EMI
-
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేట్లను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతాన్ని (5 బేసిస్ పాయింట్లు) పెంచడంతో 9 శాతానికి చేరింది. గృహ రుణం వంటి దీర్ఘకాల రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్‌నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎంసీఎల్ఆర్ రేట్లను ఎస్బీఐ రెండుసార్లు పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వ్యయాల పెరుగుదలతో బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాల్సి వస్తోంది. -
సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్డీఎఫ్సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..ఓవర్ నైట్: 9.15 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
కిస్తీ కోసం కుస్తీ!
‘ భార్యా భర్తలతో పాటు ఇంటిల్లిపాదీ కాయకష్టం చేసుకుని, సంవత్సరాల తరబడి కిస్తీలు కట్టుకుంటూ ఇంటిలో ఒక్కొక్కటిగా సమకూర్చుకున్న వస్తువులన్నీ వరద పాలయ్యాయి. నష్టపరిహారం ఇస్తామంటూ రెండుసార్లు వచ్చి రాసుకుని వెళ్లినా.. ఇంతవరకు సాయమందలేదు. అందుకోసం ఇప్పుడు నేను కూలి వదిలేసుకుని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా. కిస్తీ కట్టలేదని ఫైనాన్స్ వాళ్లు నా బైక్ తీసుకెళ్లిపోయారు. మా అకౌంట్లో ఉన్న కాస్త డబ్బులను కూడా ఫైనాన్స్ వాళ్లు లాగేసుకుంటున్నారు. ఇక మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వగలం’ అంటూ వాంబే కాలనీకి చెందిన తాపీ కార్మికుడు ఆకుల గణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘వరదల్లో మునిగిన ఆటోకు రూ.10వేలు సాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వరకు ఫైనాన్స్ కంపెనీలు ఊరుకోవు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్లు చేసి డబ్బులు కట్టమని వేదిస్తున్నారు. కిస్తీ కట్టకుంటే బండి తీసుకెళ్లిపోతారు. అలా జరిగితే నేను ఇప్పటి వరకు కట్టిన 22 కిస్తీలు, డౌన్ పేమెంట్ మొత్తం పోయినట్టే. ఇన్నాళ్లూ బండి నడవకున్నా అప్పు చేసి కిస్తీ కట్టాను. మరో రూ.15వేలు అప్పులు తీసుకుని రిపేర్ చేయించాను. మా ఇళ్లు నీట మునిగిపోయినా.. నా ఆటో పాడైనా ప్రభుత్వ జాబితాలో పేరు లేదంటున్నారు. ఎక్కడికి వెళ్లి ఎవరిని అడగాలో తెలియడం లేదు’ అంటూ వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కె.రమేష్ వాపోయాడు. సాక్షి, అమరావతి: విజయవాడను బుడమేరు వరద విడిచిపెట్టినా.. ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం పట్టిపీడుస్తోంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడిన జీవితాలకు భరోసా కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ‘తాంబూళాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న చందాన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించి.. దానిని పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. సోమవారం విజయవాడలోని వాంబేకాలనీ, వడ్డెర కాలనీ, శాంతిప్రశాంతి నగర్లో సాక్షి క్షేత్ర స్థాయిలో పర్యటించగా.. వరద బాధితులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉక్కిరిబిక్కిరవుతూ కనిపించారు. నెలవారీ కిస్తీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మారటోరియం ఇస్తారంటూ చేసిన ప్రకటనలు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకర్లతో సమావేశం పెట్టి ఈఎంఐలు కట్టుకోవడానికి సమయం ఇచ్చేలా ఒప్పించామంటూ చేసిన హడావుడితో ఒనగూరిందేమీ లేదని తేలిపోయింది. రోజు ఉదయాన్నే ఫైనాన్స్ కంపెనీలు బాధితులకు ఫోన్లు చేసి వాయిదాలు కట్టాల్సిందేనని వేదిస్తుండం పరిపాటిగా మారింది. నష్ట పరిహారం అందకపోవడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పులు చేస్తున్నారు. తీరా ఆ మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడిన వెంటనే కిస్తీల రూపంలో సదరు ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు లాగేసుకుంటున్నాయి. జీరో అకౌంట్‌కు 15 రోజులా? సాధారణంగా బ్యాంకులో కొత్తగా ఖాతా తీసుకోవాలంటే ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కానీ, వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో సుమారు 15 రోజులు పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలు ఏదో ఒక ఈఎంఐకు లింక్ పెట్టి ఉండడంతో.. ఒకవేళ ప్రభుత్వ సాయం అందితే.. ఆ మొత్తం పాత ఖాతాలో పడితే ఎక్కడ బ్యాంకర్లు, ఫైనాన్స్ కంపెనీలు లాగేసుకుంటాయోనని బాధితులు నానా అగచాట్లు పడుతున్నారు. జీరో అకౌంట్ల కోసం బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్‌కు, బ్యాంకు ఖాతాలకు, ఫోన్ నంబర్లు ఒకదానికొకటి లింక్ కాపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్యుమరేషన్లో బైక్‌లు వదిలేసి.. వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో వీలైనంత వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఎన్యుమరేషన్ ప్రక్రియలో చాలా కుటుంబాలకు చెందిన ద్విచక్ర వాహనాలు, ఆటోలను కావాలనే విస్మరించింది. దీంతో వాహనాలు దెబ్బతిన్న బాధితులు నష్టపోయారు. తీరా అకౌంట్లలో నగదు జమవుతుందని తెలిసి సచివాలయాలకు వెళ్లడంతోఎన్యుమరేషన్లో తమ వాహనాలు నమోదు చేయలేదని తెలుసుకున్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బైక్‌లకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు సాయం ఎంత మందికి ఇచ్చారన్నదే ప్రశ్నార్థకం. -
మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు. -
పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!
రాజు నెల వేతనం రూ.20 వేలు. ఇంటిఅద్దె రూ.తొమ్మిది వేలు చెల్లిస్తాడు. పిల్లల స్కూల్ ఫీజు ఏటా రూ.40 వేలు అంచనా వేసినా నెలకు రూ.3,500 అవుతుంది. కరెంటు బిల్లు, వైద్యం, రెస్టారెంట్, సినిమా, పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, సేవింగ్స్ కోసం రూ.నాలుగు వేలు ఖర్చు చేశాడని అనుకుందాం. ఈక్రమంలో నెలవారీ ఇంటి ఖర్చులు రూ.3,500 దాటాయంటే ఈఎంఐ తప్పదు. దీని ప్రభావం వచ్చేనెల ఖర్చులపై ఉంటుంది.దేశంలోని చాలామంది తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఖర్చు చేస్తుంటారు. కొందరు అవసరాలకు మాత్రమే అప్పు చేస్తుంటే.. ఇంకొందరు వివిధ కారణాల వల్ల అప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో సరిపడా ఆదాయంలేని వారు ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఈఎంఐ తప్పడంలేదు. ఇండియాలో ఈఎంఐ కల్చర్ ఎలా ఉందనే అంశాలను తెలియజేస్తూ ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.దేశంలో దాదాపు 70 శాతం మంది ఐఫోన్ వినియోగదారులు ఈఎంఐ ద్వారానే వాటిని కొనుగోలు చేస్తున్నారని తేలింది. 80 శాతం కారు విక్రయదారులు ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. 60 శాతానికిపైగా ఇళ్లు హోంలోన్ ద్వారానే కొంటున్నారు. అయితే నెలవారీ సంపాదనలో మొత్తం ఈఎంఐలు 30 శాతం లోపే ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఈఎంఐ పెట్టాలనుకుంటే మాత్రం సంపాదన పెంచుకోవాలని చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, సంపాదన పెరిగితే ఈఎంఐ అవసరం లేకుండానే వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 13 రూ.11కే..?దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొబైళ్లు, దుస్తులు, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు అత్యవసరం అయితే తప్పా కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సమాజం మన్ననలు పొందేందుకు ఆర్బాటాలకు పోయి అప్పు చేసి ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటే చివరకు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా, ప్రణాళికబద్దంగా అత్యవసరమైతేనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. -
CIBIL Score: సిబిల్ గుబులు!
నేడు ప్రతి చిన్న వస్తువు కొనుగోలూ ఈఎంఐ విధానంలోనే చెల్లింపుల్లో జాప్యంతో సిబిల్ స్కోర్‌కు దెబ్బ భవిష్యత్‌లో ఇతర రుణాలు తీసుకోలేని పరిస్థితి ఆలస్య రుసుములు, వాటిపైన పన్నుల బాదుడు సరేసరి ఆయా కంపెనీల ప్రకటనల వలలో చిక్కుకుంటున్న ప్రజలునియంత్రణ అవసరమంటున్న నిపుణులు విజయవాడకు చెందిన గౌస్ మొహియుద్దీన్ ఐదు నెలల క్రితం టీవీ కొన్నారు. గత నెలలో ఈఎంఐ కట్టాల్సిన సొమ్ము కంటే రూ.10 బ్యాంకులో తక్కువగా ఉండటంతో రూ.580 ఆలస్య రుసుము పడటమే కాకుండా సిబిల్ స్కోర్ భారీగా తగ్గింది.రమేశ్ నాయుడు అనే డిగ్రీ విద్యార్థి ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి శాంసంగ్ మొబైల్ కొన్నాడు. నాలుగో నెలలో ఈఎంఐ చెల్లించకపోవడంతో మొబైల్‌ను బ్లాక్ చేశారు. తిరిగి దీన్ని పనిచేయించేందుకు ఈఎంఐ కట్టడంతో పాటు రూ.600 ఆలస్య రుసుం చెల్లించాడు. అతడు ఇప్పుడు ద్విచక్రవాహనం కొనడానికి వెళ్తే.. ‘సిబిల్ స్కోర్ పడిపోయింది.. రుణం ఇవ్వలేం’ అని చెప్పారు... ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సిబిల్ స్కోర్ సరిగా లేక వాహన, వ్యక్తిగత, గృహ రుణాలను పొందలేకపోతున్నారు. చెక్ బౌన్స్ అయితే భారీగా సిబిల్ స్కోర్ పడిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏ రుణం తీసుకున్నా సకాలంలో చెల్లించాలంటున్నారు. ఆయా రుణ సంస్థలు, బ్యాంకులు నిర్దేశించిన తేదీల్లోగా చెల్లింపులు చేయాలంటున్నారు. ఇలా చేస్తేనే చక్కటి సిబిల్ స్కోర్ సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. సిబిల్ సరిగా లేకపోతే ఏ రుణం కూడా మంజూరు కాదని చెబుతున్నారు. సిబిల్ లెక్కలివి.. సగటున ఉండాల్సిన కనీస స్కోర్ 650ఏదైనా రుణం రావాలంటే కనీసం ఉండాల్సిన స్కోర్ 600గృహరుణం కావాలంటే ఉండాల్సిన స్కోర్ 700కు పైనఈఎంఐల్లోనే ఎక్కువ..ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ నెలసరి వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానంలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వివిధ బ్యాంకులతోపాటు ప్రైవేటు ఆర్థిక సంస్థలు సైతం క్రెడిట్ (సిబిల్) స్కోర్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో చాలా మంది ఈఎంఐ విధానంలో వస్తువులను కొంటున్నారు. అయితే నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోవడం, అందుకు తగ్గట్టుగా బ్యాంకులో నగదు నిల్వ ఉంచకపోవడంతో బౌన్సుల బారినపడుతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుం, దానిపైన ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఫోన్లలో ఆయా రుణ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. నియంత్రించుకోకుంటే కష్టం.. ఇప్పుడు చాలా సులువుగా ఆన్‌లైన్‌లోనూ, వివిధ యాప్స్ ద్వారా రుణాలు లభిస్తున్నాయి. కేవలం పాన్ కార్డు నంబర్‌ను సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ మాల్స్, షాపుల్లోనూ పాన్ కార్డు నంబర్‌ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆసక్తితో రుణాల ద్వారా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ‘జీరో వడ్డీ’, ‘ప్రాసెసింగ్ ఫీజు లేదు’ అంటూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే ప్రకటనల వలలో పడుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇలా ఆయా ప్రకటనలకు ఆకర్షితులై రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో భారీగా ఆలస్య రుసుం, ఇతర జరిమానాలు తప్పడం లేదు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా పడిపోతోంది. తద్వారా భవిష్యత్తులో రుణాలు పొందలేని పరిస్థితి తలెత్తుతోంది.పదిశాతం మందికి పైగా డిఫాల్టర్లే..రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నవారిలో మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు చెబుతున్నాయి. సాధారణంగా సిబిల్ స్కోర్ 650 దాటితేనే ఏ రుణమైనా లభిస్తుంది. అయితే రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత తేదీల్లోగా చెల్లించకపోవడంతో ప్రతి పదిమందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేస్తున్న వారిలో రుణాల రికవరీ అత్యంత తక్కువగా ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు గుర్తించాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో డిఫాల్టర్లు 14 శాతంగా ఉన్నారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. జరిమానాలు ఎక్కువగా పడటం, చెక్ బౌన్స్ కేసులు నమోదు కావడం, ఈఎంఐల చెల్లింపుల్లో జాప్యం వంటివన్నీ అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ మూడు చోట్లా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా తగ్గినట్టు తేలింది. ఈ మూడు నగరాలు కాకుండా మిగతా జిల్లాల్లో సగటున 10 శాతం డిఫాల్టర్లు ఉంటున్నారు.సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ బాగుంటుంది.. ప్రస్తుతం సిబిల్ స్కోర్ చాలా కీలకమైంది. సిబిల్‌కు ఆయా ఫైనాన్స్ సంస్థలు చిన్న చిన్న అప్పుల సమాచారాన్ని కూడా ఇస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు కారణంగా మా దగ్గరకు వచ్చే చాలామందికి సిబిల్ స్కోర్ లేక రుణాలు ఇవ్వడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ స్కోర్ బాగుంటుంది. లేదంటే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – సునీల్ కుమార్, మేనేజర్, ఎస్బీఐ -
వెహికల్ కొంటున్నారా?.. దీన్ని ఓ లుక్ వేయండి!
ఒక వాహనం కొనుగోలు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి తీసుకోవడం. రెండు 'ఈఎమ్ఐ' రూపంలో తీసుకోవడం. ఇంతకీ ఏ విధంగా కొనుగోలు చేస్తే ఉత్తమం? మొత్తం డబ్బు చెల్లించడం (ఫుల్ క్యాష్) ద్వారా లాభాలేంటి? ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే లాభ, నష్టాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బంధువులు కొన్నారు, పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు అని, ఆవేశంతో ఆలోచించకుండా వాహనాలు కొనుగోలు చేస్తే.. ఆ తరువాత ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీలు ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఒక వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవడం మాత్రమే.. సంపాదనను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.మొత్తం డబ్బు చెల్లించి (ఫుల్ క్యాష్)ఏదైనా వాహనం (కారు / బైక్) కొనాలంటే మొత్తం డబ్బు చెల్లించడం అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఒకేసారి వాహన ఖరీదును చెల్లించాలమంటే.. ప్రతి నెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్టేషన్స్, యాక్ససరీస్ వంటివన్నీ ఒకేసారి పొందవచ్చు. వడ్డీ చార్జీలు నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా కొన్ని సార్లు ఆఫర్స్ కూడా లభిస్తాయి. తక్షణమే మీరు వాహనానికి ఓనర్ కూడా అవ్వొచ్చు.లోన్ మీద కారు కొనుగోలునిజానికి ప్రతి ఒక్కరూ మొత్తం డబ్బు చెల్లించే విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కారు కొనాలంటే కనీసం రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కొందరికి కష్టమే. కానీ వారు ప్రతి నెలా కొంత మొత్తంగా చెల్లిస్తూ కారును కొనుగోలు చేసే స్థోమత ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా లోన్ మీద కారును తీసుకోవచ్చు.లోన్ ద్వారా కారు కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు👉లోన్ తీసుకుని కారు కొనేయాలనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు వెహికల్ లోన్ ఇవ్వాలంటే ముందుగా మీ సంపాదన, సిబిల్ స్కోర్ వంటి వాటిని చూస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు లోన్ తీసుకోవడానికి అర్హులేనా? అర్హులైతే ఎంత వరకు లోన్ మంజూరవుతుంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.👉వెహికల్ లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సమయం (డ్యూరేషన్) ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమును ఏమిటంటే? మీరు ఎంచుకున్న సమయం లేదా సంవత్సరాలను బట్టి వడ్డీ అనేది నిర్ణయిస్తారు. డ్యూరేషన్ అనేది వీలైనంత తక్కువ సెలక్ట్ చేసుకుంటే వడ్డీ తగ్గుతుంది.👉కొన్ని సందర్భాల్లో కొన్ని డీలర్‌షిప్‌లు కొంత కాలానికి 0% ఫైనాన్సింగ్‌తో సహా ప్రమోషనల్ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇది మీరు తీసుకునే లోన్‌కు సంబందించిన ఖర్చులను కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.👉లోన్ తీసుకునే వ్యక్తి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరపడితే నష్టపోయేది మీరే. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయంలో భారీ వడ్డీలను వసూలు చేసి అమాయక ప్రజలను దోచుకునే అవకాశం ఉంది.లోన్ తీసుకుని వాహనాలను కొనుగోలు చేయడంలో పెద్దగా లాభాలు కనిపించవు, కానీ ఆదమరిస్తే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.👉రుణ గ్రహీత లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చార్జీలను తీసుకోకుండా ముందడుగు వేస్తే.. అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.👉వడ్డీ అనేది కూడా చివరి వరకు ఒకేలా ఉండదు. ఇందులో కొన్ని సార్లు పెరుగుదలలు కూడా ఉంటాయి. రేపో రేటు పెరిగితే కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వడ్డీలను అమాంతం పెంచేస్తాయి. ఇది రుణ గ్రహీత మీద భారం పడేలా చేస్తాయి.👉ముందుగానే మీ సంపాదన, ఈఎమ్ఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. ఒకసారి ఈఎమ్ఐ మొదలు పెట్టిన తరువాత.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకోవాలి. లేకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుపోవాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు కూడా లెక్కించుకోవడం ఉత్తమం. పొరపాటున ఈఎమ్ఐ కట్టడం ఆలస్యమైతే.. కట్టాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.10 లక్షల కారును 7 సంవత్సరాల వ్యవధితో లోన్ ద్వారా తీసుకుంటే?👉ఒక వ్యక్తి రూ. 10 లక్షల కారును కొనాలనుకుంటే.. దానికి కావాల్సిన లోన్‌ను బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుంచి తీసుకుంటారు. డ్యూరేషన్ 7 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే.. నెలకు సుమారు రూ. 15వేలు కంటే ఎక్కువ ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు.. ఒక బ్యాంక్ 8.65 శాతం వడ్డీతో రూ. 10 లక్షలు లోన్ ఇస్తే (7 సంవత్సరాల కాల వ్యవధి) నెలకు రూ. 15912 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు 7 సంవత్సరాల్లో మొత్తం రూ. 13,36,608 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్నదానికంటే సుమారు రూ. 3.36 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.అదే వడ్డీ రేటు 11 శాతం అనుకుంటే (10 లక్షలు 7 సంవత్సరాల డ్యూరేషన్) అప్పుడు నెలకు రూ. 17122 చొప్పున మొత్తం రూ. 14,38,248 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత వడ్డీకి ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్‌లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్‌మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్: పెరగనున్న ఈఎంఐలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఈఎంఐల భారం పెరగనుంది. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఫ్రేమ్‌వర్క్‌తో ముడిపడి ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి.ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం.. జూన్ 15 నుంచి అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (0.1%) పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.00 శాతం నుంచి 8.10 శాతానికి, నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.గృహ, వాహన రుణాలతో సహా చాలా రిటైల్ రుణాలు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో ముడిపడి ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ ఈల్డ్ వంటి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌లతో ముడిపడి ఉన్న రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంపు ఎలాంటి ప్రభావం చూపదు. -
ఈఎంఐలు తగ్గుతాయా? రేపటి నుంచే ఆర్బీఐ మీటింగ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. మళ్లీ యథాతథమే! ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తగ్గింపు అప్పుడే.. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. -
ఎస్బీఐ వినూత్న ఐడియా! ఈఎంఐలు కట్టనివారి కోసం..
బ్యాంకులో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టనివారి నుంచి బకాయిలు రాబట్టేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినూత్న ఐడియా వేసింది. ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది. (ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు) ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకుంటున్న కస్టమర్లు.. సాధారణంగా బ్యాంక్ చేసే రిమైండర్ కాల్‌కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్బీఐ భావిస్తోంది. వడ్డీ రేట్లలో కదలికల నేపథ్యంలో ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యాలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ 2023 జూన్ త్రైమాసికంలో గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే రెండు ఫిన్‌టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్బీఐలో రిస్క్ విభాగానికి ఇన్చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ఈ ఫిన్‌టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని పేర్కన్నారు. అయితే ఆ ఫిన్‌టెక్‌ల పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ చర్య కేవలం పైలట్ దశలో ఉందని, కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని, విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) -
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్! షాకిచ్చిన టాప్ ప్రైవేట్ బ్యాంక్
HDFC Bank hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా అవతరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రేట్‌ను 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
ఎస్బీఐ రుణ రేటు పెంపు.. పెరగనున్న ఈఎంఐ భారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై స్వల్పంగా 5 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచింది. పెరిగిన రేటు జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు. తాజా ఎస్బీఐ రుణ రేటు పెంపు రుణ గ్రహీతలపై ఆ మేరకు ఈఎంఐ భారం (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన) పెరగనుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఏడాది రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలవుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా ఉంటుంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.65%కి చేరుతుంది. మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుంది. -
సెల్‌ఫోన్ ఈఎంఐ కట్టే విషయంలో గొడవ.. స్నేహితుడి హత్య
తూర్పు గోదావరి: సెల్‌ఫోన్‌కు ఈఎంఐ కట్టే విషయంలో తలెత్తిన వివాదంలో స్నేహితుడిని హత్య చేసి మృతదేహాన్ని తన ఇంటిలోనే పూడ్చి పెట్టిన కేసులో లాకవరపు పవన్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్టు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం నడుపల్లికోట గ్రామానికి చెందిన మృతుడు కొడమంచిలి సురేంద్ర (25), లాకవరపు పవనన్‌కుమార్ స్నేహితులు. సురేంద్ర స్నేహితుడికి ఈఎంఐలో సెల్‌ఫోన్ ఇప్పించాడు. రెండు వాయిదాలు కట్టిన తర్వాత సొమ్ము కట్టడం మానేశాడు. సురేంద్ర ఈ నెల 3వ తేదీన పవన్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగటంతో ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటిలోనే గొయ్యితీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మూడు రోజులకు దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 6వ తేదీన పోలీసులు, తహసీల్దార్ సమక్షంలో తవ్వకాలు జరిపి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సురేంద్ర మృతికి కారణమైన పవన్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. వేగంగా కేసు దర్యాప్తు చేసిన ఎస్ఐ ఎం.సూర్య భగవాన్ను, సిబ్బందిని సీఐ వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఇన్స్టాల్మెంట్లో మామిడి పండ్లు కొనుక్కోవచ్చని మీకు తెలుసా!
ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్‌లు, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ. రిటైల్ మార్కెట్లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్‌మెన్ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్సనస్. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్‌తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్. అందుకోసం కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్ తెలిపారు. (చదవండి: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
ఎస్బీఐకి రూ.50వేలు జరిమానా
విశాఖ లీగల్: రుణం ఇవ్వకుండానే ఓ వ్యక్తి నుంచి 10 నెలలు ఈఎంఐ వసూలు చేసిన విశాఖలోని ఎన్ఏడీ కొత్త రోడ్లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖకు జిల్లా వినియోగదారుల ఫోరం–2 రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీలు చేయగా, జరిమానాను రూ.50వేలకు తగ్గించింది. విశాఖలోని మురళీనగర్‌కు చెందిన మాథా ఉదయభాస్కర్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఆయన జీతం ఎన్ఏడీ కొత్త రోడ్‌లోని ఎస్బీఐ శాఖలో ఉన్న తన ఖాతాలో జమ అవుతుంది. ఉదయభాస్కర్ మధురవాడలో సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.25లక్షలు రుణం కావాలని 2017లో ఎస్బీఐ ఎన్ఏడీ కొత్త రోడ్ శాఖ అధికారులను సంప్రదించారు. రుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు అంగీకరించి, ఆయనతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇంటికి కొన్ని అనుమతులు రాకపోవడం వల్ల రుణం మంజూరు చేయలేదు. కానీ, రుణం ఇచ్చి నట్లుగానే ఉదయభాస్కర్ బ్యాంక్ ఖాతా నుంచి నెలకు రూ.21,538 చొప్పున 10నెలలు రూ.2,15,380లు, సరైన సమాచారం ఇవ్వలేదని మరో రూ.10వేలు కట్ చేసుకున్నారు. బీమా సొమ్ము కింద పీఎన్బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.2,701 తీసుకున్నారు. తన ఖాతా నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంక్, బీమా కంపెనీవారిని ఉదయభాస్కర్ కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన 2019లో విశాఖలోని వినియోగదారుల ఫోరం–2లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన ఫోరం–2 న్యాయమూర్తి జి.వేంకటేశ్వరి, సభ్యులు డాక్టర్ రమణబాబు, పి.విజయదుర్గ.. వినియోగదారుడికి సేవాలోపం కలిగించినందుకు ఎస్బీఐ ఎన్ఏడీ కొత్త రోడ్ శాఖకు రూ.లక్ష జరిమానా విధిస్తూ 2022, మేలో తీర్పు చెప్పారు. ఈఎంఐ, జరిమానా, బీమా రూపంలో తీసుకున్న రూ.2,15,380లను12% వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద మరో రూ.20వేలను కలిపి 45 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఫోరం తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ జరిమానాను తగ్గించారు. -
ఇక బ్యాంకుల బాదుడు షురూ?.. భారం కానున్న లోన్ ఈఎంఐలు
ఇదిలాఉండగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ సమీకరణ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్) మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును బ్యాంకులు వ్యవస్థపై 100 నుంచి 150 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) బదలాయించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే జరిగితే వాహన, వ్యక్తిగత, ఆటో, వాణిజ్య రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. గత నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. వచ్చే నెల్లో జరిగే సమావేశాల్లోనూ పావుశాతం రేటు పెంపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రుణ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తంగా డిపాజిట్ రేట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. వ్యవస్థలో డిపాజిట్లు కూడా 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి. -
కారు ఈఎమ్ఐ చెల్లించే సులభమైన టిప్స్, ఇవే!
చాలామంది కార్లను ఈఎమ్ఐ పద్దతిలో కొనుగోలు చేస్తూ ఉంటారు, మొదట్లో బాగున్నప్పటికీ క్రమంగా కార్ ఈఎమ్ఐ భారంగా మారుతుంది. అయితే కారు లోన్ చెల్లించడానికి కొన్ని సులమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. కారుని సెలక్ట్ చేసుకోవడం: కొనుగోలుదారుడు ముందుగా తాను ఎలాంటి కారు కొనాలనేది డిసైడ్ చేసుకోవాలి. కారు కొనడానికి మీ ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తక్కువ డబ్బుతో కారు కొనాలనుకున్నప్పుడు హ్యాచ్‌బ్యాక్ ఎంచుకోవడం మంచిది. ప్రీమియం SUV ఎంచుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. డౌన్ పేమెంట్ పెంచుకోవడం: నిజానికి మీరు మొదట్లో చెల్లించే డౌన్ పేమెంట్ మీద కూడా ఈఎమ్ఐ ఆధారపడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతుంది. మొత్తం వడ్డీ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. అడిషినల్ ఈఎమ్ఐ చెల్లించడం: మీరు ఎంచుకునే ఈ అడిషినల్ ఈఎమ్ఐ వల్ల లోన్ భారం కొంత తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు రెండూ కూడా తగ్గుతాయి. ఉదాహరణకు నెలకు రూ. 19,500 చెల్లిస్తున్నారనుకుంటే, అదనంగా ప్రతి నెల రూ. 500 చెల్లించాలి. అప్పుడు మీరు నెలకు రూ. 20,000 చెల్లించవచ్చు. ఇది ఈఎమ్ఐ చివరలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. లోన్ ముందస్తుగా చెల్లించడం: మీరు తీసుకున్న లోన్ లేదా ఎంచుకున్న ఈఎమ్ఐ ముందస్తుగా చెల్లించడం వల్ల అది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ముందుగానే ఈ ఎంపిక గురించి తెలుసుకోవాలి, అప్పుడు మీకు వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం: మీరు ప్రతి నెల లోన్ చెల్లిస్తున్నట్లయితే తప్పకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు మీకు ఆర్ధిక భారాన్ని పెంచుతాయి. అయితే మీరు కారు కొనేటప్పుడే నిత్యావసరాల ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. ఇవన్నీ ఈఎమ్ఐ తొందరగా క్లియర్ సహాయపడతాయి. -
RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!
సాక్షి,ముంబై: ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 6.25 శాతం ఉన్న కీలకమైన రెపోరేటును 6.50 శాతానికి పెంచింది. దీని ప్రభావం అన్నిరకాల లోన్లపైనా పడనుంది. కార్లు, వివిధ రకాల వాహనాల లోన్లు, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. తాజా రెపో రేటు పెంపుతో అన్ని రకాల లోన్లపై రుణ భారం సుమారు 2-4 శాతం వరకు పెరగనుంది. దీంతో ఖాతాదారులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే ఈ భారం నుంచి కాస్త ఊరట కలగాలంటే.. అవకాశం ఉన్న రుణగ్రహీతలు లేదా వారి రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు నగదు చెల్లింపును లేదా ఈఎంఐ భారాన్ని భరించలేని వారు రుణకాలాన్ని పొడిగించుకోవడమో చేయాల్సి ఉంటుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారు కూడా పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీ శాతాన్నే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదుపులో ఉన్నప్పుడు తగ్గిస్తుంది లేదా అదే రేటును కొనసాగిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు వడ్డీ భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారుల మీదకు మళ్లించి ఆ మేరకు వడ్డీలను వసూలు చేస్తాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధపడతాయి. అయితే ఈ మేరకు ఖాతాదారుల డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు కూడా పెరగ నుంది (ఇదీ చదవండి: సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ) -
స్వరా ఫైనాన్స్ కస్టమర్లకు నివాబూపా కవరేజీ
న్యూఢిల్లీ: స్వరా ఫైనాన్స్‌తో నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఒప్పందం చేసుకుంది. దీనికింద స్వరా ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకునే వారికి ‘ఎక్స్‌ప్రెస్ హెల్త్ – సీరియస్ ఇల్నెస్ ప్లాన్ బెనిఫిట్’ను ఆఫర్ చేయనుంది. ఈ ప్లాన్ ఏడాది, రెండేళ్ల కాలానికి లభిస్తుంది. స్వర ఫైనాన్స్ రుణ గ్రహీతలు ఈ ప్లాన్ తీసుకుని, ఏదైనా అనారోగ్యంతో ఐదు రోజులు, అంతకుమించి ఎక్కువ కాలానికి హాస్పిటల్లో చేరినప్పుడు.. మూడు ఈఎంఐలను నివా బూపా చెల్లిస్తుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మందికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని.. ఈ అంతరం పూడ్చేందుకు స్వరా ఫైనాన్స్‌తో కలసి ఈ పాŠల్న్తో ముందుకు వచ్చామని నివాబూపా తెలిపింది. బ్యాంకుల పరిధిలో లేని కస్టమర్లకు స్వరా ఫైనాన్స్ రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తుంటుంది. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ!
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. మే నెల నుంచి హెచ్డీఎఫ్సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ వస్తుందా!
బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్‌కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది ►క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం ►నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం ►తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం ►క్రెడిట్ కార్డ్ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 750లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. -
నెలవారీ చెల్లింపులు మరింత భారం
ముంబై: వరుసగా ఐదో విడత ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది. ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. వృద్ధి అంచనాలకు కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్ సంస్థలు సైతం భారత్ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్‌తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది.. మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్బీఐ ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్‌సేల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ పాలసీలోని ఇతర అంశాలు ►ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు. ►సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ►ఆర్బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్ సమీక్షలో అర శాతం, ఆగస్ట్‌లో అర శాతం, సెప్టెంబర్ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ►యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘సింగిల్ బ్లాక్, మల్టీ డెబిట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్ ఒక ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం. ►భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేట్ల పెంపు స్పీడ్ తగ్గినట్టే ఆర్బీఐ పాలసీ ప్రకటన మా అంచనాలకు తగ్గట్టే ఉంది. విధానంలోనూ మార్పులేదు. ప్రకటన కొంచెం హాకిష్‌గా (కఠినంగా) ఉంది. రేట్ల పెంపు సైకిల్ ముగిసిందనే సంకేతాన్ని ఇవ్వలేదు. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2022–23 సంవత్సరానికి 6.7 శాతం వద్ద కొనసాగించడం, సీక్వెన్షియల్‌గా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న అంశాలు తెరముందుకు వచ్చాయి. ఇదే ధోరణి స్థిరంగా ఉంటూ, ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తుందా అన్నది చూడాలి. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ రెపో రేటు ఏ మాత్రం పెంచినా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపై, గృహ కొనుగోలుదారులపై పడుతుంది. బ్యాంకులు రేట్ల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీంతో స్వల్పకాలంలో ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుంది. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!
కర్నూలు(సెంట్రల్): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్ హ్యాండ్ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వెలుస్తున్న షోరూంలు.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్ షోరూంలు ఉన్నాయి. ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్‌లు అమ్మకాలు జరిగాయి. ఈఎంఐ సదుపాయం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లకు కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్పేమెంట్స్తో ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్కు చూపించి, దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం. కార్లపై పెరిగిన ఆసక్తి... మార్కెట్లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. కార్లు ఎక్కువగా కొంటున్నారు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మా షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి. కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు సౌకర్యవంతంగా ఉంది మేం ఇటీవల సెకండ్ హ్యాండ్లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. – రజనీకాంత్‌రెడ్డి, కర్నూలు సగం ధరకే కొనుగోలు చేశా నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్లో ఫస్టు హ్యాండ్ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా. – శ్రీనివాసరెడ్డి, కర్నూలు -
సర్వీస్ ఛార్జీల మోత : ‘ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్’
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు కార్డు వినియోగదారులకు సమాచారం అందించింది. కస్టమర్లకు ఎస్బీఐ పంపిన మెసేజ్ ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా రెంటు పే చేస్తే.. ఆ రెంటుపై రూ.99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ నెలనుంచి అమల్లోకి రానున్నట్లు అందులో పేర్కొంది. ఉదాహరణకు.. సురేష్ తన ఇంటిరెంట్ రూ.12వేలను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించేవారు. బ్యాంకు సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేసేవి కావు. కానీ తాజాగా ఎస్బీఐ తెచ్చిన నిబంధన మేరకు..సురేష్ తన ఇంటి రెంటును రూ.12వేలు చెల్లించడంతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.99, జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ప్రాసెసింగ్ ఫీజును పెంచింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే .. ఆ వస్తువు ధర ప్రాసెసింగ్ ఫీజు రూ.199 (అంతకు ముందు రూ.99 ఉంది), 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంది.