
ద్రవ్యోల్బణంపై పోరాటాన్ని...పటేల్ కొనసాగిస్తారు
⇔ తదుపరి గవర్నర్‌పై రాజన్ విశ్వాసం
ముంబై : ప్టెంబర్ 4న పదవీ విరమణ చేయనున్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తన వారసుడు ఉర్జిత్ పటేల్ గురించి తొలిసారిగా స్పందించారు. ద్రవ్యోల్బణం అరికట్టడానికి తాను మొదలు పెట్టిన పోరాటాన్ని పటేల్ కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో శుక్రవారం జరిగిన ఫారెక్స్ డీలర్స్ అసోసియేషన్ వార్షికోత్సవ సమావేశంలో రాజన్ మాట్లాడారు. ‘నేను నమ్మకంతో చెబుతున్నాను.
మూడేళ్లుగా ద్రవ్యపరపతి విధానంపై నాతో సన్నిహితంగా కలసి పనిచేసిన ఉర్జిత్ పటేల్... ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మానిటరీ పాలసీ కమిటీకి తగిన మార్గదర్శనం చేస్తారు’ అని రాజన్ చెప్పారు. ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌గా ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను నియమిస్తూ గత శనివారం కేంద్రం ప్రకటన జారీ చేసిన తర్వాత దీనిపై రాజన్ స్పందించడం ఇదే తొలిసారి.
రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుతుంది...
2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తీసుకురావాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. కానీ జూలైలో ఇది 6 శాతాన్ని దాటిపోవడంపై రాజన్ స్పందిస్తూ... రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయని, దాంతో ముందు ముందు ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న దానిపై తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. కాగా, మౌలిక రంగానికి రుణాలు అందించడం వంటి జాతీయ ప్రాధాన్యతల దృష్ట్యా రుణాల జారీ నిబంధనలను సరళీకరించాలన్న సూచనలను రాజన్ తిరస్కరించారు. ఆర్‌బీఐ వ్యవస్థాపరమైన స్థిరత్వం విషయంలో రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఆర్‌బీఐ త్యాగం చేయాలని కోరుకోవడం బదులు ప్రభుత్వమే ఇలాంటి పనులకు సబ్సిడీ అందించాలన్నారు.