
రెపో, ఈబీఎల్‌ఎల్ రుణ రేట్లు 0.25 శాతం తగ్గింపు
డిపాజిట్లపై 0.1–0.25 శాతం కోత
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ డిపాజిట్లు, రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిపాజిట్లపై రాబడి తగ్గనుండగా.. రుణ గ్రహీతలకు వెసులుబాటు లభించనుంది. రెపో అనుసంధానిత లెండింగ్ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.25 శాతానికి దిగొచ్చింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారత రుణ రేటు (ఈబీఎల్‌ఆర్)ను సైతం 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.65 శాతం చేసింది.
ఏప్రిల్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఆర్‌బీఐ గత వారం రెపో రేటును పావు శాతం తగ్గించడం తెలిసిందే. దీంతో ఈ మేరకు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ బదిలీ చేయడం గమనార్హం. అదే సమయంలో వివిధ కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా 10–25 బేసిస్ పాయింట్లు (0.1–0.25 శాతం) మేర వడ్డీ రేట్లను ఎస్‌బీఐ తగ్గించింది. ఇవి కూడా ఈ నెల 15 నుంచే అమల్లోకి రానున్నాయి.
→ రూ.3 కోట్ల వరకు ఎఫ్‌డీలపై 1–2 ఏళ్ల కాల వ్యవధికి ఇక మీదట వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంటుంది. 10 బేసిస్ పాయింట్లు తగ్గింది.
→ 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 7 శాతం రేటు కాస్తా 6.90 శాతానికి దిగొచ్చింది.
→ రూ.3 కోట్లకు మించిన 180–210 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గి 6.40 శాతానికి పరిమితం అయింది. అదే 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 25 బేసి స్ పాయింట్లు తగ్గడంతో 6.50 శాతంగా ఉంది.
→ ఎస్‌బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్లపైనా 10 బేసిస్ పాయింట్ల వరకు రేటు తగ్గింది.
→ 444 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం రేటు అమలు కానుంది.
→ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం సేవింగ్స్ డిపాజిట్ల రేటును 0.25 శాతం తగ్గించి 2.75 శాతం చేయడం గమనార్హం. రూ.50 లక్షలకు మించిన మొత్తంపై రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి దిగొచ్చింది.