న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూనే వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు.
10 నెలల అప్‌ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్‌లో ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. రెపోపై ఆర్‌బీఐ నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో మరో పావు శాతం పెరిగి, 6.50 శాతానికి చేరింది.
తయారీ: తయారీ ఉత్పత్తులకు సంబంధించి ధరల స్పీడ్ జనవరిలో 2.99 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్ 2022లో ఈ రేటు 3.37 శాతం.
ఇంధనం, విద్యుత్ నెలల వారీగా ఈ రేటు 18.09 శాతం నుంచి 15.15 శాతానికి తగ్గింది.
ఫుడ్ బాస్కెట్: ఈ విభాగంలో రేటు జనవరిలో 2.38 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌లో ఈ రేటు 1.25 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. పప్పు దినుసుల ధర స్పీడ్ 2.41 శాతంగా ఉంటే, కూరగాయల ధరలు మాత్రం 26.48 శాతం తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment