
కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జూలై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 7–9 మధ్య ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష చేపట్టనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.26 శాతంగా, గతేడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 222 బేసిస్ పాయింట్ల మేర తగ్గినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. 2023 మే తర్వాత ఇదే కనిష్టమని పేర్కొంది. కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పు ధాన్యాలు మొదలైన వాటి ధరల పెరుగుదల తగ్గడమే రిటైల్, ఆహార ద్రవ్యోల్బణాలు దిగి రావడానికి కారణమని వివరించింది.
ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్
జనవరిలో ఐఐపీ 5 శాతం అప్
తయారీ కార్యకలాపాలు పుంజుకోవడంతో దేశీయంగా పారిశ్రామికోత్పత్తి జనవరిలో మెరుగుపడింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 5%గా నమోదైంది. ఇది 2024 నవంబర్‌లో 5 శాతంగా ఉంది. 2024 డిసెంబర్ గణాంకాలను ప్రభుత్వం 3.2% నుంచి 3.5%కి సవరించింది. ఇక, గతేడాది జనవరిలో 3.6%గా ఉన్న తయారీ రంగ ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 5.5%కి పెరిగింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 6 శాతం నుంచి 4.2 శాతానికి నెమ్మదించింది.
Comments
Please login to add a commentAdd a comment