బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.
స్తబ్దుగా తయారీ రంగం
దేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్‌లకు దెబ్బ!
ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు
సమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment