
28,818 ఐబీసీ దరఖాస్తులకు ఆమోదం
కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్ర
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) కింద ఇప్పటి వరకు 28,818 దరఖాస్తులకు పరిష్కారం లభించినట్టు కేంద్ర కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి మర్ష మల్హోత్రా ప్రకటించారు. వీటి మొత్తం రూ.10 లక్షల కోట్లుగా ఉంటుందని లోక్‌సభకు తెలియజేశారు. ‘మొత్తం 40,943 దరఖాస్తులు ఐబీసీ కింద దాఖలయ్యాయి. ఇందులో 28,818 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇదొక గొప్ప విజయం’ అని మంత్రి పేర్కొన్నారు.
2016లో ఐబీసీని తీసుకురావడం భారత్‌కు ఎంతో మేలు చేసిందని మంత్రి అన్నారు. అంతర్జాతీయంగా వ్యాపార సులభతర సూచీలో భారత్ ర్యాంక్ 2018లో 108గా ఉంటే, 2019లో 52కు మెరుగుపడినట్టు తెలిపారు. గృహ కొనుగోలుదారుల కోసం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ‘ఏదైనా బిల్డర్ లేదా వినియోగదారుడు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించినట్టయితే.. ప్రత్యేక పరిష్కార చర్యలు ఉండేలా చర్యలు తీసుకున్నాం’ అని వివరించారు.
ఇదీ చదవండి: 2026లో నిధుల సమీకరణకు జోష్
అపరిష్కృతానికి కారణాలు
2024 డిసెంబర్ చివరికి కంపెనీల చట్టం కింద 8,133 కేసులు, ఐబీసీ కింద 12,351 కేసులు ఎన్‌సీఎల్‌టీ వద్ద అపరిష్కృతంగా ఉన్నట్టు సహాయ మంత్రి హర్ష మల్హోత్ర తెలిపారు. ఒక్కో కేసులో ఉండే సంక్లిష్టతలు, సాక్ష్యాల తీరు, ఉన్నత న్యాయస్థానాల్లో స్టేలు, భాగస్వాముల మధ్య సహకార లేమి, వాయిదాలు ఇవన్నీ పరిష్కారంలో జాప్యానికి కారణాలుగా పేర్కొన్నారు. ‘కేసులను వేగంగా పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ–కోర్టు, హైబ్రిడ్ కోర్టు ప్రాజెక్ట్, సామర్థ్యాన్ని పెంచడానికి తరచూ చర్చలు, ఖాళీల భర్తీ, సదుపాయాల కల్పన ఇందులో ఉన్నాయి’ అని మంత్రి వివరించారు. సులభతర వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవడంతో 2019 ప్రపంచబ్యాంక్ నివేదికలో భారత్ 52వ స్థానం దక్కించుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత నుంచి ప్రంపచబ్యాంక్ ఈ సూచీని ప్రకటించడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment