హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో ముందడుగు వేసింది. డిజిటల్ పేమెంట్స్ సాధనం అయిన అమెజాన్ పే తాజాగా అమెజాన్ పే ఈఎంఐ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. వాయిదాల్లో చెల్లించేలా అర్హులైన కస్టమర్లకు ఉపకరణాల కొనుగోలుకు రూ.60,000 వరకు రుణం మంజూరు చేస్తారు. క్రెడిట్ కార్డు లేని, డెబిట్ కార్డు ఉన్నా ఈఎంఐ సౌకర్యం పొందలేని వినియోగదార్ల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన డిజిటల్ లెండింగ్ స్టార్టప్ కంపెనీ క్యాపిటల్ ఫ్లోట్‌తో అమెజాన్ చేతులు కలిపింది. 3, 6 నెలల వాయిదాల్లో రుణం చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఉండదు. వాయిదాలు ఆరు నెలలు దాటితే కాలాన్నిబట్టి వడ్డీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లేదు. 60 సెకన్లలోనే రుణం జారీ చేస్తారు. ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా కనీసం రూ.8,000 ఆపైన ఖరీదైన ఒక ఐటెమ్ కొనుగోలుపై మాత్రమే లోన్ ఇస్తారు.
రుణం ఇలా పొందండి..
కార్డ్‌లెస్ ఈఎంఐ పొందాలంటే అమెజాన్ ఐడీ తప్పనిసరి. కొనుగోలు హిస్టరీ ఆధారంగా రుణం ఇచ్చేది నిర్ణయిస్తారు. ఆధార్ నంబర్, వోటర్ ఐడీ లేదా పాన్ నంబర్ ఉండాలి. కస్టమర్లు ముందుగా అమెజాన్ యాప్‌లోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐని ఎంచుకోవాలి. అడిగిన వివరాలు పొందుపరచాలి. ఆధార్ నంబరుతో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ పంపి వెరిఫై చేసుకుంటారు. ఎంత రుణం వచ్చేది స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. అమెజాన్ వెబ్‌సైట్లో వాయిదాల్లో విక్రయానికి ఉన్న ఉత్పత్తిని కార్ట్‌లోకి చేర్చుకోవాలి. చెకింగ్ ఔట్ సమయంలో ఈఎంఐ మెనూలోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐ ఎంచుకోవాలి. ఈఎంఐ ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. వాయిదాల చెల్లింపుకు డెబిట్ కార్డును అనుసంధానించాలి.
మొబైల్స్ అమ్మకాల్లో
10 శాతం వాటా: అమెజాన్
భారత మొబైల్స్ విక్రయాల్లో 10 శాతం వాటా దక్కించుకున్నట్టు అమెజాన్ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో మొబైల్స్ అమ్మకాల్లో 33–35 శాతం వాటా చేజిక్కించుకున్నామని అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ లీడర్ నిశాంత్ సర్దానా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘కంపెనీ వెబ్‌సైట్లో 2,500 రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఇందులో 250 దాకా ఎక్స్‌క్లూజివ్ మోడళ్లు ఉంటాయి. ఇన్ని రకాల ఫోన్లను నిల్వ చేయడం రిటైల్ దుకాణ వర్తకులకు సాధ్యం కాదు. ఎక్స్‌చేంజ్, నెల వాయిదాల్లో ఫోన్లను ఆఫర్ చేస్తున్నాం. రూ.500ల కనీస ఈఎంఐతో ఫోన్‌ను కొనుక్కోవచ్చు’ అని తెలిపారు. గతేడాది పండుగల సీజన్‌తో పోలిస్తే ఈసారి రెండింతల అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు.
60 వేల వరకు వడ్డీ లేని రుణం
Published Fri, Sep 21 2018 12:41 AM | Last Updated on Fri, Sep 21 2018 12:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment