
పీడీ కార్యాలయంలో పంచాయితీ చేస్తున్న టీడీపీ నాయకుడు బాలకృష్ణయాదవ్
కడప కార్పొరేషన్ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. పనులు మానుకొని బ్యాంకులకు వెళ్లలేని స్వయం సహాయక సంఘాల మహిళలు కంతులు చెల్లించమని ఇచ్చిన డబ్బులను ఆర్‌పీలు వాడేసుకున్నారు. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా బాధితులు గుర్తించలేకపోయారు. రుణానికి సంబంధించి కంతులన్నీ కట్టేశాం కదా మళ్లీ రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన మహిళలు ఒక్క కంతు కూడా కట్టలేదని తెలిసి కంగుతిన్నారు. తమ డబ్బులు ఏమయ్యాయని ఆర్‌పీలను నిలదీయడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. ఇందులో లక్ష్మిదేవి, లీలావతి అనే ఇద్దరు ఆర్‌పీలు ప్రధాన భూమిక పోషించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారికంగా రూ.15 లక్షలు మోసం జరిగిందని చెప్తున్నా, వాస్తవానికి రూ.30లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు మంగళవారం సాయంత్రం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్‌రెడ్డి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. అయితే డ్వాక్రా మహిళల డబ్బులను సొంతానికి వాడుకున్న వారికి మద్దతుగా టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ పంచాయితీకి వచ్చి పీడీ కార్యాలయంలో కూర్చోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి....
కడప నగరం శంకపురానికి చెందిన కావ్య స్వయం సహాయక సంఘ సభ్యులకు గత ఏడాది బ్యాంకు లింకేజీ ద్వారా జయనగర్ కాలనీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి రూ.7లక్షల రుణం మంజూరైంది. అయితే రూ.3.50 లక్షలు విత్ డ్రా చేయించి ఏడుగురు సభ్యులకు రూ.50వేల చొప్పున ఇచ్చిన ఆర్‌పీలు మిగతా రూ.3.50 లక్షలను వారికి ఇవ్వలేదు. ఆ మొత్తాన్ని స్త్రీ నిధికి జమ చేశామని చెప్తున్నా, అందులో వివరాలు నమోదు కాలేదు. అలాగే మరో ఇందిరా స్వయం సహాయక గ్రూపునకు సంబంధించి సభ్యులు 21 నెలలుగా చెల్లిస్తున్న సొమ్మును ఆర్‌పీలు సొంతానికి వాడుకున్నారు. ఆ గ్రూపు సభ్యులు రెండేళ్ల క్రితం జయనగర్ ఏపీజీబీలో రూ.5లక్షలు రుణంగా తీసుకున్నారు. మొదటి మూడు కంతులు సభ్యులే బ్యాంకుకు వెళ్లి చెల్లించారు. తర్వాత గ్రూప్ లీడర్ వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో సభ్యులంతా తాము చెల్లించాల్సిన కంతులను ఒక్కొక్కరు రూ.2500 చొప్పున నెలకు రూ.25వేలు ఆర్‌పీలకు ఇచ్చేవారు. వారు ఆ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించకుండా తమ సొంతానికి వాడుకున్నారు. తీరా అన్ని కంతులు అయిపోయాయి కదా మళ్లీ రుణం తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన వారికి వారు చెల్లించిన మూడు కంతులు తప్పా ఇంకేమీ కట్టలేదని తెలియడంతో ఆశ్చర్యపోయారు. న్యాయం చేయాలని పీడీ కార్యాలయానికి వచ్చారు. ఈ రెండు గ్రూపులేగాక మరో ఆరు గ్రూపులకు సంబంధించిన సభ్యుల నుంచి కూడా డబ్బులు తీసుకొని బ్యాంకులకు చెల్లించకుండా వారు మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే కేసు నమోదు– పీడీ
డ్వాక్రా సభ్యులు బ్యాంకులో కట్టమని ఇచ్చిన డబ్బులు ఆర్‌పీలు సొంతానికి వాడుకున్నారని, అందువల్లే ఈ సమస్య వచ్చిందని మెప్మా పీడీ రామమోహన్‌రెడ్డి తెలిపారు. ఇలా వారు వాడుకున్న మొత్తం రూ.15లక్షల వరకూ ఉందని, ఇద్దరు ఆర్‌పీలు ఈ వ్యవహారం నడిపారని, ఆర్‌పీలు డ్వాక్రా సభ్యుల వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment