ఇక రుణాలు మరింత చౌక! | RBI governor Sanjay Malhotra announces 25 bps repo rate cuts | Sakshi
Sakshi News home page

ఇక రుణాలు మరింత చౌక!

Published Thu, Apr 10 2025 4:58 AM | Last Updated on Thu, Apr 10 2025 4:58 AM

 RBI governor Sanjay Malhotra announces 25 bps repo rate cuts

ఈఎంఐలు దిగొస్తాయ్‌.. 

రెండోసారీ రెపో రేటు కోత 

6.25% నుంచి 6%కి తగ్గింపు 

ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌తో ఎకానమీకి, ఎగుమతులకు దెబ్బ 

వృద్ధి అంచనాలు 6.5%కి కట్‌ 

పరపతి విధానం ‘తటస్థం’ నుంచి ‘సానుకూలానికి’ మార్పు 

మరిన్ని రేట్ల కోతలకు సంకేతం... 

ద్రవ్యోల్బణం అంచనాలు కూడా 4 శాతానికి కుదింపు 

ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో కీలక నిర్ణయాలు

రుణగ్రహీతలకు మరోసారి ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలు మరింత చౌకగా లభించేలా.. ఈఎంఐల భారం ఇంకాస్త దిగొచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకపక్క ముదురుతున్న ట్రంప్‌ టారిఫ్‌ వార్‌.. మరోపక్క దిగజారుతున్న వృద్ధి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తూ... వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించింది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న సంకేతాలివ్వడం విశేషం! ఆర్‌బీఐ చర్యలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు కూడా తక్షణం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పరపతి సమీక్షలోనూ వడ్డీ రేట్ల కోతకు ఓకే చెప్పింది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు గట్టిగానే సెగ తగిలే అవకాశం ఉండటంతో కీలక పాలసీ రేటు.. రెపోను వరుసగా రెండోసారి తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గనుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలోని పరిపతి విధాన కమీటీ (ఎంపీసీ) సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఓటేశారు. దీంతో బ్యాంకుల రుణ రేట్లు కూడా దిగిరానున్నాయి. 

ప్రతీకార సుంకాల్లో భాగంగా దాదాపు 60 దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌లు విధించడం తెలిసిందే. భారత్‌పై కూడా 26 శాతం సుంకాలు వడ్డించారు. మరోపక్క, అమెరికాతో అమీతుమీ అంటూ చైనా కూడా దీటుగా సుంకాలతో విరుచుపడుతుండటంతో వాణిజ్య యుద్ధం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో వృద్ధికి మరింత దన్నుగా నిలిచేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో కొనసాగుతోంది.  ఈ ఏడాది ఫిబ్రవరి సమీక్షలో దాదాపు ఐదేళ్ల తర్వాత (2020 మే) తొలిసారి రెపో రేటును పావు శాతం తగ్గించింది.  ఇప్పుడు మరో పావు శాతం కోతతో రెపో రేటు 2022 నవంబర్‌ స్థాయికి దిగొచ్చింది.

వృద్ధి రేటు అంచనాలు డౌన్‌... 
ట్రేడ్‌ వార్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశి్చతుల ప్రభావంతో మన ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క, మాంద్యం ఆందోళనలు, ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయంగా చమురు రేటు దిగొస్తుండటంతో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.5 శాతానికి కుదించింది.  

ఇతర ముఖ్యాంశాలు... 
→ పరపతి విధాన స్థితిని ఇప్పుడున్న ‘తటస్థం’ నుంచి ‘సానుకూలానికి’ తగ్గించింది. అంటే, ఎలాంటి తీవ్ర ప్రతికూలాంశాలు లేకపోతే, రాబోయే సమీక్షల్లో రేట్ల తగ్గింపు లేదా యథాతథ స్థితిని కొనసాగించడం జరుగుతుంది. 
→ పర్సన్‌–టు–మర్చంట్‌ (పీ2ఎం) పేమెంట్‌లకు సంబంధించి యూపీఐ లావాదేవీ పరిమితిని పెంచడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కి అనుమతించింది. ప్రస్తుతం పర్సన్‌–టు–పర్సన్‌ (పీ2పీ), పీ2ఎం పరిమితి రెండూ రూ.  లక్షగా ఉంది. అయితే, పీ2ఎంలో కొన్ని నిర్దిష్ట వినియోగాలకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు ఇలా అధిక పరిమితులకు మినహాయింపు ఉంటోంది. అయితే, ఇప్పుడు ఆర్‌బీఐ అనుమతితో పీ2ఎంపై ఉన్న రూ. లక్ష పరిమితిని యూజర్ల అవసరాలకు అనుగుణంగా పెంచడానికి ఎన్‌పీసీఐకి అవకాశం లభిస్తుంది. పీ2పీ పరిమితి మాత్రం రూ. లక్షగానే కొనసాగుతుంది. 
→ బంగారు రుణాలపై నిబంధనలను కఠిన తరం చేస్తూ ముసాయిదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. రుణాల మంజూరు సమయంలో తనఖాగా పెట్టే పసిడి స్వచ్ఛత, బరువు లెక్కింపు ఇతరత్రా పద్ధతులకు సంబంధించి గోల్డ్‌ లోన్‌ పరిశ్రమలోని రుణదాతలంతా ఇకపై ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను అనుసరించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్రాంచీల్లోనూ ఒకే ప్రామాణిక విధానం అమలు చేయాలని ముసాయిదాలో పేర్కొంది. 
→ తదుపరి పాలసీ సమీక్ష 2025 జూన్‌ 4 నుంచి 6 వరకు జరుగుతుంది.


4 బ్యాంకులు బోణీ...
ఆర్‌బీఐ రెండోసారి రెపో తగ్గింపు ప్రకటనతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు బోణీ చేశాయి. ఇందులో ఇండియన్‌ బ్యాంక్‌ అత్యధికంగా రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌బీఎల్‌ఆర్‌)ను 35 బేసిస్‌ పాయింట్లు (0.35%) తగ్గింంచి 8.7%కి చేర్చింది. శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్‌లో పావు శాతం కోతతో ఇప్పుడున్న 9.1% నుంచి 8.85 శాతానికి తగ్గించాయి. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. యూకో బ్యాంక్‌ గురువారం నుంచి అమలయ్యేలా ఆర్‌బీఎల్‌ఆర్‌ను 8.8%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గను న్నాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలోనే ఇదే బాట పట్టే అవకాశం ఉంది.

నేను భారతంలో సంజయుడిని కాదు... 
వడ్డీ రేట్లు ఏ స్థాయికి చేరుతాయో చెప్పలేను. నేను భారతంలో సంజయుడిని కాదు. సంజయ్‌ని మాత్రమే. నాకు అలాంటి దివ్య దృష్టి ఏదీ లేదు. పాలసీ నిర్ణయం కస్టమర్లకు బదిలీ అయ్యేందుకు తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ)ను అందిస్తాం. తాజా ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ముడిచమురు ధరలు దిగొస్తున్నాయి. దీంతో సెంట్రల్‌ బ్యాంకులు తమ దేశీ ప్రాధాన్యతలను అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.    – సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌బీఐ గవర్నర్‌

గృహ రుణాలపై ఊరట ఇలా... 
ఆర్‌బీఐ వరుసగా రెండో సారీ రెపో రేటును పావు శాతం తగ్గించడంతో గృహ రుణగ్రహీతలకు మరింత ఊరట లభించనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75% వడ్డీ రేటుతో తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.44,186 చొప్పు న నెలవారీ వాయిదా(ఈఎంఐ) పడు తుంది. బ్యాంకులు ఈ పావు శాతం కోతను నేరు గా కస్టమర్లకు బదలాయిస్తే... వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గు తుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ. 43,391కి దిగొస్తుంది. అంటే నెలకు రూ.795 చొప్పున మిగిలినట్లు లెక్క. మిగతా రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పులు జరగకుండా అదే వడ్డీ రేటు కొనసాగితే మొత్తం వడ్డీ రూ. 1,90,649 ఆదా అవుతుంది. అయితే, రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ నెలవారీ చెల్లించే ఈఎంఐని ఇంతకుముందు లాగే (రూ.44,186 చొప్పున) కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.

ఎకానమీకి దన్ను... 
రెపో రేటు తగ్గింపుతో పాటు పరపతి విధాన స్థితిని తటస్థం నుంచి సానుకూలానికి మార్చడం అనేది దేశీ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. టారిఫ్‌ ప్రభావం నుంచి ఎకానమీకి చేదోడుగా నిలిచేందుకు ఈ చర్యలు తోడ్పడతాయి. 
– సీఎస్‌ శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్‌

వాహన పరిశ్రమకు సానుకూలం... ఆర్‌బీఐ రెపో తగ్గింపుతో వాహన కొనుగోలుదారులపై భారం తగ్గుతుంది. దీనివల్ల మళ్లీ అమ్మకాలు పుంజుకుని ఆటోమొబైల్‌ రంగంలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంటుంది. 
– శైలేష్‌ చంద్ర, సియామ్‌ ప్రెసిడెంట్‌

వృద్ధికి ఊతం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రెపో కోతతో పాటు పరపతి విధానాన్ని సానుకూలానికి మార్చడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్‌. దీనికి ప్రభుత్వ సానుకూల ఆర్థిక విధానం కూడా తోడవ్వడంతో వృద్ధి పుంజుకుంటుంది. 
– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయ్‌... 
రియల్టీ రంగంలో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్‌ నింపేలా సరైన సమయంలో రేట్ల కోత నిర్ణయం వెలువడింది. దీనివల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొచి్చ... మధ్య ఆదాయ, అందుబాటు ధర ఇళ్ల విభాగాల్లో అమ్మకాలు పుంజుకుంటాయి. 
– బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement