Inflation
-
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది. రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి. రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు. -
తయారీ రంగం, ఆహార ద్రవ్యోల్బణంపై సూచనలు
బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.స్తబ్దుగా తయారీ రంగందేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్లకు దెబ్బ!ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలుసమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు. -
ట్రూడో తాయిలాలు
టొరంటో: ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై రెండు నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనేడియన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి ‘వర్కింగ్ కెనడియన్స్ రిబేట్’కింద ఒక్కొక్కరికి 250 డాలర్ల చొప్పున పంపిణీ చేయనుంది. ట్రూడో ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులో వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు. కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదు. 250 డాలర్ల రిబేట్‌తో పాటు కెనేడియన్లు డిసెంబర్ 14 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ, హెచ్ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారు’’అని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై రెణ్నెల్లపాటు పన్ను ఎత్తేస్తారు. ట్రూడో ప్రకటనను విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే తప్పుపట్టారు. రెండు నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ‘‘ట్రూడో హయాంలో గృహనిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫుడ్‌బ్యాంక్ వినియోగం ఆకాశాన్నంటుతోంది. ఫెడరల్ కార్బన్ ట్యాక్స్ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది’’అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్ పన్ను, జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం తెలిసిందే. దాంతో తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగీ్మత్ సింగ్ అన్నారు. -
ఆర్థికాభివృద్ధికి ‘ధరల స్థిరత్వమే’ పునాది
ముంబై: ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన అన్నారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సౌత్ దేశాల సెంట్రల్ బ్యాంకుల ఉన్నత స్థాయి విధాన సదస్సులో ఆయన ‘సమతౌల్య ద్రవ్యోల్బణం, వృద్ధి: ద్రవ్య పరపతి విధానానికి మార్గదర్శకత్వం’ అనే అంశంపై ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...⇒ దేశ ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండడం.. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్య సాధనపై ఆర్బీఐ గురి తప్పకుండా చూస్తోంది. ⇒ సుస్థిర ద్రవ్యోల్బణం అటు ప్రజలు, ఇటు ఎకానమీ ప్రయోజనాలకు పరిరక్షిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, పెట్టుబడులకు తగిన వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదపడే అంశమిది. ⇒ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను తట్టుకుని తన స్థిర స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతోంది. అయినప్పటికీ, ఇప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ అనిశ్చితితో కూడిన ఈ వాతావరణంలో ద్రవ్య, పరపతి విధాన రూపకల్పన.. స్పీడ్ బ్రేకర్లతో కూడిన పొగమంచు మార్గంలో కారును నడపడం లాంటిది. ఇవి డ్రైవర్ సహనం, నైపుణ్యాన్ని పరీక్షించే కీలక సమయం. ⇒ ప్రస్తుతం ఎన్నో సవాళ్లు సెంట్రల్ బ్యాంకులకు ఎదురవుతున్నాయి. విధాన నిర్ణేతలు పలు కీలక పరీక్షలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన కాలపు చరిత్రను వ్రాసినప్పుడు, గత కొన్ని సంవత్సరాల అనుభవాలు, అభ్యాసాలు అందులో భాగంగా ఉంటాయి. భవిష్యత్ సెంట్రల్ బ్యాంకింగ్ పరిణామంలో తాజా పరిణామాలు ఒక మలుపుగా మారుతాయి. ⇒ గ్లోబల్ సౌత్ దేశాలకు స్థిరమైన వృద్ధి, ధరలు, ఆర్థిక స్థిరత్వాలను కొనసాగించడం సవాలు. ⇒ కోరుకున్న ఫలితాలను సాధించేందుకు సెంట్రల్ బ్యాంకులు ఎంతో వివేకంతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మేరకు ద్రవ్య, ఆర్థిక, నిర్మాణాత్మక విధానాలను అవలంభించాలి. మరింత దృఢమైన, వాస్తవిక, అతి క్రియాశీల పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించాలి. రేటు తగ్గింపు ఉండకపోవచ్చు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2% అటు ఇటుగా 4% వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 % పైకి పెరగకూడదు. అక్టోబర్‌లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావి స్తున్నారు.ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6% దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. -
సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.తగ్గుతున్న పంటల సాగుదేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టంభౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఆహార ద్రవ్యోల్బణం కీలకంఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ధరలకు రెక్కలు..
న్యూఢిల్లీ: భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో బెంబేలెత్తించింది. 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2%గా నమోదైంది. ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. ⇒ ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెలలో 10.87 శాతం పెరిగింది. ⇒ దేశ వ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.2% ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా, పట్టణ ప్రాంతాల్లో 5.62 శాతంగా నమోదయ్యింది. ⇒1,114 పట్టణ, 1,181 గ్రామీణ మార్కెట్లలో ధరలను వారంవారీగా విశ్లేషించి జాతీయ గణాంకాల కార్యాలయం నెలవారీ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేస్తుంది. -
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24 శాతంగా ఉండేది. అక్టోబర్‌లో ఇది ఏకంగా 10.87 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబరులో నమోదైన 5.87 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో 6.68 శాతానికి చేరింది. పట్టణ ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో 5.05 శాతం నుంచి 5.62 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.81-6 శాతానికి చేరువగా ఉంటుందని రాయిటర్స్ పోల్ ఇటీవల అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా గణాంకాలు వెలువడ్డాయి.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!భగ్గుమంటున్న కూరగాయలువంట సామగ్రి, కూరగాయలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఉల్లిపాయ హోల్‌సేల్ ధరలు కిలోగ్రాముకు రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. -
గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?
భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయదారులపైన, వ్యవసాయ సంస్కృతి పైన చూపిన నిర్లక్ష్యం. దానికి విరుగుడుగా దేశంలో కోట్ల మందిగా ఉన్న గ్రామీణ కూలీలకు కనీస బతుకుదెరువు కల్పించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగ అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం అని గుర్తించాలి.భారతదేశంలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గానికి, అందునా దళిత బహుజన వర్గాలకు ఆచారణాత్మక విరో ధాన్ని ప్రకటిస్తున్నాయి. దానికి రుజువు ఏమిటంటే, పేద ప్రజలకు మేలు కలిగించి వారి పొట్ట నింపుతూ వారికి గ్రామాల్లో నివసించే పరిస్థితిని కల్పించిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని(ఎంజీ–ఎన్ఆర్ఈజీఎస్) నీరు గార్చడం. ఇది పేద లను గ్రామాల నుంచి తరిమేసి, గ్రామాలను కార్పొరేట్లకు అప్పజెప్పే దుష్ట యత్నం. దేశంలో కోట్ల మందిగా వున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ ఇవ్వడం కోసం స్వాతంత్య్రానంతరం వచ్చిన ఒకే ఒక్క పథకం – గ్రామీణ ఉపాధి హామీ. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నాడు వామపక్షాల మద్దతు అనివార్యమైంది. దాంతో వామపక్షాలు డిమాండ్ చేసినట్టుగా గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధంగా అమలు చేయాల్సి వచ్చింది. 2005 ఆగస్ట్ 23న దేశ పార్లమెంట్ చారిత్రాత్మకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండమీదపల్లి గ్రామంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది.నిజానికి మన్మోహన్ భారతదేశానికి ఉపకరించే అనేక ఉపయో గకరమైన పనులు నిర్వర్తించారు. ఉపాధి హామీ పథకం రూపకల్ప నలో ఆంధ్ర క్యాడర్‌కు సంబంధించి ఢిల్లీలో పనిచేసిన కొప్పుల రాజు ప్రభావం ఉంది. ఆయన మీద ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పోరా టాల ఫలితం ఉంది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగపు అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం.అంతర్జాతీయస్థాయిలో మానవాభివృద్ధిని గణించినట్లు, భారత దేశంలో కూడా లెక్కించడానికి ప్రణాళికాసంఘం ఆధ్వర్యంలో ప్రయ త్నాలు జరిగాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మానవాభి వృద్ధిలో మెరుగైన పనితీరును ప్రదర్శించాయి. కానీ ఆర్థికాభివృద్ధికీ, మానవాభివృద్ధికీ మధ్య ఉండే ధనాత్మక సహసంబంధం మధ్యంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్వయించడం లేదు. అయితే కేరళ రాష్ట్రం మానవాభివృద్ధిలోనూ, ఆర్థికాభివృద్ధిలోనూ సమాన మెరుగుదల కనబరుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా మొదలైనవాటి పనితీరుతో కేరళ రెండింతల మెరుగుదల కన బరిచింది. పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా మొదలైన రాష్ట్రాలు చెప్పుకోతగ్గ పురోగతిని సాధించాయి. క్లుప్తంగా చెప్పాలంటే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మానవాభివృద్ధిలో మంచి ఫలితాలను సాధించాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మానవాభివృద్ధిలో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నప్పటికీ, వాటి మధ్య అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయ దారులపైన, వ్యవసాయ సంస్కృతిపైన చూపిన నిర్లక్ష్యం. భారతదేశంలో కుల కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ రూపొందడానికి కారణాలను అంబేడ్కర్ ఆనాడే పసిగట్టారు. పేద ప్రజలను కులం ద్వారా విభజించి వారికి రాజ్యాధికారం రాకుండా చేయడానికే ప్రయత్నాలు జరి గాయి. అంబేడ్కర్ 1942లోనే మహరాష్ట్ర ‘కొలాబా’ జిల్లాలో అణ గారిన వర్గాల సభలో మాట్లాడుతూ, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు, ఆర్థిక పెత్తందారులు, భూస్వాములు కలిసి శ్రామిక వర్గాలను ఏకం కాకుండా చేసి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారన్నారు. ‘‘అణగారిన వర్గాల వారి ఉద్యమం ఇతర శ్రామికజనంతో కలిసి ముందుకు సాగాలని నేను ఆత్రుత పడుతున్నాను. ఈ లక్ష్యాన్నిదృష్టిలో ఉంచుకునే, బ్రాహ్మణేతర వర్గానికి చెందిన శ్రమజీవులు తమ స్వేచ్ఛకోసం ఎప్పుడో ఒకప్పుడు మహత్తర పోరాటం చేస్తారన్న ఆశ తోనే గత పదేళ్ళుగా బ్రాహ్మణేతర పార్టీలో కొనసాగుతున్నారు. మా పార్టీకి తన అంతరాంతరాలలో ప్రజాస్వామ్య బీజాలు ఉన్నాయి. దుర దృష్టవశాత్తు ఈ పార్టీ నాయకులు తమ బాధ్యతలను గుర్తించకుండా ఒకవైపున ప్రభుత్వం, మరోవైపున కాంగ్రెస్ ప్రభావం వల్ల ఈ పార్టీ ఛిన్నాభిన్నం కావడానికి దోహదం చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో వారు ఏమైనా చేయగలిగితే నేను ఆహ్వానిస్తాను. బ్రాహ్మణే తరులైన శ్రమజీవులు మా పార్టీలో చేరాలని నేను పట్టబట్టడం లేదు. కావాలనుకుంటే వారు వేరే పార్టీ పెట్టుకోనివ్వండి. అయినా బ్రాహ్మ ణులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా మనందరం కలిసి ఉమ్మడి పోరాటం చేయవచ్చు. అణగారిన వర్గాల వారు విడిగా ఒక రాజకీయ పార్టీ నడిపితే శ్రామికజన ప్రయోజనాలు దెబ్బతింటాయని కొందరు అంటున్నారు. దానివల్ల అలాంటిది ఏమీ జరగదు. అట్టడుగున ఉన్న మన పోరాటం నిజానికి ఇతర శ్రామిక వర్గాల వారి కష్టాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. భవనంలోని అట్టడుగున ఉన్న పునాదిరాయి కదిలితే, పైన ఉన్నవి పట్టు సడలుతాయి. కేవలం సవర్ణ హిందు వులతో మాత్రమే కూడిన కార్మిక సంస్థ ఉంటే హిందువులకు మేలు కలుగుతుందని ఏమీ లేదు. ఒకవేళ ఆ కార్మిక సంస్థకు సరైన మార్గ దర్శనం లేకపోతే ఆ అణగారిన వర్గాల హిందువులకు మేలు కలుగు తుందని గ్యారెంటీ కూడా ఏమీ లేదు. పైగా హాని కూడా జరగొచ్చు. అనేక సందర్భాలలో జరిగినట్టు వారి హక్కులను కాలరాయడానికి ఉపయోగపడవచ్చు.’’ అంబేడ్కర్ ఆలోచనలు విశాలమైనవి. దీర్ఘ దర్శనంతో కూడు కున్నవి. ఇకపోతే ఉపాధి చట్టం కింద పని చేసిన కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ పని చేస్తే తప్ప పూట గడవని కూలీలకు ఆరేడు నెలలుగా బిల్లులు ఎందుకు బకాయి ఉంటున్నాయి? కూలీలకు సకాలంలో డబ్బులు అందకపోతే అనివార్యంగా ఈ పని నుండి తప్పు కొంటారు. పని దినాలు కల్పించాలనే డిమాండ్ చేయడం తగ్గిపోతుంది. తిరిగి మరలా గ్రామీణ వేతన దోపిడీకి గురికావలసి వస్తుంది. ఎన్నికల ముందు అనేక పథకాలు ప్రకటించి గద్దెనెక్కే పాలకులు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయకపోవడం వెనుక గ్రామీణ ప్రాంతాల నుండి పేదలను తరిమివేసే కుట్రలేదని భావించగలమా? ఈ కూలీలు ఇతర రాష్ట్రాల వ్యవసాయ పనులకు, మహా నగరాలకు పెద్ద ఎత్తున వలస వెళితే తప్ప అక్కడ చౌకగా శ్రమను అమ్ముకునే కార్మికులు దొరకరని సామా జిక విశ్లేషకులు చెబుతున్నారు.రాజ్యాంగం కార్మిక, శ్రామిక పక్షపాతంతో కూడుకుని ఉన్నదని పాలకులు గుర్తించలేకపోతున్నారు. పేద ప్రజలు తమ గ్రామంలో బతికితే ఆ గ్రామానికి వెలుగు, ఆ గ్రామానికి జీవం. ఈ పథకం వల్ల దళిత స్త్రీలు సూర్యోదయాన్నే కొంత కూలీని సంపాదించుకున్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ రోడ్ల పక్కన కాలువలు తీయబడ్డాయి. ఈ పథకం వల్ల గ్రామీణ స్కూళ్లు బలపడ్డాయి. పిల్లలను చదివించు కోగలిగారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో రాజ్యాంగ నిరాకరణ ఉంది. మానవతా స్ఫూర్తికి విరుద్ధమైన ఆచరణ ఉంది. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. బలమైన గ్రామీణ భారతదేశాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695 -
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన 5.5 శాతం ద్రవ్యోల్బణం కంటే అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొంది. కానీ భారత ఎకానమీని స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ సమర్థంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి యూఎస్ ఎన్నికల ఫలితాలు. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడం. ఆర్థిక వృద్ధికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు ఆర్బీఐ 70కి పైగా హైస్పీడ్ ఇండికేటర్లను ట్రాక్ చేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్షరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు–రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
RBI Monetary Policy: అదుపులో ద్రవ్యోల్బణ ‘గుర్రం’
ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘ఏనుగు’ నుంచి ‘గుర్రం’ వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ‘‘ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ‘‘చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది. రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘గుర్రం మళ్లీ అదుపుతప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ, ‘‘ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది’’ అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోలి్చన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీ తొలి భేటీ కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు వోటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అలా చేస్తే ప్రజల్లో విశ్వసనీయత పోతుంది
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం నుంచి ఆహారోత్పత్తుల ధరలను మినహాయించడానికి తాను వ్యతిరేకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల సవరణలో ఆహార ధరలను మినహాయించాలన్న సూచనలపై రాజన్ స్పందించారు. అలా చేస్తే సెంట్రల్ బ్యాంక్ పట్ల ప్రజల్లో ఉన్న గొప్ప నమ్మకం తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో పెట్టాలంటూ ఆర్బీఐకి కేంద్రం లక్ష్యం విధించడాన్ని గుర్తు చేశారు. వినియోగదారులు వినియోగించే ఉత్పత్తుల బాస్కెట్ వరకే ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.ఎందుకంటే అది వినియోగదారుల అవగాహనను ప్రభావితం చేస్తుందన్నారు. రాజన్ ఓ వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయమై మాట్లాడారు. వడ్డీ రేట్ల నిర్ణయంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలని 2023–24 ఆర్థిక సర్వేలో పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణంలో ఎంతో ముఖ్యమైన కొన్నింటిని మినహాయించి, ద్రవ్యోల్బణం నియంత్రణంలో ఉందని చెప్పొచ్చు. కానీ, ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటప్పుడు దీన్ని ద్రవ్యోల్బణం బాస్కెట్లో చేర్చకపోతే ఆర్బీఐ పట్ల ప్రజల్లో గొప్ప విశ్వాసం నిలిచి ఉండదు’’అని రాజన్ వివరించారు. ఇలా చేయాలి.. ‘‘ఆహార ధరలు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నాయంటే, డిమాండ్‌కు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో ఉన్న సమస్యలను తెలియజేస్తోంది. అలాంటి సందర్భంలో ఇతర విభాగాల్లోని ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి. సెంట్రల్ బ్యాంక్ చేయాల్సింది ఇదే’’అని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. మొత్తం ధరలను ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో ఆహారం వెయిటేజీ ప్రస్తుతం 46 శాతంగా ఉంది. దీన్ని 2011–12లో నిర్ణయించారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం విధించిన లక్ష్యం. ప్రతికూల పరిస్థితుల్లో ఇది మరో 2 శాతం ఎగువ, దిగువకు మించకుండా చూడాలి. విశ్వసనీయంగా ఉండాలి.. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ చేసిన ప్రయోజన వైరు« ద్య ఆరోపణలను ప్ర స్తావించగా.. ఎవరైనా, ఎప్పుడైన ఆరోపణలు చేయొచ్చంటూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాజన్ పేర్కొన్నారు. ఒక్కో ఆరోపణపై మరింత వివరంగా స్పందన ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘అంతిమంగా మన నియంత్రణ సంస్థలు సాధ్యమైనంత వరకు విశ్వసనీయంగా మసలుకుంటే అది దేశానికి, మార్కెట్లకు మంచి చేస్తుంది. నియంత్రణ సంస్థలకూ మంచి చేస్తుంది’’అని రాజన్ పేర్కొన్నారు. -
ఈ ఏడాది రేట్ల కోత ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతను చేపట్టకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడ్ నాలుగేళ్లలో మొదటిసారి వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆర్థిక సెంట్రల్ బ్యాంక్‌లు సైతం ఇదే బాట పట్టొచ్చన్న అంచనాలు నెలకొండడం తెలిసిందే. ‘‘రేట్ల విషయంలో సెంట్రల్ బ్యాంక్‌లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాయి. ఫెడ్ రేట్ల కోత ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. కానీ, ఆర్బీఐ మాత్రం ఈ విషయంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకునే ఓ నిర్ణయానికొస్తుంది. మా అభిప్రాయం ఇదే. ఈ కేలండర్ సంవత్సరంలో ఆర్బీఐ రేట్లను తగ్గించకపోవచ్చు. ఆహార ద్రవ్యోల్బణం పరంగా మంచి పురోగతి ఉంటే తప్ప ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025 జనవరి–మార్చి) వరకు వేచి చూడాల్సి రావచ్చు’’ అని శెట్టి పేర్కొన్నారు. ఆహార ద్రవ్వోల్బణం కీలకం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన గల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి వడ్డీ రేట్ల సమీక్షను అక్టోబర్ 7–9 మధ్య చేపట్టనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు 3.65 శాతానికి పెరగడం తెలిసిందే. జూలై నెలకు ఇది 3.54 శాతంగా ఉంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు 5.66 శాతంగా నమోదైంది. అయినప్పటికీ ఆర్బీఐ దీర్ఘకాల కట్టడి లక్ష్యం 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. ఆగస్ట్ నాటి ఎంపీసీ సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం తెలిసిందే. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించింది. అంతేకాదు ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. చివరి ఎంపీసీ భేటీలో నలుగురు సభ్యులు యథాతథ స్థితికి మొగ్గు చూపితే, ఇద్దరు సభ్యులు రేట్ల తగ్గింపునకు మద్దతు పలికారు.ఎస్బీఐ నిధుల సమీకరణ రూ. 7,500 కోట్ల బాండ్ల జారీ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించింది. బాసెల్–3 నిబంధనలకు అనుగుణమైన టైర్–2 బాండ్ల జారీని చేపట్టినట్లు ఎస్బీఐ పేర్కొంది. అర్హతగల సంస్థాగత బిడ్డర్లకు బాండ్లను ఆఫర్ చేయగా.. భారీ స్పందన లభించినట్లు వెల్లడించింది. ప్రాథమికం(బేస్)గా రూ. 4,000 కోట్ల సమీకరణకు బాండ్ల జారీని చేపట్టగా మూడు రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. దీంతో రూ. 7,500 కోట్లవరకూ బాండ్ల జారీకి నిర్ణయించినట్లు వివరించింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు తదితరాలు దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. విభిన్న సంస్థలు బిడ్డింగ్ చేయడం ద్వారా దేశీ దిగ్గజ బ్యాంక్‌పై నమ్మకముంచినట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వ్యాఖ్యానించారు. కాగా.. 7.33% కూపన్ రేటుతో 15ఏళ్ల కాలపరిమితిగల బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలియజేసింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణమైన టైర్–2 బాండ్ల జారీకి తెరతీసినట్లు పేర్కొంది. 10ఏళ్ల తదుపరి ప్రతీ ఏడాది కాల్ ఆప్షన్‌కు వీలుంటుందని వెల్లడించింది. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థకు నిలకడను తీసుకువచ్చే బాటలో రూపొందించినవే అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలు(బాసెల్–3). బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.2% బలపడి రూ. 792 వద్ద ముగిసింది. -
టోకు ధరల ఊరట..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.31 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 4 నెలల్లో ఇంత తక్కువస్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం. కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా జూలై, ఆగస్టుల్లో 4% లక్ష్యాల దిగువకు (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) చేరిన సంగతి తెలిసిందే. తాజా టోకు గణాంకాల్లో ఫుడ్ ఐటమ్స్ ద్రవ్యోల్బణం 3.11% గా నమోదయ్యింది. కూరగాయల ధరలు 10% తగ్గాయి. అయితే ఆలూ, ఉల్లి ధరలు భారీగా 77.96%, 65.75% చొప్పున పెరిగాయి. -
ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గిందా?
గతేడాది రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ పాయింట్లు అధికంగా ఉన్నందునే తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గినట్లు నమైదయ్యాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. కానీ ఇటీవల ఆర్బీఐ గవర్నర్ మాత్రం అందుకు అనుగుణంగా కీలక వడ్డీరేట్లను తగ్గింపుపై మొగ్గు చూపించడం లేదని తెలుస్తుంది. రేట్ల తగ్గింపు అంశంపై ఇటీవల స్పందించిన గవర్నర్ శక్తికాంతదాస్ రేటుకట్లపై తొందరపడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు విశ్లేషకుల అంచనాలను సమర్థించినట్లయింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండనుంది.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలురిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
పటిష్టంగా భారత ఎకానమీ
దేశ ఆర్థిక వ్యవస్థసహా పలు అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదికలు, ఆర్టికల్స్ సానుకూల అంశాలను వెలువరించాయి. అయితే ఈ నివేదికలు, ఆర్టికల్స్ ఆర్బీఐ బులెటిన్‌లో విడుదలవుతాయి తప్ప, వీటిలో వ్యక్తమయిన అభిప్రాయాలతో సెంట్రల్ బ్యాంకు ఏకీభవించాల్సిన అవసరం లేదు. తాజా ఆవిష్కరణలను చూస్తే...ధరల్లో స్థిరత్వం..‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన విడుదలైన ఆర్టికల్ ప్రకారం ఆగస్టులో తృణధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరల్లో నియంత్రణ కనబడింది. ఆయా అంశాలు ఆగస్టు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 2024లో 5.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, జూలైలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.5 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్ రూపొందించిన ఈ ఆర్టికల్, గ్రామీణ వినియోగం ఊపందుకుందని, ఇది డిమాండ్, పెట్టుబడులకు దోహదపడుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల..ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం వల్ల తయారీ రంగంలో 2022–23లో ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమైందని ఆర్థికవేత్తలు పాత్రా, జాయిస్ జాన్, ఆసిష్ థామస్ జార్జ్‌లు రాసిన మరో ఆర్టికల్ పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోందని ‘ఆర్ ఫుడ్ ప్రైసెస్ స్పిల్లింగ్ ఓవర్? (మొత్తం సూచీ ద్రవ్యోల్బణానికి ఆహార ధరలే కారణమా?) అన్న శీర్షికన రాసిన బులెటిన్‌లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆహార ధరల ఒత్తిళ్లు కొనసాగితే జాగరూకతతో కూడిన ద్రవ్య పరపతి విధానం అవసరమని ఈ ఆర్టికల్ పేర్కొంది. ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!నిధులకోసం ప్రత్యామ్నాయాలు..డిపాజిట్ వృద్ధిలో వెనుకబడి ఉన్నందున కమర్షియల్ పేపర్, డిపాజిట్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు బ్యాంకింగ్ చూస్తోందని బులెటిన్ ప్రచురితమైన మరో ఆర్టికల్ పేర్కొంది. 2024–25లో ఆగస్టు 9 వరకూ చూస్తే, ప్రైమరీ మార్కెట్లో రూ.3.49 లక్షల కోట్ల సర్టిఫికేట్లు ఆఫ్ డిపాజిట్ (సీడీ) జారీ జరిగిందని ఆర్టికల్ పేర్కొంటూ, 2023–24లో ఇదే కాలంలో ఈ విలువ రూ.1.89 లక్షల కోట్లని వివరించింది. ఇక 2024 జూలై 31 నాటికి కమర్షియల్ పేపర్ల జారీ విలువ రూ.4.86 లక్షల కోట్లయితే, 2023 ఇదే కాలానికి ఈ విలువ రూ.4.72 లక్షల కోట్లని తెలిపింది. -
ఆర్థిక అసమానతలకు కారణం ఏమిటంటే..
దేశంలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రజల్లో ఆర్థిక అసమానతలను సృష్టిస్తుందని ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్‌బసు అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు తమ ఆదాయంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘సామాన్య ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ద్ర్యవ్యోల్బణం 5.1 శాతంగా ఉంది. దీన్నిబట్టి ఆహార ద్రవ్యోల్బణం 30 శాతంగా ఉంటుంది. నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఆహారానికే ఖర్చు చేసే కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టవేయబడుతున్నాయి. దానివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. భారత్‌లో కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఏఐలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయ కార్మిక రంగంపై దీని ప్రభావం పడుతోంది. విద్య ఒక్కటే పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకు పరిష్కారం కాదు. ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా నైపుణ్యాలు పెంచుకోవాలి. భారత్‌లో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టింది. అయినా మరిన్ని సంస్కరణలు రావాలి’ అని బసు సూచించారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’ -
దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?
2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? బడ్జెట్ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా? చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్‌ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్–భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్పూర్లోని పీర్‌పైంతిలో 2,400–మెగావాట్ల పవర్ ప్లాంట్ రానుంది. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.బడ్జెట్ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్నిసంతోషపెట్టడమే.అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?నోట్ల రద్దు, కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.- వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సుబీర్ రాయ్ -
తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?
బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆగస్టు 1న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 2 శాతం దరిదాపుల్లో స్థిరంగా ఉంటున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.2021 జులైలో బ్రిటన్‌లో చివరి సారిగా ద్రవ్యోల్బణం 2 శాతంగా నమోదైంది. కానీ క్రమంగా అది పెరుగుతూ 2022 నాటికి 11 శాతానికి చేరింది. దాంతో కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చారు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధర పెరుగడంతో వడ్డీరేట్లలో మార్పులు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇంధన ఖర్చులూ అధికమయ్యాయి. అయితే కొంతకాలం నుంచి క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ ద్రవ్యోల్బణం 2 శాతానికి దరిదాపుల్లోకి రావడంతో ఆగస్టు 1న వడ్డీరేట్లను తగ్గిస్తారని నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో 5.25 శాతం వడ్డీరేటు ఉంది.ఇదీ చదవండి: రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదంఇదిలాఉండగా, ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్ ఫావెల్ మీడియాతో మాట్లాడుతూ యూఎస్‌లో కీలకవడ్డీ రేట్లను పెంచే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అయితే తగ్గిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వడ్డీ రేట్లను తగ్గించాలంటే మరికొన్ని నివేదికలు అవసరమన్నారు. జులైలో 30-31న జరిగే ఫెడ్ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారా..?
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. రిటర్ను దరఖాస్తులు దాఖలు చేసేపుడు చాలామంది పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి అనువుగా వచ్చే ఆదాయాన్ని సర్దుబాటు చేస్తే కొంతమేర పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పన్ను చెల్లింపుల్లో ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇండెక్సేషన్పన్నుదారుల్లో చాలామంది స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దానికి అనువుగా ఆదాయాన్ని సర్దుబాటు చేసే పద్ధతినే ఇండెక్సేషన్ అంటారు. పన్ను రిటర్నులు దాఖలు చేసేపుడు చాలావరకు గతంలో చేసిన పెట్టుబడులను ప్రస్తుత విలువగానే పరిగణిస్తున్నారు. కానీ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. దాన్ని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ) గణాంకాల ఆధారంగా ఇండెక్సేషన్‌ను అంచనా వేస్తారు. మూలధన లాభాలను కచ్చితంగా నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది.ఏదైనా ఒక వస్తువును రూ.10కు కొనుగోలు చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం కారణంగా ఏడాదిలో దాని ధర రూ.12కు చేరినట్లు భావించండి. ఆ వస్తువుపై రూ.1 లాభం రావాలంటే మీరు దాన్ని ప్రస్తుత విలువ ప్రకారం రూ.13కు అమ్ముతారు. కానీ మీరు కొన్నది రూ.10కే. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ మీరు అమ్మే సమయానికి రూ.2 పెరిగింది. కాబట్టి మీకు వచ్చిన లాభంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయాలి. దానికోసం ఇండెక్సేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. -
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
SBI Chairman Dinesh Kumar Khara: డిపాజిట్ రేట్లు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: డిపాజిట్ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, మధ్య కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్బీఐ కూడా తన వడ్డీ రేట్ల వ్యవస్థను వెనక్కు మళ్లించడం ప్రారంభించవచ్చని ఖారా అంచనావేశారు. స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, యూరో ఏరి యా వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో తమ రేటు సడలింపు ప్రక్రియ ను ప్రారంభించాయి. అయితే, ద్రవ్యోల్బణం నిలకడ నేపథ్యంలో అమెరికా సెంట్రర్ బ్యాంక్ –ఫెడ్ ఫండ్ రేటు తగ్గింపు ప్రణాళికలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. కాగా, బుధవారం ఫెడ్ తన యథాతథ వడ్డీ రేటును (5.25%–5.5%) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
మొదటి నూరు రోజులు కీలకం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 1933లో అమెరికాలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. అప్పటి నుంచీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తొలి వంద రోజుల్లో ఏం చేస్తుందనే ఆసక్తి మొదలైంది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఉపాధి! దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. వంద కోట్ల కంటే ఆర్థిక సంపద ఎక్కువగా ఉన్న వారిపై ఒక శాతం పన్ను విధించాలి. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా తొలి వంద రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వపు ప్రాథమ్యాలు అర్థమయ్యేదిప్పుడే మరి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసేందుకు ఇదే మంచి తరుణం కూడా. తద్వారా కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. ప్రజల్లో విశ్వాసమూ నెలకొంటుంది. అలాగే దేశీ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం చూరగొనడమూ సాధ్యమవుతుంది. స్పష్టమైన మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా కొంత సమయం తరువాత ప్రజా విశ్వాసం కోల్పోవచ్చు. కాబట్టి ఈ తొలి రోజులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ తొలి వంద రోజుల భావన ఎప్పుడో 1933లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ మొదలుపెట్టారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. రైతులతోపాటు నిరుద్యోగులు, యువత, పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా తక్షణ సాయం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టడం వీటిల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బంగారంపై ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ సమయంలోనే జరిగాయి. మనుగడ సాగించలేని బ్యాంకుల బరువును వదిలించుకునేందుకు బ్యాంకింగ్ హాలిడేను ప్రకటించారు. వాణిజ్య, పెట్టుబడులకు వేర్వేరుగా బ్యాంకింగ్ వ్యవస్థల ఏర్పాటుకు దారితీసిన గ్లాస్–స్టీగాల్ చట్టం ఈ సమయంలోనే అమల్లోకి వచ్చింది. భారత్‌లో కొత్తగా కొలువైన ప్రభుత్వానికి రూజ్వెల్ట్ తరహాలో ఆర్థిక మాంద్య సమస్య లేదు. పైగా ఆర్థిక రంగం పటిష్టంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు చాలామందిని ఆశ్చర్యపరుస్తూ పైకి ఎగబాకింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం కూడా బాగానే కనబడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ స్థూల ఆర్థికాంశాలన్నీ బాగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలి వంద రోజుల ప్రాథమ్యాలు ఏముంటే బాగుంటుంది? నాలుగు నిర్దిష్టమైన సూచనలు:కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కావచ్చు. అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇన్ స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదికల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది 29 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు. ఇదే సమయంలో దేశం మొత్తమ్మీద నైపుణ్యమున్న, అర్ధ నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కాబటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రకమైన కార్యక్రమానికి ప్రస్తుతమున్న వాటి కంటే మెరుగైన చట్టపరమైన మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం.. అప్రెంటిస్ అయినా, ఇతరులైనా ఆరు నెలలపాటు పనిచేస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలి. ఫలితంగా పారిశ్రామిక వేత్తలు అప్రెంటిస్‌లకు కూడా అవకాశాలిచ్చే అవకాశం తక్కువ అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అప్రెంటిస్ సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ముద్ర కూడా ఈ సర్టిఫికెట్‌కు అవసరమవుతుంది. జాతీయ అప్రెంటిస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పై అంశాలన్నింటినీ చేర్చడం ద్వారా నిరుద్యోగ సమస్య, నైపుణ్యాల లోటు, ఉద్యోగార్హతల సమస్యలను పరిష్కరించవచ్చు. దీంతోపాటు అగ్నివీర్ కార్యక్రమాన్ని ప్రస్తుతమున్న నాలుగేళ్ల నుంచి ఏడు లేదా ఎనిమిదేళ్లకు పెంచడం (షార్ట్ సర్వీస్ కమిషన్ కార్యకాలానికి దగ్గరగా) కూడా నిరుద్యోగ సమస్య సమసిపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇక రెండో సూచన... పంట ఉత్పత్తులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించడం గురించి. కనీస మద్దతు ధర సాఫల్యానికి మార్కెట్ ధరలన్నీ గణనీయంగా తగ్గాలి. అయితే కనీస మద్దతు ధర వల్ల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంటుంది. కానీ మొత్తమ్మీద అటు రైతుకు, ఇటు ప్రభుత్వానికి ఉభయ తారకం. కొత్త ప్రభుత్వం కనీస మద్దతు ధరతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణలకు దూరంగా ఉంటామన్న సూచన కూడా చేయాల్సి ఉంటుంది. నియంత్రణలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.మూడవ సూచన: చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం కౌలు రైతులే పండిస్తున్నారు. భూ యజమానులతో వీరికి నామమాత్రపు ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా రుణ సౌకర్యం లభించడం కష్టమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని వినూత్న పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రయత్నాల మదింపు జరిపి జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరముంది. సాధారణంగా పంట రుణాలన్నవి నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి అవసరమవుతుంటాయి. ఇంత చిన్న కాలావధి అనేది నిరర్థక ఆస్తుల నిర్వచనం కిందకు రాదు. దీనికి తగిన నమూనా రూపొందించాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులు, ఔత్సాహిక చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకూ రుణ సౌకర్యం పెద్దగా ఉండటం లేదు. అకౌంట్ అగ్రిగేటర్స్ వంటివి అందుబాటులో ఉన్న ఈ కాలంలో కేవలం కొలాటరల్ ఆధారంగా కాకుండా... క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. పైగా... చాలామంది చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకు ఆర్థికాంశాలపై అవగాహన తక్కువే. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు గట్టి ప్రయత్నమే జరగాలి. అంతేకాకుండా... చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరిగేందుకు 2006 నాటి చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టంలోని 45 రోజుల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నం జరగాలి. నాలుగో సూచన... ఫైనాన్షియల్ వెల్త్ (స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి– అన్నీ ‘పాన్’తో అనుసంధానించి ఉంటాయి) విలువ రూ.వంద కోట్ల కంటే ఎక్కువగా ఉన్న వారిపై కొద్దిగా ఒక శాతం పన్ను విధించడం. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది. ఈ పన్ను ద్వారా సేకరించిన మొత్తాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభివృద్ధికి కేటాయించవచ్చు. ఈ నిధులు రాష్ట ప్రభుత్వాలకు కాకుండా... నేరుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు చేరాలి. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే ఇలా నేరుగా ఆర్థిక వనరులను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రొ‘‘ అజీత్ రానాడే వ్యాసకర్త పుణెలోని ‘గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్’ వైస్ ఛాన్స్లర్ (‘ద మింట్’ సౌజన్యంతో) -
Indian stock market: భారీ లాభాలకు అవకాశం
ముంబై: దలాల్ స్ట్రీట్ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది. కళ్లన్నీ ఫెడ్ సమావేశం పైనే..! అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్లోనా.? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.రూ.14,794 కోట్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.