైన ముద్ర వేసుకున్న రఘురామ్ రాజన్ బ్రెక్సిట్ కోసం దేశం సిద్ధపడుతున్న సమయంలో ప్రతిష్టాత్మక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ రేసులో..అదీ టాప్‌లో వుండటం విశేషం. ప్రస్తుతం బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న రఘురామ్ రాజన్ పేరు పరిశీలనలో ఉందిట. ఈ పదవిని చేపట్టటానికి అవసరమైన ప్రాసెస్ ను ప్రారంభించినట్లు యూకే ఛాన్సెలర్ ఫిలిఫ్ హమోండ్ తెలిపారని ఎఫ్టీ రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఈ లిస్ట్ లో భారత్ కు చెందిన మరో వ్యక్తి స్రితి వదేరా పేరు కూడా ఉంది. -
ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది
-
నోట్ల రద్దు చెత్త ఆలోచన!
న్యూయార్క్: మోదీ సర్కారు 2016 నవంబర్‌లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నిర్ణయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అది మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. అంతేకాకుండా వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రక్రియను తగిన ప్రణాళిక లేకుండా చేపట్టారని కూడా ఆయన కుండ బద్దలుకొట్టారు. విఖ్యాత హార్వర్డ్ కెనడీ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని అమలు చేసేముందు ప్రభుత్వం ఆర్బీఐని సంప్రదించలేదన్న వాదనలను రాజన్ తోసిపుచ్చారు. 2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా మళ్లీ రూ.2,000, రూ.500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టారు. తర్వాత రూ.200 నోటును కూడా తీసుకొచ్చారు. అయితే, తగినన్ని నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లుపడ్డారు. రాజన్ హయాంలోనే నోట్ల రద్దుపై ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టినప్పటికీ, 2016 సెప్టెంబర్‌లో ఆయన పదవీకాలం పూర్తయ్యాక ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో దీన్ని అమలు చేసింది. అప్పట్లో తాను రెండోసారి గవర్నర్‌గా కొనసాగాలని భావించినా ప్రభుత్వం మొగ్గుచూపలేదని కూడా రాజన్ చెప్పడం తెలిసిందే. నోట్ల రద్దు ఇతరత్రా అంశాల్లో మోదీ సర్కారుతో తలెత్తిన విభేదాలే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం రాజన్ షికాగో యూనివర్సిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా తన పాత విధుల్లో కొనసాగుతున్నారు. తగినన్ని నోట్లు సిద్ధం కాకుండానే... ‘వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన నోట్లను రద్దు చేయాలంటే ముందుగా దానికి తగ్గట్టుగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడాలి. ఏ ఆర్థికవేత్త అయినా ఇదే చెబుతారు. అయితే, భారత ప్రభుత్వం ఇలాంటి కసరత్తును పూర్తిగా చేయకుండానే ఆదరాబాదరాగా డీమోనిటైజేషన్ను ప్రకటించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నిర్ణయంతో ప్రజలు నల్ల ధనాన్ని నేలమాళిగల్లోంచి బయటకు తెచ్చేసి, లెంపలేసుకొని పన్నులు కట్టేస్తారనేది ప్రభుత్వం ఆలోచన. అయితే, ఇది అవివేకమైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు కొత్త వ్యవస్థలకు వేగంగా అలవాటుపడిపోయి, కొత్త దారులు వెతుక్కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. రద్దు చేసిన నోట్లకు సమానమైన మొత్తం వ్యవస్థలోకి మళ్లీ తిరిగివచ్చేసిందంటే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని చేపట్టిందో అది నెరవేరనట్టే లెక్క. ప్రత్యక్షంగా దీని ప్రభావంలేదని తేటతెల్లమైంది. కరెన్సీకి కటకటతో ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ఒకెత్తు అయితే, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో అసంఘటిత రంగంలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి. ప్రధానంగా పన్నుల వసూళ్లపై ప్రభుత్వం గనుక సీరియస్‌గా దృష్టిసారిస్తే... ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. ఇది నెరవేరిందని బలంగా నిరూపితం అయితేనే సానుకూల ప్రభావం ఉన్నట్లు లెక్క. నా వరకూ అయితే, ఆ సమయంలో నోట్ల రద్దు అనేది నిరుపయోగమని భావించా’ అని రాజన్ వివరించారు. జీఎస్టీ మంచిదే, కానీ... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను మెరుగ్గా అమలు చేయగలిగితే భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని రాజన్ వ్యాఖ్యానించారు. ‘ఇదేమీ సరిదిద్దలేనంత పెద్ద సమస్య కాదు. అయితే, మరింతగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీపై నాకు ఇంకా విశ్వాసం ఉంది’ అని పేర్కొన్నారు. -
రాజన్... ‘క్రియా’ యూనివర్సిటీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొందరు కార్పొరేట్లతో కలిసి యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీరిలో జేఎస్‌డబ్లు్య గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రానున్న ఈ యూనివర్సిటీకి ‘క్రియా’ అని పేరు పెట్టారు. క్రియా యూనివర్సిటీకి తొలుత రూ.750 కోట్ల నిధులు సమకూరతాయని ఇండస్ఇండ్ బ్యాంక్ చైర్మన్, యూనివర్సిటీ సూపర్వైజరీ బోర్డు చైర్మన్ ఆర్.శేషసాయి ముంబైలో తెలిపారు. దాతృత్వంలో భాగంగా కార్పొరేట్లు ఈ యూనివర్సిటీకి ఖర్చు చేస్తారన్నారు. యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారుగా రఘురామ్ రాజన్ వ్యవహరిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ సబ్జెక్టును రాజన్ బోధిస్తున్న సంగతి తెలిసిందే. క్లాసులు 2019 నుంచి..: యూనివర్సిటీలో 2019 జూలై నుంచి తొలి బ్యాచ్ ప్రారంభమవుతుంది. హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.7–8 లక్షలు ఉండనుంది. లిబరల్ ఆర్ట్స్, సైన్సెస్‌లో బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తారు. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లుంటాయి. తాత్కాలికంగా శ్రీసిటీలోని ఐఎఫ్ఎంఆర్ క్యాంపస్‌లో క్లాసులు ప్రారంభిస్తారు. తర్వాత సొంత భవనంలోకి మారుస్తారు. 200 ఎకరాల్లో నిర్మించే క్రియా యూనివర్సిటీ సొంత భవనం 2020 నాటికి సిద్ధమవుతుంది. ప్రపంచ అభివృద్ధిలో పాలుపంచుకునే నవతరం భారతీయులను ఇక్కడ తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అందుబాటులో లేని, భవిష్యత్‌కు అవసరమైన విద్యావిధానం తీసుకొస్తామని చెప్పారు. కాగా, జిందాల్, మహీంద్రాలు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. పద్మభూషణ్ నారాయణన్ వఘుల్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. విద్యావేత్త సుందర్ రామస్వామి వైస్ చాన్స్‌లర్‌గా ఉంటారు. యూనివర్సిటీ ప్రకటన సందర్భంగా రాజన్, ఆనంద్ మహీంద్రా, సజ్జన్ జిందాల్ తదితరులు -
ప్రపంచ ఆర్థిక రికవరీకి అడ్డు: రాజన్
కోచి/న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటే అది ప్రపంచ ఆర్థిక రంగ రికవరీకి విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘‘ఈ విషయంలో ఆందోళన కలిగించే ఎన్నో అంశాలున్నాయి. దీన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం’’ అని రాజన్ పేర్కొన్నారు. అయితే, ఒక దేశం చర్యకు, మరో దేశం ప్రతిస్పందించే విధానం నుంచి బయటపడతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వాణిజ్య యుద్ధం అనే పదాన్ని వినియోగించడం ఇష్టం లేదు. ఎందుకుంటే వారు ఇంకా ఆ దశలో లేరు. అయితే, ఈ విధమైన చర్యలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక రంగ రికవరీకి హాని కలుగుతుంది. అమెరికా పూర్తి బలంగా ఉండి, ఉద్యోగాలు తగినన్ని ఉన్న తరుణంలో ఈ విధంగా చేయడం సరికాదని భావిస్తున్నా’’ అని రాజన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఏకపక్షంగా చర్యలు తీసుకుంటే స్పందిస్తాం: ప్రభు అమెరికా రక్షణాత్మక చర్యలతో ప్రపంచం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎగుమతుల పెంపునకు మార్గాలను అన్వేషించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. చైనా సహా తన వాణిజ్య భాగస్వాములకు వ్యతిరేకంగా అమెరికా కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ‘‘నిబంధనలకు లోబడి, పారదర్శక, భాగస్వామ్య వాణిజ్య విధానాన్ని భారత్ బలంగా విశ్వసిస్తుంది. ఒకవేళ ఏ దేశమైనా ఏకపక్షంగా చర్యలకు దిగితే దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తగు రీతిలో ఎదుర్కొంటాం’’అని ప్రభు స్పష్టం చేశారు. ఎగుమతుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త మార్కెట్లు, కొత్త ఉత్పత్తులకు అవకాశాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. భారత్ చొరవ చూపాలి: ఫిక్కి ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు ఆవరిస్తుండటంతో వాటిని తగ్గించేందుకు భారత్ చురుకైన పాత్ర పోషించాలని ఫిక్కి కోరింది. ప్రపంచ వాణిజ్య ప్రగతిని అవి దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విధానాలు వాణిజ్య ఘర్షణకు తెరతీసిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) విధానాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఓ ముఖ్య దేశంగా భారత్‌కు ప్రపంచ దేశాల్లో ఆమోదం పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీవో బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించింది. -
అందుకే ట్విటర్లో ఆబ్సెంట్
కొచ్చి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు 2012 జనవరి నుంచి ట్విటర్ యాక్టివ్ అకౌంట్ ఉంది. కానీ ఈ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్‌కు మాత్రం ఇప్పటి వరకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ లేదట. అయితే తాను ఎందుకు ట్విటర్ అకౌంట్లో ఆబ్సెంట్గా ఉన్నారో రాజన్ వివరించారు. ‘నాకు సమయం లేదు. ఒకవేళ దానిలో ఎంగేజ్ అవ్వాలనుకుంటే, నిరంతరం దానిలో ఉనికిలో ఉండాలనేది నా అభిప్రాయం. వెంటనే ఆలోచించే సామర్థ్యం నాలో లేదు. 20 నుంచి 30 సెకన్లలో 140 క్యారెక్టర్ ట్వీట్ ద్వారా నేను స్పందించలేను’ అని రాజన్ చెప్పారు. కొచ్చిలో జరుగుతున్న ఫ్యూచర్ గ్లోబల్ డిజిటల్ సమిట్ సందర్భంగా రాజన్ ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం రాజన్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యూచర్ డిజిటల్ సమిట్‌లో ఆయన కీలక స్పీకర్. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దీన్ని ప్రారంభించారు. ఇన్ఫోనిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, సిస్కో హరీష్ కృష్ణన్, హార్వడ్ యూనివర్సిటీ గీతా గోపినాథ్ వంటి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. -
రాజకీయాల్లోకి రావడంపై రాజన్ క్లారిటీ
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రతిపాదనేమీ లేదని తేల్చిచెప్పారు. ప్రొఫెసర్‌గా తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫు నుంచి రాజన్‌ను రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రొఫెసర్‌గా తానెంతో సంతోషంగా ఉన్నానని, రోజుకు చాలా గంటలు పనిచేసే బ్రెయిన్ తనకు ఉందని, నేనే ఇష్టపడే ఉద్యోగం ఇదే అని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశంపై వెనువెంటనే నో అని చెప్పేశారు. తన భార్యకు కూడా ఇష్టంలేదని, తను చాలా స్పష్టంగా వద్దని చెప్పినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి రాజ్యసభ సీటును ఆప్ రాజన్‌కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌ను ఆర్బీఐ మాజీ గవర్నర్ తిరస్కరించినట్టు తెలిసింది. మరో పుస్తకం కూడా తాను రాస్తున్నట్టు తెలిపారు. రాజన్ చివరి పుస్తకం ' ఐ డూ వాట్ ఐ డూ'. సెప్టెంబర్‌లో ఈ బుక్ విడుదలైంది. దేశీయ ఆర్థికవ్యవస్థ గురించి పలు అంశాలను ఇది స్పృశించింది. జీఎస్టీ గురించి మాట్లాడిన రాజన్, దీర్ఘకాలికంగా ఇది చాలా మంచిదని, కానీ కొన్ని సమస్యలున్నట్టు తెలిపారు. ఈ ఆటుపోట్లను తొలగించాల్సినవసరం ఉందన్నారు. -
పెద్దల సభకు రాలేనంటున్న రాజన్
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేయలేనని రాజన్ పేర్కొన్నారు. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆఫర్‌పై రాజన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రఘురామ్ రాజన్ అధ్యాపక వృత్తిలో మమేకమై ఉన్నారని, భారత్‌లో కూడా విభిన్న విద్యా కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని కార్యాలయం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పూర్తిస్థాయి అధ్యాపకుడిగా కొనసాగేందుకే రాజన్ ఇష్టపడుతున్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు సభ్యులను జనవరిలో రాజ్యసభకు పంపనుంది. ఈ మూడు స్థానాలను ఆప్ పార్టీ నేతలను కాకుండా.. ఆయా రంగాల్లో నిష్ణాతులను పంపాలని అరవింద్ కేజ్రీవాల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఆప్ పార్టీ నేత ఆశిష్ ఖేతన్ ట్విటర్లో వెల్లడించారు. See the contrast. @narendramodi recently sent @AmitShah to Rajya Sabha. While @ArvindKejriwal wants to send Mr. Raghuram Rajan to the upper house. — Ashish Khetan (@AashishKhetan) 8 November 2017 -
రాజన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేది ఆ పార్టీనే?
న్యూఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సీటు ఆఫర్ చేయబోతుంది. రాజ్యసభ సభ్యుడిగా రాజన్‌ను పేరును ఆప్ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులను త్వరలోనే రాజ్యసభకు పంపించబోతున్నారు. వీరి పదవీ కాలం జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలను కాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్ నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. సెంట్రల్ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ కొనసాగింపును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, ఆయన పదవిని పొడిగించలేదు. ఈ క్రమంలో ఆయన తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృతిని ఎంచుకున్నారు. ఖాళీ కాబోతున్న ఈ మూడు రాజ్యసభ సీట్ల కోసం పోటీ బాగానే ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ ఆప్ నేత కుమార్ విశ్వాస్ కూడా రాజ్యసభ పదవికి పోటీ పడుతున్నారు. -
బకాయిల భారం తగ్గిన తర్వాతే విలీనాల పర్వం!: రాజన్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో తొలుత మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తదుపరే విలీనాల ప్రక్రియ ప్రారంభం కావాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల మూలధన సమస్య పరిష్కారానికి కూడా ఇది కీలకమని ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. తాను ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన రుణ నాణ్యాతా సమీక్ష (ఏక్యూఆర్) మొండిబకాయిల పరిష్కారంలో కీలక అడుగని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలానికి భద్రతేది?: రాజన్
ముంబయి: ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలానికి భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల పదవీకాలానికి ఎలాంటి భద్రత ఉంటుందో అదే స్థాయి భద్రతను ఆర్బీఐ గవర్నర్ పదవికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉండటం చాలా స్వల్పమైనదని చెప్పారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని, ఒక్కోసారి చిన్నచిన్న విషయాలకే అది సమస్యగా పరిణమిస్తుందని కూడా చెప్పారు. ఇవి తీరేందుకు విలువైన సమయం వృధా అయిపోతుందని కూడా తెలిపారు. అయితే, ఒక వేళ పదవీ కాలానికి భద్రత ఉంటుందనుకొని భావించినా తిరిగి ఏదో ఒక అంశం ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆయన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకం 'ఐ డూ వాట్ ఐ డూ' అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
వృద్ధిపై ప్రభుత్వానిది ‘డబ్బా’!
► పదేళ్లపాటు 8–10 శాతం వృద్ధి సాధించాలి... ► వృద్ధి జోరులో మనమే టాప్ అని ►అప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది... ► జీడీపీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి రేటుపై మోదీ సర్కారువన్నీ డబ్బా కబుర్లేనంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా చురకలంటించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమంటూ బాకా కొట్టుకోవడానికి ముందు వరుసగా పదేళ్లపాటు అత్యంత పటిష్టమైన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిని సాధించి చూపాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్‌గా తన అనుభవాలపై ‘ఐ డూ వాట్ ఐ డూ’అనే పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా రాజన్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఏకంగా మూడేళ్ల కనిష్టానికి(5.7 శాతం) పడిపోయింది. అంతక్రితం త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదైంది. అయితే, ఇదే తరుణంలో చైనా మాత్రం 6.5 శాతం చొప్పున వృద్ధి సాధించి భారత్‌ను వెనక్కినెట్టింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారత్ తన సంస్కృతి, చరిత్ర గురించి ప్రపంచానికి ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. అయితే, ఆర్థిక వృద్ధి విషయంలో మాత్రం ఈ బాకా కుదరదు. ముందుగా పదేళ్లపాటు 8–10% మేర నిలకడైన వృద్ధి రేటును సాధించి చూపాలి. ఆ తర్వాత గొప్పలు చెబితే బాగుంటుంది’ అని రాజన్ సూచించారు. నా వ్యాఖ్యల తర్వాత వృద్ధి పడుతూనే ఉంది: ఇప్పటివరకూ ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన వారందరికీ రెండోవిడత అవకాశం లభించింది. అయితే, రాజన్‌ను మాత్రం మరోవిడత కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఇష్టపడకపోవడంతో పదవిలో ఉండగానే తాను మరోసారి గవర్నర్‌గా చేయబోనని.. తన అధ్యాపక వృత్తికి తిరిగివెళ్లిపోనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్బీఐ అధిపతిగా ఉన్నప్పుడు కూడా రాజన్ మన ఆర్థిక వ్యవస్థపై నిక్కచ్చిగా కుండబద్దలుకొట్టినట్లు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ప్రధా నంగా ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను ఉన్నోడే రాజు’ అంటూ భారత్ వృద్ధి రేటును ఆభివర్ణించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ.. తక్షణం రాజన్‌ను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖకూడా రాశారు. అసలు రాజన్ మానసికంగా భారతీయుడు కాదని కూడా స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, దీన్ని తాను పెద్దగా పట్టించుకోలేదంటూ రాజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను దేన్నయినా ముందుగానే ఊహించి చెప్పగలనని అనుకోవడం లేదు. అయితే, మనగురించి మనం మరీ అతిగా చెప్పుకునే విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నదే నా ఉద్దేశం. నేను వృద్ధి విషయంలో ఆ వ్యాఖ్యలు 2016 ఏప్రిల్‌లో చేశాను. అప్పటి నుంచీ ప్రతి త్రైమాసికంలోనూ వృద్ధి రేటు దిగజారుతూనే వస్తోంది’ అని రాజన్ వివరించారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి చెప్పిన ప్రపంచ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఒకరు కావడం గమనార్హం. మనది ఇంకా చిన్న ఆర్థిక వ్యవస్థే... చైనా ఆర్థిక వ్యవస్థతో మనకు ఎన్నటికీ పోలికే ఉండదని రాజన్ చెప్పారు. ‘ప్రస్తుతం 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదికింద లెక్క. అయినప్పటికీ చాలా పెద్దదేశంగా భావిస్తాం. మనతో పోలిస్తే చైనా ఎకానమీ ఐదు రెట్లు పెద్దది. ఒకవేళ చైనా స్థాయికి భారత్ చేరుకోవాలంటే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించాలి. భారత్ వచ్చే పదేళ్లపాటు భారీస్థాయి వృద్ధి రేటుతో దూసుకుపోవాలి’ అని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ వృద్ధి మళ్లీ 8–9 శాతానికి పుంజుకోవాలంటే మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులకు పునరుత్తేజం ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ‘1990 దశకం నుంచి భారత్ 6–7–8 శాతం మేర వృద్ధి రేటు స్థాయికి నెమ్మదిగా చేరింది. అయితే, మధ్యతరగతి ప్రజలకు సైతం ఆర్థిక ప్రగతి ఫలాలు అందాలంటే 8–10 శాతం వృద్ధి కనీసం పదేళ్లపాటు స్థిరంగా కొనసాగాల్సి ఉంటుంది. అప్పుడే భారీస్థాయి ఆర్థిక వ్యవస్థగా అవతరించగలుగుతాం’ అని రాజన్ స్పష్టం చేశారు. -
బ్యాంకుల విలీనాలతో ఒరిగేదేంటి..?
♦ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి... ♦ బలహీన బ్యాంకులతో విలీనాలు మరింత జఠిలం ♦ కన్సాలిడేషన్ సులువైన ప్రక్రియేమీ కాదు ♦ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ తీరును రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. కన్సాలిడేషన్ సహేతుకమైనదే అయినప్పటికీ.. దీనివల్ల కలిగే లాభాలేంటో ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. ఒక ఫైనాన్షియల్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో... బ్యాంకుల విలీనాన్ని చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా రాజన్ వర్ణించారు. ‘కన్సాలిడేషన్‌కి బ్యాంకుల సీఈవోలు, మేనేజర్లు మొదలైన వారంతా బోలెడంత శ్రమ, సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఐటీ సిస్టమ్స్ అనుసంధానం చేయాలి.. రెండు విభిన్న పని సంస్కృతులు, హెచ్ఆర్ వ్యవస్థలు మొదలైన వాటన్నింటి విలీనం చేయాలి. ఇదంతా అత్యంత శ్రమతో కూడుకున్నదే‘ అని ఆయన చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే బలహీనంగా ఉన్న నేపథ్యంలో విలీనాలు మరింత సమస్యాత్మకంగా మారతాయని రాజన్ పేర్కొన్నారు. ‘ఈ ప్రక్రియంతా చాలా సులువుగా ఎలా పూర్తయిపోతుందనేది ప్రభుత్వం చెప్పాలి. ఇది సమస్య నుంచి దృష్టి మరల్చి.. సంస్థను మరింతగా కుంగదీయకుండా, ఏ విధంగా ఊతమివ్వగలదో చెప్పాలి‘ అని వ్యాఖ్యానించారు. నార్త్ బ్లాక్ ఆధిపత్యమేంటి? విలీన ప్రణాళికల్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుండటాన్ని రాజన్ ప్రశ్నించారు. ‘ఈ ప్రణాళికలన్నింటినీ నార్త్ బ్లాకే (ఆర్థిక తదితర కీలక శాఖల కార్యాలయాలున్న భవంతి) నిర్ణయిస్తుందా? ఒకవేళ అదే జరిగితే.. ఇక కొత్తేం ఉంది? ఎంతో కొంత వైవిధ్యం ఉండాలన్న జ్ఞాన సంఘం నిబంధనలను చేరుకోనట్లేగా? ఒకవేళ అంతా నార్త్ బ్లాకే నిర్ణయిస్తే.. తేడా ఏముంటుంది?‘ అని ఆయన పేర్కొన్నారు. విలీనాలనేవి బ్యాంకులు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే చేయాలి తప్ప బలహీనంగా ఉన్నప్పుడు కాదని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదీ నేపథ్యం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను విలీనాల ద్వారా 21 నుంచి 15కి తగ్గించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టమైన పెద్ద బ్యాంకులను ఆవిష్కరించడమే దీని వెనుక ప్రధానోద్దేశమని కేంద్రం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది బ్యాంకులు కలిసి సుమారు రూ. 18,066 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. ఇక ఆరు బ్యాంకులు కార్యకలాపాల విస్తరణపై ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇక విలీనాల విషయానికొస్తే.. ఏ రెండు బ్యాంకులు కలపాలని చూసినా.. చాలా మటుకు సందర్భాల్లో వాటిలో పేరుకుపోయిన మొండిబాకీల పరిమాణం నిర్దిష్ట స్థాయికి మించిపోవడం ద్వారా ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతరత్రా కేటాయింపులు పోగా.. మార్చి ఆఖరు నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండి బాకీలు మొత్తం రుణాల్లో 7.8 శాతంగా ఉండగా.. కెనరా బ్యాంక్ మొండి బాకీలు 6.3 శాతంగా నమోదయ్యాయి. విలీనాలకు అనువైనవిగా భావిస్తున్న బలహీన బ్యాంకుల గురించి పెద్ద బ్యాంకులు ఇప్పటికే ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశాయి. టేకోవర్ సామర్ధ్యమున్న బ్యాంకులుగా పరిగణిస్తున్న కెనరా బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైనవి.. చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవడానికి ముందస్తుగా కొన్ని షరతులు విధిస్తున్నాయి. టార్గెట్ బ్యాంకు కచ్చితంగా లాభాలార్జిస్తున్నదై ఉండాలన్నది ఇందులో ప్రధానమైనది. అలాగే, టార్గెట్ బ్యాంకుకు తగినంత మూలధనం ఉన్నప్పటికీ ప్రభుత్వం మరింత పెట్టుబడి సమకూర్చాలని కూడా టేకోవర్ సామర్ధ్యమున్న బ్యాంకులు కోరుతున్నాయి. విలీనాలనేవి బోర్డుల నిర్ణయాల ఆధారంగానే ఉండాలి తప్ప.. ప్రభుత్వం నిర్ణయాల మేరకు ఉండకూడదని బ్యాంకులు ఆశిస్తున్నాయి. బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలు ముందుకు తెస్తే.. వాటిని మంత్రుల కమిటీ పరిశీలించి, కన్సాలిడేషన్ ప్లాన్‌కి సూత్రప్రాయ అనుమతులు ఇస్తాయంటూ కేంద్రం ఆగస్టు నెలాఖర్లో పేర్కొంది. -
గోరంతే చెప్పాలి.. కొండంత సాధించి చూపాలి
► చైనాతో పోటీలో భారత్ చేయాల్సిందిదే ► ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెన్నై: ఎప్పుడైనా సరే మన సామరŠాధ్యల గురించి తక్కువగానే చెప్పి, ఎక్కువగా సాధించి చూపాలని.. ఆ తర్వాతే గొప్పలు చెప్పుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో చైనా నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొనడం కన్నా ఈ విధానాన్ని పాటించడమే శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా తన అనుభవాలను కూర్చి రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు. భారత్‌కి అపరిమితమైన సామర్ధ్యముందని, అయితే సాధించడానికి ముందుగానే గొప్పలు చెప్పుకుంటూ తిరగడం శ్రేయస్కరం కాదని ఆయన సూచించారు. ‘సాధించగలమన్న సత్తా మనలో ఉందని గట్టిగా విశ్వసిద్దాం. సాధించి చూపుదాం. ఆ తర్వాతే గొప్పలు చెప్పుకుందాం. అంతే తప్ప సాధించడానికన్నా ముందుగానే గొప్పలకు పోవద్దు‘ అని రాజన్ పేర్కొన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలో భారత వృద్ధి చైనా కన్నా వెనుకబడి ఉండటంపై తన బీజింగ్ పర్యటనలో.. కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు రాజన్ తెలిపారు. ఇటీవలి వివాదం సంగతి ఎలా ఉన్నా భారత్ మెరుగ్గానే రాణిస్తోన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నది చైనాయే కదా అన్న ప్రశ్నలు వచ్చాయన్నారు. మరోవైపు, డీమోనిటైజేషన్ మూల్యం చాలా భారీగానే ఉంటుందని ఆయన చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడి పరిస్థితులు, డీమోనిటైజేషన్, జీఎస్టీ .. ఇవన్నీ కూడా దాదాపు ఏకకాలంలో ఉండటం వల్ల దేని ప్రభావం ఎంత మేర ఉంటుందనేది ఇథమిత్థంగా చెప్పలేకపోయినప్పటికీ.. విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా జీడీపీ వృద్ధిపై 1–2% ప్రతికూల ప్రభావం ఉండొచ్చని రాజన్ పేర్కొన్నారు. -
ఇంతకీ నోట్ల రద్దు నిర్ణయం ఎవరిది?
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన పుసక్తంలో చేసిన వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. ప్రత్యామ్నాయాలు సూచించిన పట్టించుకోకుండా డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నారంటూ రాజన్ తన ‘‘ఐ డు వాట్ ఐ డు: ఆన్ రీఫార్మ్స్, రెటోరిక్ అండ్ రీసాల్వ్’’ పుస్తకంలో వివరించిన విషయం విదితమే. నోట్ల రద్దు ఎందుకు వద్దంటే... తనకేం సంబంధం లేదని రాజన్ తేల్చేయటంతో పలు పశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆ లెక్కన్న నోట్ల రద్దు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర్య ప్రతిపాదికన తీసుకున్న నిర్ణయమా? లేక వెనకాల ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆర్థిక పరిస్థితిని కుదేలు చేయగలిగే నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఒత్తిళ్లు పని చేశాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆర్బీఐ గణాంకాలతోసహా హెచ్చరించినా ఎందుకింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. పోనీ ఆర్బీఐ కమిటీ సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకున్నారా?(లేదనే రాజన్ చెబుతున్నారు) అన్న కోణంలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజన్ చెప్పినట్లు అసలు అంత హడావుడిగా నోట్ల రద్దు ప్రకటించాల్సిన అవసరం ఏంటి? అన్నది కీలకంగా మారింది. అన్నింటికి మించి 86 శాతం చెలామణిలో ఉన్న నోట్లను అర్థాంతరంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏంటి?... వీటన్నింటిని త్వరగతిన నివృత్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా కానీ పక్షంలో దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అన్న మచ్చను మోదీ ప్రభుత్వం తర్వాతి తరాల్లో కూడా మోయాల్సి ఉంటుంది. -
'మోదీ సర్కారును ముందే హెచ్చరించా'
పెద్ద నోట్ల రద్దుపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: నల్లధనం అణచివేతకు నరేంద్రమోదీ సర్కారు అమలుచేసిన పెద్దనోట్ల రద్దు.. పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదని వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఆర్బీఐ.. 99శాతం రద్దైన కరెన్సీ తిరిగి బ్యాంకుకు చేరిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు విషయంలో నరేంద్రమోదీ సర్కారును తాను ముందే హెచ్చరించానని, నోట్ల రద్దు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా స్పల్పకాలికంగా జరిగే నష్టమే ఎక్కువ అని తాను చెప్పానని తెలిపారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను తాను సూచించానని, అయినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన చెప్పారు. 'ఐ డూ వాట్ ఐ డూ: రిఫార్మ్స్, రెటారిక్, రిజాల్వ్' పేరిట రాజన్ రాసిన పుస్తకం వచ్చేవారం విడుదల కానుంది. 2016 ఫిబ్రవరిలో పెద్దనోట్ల రద్దుపై తన అభిప్రాయం తెలుపాలని ప్రభుత్వం మౌఖికంగా కోరిందని, దీంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును చేపడితే.. తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అనువైన సమయంపై నోట్‌ను ఆర్బీఐ సర్కారుకు సమర్పించిందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌గా గత ఏడాది సెప్టెంబర్ 5న తన పదవీకాలం ముగియడంతో తిరిగి షికాగో యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ అధ్యాపకుడిగా రాజన్ చేరిన సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు గురించి తన హయాంలోనే ప్రభుత్వం సంప్రదించినా.. నిర్ణయం తీసుకోవాలని మాత్రం తనను కోరలేదని స్పష్టం చేశారు. -
ఆర్బీఐ గవర్నర్ గిరీపై రాజన్ పుస్తకం
సెప్టెంబర్ 4న మార్కెట్లోకి ’ఐ డూ వాట్ ఐ డూ’ న్యూఢిల్లీ: సంక్షోభ సమయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ్ రాజన్.. కొత్తగా మరో పుస్తకాన్ని ప్రచురించారు. ’ఐ డూ వాట్ ఐ డూ’ పేరిట ఆయన రాసిన ఈ పుస్తకం సెప్టెంబర్ 4న మార్కెట్లోకి రానుంది. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో రాజన్ రాసిన వ్యాసాలు, ప్రసంగాలు ఇందులో పొందుపర్చారు. ఆర్థిక, రాజకీయపరమైన అంశాలు దీన్లో చాలా ఉన్నాయి. 2013 సెప్టెంబర్‌లో రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి రూపాయి పతనావస్థలో ఉండగా.. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. కరుగుతున్న విదేశీ మారక నిల్వలు.. భారీ కరెంటు అకౌంటు లోటు దేశానికి సమస్యాత్మకంగా మారాయి. అయిదు బలహీన ఎకానమీల్లో ఒకటనే ముద్రతో భారత్‌పై నమ్మకం సడలిన పరిస్థితులను రాజన్ సమర్థంగా ఎదుర్కొన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత... కొనసాగుతున్న సంస్కరణల గురించి ప్రపంచానికి బలమైన సంకేతాలు పంపారని ముద్రణా సంస్థ హార్పర్‌కోలిన్స్ ఇండియా పేర్కొంది. దీర్ఘకాలికంగా వృద్ధి, స్థిరత్వాన్ని సాధించడం, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై రాజన్ దృష్టి పెట్టారని తెలిపింది. దోశ ధరతో ముడిపెట్టి ఆర్థికాంశాలను రాజన్ వివరించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘దోశనామిక్స్ లేదా రుణ సంక్షోభ పరిష్కారమార్గాలు కావొచ్చు. రాజన్ ఆర్థిక విషయాలను సరళంగా వివరిస్తారు‘ అని హార్పర్‌కోలిన్స్ వివరించింది. రాజన్ ఇప్పటికే సేవింగ్ క్యాపిటలిజం ఫ్రం క్యాపిటలిస్ట్‌తో పాటు మరో పుస్తకాన్ని కూడా రాశారు. -
గణాంకాల మాయాజాలం
గణాంకాలు సగటు మనిషిని చికాకుపరుస్తాయి. వాటి సారాంశమేమిటో తెలుసు కుని నిట్టూర్చడమో, ఊపిరిపీల్చుకోవడమో తప్ప... లోతుల్లోకి పోయి అర్ధం చేసు కోవడానికి ప్రయత్నించేంత తీరిక, ఓపిక వారికి ఉండవు. వాటి నిజానిజాలను తేల్చుకునే నైపుణ్యమూ ఉండదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ దేన్నయినా తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశ ప్రచారంలో ఆయన అంతకుముందు రోజు కేంద్ర గణాంకాల శాఖ(సీఎస్ఓ) ప్రకటించిన దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని ప్రస్తావించారు. జీడీపీ 7శాతం ఉన్నదని తేలింది గనుక ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదివిన ‘మహా ఆర్థికవేత్తలు’ ఏమంటారని ఎద్దేవా చేశారు. హార్వర్డ్ కన్నా ‘హార్డ్‌వర్క్’(కఠోరశ్రమ) మిన్న అని చెప్పారు. ‘పెద్ద నోట్లు రద్దు వల్ల వృద్ధి రేటు 2 శాతం పడిపోతుంది... 4శాతం పడిపోతుంది’అంటూ బెదరగొట్టారని గుర్తుచేశారు. పేర్లు చెప్పకపోయినా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్లను ఉద్దేశించే ఆయనలా అన్నారని అందరికీ అర్ధమైంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సంగతలా ఉంచి అంతకుముందు నుంచే ఆర్థిక స్థితి బాగు లేదని పెదవి విరిచినవారున్నారు. ఎవరి వరకో ఎందుకు... రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నప్పుడు రఘురాంరాజనే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. నిరాశామయ వర్తమానంలో భారత్ దేదీప్య మానంగా వెలుగుతున్న దేశమని నిరుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అన్నప్పుడు రఘురాం రాజన్ పొంగిపోలేదు. ‘అంధుల దేశానికి ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అంటూ వ్యాఖ్యానించి నిర్వేదంగా మాట్లాడారు. నిజమే...మొన్న డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (అక్టోబర్–డిసెం బర్)లో జీడీపీ 7 శాతంగా నమోదైనట్టు సీఎస్ఓ అంచనా వేసింది. అది 6.1–6.8 మధ్య ఉండొచ్చునని అంతక్రితం అనేక ఏజెన్సీలు భావించాయి. పెద్దనోట్ల రద్దు, కొత్త నోట్ల లభ్యత సక్రమంగా లేని కారణంగా చిన్న పరిశ్రమలు మూతబడటం, రోజుకూలీలు సైతం ఉపాధి కోల్పోవడంవంటివి జరిగాయని వార్తలొచ్చిన నేప థ్యంలో సీఎస్ఓ గణాంకాలు నిజమేనా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, చివరకు పెద్దనోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా వాటన్నిటినీ తట్టుకునేంత పటిష్టంగా దేశ ఆర్థికవ్యవస్థ ఉంటే అది గర్వించదగిన, సంతోషించదగిన అంశం. అయితే తయారీ, వ్యవసాయ రంగాల ఊతం కార ణంగా అది పెరిగిందని సీఎస్ఓ అంటున్నది. పెద్ద నోట్ల రద్దు సమయంలో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ ఆర్ధికవేత్తలు మాత్రమే కాదు... ఇతర వర్గాలవారు కూడా ఆ నిర్ణయంలోని లోటుపాట్ల గురించి చర్చించారు. విమర్శించినవారున్నట్టే మెచ్చుకున్న వారూ ఉన్నారు. కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) సైతం ఆ నిర్ణయాన్ని దుయ్యబట్టింది. దానివల్ల 20 లక్షలమంది ఉద్యోగావకాశాలు కోల్పోయారని సంస్థ అధ్యక్షుడు బైజ్నాథ్ రాయ్ అప్పట్లో అన్నారు. అసంఘటిత రంగంలో పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉన్నదని కూడా చెప్పారు. నోట్ల రద్దు జరిగిన నెల్లాళ్ల తర్వాత అన్న మాటలవి. ఆ నిర్ణయం వెనకున్న ఉద్దేశం మంచిదని మెచ్చుకుంటూనే ఆయన ఈ లెక్కలు చెప్పారని గుర్తుంచుకుంటే సీఎస్ఓ తాజా గణాంకాలు ఆశ్చర్యం కలిగిం చడంలో వింతేమీ లేదు. సీఎస్ఓ గడిచిన త్రైమాసికంలో ఆశావహమైన స్థితి ఉన్నదని చెప్పడమే కాదు... మొత్తంగా 2016–17 ఆర్ధిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చింది. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత పరోక్ష పన్నుల వసూళ్లు ముమ్మరమయ్యాయని మర్చిపోకూడదు. పాత నోట్లతో పన్నులు కట్టొచ్చునని ప్రభుత్వాలు ప్రకటించేసరికి ఏళ్ల తరబడి మొండి బకాయిలుగా ఉన్నవి కూడా వసూలయ్యాయి. ఎటూ రద్దయిన నోట్లను చేంతాడంత క్యూల్లో గంటలకొద్దీ నిలబడి మార్చుకోవాల్సి ఉంటుంది గనుక దాని బదులు బకాయిలు చెల్లిస్తే సమస్య తీరుతుందని చాలామంది భావించారు. అదే సమయంలో పలు సంస్థలు, కంపెనీలు కూడా ఉత్పాదకతకు సంబంధించిన పన్నులను పాత నోట్లలో ముందే చెల్లించాయి. అలాగే తమ దగ్గరున్న నగదు నిల్వలను విక్రయాలుగా చూపించాయి. ఇవన్నీ జీడీపీ పెరుగుదలపై ప్రభావాన్ని చూపి ఉండొచ్చు. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, కస్టమ్స్ సుంకం వంటి వసూళ్లు మొన్న జనవరికి రూ. 7.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం అదే కాలంలో వసూలైన పన్ను వసూళ్లతో పోలిస్తే అది 23.9 శాతం అధికం. పైగా నోట్ల రద్దు రాబోతున్నదని తెలియక రెండు పెద్ద పండుగలకు జనం బాగా ఖర్చుపెట్టారు. వీటన్నిటి సంగతలా ఉంచి రెండేళ్లక్రితం ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థ్ధిక కార్యకలాపాలను కొలిచే విధానాన్ని మార్చినప్పటినుంచి ఆర్థికవ్యవస్థ పెను వేగంతో కదులుతున్నట్టు కనబడటం మొదలుపెట్టిందని, ఇప్పుడు వెలువడిన గణాంకాలు కూడా ఆ వరసలోనివేనని పెదవి విరుస్తున్న వారున్నారు. ఉత్తరాదిలో తయారీ రంగ పరిశ్రమలు విస్తృతంగా ఉండే లూథియానా, ఆగ్రా, నోయిడా... తమిళనాడులోని తిరుపూర్ వంటిచోట్ల పరిశ్రమలు మూతబడ్డాయని, కార్మికులను రిట్రెంచ్ చేశారని వార్తలొచ్చాయి. నిర్మాణరంగం మందగించిందని, వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయని కథనాలు వెలువడ్డాయి. తమ ఆదాయం, ఉపాధిపై గృహస్తుల్లో ఉన్న అనిశ్చితివల్ల వినియోగదారుల విశ్వాసం గణనీయంగా పడిపోయిందని రిజర్వ్‌బ్యాంక్ తాజా సర్వే కూడా చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్ఓ అందుకు భిన్నమైన స్థితిని ఆవిష్కరించడం ఒక వైచిత్రి. అయితే ఇది కేవలం ఈ త్రైమాసికానికి సంబంధించిందే. దీన్నిబట్టి అంతా బాగున్నదని మెచ్చుకోవడమో, వాస్తవాలను ప్రతిబింబించడంలేదని విమర్శిం చడమో చేయడం సరికాదు. మొత్తంగా 2016–17 ఆర్థిక సంవత్సరం వాస్తవ స్థితి 2018 జనవరిలో వెలువడే సవరించిన గణాంకాలు చెబుతాయి. అంతవరకూ ఓపిక పట్టక తప్పదు. -
రాజన్ రాజీనామా ‘చిదంబర’ రహస్యం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రాజన్ వైదొలగడం వెనుక కారణంపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి,కాంగ్రెస్ నేత పి. చిదంబంర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించినందు వల్లే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. వాస్తవానికి రాజన్ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలనుకున్నారనీ, కానీ పరిస్థితులు ఆయనను రాజీనామా వైపు నడిపించాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్లను తీవ్రంగా వ్యతిరేకించిన రాజన్ పదవీకాలం పొడించలేదని ఆరోపించారు. అలాగే రాజన్ రాజీనామా సందర్బంగా ఆర్బీఐ తరపున రాజన్ డీమానిటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ 5 పేజల లేఖను ప్రభుత్వానికి సమర్పించారని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ ప్రక్రియను ఎందుకు చేపట్టకూడదో వాదిస్తూ ఈ ఐదు పేజీల లేఖను రాసినట్టు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ లేఖను బహిర్గతం చేయాలని ఆయన సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంటే రాజన్ లేఖను బైటపెట్టగాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ పదవీకాలం ముగియనుండగా... రాజన్ పదవీకాలాన్ని పొడిగిస్తారా లేదా అనే చర్చ ఒక పక్క జోరుగా సాగుతుండగానే రాజన్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ను ప్రభుత్వం నియమించింది. అలాగే నవంబర్ 8 న ప్రధాని మోదీ 80శాతం చలామణిలోఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. మరోవైపు అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ పదవినుంచి తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి పలుమార్లు రాజన్ పై దాడికి దిగినపుడు కూడా చిదంబరం రాజన్‌కు మద్దతుగగా నిలిచిన సంగతి తెలిసిందే. -
మళ్లీ అధ్యాపకుడిగా.. అద్భుతం: రాజన్
షికాగో వర్సిటీలో చేరటంపై వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల అనంతరం షికాగో యూనివర్సిటీలో అధ్యాపక విధుల్లో చేరిన రఘురామ్ రాజన్... తాను వెనక్కి తిరిగి రావడం, షికాగోలో బైక్ రైడింగ్ చేయడం గొప్పగా ఉందన్నారు. ‘‘బైక్‌ను బయటకు తీసి తీరం వెంట రహదారిపై దాన్ని నడపడం నా జీవితంలో గొప్ప అనుభూతి. కోరుకున్నంత కాలం నేను ఈ పనిచేయగలనని భావిస్తున్నాను’’ అన్నారాయన. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మీడియా బృందానికి ఆయన ఇంటర్వూ్య ఇచ్చారు. బూత్ స్కూల్ పాతికేళ్ల పాటు తనకు ఇల్లులా ఉందన్నారు. దాన్ని ఓ అద్భుతమైన స్కూల్‌గా అభివర్ణించారు. ‘‘ఇదో గొప్ప నగరం. గొప్ప సహచరులున్నారు. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ ఇది విభిన్నంగా కనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. అధ్యాపక వృత్తిలోకి తిరిగొచ్చాక దేనికోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘వాస్తవిక ప్రపంచంలో ఉద్యోగ విధుల్లో ఉన్న వారికి కనీసం ఆలోచించేంత తీరిక కూడా దొరకదు. అదే ఇబ్బంది. ఇపుడు అధ్యాపక రంగంలో ఉన్నాను. కావాలంటే నాలుగు రోజులు ఓ గదిలో గడిపేయగలను. కూర్చుని పేపర్ వంక చూస్తూ బయటకు రానంటున్న ఆలోచనలతో పోరాడొచ్చు’’ అంటూ ప్రస్తుత వృత్తిలో ఉన్న వెసులుబాటును రాజన్ చెప్పుకొచ్చారు. పరిశోధనల గురించి చెబుతూ... దాన్నెప్పుడూ వదిలిపెట్టేది లేదని, ఆర్బీఐలో ఉన్నప్పుడు కూడా తాను కొన్ని పేపర్లను ప్రచురించానని తెలియజేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతూ వచ్చే 30 ఏళ్ల కాలానికి అదో పరిశోధనాంశంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం రఘురామ్ రాజన్ యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1991లోనే ఆయన బూత్ స్కూల్లో ప్రొఫెసర్‌గా చేరగా... మధ్యలో 2003 నుంచి 2006 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో చీఫ్ ఎకనమిస్ట్, రీసెర్చ్ డైరెక్టర్‌గా, 2013 నుంచి 2016 వరకు మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. -
ఇదో ముక్కోణపు కథ..
► ఆర్బీఐ–బ్యాంకులు– కేంద్రం బ్యాంకులు 2017 మార్చికల్లా ఎన్ పీఏలకు పూర్తి కేటాయింపులు చేసి బ్యాలన్స్ షీట్లలో చూపించాలని రఘురామ్ రాజన్ షరతు పెట్టారు. నల్లధనాన్ని ఏరేయాలనుకున్న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ఆర్బీఐపై భారీ బాధ్యతే పెట్టింది. చివరి రెండు నెలలూ తమ వ్యాపారాన్నంతా పక్కన పెట్టి బ్యాంకులు జనం నుంచి పాత నోట్లు తీసుకోవటం, కొత్త నోట్లు ఇవ్వటానికే పరిమితమయ్యాయి. ఇదో ట్రయాంగిల్ స్టోరీలా మారింది. బ్యాంకుల ఎన్ పీఏలు సెప్టెంబర్ నాటికే రూ.7 లక్షల కోట్లను దాటేశాయి. వీటిలో అధికం ప్రభుత్వ రంగ బ్యాంకులవే. వీటికి కేటాయింపులు చేయడం బ్యాంకులకు సవాలుగా మారింది. ఆస్తులు అమ్మి రుణాలు తీర్చటానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నా అవి ఫలించటం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారూ భారీగానే ఉన్నారు. ఇవన్నీ ఎన్ పీఏలను పెంచేశాయి. అయితే, నోట్ల రద్దుతో బ్యాంకుల్లో చేరిన భారీ డిపాజిట్లు మూలధన అవసరాలు తీరుస్తాయనేది తాజా అంచనా. ద్రవ్యోల్బణమే ఆర్బీఐ టార్గెట్? రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగిసింది. తర్వాత ఉర్జిత్ పటేల్ గవర్నర్ అయ్యారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న విషయంలో కేంద్రం, ఆర్బీఐ అంగీకారానికి వచ్చాయి. ఇక ఆర్బీఐ అనుమతుల మేరకు దేశంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, ఈక్విటీస్ స్మాల్ బ్యాంకు పేరుతో కొత్త తరహా బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. -
ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య
మూడేళ్ల పాటు పదవీ కాలం ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ విరాళ్ ఆచార్య తాజాగా రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆచార్య (42) మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదోన్నతి పొందినప్పట్నుంచీ డిప్యూటీ గవర్నర్ స్థానం ఒకటి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు (ఎస్ఎస్ ముంద్రా, ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్ గాంధీలు) ఉన్నారు. డీమోనిటైజేషన్ దరిమిలా రిజర్వ్ బ్యాంక్ పూటకో నిబంధన మార్చేస్తూ, తీవ్ర విమర్శల పాలవుతున్న తరుణంలో ఆచార్య నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఎన్‌వైయూ–స్టెర్న్)లోని ఆర్థిక విభాగంలో సీవీ స్టార్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.ముంబై ఐఐటీ విద్యార్థి అయిన ఆచార్య.. 1995లో బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివారు. 2001లో ఎన్‌వైయూ–స్టెర్న్ నుంచి ఫైనాన్స్‌లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 2001–08 మధ్య కాలంలో లండన్ బిజినెస్ స్కూల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. భారతీయ క్యాపిటల్ మార్కెట్స్పై ఎన్ఎస్ఈ–ఎన్‌వైయూ స్టెర్న్ చేపట్టిన అధ్యయనానికి డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ‘పేదల రఘురామ్ రాజన్’... ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనకు స్ఫూర్తిప్రదాతగా చెబుతుంటారు ఆచార్య. అంతే కాదు.. తనను తాను పేదల రఘురామ్ రాజన్‌గా అభివర్ణించుకుంటారు. 2013లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా దీని వెనుక గల కథను ఆయన వివరించారు. తానొకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు బ్యాంకింగ్, సంక్షోభాలు మొదలైన వాటికి సంబంధించి తన చేతిలో ఉన్న పత్రాలను చూసి తోటి ప్రయాణికుడు తనను రఘురామ్ రాజన్‌గా భావించారని ఆచార్య పేర్కొన్నారు. ’దీంతో రాజన్‌ను రోల్ మోడల్‌గా తీసుకుని, ఆయన సాధించిన దానిలో కనీసం 5–10 శాతం సాధించగలిగినా.. విమాన ప్రయాణాల్లో ’పేదల రఘురామ్ రాజన్’గా చలామణి అయిపోవచ్చని ఆరోజు గ్రహించాను’ అని ఆచార్య చమత్కరించారు. తన రోల్ మోడల్ రాజన్‌తో కలిసి ఆయన గతంలో మూడు పరిశోధన పత్రాలు రాశారు. ’సార్వభౌమ రుణం, ప్రభుత్వ హ్రస్వదృష్టి, ఆర్థిక రంగం’, ’కంపెనీల అంతర్గత గవర్నెన్స్’, ’క్రియాశీలక పరిస్థితుల్లో రుణభారం, ప్రభుత్వ హ్రస్వదృష్టి’ పేరిట ఆయన ఈ పరిశోధన పత్రాలు రూపొందించారు. రాజన్ తరహాలోనే కేంద్రీయ బ్యాంకుల స్వతంత్రత కాపాడాలన్నది ఆచార్య అభిప్రాయం. కేంద్రీయ బ్యాంకులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూనే, రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అంటారాయన. న్యూయార్క్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోని ఆచార్య ప్రొఫైల్ ప్రకారం.. ఆర్థిక రంగానికి వ్యవస్థాగతంగా ఎదురయ్యే రిస్కులు, నియంత్రణ, ప్రభుత్వ జోక్యంతో తలెత్తే సమస్యలు మొదలైన అంశాలపై ఆచార్య పరిశోధనలు చేశారు. ప్రభుత్వ బ్యాంకులకు ‘ఆచార్య’ ఔషధం? ఆచార్యకు భారత బ్యాంకింగ్ వ్యవస్థపై అపార అవగాహన ఉంది. బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించిన బాసెల్ 3 నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయని వాదించే వర్గాలకు ఆచార్య నియామకం రుచించకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ బాగుపడాలంటే ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను సరిదిద్దాలని, బాసెల్ నిబంధనలు మరింత కఠినతరంగా ఉండాలని ఆచార్య ఒక పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ’ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఎక్కువగా రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా వచ్చే అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్పనిసరిగా గణనీయంగా మూలధనం సమకూర్చుకోవాలి లేదా తమ మూలధనానికి తగ్గట్లుగా అసెట్స్ అయినా తగ్గించుకోవాలి’ అని ఆయన వివరించారు. 2015లో రాజన్ నిర్వహించిన అసెట్ క్వాలిటీ సమీక్ష అనేది నిజానికి ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆచార్య వ్యాఖ్యానించారు. ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా మెరుగైన ప్రైవేట్ బ్యాంకుల్లో విలీనం చేయడం, ఆటోమేటిక్‌గా మూలధనం సమకూర్చడం, డిపాజిట్ బీమా పథకం ప్రవేశపెట్టి బ్యాంకుల రిస్కులను మదింపు చేయడం మొదలైన చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. బాసెల్ వంటి నిబంధనలు ఒక్కో బ్యాంకు పాటించాల్సిన నిబంధనలే సూచిస్తున్నాయే తప్ప పూర్తి వ్యవస్థను పటిష్టం చేసేవిగా లేవన్నది ఆచార్య అభిప్రాయం. ఫలితంగా ఒక్కో బ్యాంకు దేనికదే రిస్కులను పరిమితం చేసుకునే చర్యలు తీసుకున్నా .. పెను సంక్షోభాలేవైనా వచ్చినప్పుడు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు రిస్కులు తప్పకపోవచ్చని ఆయన అంటారు. రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన నియామకంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల పర్వం మొదలవుతుందన్న అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. -
పెద్దనోట్ల రద్దుపై రాజన్ ఏమన్నారు?
అహ్మదాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రాజీనామా చేసిన రఘురామ రాజన్ మొదటి సారి అహ్మదాబాద్ ఐఐఎం-ఎ ను సందర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ క్యాంపస్ లో ప్రసంగించారు. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్శిటీ విశిష్ట్ ప్రొఫెసర్ గా 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థ:అవకాశాలు మరియు సవాళ్లు' అనే అంశంపై లెక్చరిచ్చారు. కానీ పెద్ద నోట్ల రద్దుపై ఒక ముక్క కూడా మాట్లాడకపోవడం విశేషం. డీమానిటైజేషన్ పై ఎలాంటి ప్రస్తావన లేకుండానే ఆయన ప్రసంగ పాఠం ముగిసింది. డీమానిటైజేషన్ సహా దేశంలోని కొన్ని నిర్దిష్ట ఆర్థిక అంశాల ప్రస్తావన ఉంటుందని విశ్వసించిన వారికి నిరాశే ఎదురైంది. రాజన్ ఉపన్యాసానికి శ్రీ రామకృష్ణ ప్రెవేట్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు గోవింద ధోలకియా, మేనేజింగ్ డైరెక్టర్ ప్రొ.రాహుల్ ధోలకియా ప్రొఫెసర్లు, ఆశిష్ నందా, రాకేష్ బసంత్ తదితరులు విచ్చేసారు. వీరితోపాటు ఐఐఎం బోధనా సిబ్బంది, విద్యార్థులు , 1987 పూర్వ విద్యార్థులు బ్యాచ్ , ఇతర పూర్వ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలతో పరిశ్రమ మరియు విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యం తో ఈ వార్షిక ఉపన్యాసాలను శ్రీ రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తోంది. ఈ సిరీస్ లో మొదటి ఉపన్యాసాన్ని రాఘురాజన్ ఇచ్చారు. -
మళ్లీ బోధనకు సిద్ధమైన రాజన్...
న్యూయార్క్: ఆర్బీఐ గవర్నర్‌గా తనదైన ముద్రవేసి ఈ నెల 4న పదవీ విరమణ చేసిన రఘురామ్ రాజన్... తన మునుపటి వృత్తి బోధనను త్వరలోనే చేపట్టనున్నారు. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నేషనల్ కార్పొరేట్ ఫైనాన్స్ అనే అంశంపై విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. ఈ మేరకు 2016-17 సంవత్సరానికి సంబంధించి రాజన్ కోర్స్ షెడ్యూల్ వివరాలను చికాగో బూత్ స్కూల్ ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక రంగం మరింతగా అనుసంధామై ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎదురయ్యే సవాళ్లపై రాజన్ బోధన ఉంటుంది. -
రాజన్ పై ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ..మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన ఆయన రాజన్ అనుసరించిన విధానాలను ప్రశంసించారు. బ్యాంకులకు పెరుగుతున్న మొండి బకాయిల సెగ మంచి పరిణామం కాదని పేర్కొన్న ప్రణబ్ బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దిశలో నడిపించేందుకు రాజన్ తగిన చర్యలను తీసుకున్నారని ప్రశంసించారు. అందుకు రాజన్ చాలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వరుస సంక్షోభాలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రభావితమైందనీ, మొత్తంగా ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల మొత్తం పనితీరు అంత ప్రకాశంగా, సంపన్నంగా లేదని చెప్పారు. అయితే ఈ సమయంలో దేశ ఆర్థికవ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ లు సహేతుకంగా పని చేశాయని చెప్పారు . అలాగే అంతర్జాతీయంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంక్షోభంలో ఉండగా, భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా, దృఢముగా ఉండడంపై అందరూ తనను అడిగేవారన్నారు. ప్రాథమిక పునాదులు, దేశ స్థూల ఆర్థిక సూచీల బలంతో భారత ఆర్థిక వ్యవస్థ సహేతుకంగా, బాగా రాణించడం తనకు సంతోషాన్నిచ్చే అంశమని ప్రణబ్ వ్యాఖ్యానించారు. కాగా ఆర్ బీఐ గవర్నర్ గా సెప్టెంబర్ 4న పదవీవిరమణ చేసిన రాజన్ పై మాజీ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు విశేషంగా మారాయి. -
ప్రపంచ వడ్డీరేట్లపై రాజన్ హెచ్చరిక
ముంబై : తక్కువ వడ్డీరేట్లపై మొగ్గుచూపుతున్న ప్రపంచ దేశాలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. తక్కువ వడ్డీరేట్లు ఆర్థిక సంస్కరణలకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. తక్కువ వడ్డీరేట్ల విధానాలు పాటిస్తున్న అతిపెద్ద ఆర్థిక దేశాలు యూఎస్, యూరప్, జపాన్‌లు గ్లోబల్ ఎకానమీలో ఇంకా నిదానంగానే ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. ఎక్కడైతే మానిటరీ పాలసీ తేలికగా ఉంటుందో అక్కడ తక్కువ వడ్డీరేట్లు అవలంభించాలో లేదో నచ్చినట్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తక్కువ వృద్ది రేటు చూడాల్సి వస్తుందనే ఆందోళనతో వడ్డీరేట్లు పెంచడానికి చాలా సెంట్రల్ బ్యాంకులు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఆర్థికాభివృద్దిని పుంజుకునేలా చేయడానికి పాలసీలో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేశారు. ఆయన తదుపరి గవర్నర్ బాధ్యతలను ఉర్జిత్ పటేల్ సోమవారం చేపట్టారు. రాజన్ ఆర్బీఐ పదవిలో కొనసాగినంత కాలం అధిక వడ్డీరేట్లను అవలంభించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విధానాలే దేశంలో అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టడానికి దోహదం చేశాయని ఆర్థిక విశ్లేషకులు కొనియాడిన సంగతి తెలిసిందే. -
'మై నేమ్ ఈజ్ రాజన్.. రఘురాం రాజన్'
ఆర్బీఐ గవర్నర్‌గా అతి తక్కువకాలంలో తనదైన ముద్రవేసిన రఘురాం రాజన్ ఆదివారం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన వారసుడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పగ్గాలను ఉర్జిత్ పటేల్ చేపట్టారు. రాజన్ నిక్కచితనం గల ఆర్థికవేత్త. ముక్కుసూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆయన నైజం. చాలా అంశాల్లో ఆయన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ మళ్లీ తన పాతవృత్తి ఉపాధ్యాయ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. రాజన్ పలుసందర్భాల్లో చేసిన వ్యాఖ్యలివి. ఆయన మంచి బ్యాంకర్ కాదు.. హాస్య చతురత కలిగిన వక్త అని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. ఇప్పటికీ మనం సంతృప్తికరమైన స్థానాన్ని సాధించాల్సిన అవసరముంది. 'గుడ్డివాళ్ల దేశంలో ఒంటికన్నువాడే రాజు' అనే సామెత ఉంది. మనం అదే దారిలో సాగుతున్నాం. నేను వినాశకారినో, విషాద వ్యక్తినో కాదు వ్యవస్థతో మంచి సంబంధాలు కలిగిన సంపన్న అక్రమార్కులను ఎవరూ పట్టించుకోవడం లేదు. మనం నిరంతర వృద్ధి సాధించాలంటే అలాంటి వారికి రక్షణ కల్పించే సంస్కృతికి ఫుల్స్టాప్ పెట్టాలి. నన్ను మీరెలా పిలుస్తారో నాకు తెలియదు. శాంట్ క్లాజ్ అని పిలుస్తారో, లేక డేగ అని అంటారో కానీ, నా పేరు రఘురాం రాజన్. నేనేం చేయాలనుకుంటానో అదే చేస్తాను. జేమ్స్ బాండ్ ఇమేజ్ కావాలని నేను కోరుకోవడం లేదు. కానీ, ముందుకునడింపించే బ్యాంకర్‌గా ఉండాలనుకుంటున్నా. బ్యాంకర్ దయ వల్ల కాదు.. డబ్బును సృష్టించాలన్న అతని ఆలోచన వల్లే మనకు ప్రతిరోజు ఉదయం ఆహారం దొరుకుతోంది. మనం డేగలం కాదు. పావురాళ్లమూ కాదు. మనం నిజానికి గబ్బిలాలం. అంచనాలు చాలా ఉన్నాయి. కానీ నేనేమీ సూపర్‌మ్యాన్ ని కాదు. భారత్‌లో ఇలాంటి కోలాహలం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. -
గవర్నర్ హోదా పెంచండి - రాజన్ అల్విదా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. కేంద్ర బ్యాంకు స్వతంత్రాన్ని కాపాడాలన్న వాదనను మరోసారి సమర్ధించుకున్న రాజన్.. ఆర్బీఐ గవర్నర్ హోదాను పెంచాలని కోరారు. గవర్నర్‌కు ప్రస్తుతం కేబినెట్ సెక్రటరీ హోదా ఉంది. రిజర్వ్ బ్యాంకు స్వేచ్ఛను కాపాడాలని ఉద్ఘాటించిన రాజన్, భారతదేశంలో అసమానమైన ప్రాముఖ్యత ఉన్న స్థూల ఆర్ధిక స్థిరత్వానికి బలమైన, స్వతంత్ర రిజర్వ్ బ్యాంక్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. బ్యాంక్ పాత్రను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా సంస్థ సామర్థ్యాన్ని కాపాడాలన్నారు. సంస్థలో తన మిగులునుంచి ప్రభుత్వానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ కింద పని చేయాలి తప్ప, ఇతర అన్ని నిరోధకాలకు, ఆటంకాలకు అనువుగా ఉండకూదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా రేపటితో (సెప్టెంబర్ 4, ఆదివారం) రాజన్ పదవీ కాలం ముగియనుంది. నూతన గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ మంగళవారం బాధ్యతలను స్వీకరించనున్న సంగతి తెలిసిందే. -
పదవిలో కొనసాగాలనుకున్నా- రాజన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ విరమణకు కేవలం రెండు రోజుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలని అనుకున్నానని కానీ, అది సాధ్యపడలేదని జాతీయ మీడియాతో తెలిపారు. కొన్ని అంసపూర్ణ చర్యల నేపథ్యంలో తాను రెండవసారి గవర్నర్ గా కొనసాగాలని భావించానని తెలిపారు. కానీ అది నెరవేరలేదని తెలిపారు. దీనిపై మరింత వివరించడానికి నిరాకరించిన రాజన్ తన వివాదాస్పద ప్రసంగాలను సమర్థించుకున్నారు. ఐఐటీ ఢిలీలో సహనం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఆలోచనలతో కూడిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఆయన వివరణ ఇచ్చారు. కొంతకాలం పాటు పబ్లిక్ స్పీక్ కు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. తాను నిజానికి దేశంలోని కొన్ని అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలనుకుంటున్నానీ, దీనికోసం దేశం చుట్టి రావాలనుకుంటున్నానని చెప్పారు. ఊర్జిత్ కు తాను సలహాలు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు. అతనిమీద తనకు విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత అన్ని విషయాలపై ఆయనకు వివరించాననీ, ఆయన ధోరణి ఆయకుందని రాజన్ చెప్పారు. ఇపుడిక మళ్లీ అకాడమీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. చాలాకాలం దూరంగా ఉన్న పరిశోధన, బోధన రంగానికి వెళ్లాలన్నారు. అక్కడ ఎన్నాళ్లు అన్నదే ప్రశ్న అని రాజన్ వ్యాఖ్యానించారు. అలాగే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత దిగి వస్తుందన్నారు. జులై నెలలో ఇది అంతకంటే ఎక్కువే (6.07 శాతం) ఉంది. 6 శాతం కంటే తక్కువే ఉంచాలన్నదే తన లక్ష్యమనీ, అది సాధించాకే తన పదవీకాలం ముగిసిందని రాజన్ తెలిపారు. కాగా ఈనెల (సెప్టెంబర్) 4వ తేదీన రాజన్ పదవీ కాలం ముగియనుంది. ఆర్ బీఐ నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నియమితులైన సంగతి తెలిసిందే. -
ద్రవ్యోల్బణంపై పోరాటాన్ని...పటేల్ కొనసాగిస్తారు
⇔ తదుపరి గవర్నర్‌పై రాజన్ విశ్వాసం ముంబై : ప్టెంబర్ 4న పదవీ విరమణ చేయనున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తన వారసుడు ఉర్జిత్ పటేల్ గురించి తొలిసారిగా స్పందించారు. ద్రవ్యోల్బణం అరికట్టడానికి తాను మొదలు పెట్టిన పోరాటాన్ని పటేల్ కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో శుక్రవారం జరిగిన ఫారెక్స్ డీలర్స్ అసోసియేషన్ వార్షికోత్సవ సమావేశంలో రాజన్ మాట్లాడారు. ‘నేను నమ్మకంతో చెబుతున్నాను. మూడేళ్లుగా ద్రవ్యపరపతి విధానంపై నాతో సన్నిహితంగా కలసి పనిచేసిన ఉర్జిత్ పటేల్... ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానిటరీ పాలసీ కమిటీకి తగిన మార్గదర్శనం చేస్తారు’ అని రాజన్ చెప్పారు. ఆర్బీఐ తదుపరి గవర్నర్‌గా ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను నియమిస్తూ గత శనివారం కేంద్రం ప్రకటన జారీ చేసిన తర్వాత దీనిపై రాజన్ స్పందించడం ఇదే తొలిసారి. రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుతుంది... 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తీసుకురావాలన్నది ఆర్బీఐ లక్ష్యం. కానీ జూలైలో ఇది 6 శాతాన్ని దాటిపోవడంపై రాజన్ స్పందిస్తూ... రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయని, దాంతో ముందు ముందు ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న దానిపై తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. కాగా, మౌలిక రంగానికి రుణాలు అందించడం వంటి జాతీయ ప్రాధాన్యతల దృష్ట్యా రుణాల జారీ నిబంధనలను సరళీకరించాలన్న సూచనలను రాజన్ తిరస్కరించారు. ఆర్బీఐ వ్యవస్థాపరమైన స్థిరత్వం విషయంలో రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఆర్బీఐ త్యాగం చేయాలని కోరుకోవడం బదులు ప్రభుత్వమే ఇలాంటి పనులకు సబ్సిడీ అందించాలన్నారు. -
రాజన్ ‘వంటకాలు’ ట్రై చేస్తారా!
♦ ఆర్బీఐ గవర్నర్ సేవలకు గుర్తింపుగా 2 ప్రత్యేక వంటకాలు... ♦ బెంగళూరు ఫుడ్ చైన్ ‘జంగ్రీ’ వడ్డింపు... బెంగళూరు: ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్లపాటు పాలసీ విధానాన్ని వండి ‘వడ్డి’ంచి తనదైన ముద్రవేసిన రఘురామ్ రాజన్‌ను బెంగళూరుకు చెందిన ఫుడ్ చైన్ సంస్థ ‘జంగ్రీ’ వెరైటీ వంటకాలతో గౌరవిస్తోంది. ఆర్బీఐ చీఫ్‌గా రాజన్ విశిష్టసేవలకు గుర్తింపుగా రెండు ప్రత్యేక డిష్(ఒకటి స్వీట్, మరొకటి హాట్)లను వడ్డిస్తోంది. ఉలుందు కోజుకట్టాయ్, కోవా కోజుకట్టాయ్ పేర్లతో లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ వంటకాలు అందుబాటులో ఉంటాయని జంగ్రీ తెలిపింది. ‘రాజన్‌తో అనుబంధం ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలివి. ఉలుందు కోజు కట్టాయ్ రేటు రూ.100 కాగా, కోవా కోజు కట్టాయ్ రూ.150కి లభిస్తుంది. నేటి(26) నుంచి సెప్టెంబర్ 2 వరకూ(రాజన్ పదవీకాలం ముగింపు రోజు) మాత్రమే ఈ వంటాకాలు అందుబాటులో ఉంటాయి’ అని జంగ్రీ పేర్కొంది. డాక్టర్ రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా అటు సామాన్య ప్రజలతో పాటు తమలాంటి ఎంట్రప్రెన్యూర్స్‌కు అనుకూలంగా కీలక నిర్ణయాలతో ఎంతగానో ప్రభావితం చేశారని.. దీనికి గౌరవసూచకంగా ఈ ప్రత్యేక వంటకాలను ప్రవేశపెట్టినట్లు జంగ్రీ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ కాల్యా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ చర్యలను తీసుకోవడంతోపాటు బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలకు అడ్డుకట్టవేయడం ఇతరత్రా అనేక కీలక సంస్కరణలను రాజన్ తన పదవీకాలంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ‘రాక్‌స్టార్’ రాజన్‌గా పేరొందిన ఆయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కేంద్రం ఆర్బీఐ చీఫ్‌గా ఎంపిక చేయడం తెలిసిందే. ఇంతకీ ఈ వంటకాల సంగతేంటే... ఉలుందు కోజుకట్టాయ్ అనేది రాజన్ పుట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వంటకాన్ని నమూనాగా తీసుకొని జంగ్రీ రూపొందించింది. ఇక కోవా కోజుకట్టాయ్ అనేది రాజన్ పూర్వీకులతో సంబంధం ఉన్న తమిళనాడు తీపి వంటకం నుంచి రూపొందించారు. -
ఆర్బీఐకి కొత్త సారథ్యం
సంఘ్ పరివార్ ఆశీస్సులున్నవారికే కీలక పదవులు ఖాయమవుతున్నాయని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఎంపిక కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చునని వెలువడిన అంచనాలు తారుమారయ్యాయి. వచ్చే నెలలో పదవినుంచి నిష్క్రమించబోతున్న ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎంపికయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌పై ఈసారి జరిగినంత చర్చ, హడావుడి ఇంతకుముందెన్నడూ లేదు. ఆ పదవిలో ఉన్నవారు ప్రభుత్వంతో విభేదించడం కొత్తేమీ కాదు. కానీ రాజన్ తీరుతెన్నులే వేరు. వడ్డీ రేట్ల కోత మొదలుకొని పలు అంశాల్లో ఆయన పాలకుల ఆశలకు అనుగుణంగా వ్యవహ రించలేకపోవడమే కాదు... అన్వయానికొచ్చేసరికి అంతరార్ధమే మారిపోవచ్చునన్న భయం కూడా లేకుండా మాట్లాడారు. ఒక్కోసారి అసలు కంటే ఈ విసురులే అధికార పక్షాన్ని బాధించాయి. దేన్నయినా ఒక ఎజెండాగా మార్చి వెంటపడటంలో సిద్ధహస్తుడైన బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తన బాణాలు రాజన్‌పై ఎక్కు పెట్టినప్పుడు దాని వెనక ప్రభుత్వంలోనివారే ఉండొచ్చునని చాలామంది భావించ డానికి కారణం అదే. ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగానైనా జోక్యం చేసుకుని ఆయనను అదుపు చేయడం, ఈలోగా రెండో దఫా ఈ పదవిని చేపట్టబోనని రాజన్ ప్రకటించడంతో ఆ అంకం సద్దుమణిగింది. అయితే రాజన్ ప్రకటన వాణిజ్య, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఎవరూ మరిచిపోలేదు. ఆయన విధానాలను విమర్శించినవారు సైతం రాజన్నే కొనసాగించడం దేశ ఆర్థిక వ్యవస్థకు అన్నివిధాలా శ్రేయస్కరమని అప్పటినుంచీ సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించని కేంద్రం చివరకు ఉర్జిత్‌ను ఎంపిక చేయడం ద్వారా విధానపరమైన అంశాల్లో యధా తథ స్థితి కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చినట్టు కనబడుతోంది. రిజర్వ్ బ్యాంకు అన్నది మౌలికంగా ప్రభుత్వానికి చెందిన కీలక అంగం. దానికి సారధ్యంవహించేవారు ద్రవ్యపరమైన అంశాల్లో, ఇతర నియంత్రణల్లో ప్రభు త్వంతో కలిసి పనిచేయక తప్పదు. వారు సర్వ స్వతంత్రంగా వ్యవహరించలేరు. అలాగని ప్రభుత్వానికి డూడూ బసవన్నల్లా మెలిగి చెప్పిందల్లా చేయడమే తమ విధి అన్నట్టు ప్రవర్తిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమవుతుంది. ఈ విషయంలో ఆర్బీఐ గవర్నర్లుగా గతంలో పనిచేసినవారు తగినంత అప్రమత్తతతోనే ఉన్నారు. వడ్డీ రేట్ల కోత విషయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న దువ్వూరి సుబ్బారావు లొంగలేదు. బహిరంగంగా చిదంబరం విరుచుకుపడినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంతగాకపోయినా అలాంటి స్థితే రాజన్‌కూ ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నా...ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించని కారణంగా బండి ముందుకు కదలడం లేదని సుబ్రహ్మణ్యస్వామి నేరుగా అని ఉండొచ్చుగానీ అలాంటి అభిప్రాయమే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలో కూడా ఉంది. వృద్ధి రేటు బాగున్నది గనుక ఆర్బీఐ చేయాల్సింది చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన చాలాసార్లు వ్యక్తం చేశారు. ఆ ‘చేయాల్సింది’ వడ్డీ రేట్ల కోతేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ రాజన్ మాత్రం దృఢంగా ఉన్నారు. జీడీపీ గణాంకాలు ఎంతగా మెరిసి పోతున్నా ఆయన నిగ్రహం చెక్కుచెదరలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పగా ఉన్నదని ఐఎంఎఫ్ లాంటి సంస్థ సర్టిఫికెట్ ఇచ్చినా మనం ఇంకా సంతృప్తికర స్థాయికి చేరుకోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. దేశ పురోగతికి ఆర్థిక వృద్ధి కొలమానం కావొచ్చుగానీ అదే పూర్తిస్థాయిలో వాస్తవ స్థితిని ప్రతిబిం బించలేదని అన్నారు. ఇలా అనడం, అందుకు తగినట్టుగా విధానాలు నిర్ణయించి అమలు చేయడం ఏటికి ఎదురీదడం. మొదటినుంచీ ఆయన దృష్టంతా వృద్ధి రేటుపై కాక ద్రవ్యోల్బణంపై ఉంది. దానికి కళ్లెం వేసి ధరల స్థిరత్వాన్ని సాధిం చాలని ఆయన భావించారు. అటు కేంద్రం సైతం వచ్చే అయిదేళ్లలో ద్రవ్యో ల్బణాన్ని 4 శాతం దాటనివ్వరాదన్న లక్ష్యంతో ఉంది. మరి వైరుధ్యం ఎక్కడొ చ్చింది? వడ్డీ రేట్ల కోతతో మార్కెట్లోకి భారీగా పెట్టుబడులొస్తాయని, పర్యవసా నంగా కార్యకలాపాలు పుంజుకొని ఉపాధి, వినిమయం వంటివి పెరిగి జీడీపీ పరుగులు పెడుతుందని ప్రభుత్వ అంచనా. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయకపోతే వడ్డీ రేట్ల కోతతో మార్కెట్లోకి ప్రవేశించే పెట్టుబడులన్నీ ధరల ఉప్పెనలో కొట్టుకుపోతాయని రాజన్ ఆందోళన. ఇప్పుడు రాజన్ స్థానంలో రాబోతున్న ఉర్జిత్ పటేల్ ఇలా స్వతంత్రంగా వ్యవ హరించగలరా? ఆయన ముందు చాలా సవాళ్లున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని పీడిస్తున్న మొండి బకాయిల విషయంలో రాజన్ ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. ఎగవేతదార్లనుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సి ఉంది. రూపాయి విలువను కంటికి రెప్పలా కాపాడటం మరో ముఖ్యౖ మెన బాధ్యత. ఉర్జిత్ అప్పటి యూపీఏ పాలకులకైనా, ఇప్పటి ఎన్డీఏ పాల కులకైనా ఇష్టుడే. 2013లో ఆయన్ను రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా తీసుకు రాదల్చుకున్నప్పుడు అప్పటికి అమెరికా గ్రీన్‌కార్డు ఉన్న ఉర్జిత్‌కు భారతీయ పౌరసత్వమివ్వాలంటూ సిఫార్సు లేఖ రాసింది నాటి ప్రధాని మన్మోహన్ సింగే. గుజరాత్ మూలాలున్నాయి గనుకా, ఆయన పనితీరు తెలుసు గనుకా నరేంద్ర మోదీకి సైతం ఆయన నచ్చినట్టున్నారు. వచ్చే అయిదేళ్లలో ద్రవ్యోల్బణం 4 శాతం మించకూడదన్న నిర్ణయం వెనక సూత్రధారి ఉర్జిత్ పటేలే. వడ్డీ రేట్లతోపాటు అన్ని కీలకాంశాలనూ నిర్ణయించడానికి ఇకపై ఆర్బీఐకి ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర నిర్ణయం ఆయన ఇచ్చిన నివేదిక పర్యవసానంగా రూపొందిందే. అయితే అలాంటి కమిటీ ఏర్పాటైతే కొత్త పదవిలో ఉర్జిత్ ఏమేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరో, ఎంతవరకూ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరో చెప్పడం కష్టమే. -
అది మూర్ఖత్వమే.. కొత్త గవర్నర్‌పై స్వామి వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: విదేశాలతో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ దిగిపోతున్న గవర్నర్ రఘురాం రాజన్ దుయ్యబట్టిన సుబ్రహ్మణ్యస్వామి.. కొత్త గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్ విషయంలో ఒకింత సానుకూల స్పందించారు. కెన్యాలో పుట్టినందుకు ఉర్జిత్ పటేల్‌ను ఎవరైనా విమర్శిస్తే.. అంతకంటే మూర్ఖత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి కొత్త గవర్నర్‌కు బీజేపీ ఎంపీ అయిన స్వామి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తున్నదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 'ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు. కానీ ఆర్3 (రఘురాం రాజన్) మాత్రం భారత్‌లో పుట్టి, అమెరికా గ్రీన్ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్‌లోనే ఉంటున్నా.. దానిని వదులుకోవడం లేదు' అని స్వామి ట్విట్టర్లో విమర్శించారు. రఘురాం అనగానే విమర్శలతో ఒంటికాలిపై లేచే స్వామి.. ఆయనను ఉద్దేశించి 'ఆర్3' అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అమెరికా అనుకూలుడంటూ దుయ్యబట్టారు. -
ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్
-
ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్
- ఉత్కంఠకు తెరదింపిన కేంద్రం - డిప్యూటీ గవర్నర్ నుంచి పదోన్నతి - సెప్టెంబర్ 4న బాధ్యతలకు అవకాశం న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఒక ఉత్కంఠకు కేంద్రం శనివారం తెరదింపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పేరును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం విభాగాలకు ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. ద్రవ్యోల్బణంపై పోరు సాగించడంలో ‘రాజన్ ఇన్ఫ్లేషన్ వారియర్’గా పటేల్‌కు పేరుంది. సెప్టెంబర్4వ తేదీతో ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పూర్తవుతుంది. అదే రోజు ఆర్బీఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం మూడేళ్లు. డిప్యూటీ గవర్నర్‌గా ఉంటూ... గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న ఏడవ వ్యక్తి పటేల్. ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశం జరిపిన 48 గంటల లోపే తాజా వార్త వెలువడ్డం గమనార్హం. అపార అనుభవం... 52 సంవత్సరాల పటేల్, 1963 అక్టోబర్ 28న జన్మించారు. యేల్ యూనివర్సిటీ నుంచి 1990లో ఆర్థికరంగంలో డాక్టరేట్ తీసుకున్నారు. అంతక్రితం 1986లో ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ చేశారు. 1990-1995 మధ్య అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో పనిచేసిన ఆయన, అమెరికా, భారత్, బహమాస్, మయన్మార్ ఆర్థిక అంశాలను పర్యవేక్షించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కూడా గతంలో పనిచేశారు. డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు సంబంధించి ఎనర్జీ, ఇన్ఫ్రా సలహాదారుగా ఉన్నారు. 1998-2001 మధ్య భారత్ ఆర్థిక వ్యవహారాల శాఖలో కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్ల పదవీ కాలానికి సంబంధించి 2013 జనవరి 11న ఆయన డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రిజర్వ్ బ్యాంక్‌లో ప్రస్తుత సంస్కరణలకు ప్రాతిపదికగా ఉన్న పరపతి విధాన నివేదిక రూపకల్పన బృందానికి కూడా ఆయన నేతృత్వం వహించారు. ద్రవ్యోల్బణం లక్ష్యాల సాధన, రెపో రేటుసహా కీలక రేట్లను ఒక్క గవర్నర్ కాకుండా ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయం తీసుకునే ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి కీలక సంస్కరణలకు ఈ నివేదికే ప్రాతిపదిక. అలాగే ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం మేర(2 శాతం ప్లస్ లేదా మైనస్) వుండాలనేది పటేల్ కమిటీ తీసుకున్న నిర్ణయమే. ఈ నిర్ణయాన్నే ఇటీవల కేంద్రం ఆమోదించింది కూడా. రాజన్‌కు వారసుడే.... రఘురామ్ రాజన్ తరహాలోనే ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరిని పటేల్ అవలంబిస్తారు. ఈ వైఖరి కారణంగానే భారత్ కరెన్సీ మార్కెట్‌కు స్థిరత్వం వుందని విశ్వసించే విదేశీ ఇన్వెస్టర్లకు ఉర్జిత్ పటేల్ నియామకం ఊరటనిస్తుంద న్నది విశ్లేషకుల అంచనా. తాజా నియామకంతో రేట్ల కోతపై ఆర్బీఐ సరళంగా వుండదన్న అభిప్రాయాన్ని స్టాక్ మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల నిర్ణయం ఆర్బీఐ కమిటీ మెజారిటీ సభ్యులదే అయినప్పటికీ, సభ్యుల ఓట్లు సరిసమానంగా వుంటే ఆర్బీఐ గవర్నర్ ఓటు కీలకమవుతుంది. ఈ సందర్భంలో ఉర్జిత్ పటేల్ రేట్ల కోతకు మొగ్గుచూపరన్నది మార్కెట్ వర్గాల భావన. పటేల్ ముందున్న సవాళ్లు కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న ఉర్జిత్ పటేల్‌కు తక్షణ సవాళ్లు పొంచివున్నాయి. 20-25 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ బాండ్లకు రానున్న నెలల్లో భారత్ చెల్లింపులు జరపాల్సివుంది. రూపాయి విలువ అస్థిరతకు లోనుకాకుండా ఇంత పెద్ద మొత్తంలో డాలరు చెల్లింపులు చేయడం ప్రస్తుతం ఆర్బీఐ ముందున్న తక్షణ కర్తవ్యం. 2013లో రూపాయి విలువ నిలువునా పతనమవుతున్న సమయంలో విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలన్న నిర్ణయాన్ని అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీసుకున్నారు. మూడేళ్ల కాలపరిమితిగల ఆ బాండ్ల పునర్చెల్లింపు ఈ సెప్టెంబర్ నుంచి మొదలుకానుంది. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్యపై పటేల్ పోరాడాల్సివుంది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ శుద్దిచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత గవర్నర్ రఘరామరాజన్ 2017 మార్చికల్లా దీనిని పూర్తిచేయాలన్న డెడ్‌లైన్ బ్యాంకులకు విధించారు. ఇది పరిపూర్తి చేయాల్సిన సవాలు పటేల్ ముందు వుంది. -
'ఆర్ 3' పై సుబ్రహ్మణ్య స్వామి మరోసారి దాడి
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి విమర్శలకు దిగారు. రాజన్ ను 'ఆర్ 3' అని పేర్కొన్న స్వామి దేశంలో రుణాత్మక ద్రవ్యోల్బణ పరిస్థితులకు ఆయనే కారణమంటూ నిందించారు. దీనికి ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా పత్రాన్ని ఆయన కోట్ చేశారు. రాజన్ అనుసరించిన వడ్డీ రేట్ల విధానమే ద్రవ్యోల్బణానికి కారణమన్న సత్యాన్ని ఐఎంఎఫ్ పత్రం తేటతెల్లం చేసిందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. మరికొన్ని వారాల్లో రాజన్ పదవీ కాలం ముగియనుండగా స్వామి తన ఘాటు వ్యాఖ్యలకు మరింత పదును పెట్టడం విశేషం. 2013, సెప్టెంబర్ లో ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరవాత, రాజన్ క్రమంగా స్వల్పకాలిక లెండింగ్ రేట్లను 7.25 శాతం నుంచి 8 శాతం పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ కారణాలను చూపుతూ 2014వరకు అదే రేట్లను కొనసాగించారు. అయితే జనవరి 2015 లో రేట్లు తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి 6.50 శాతంనుంచి 1.50శాతం మేర తగ్గించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వర్కింగ్ పేపర్ ను కోట్ చేసిన స్వామి రాజన్ పై తన విమర్శలను మరోసారి సమర్థించు కున్నారు. వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలో ఉంచి దేశ ఆర్థిక వృద్ధి నాశనానికి కారణమవుతున్నాడని, ఆయన మన దేశానికి పనికిరాడంటూ రాజన్ పై గతంలో పలుసార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. Now IMF has in effect debunked that interest rate raising madness of R3 had a role in inflation control. Personal? pic.twitter.com/Xa2qiFjP6P — Subramanian Swamy (@Swamy39) August 19, 2016