న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ పెరగడం ఇది రెండవసారి .
ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► ఎస్‌బీఐ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది.
► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్‌ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి.
► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది.
► రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది.
► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది.
► కాగా, ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్‌ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 6.25 శాతంగా ఉంది.
► గృహ, ఆటో లోన్‌లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్‌ఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్‌పీ)ను కలుపుతాయి.
ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు
ఎస్‌బీఐ ఆర్థికవేత్తల అంచనా
ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది.
ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీసీ) రంగానికి ఇన్‌పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది.
అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి.
Comments
Please login to add a commentAdd a comment