borrower
-
ఇక రుణాలు మరింత చౌక!
రుణగ్రహీతలకు మరోసారి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత చౌకగా లభించేలా.. ఈఎంఐల భారం ఇంకాస్త దిగొచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకపక్క ముదురుతున్న ట్రంప్ టారిఫ్ వార్.. మరోపక్క దిగజారుతున్న వృద్ధి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తూ... వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించింది. అంతేకాదు, సమీప భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న సంకేతాలివ్వడం విశేషం! ఆర్బీఐ చర్యలకు అనుగుణంగా కొన్ని బ్యాంకులు కూడా తక్షణం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పరపతి సమీక్షలోనూ వడ్డీ రేట్ల కోతకు ఓకే చెప్పింది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు ఆర్థిక వ్యవస్థకు గట్టిగానే సెగ తగిలే అవకాశం ఉండటంతో కీలక పాలసీ రేటు.. రెపోను వరుసగా రెండోసారి తగ్గించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలోని పరిపతి విధాన కమీటీ (ఎంపీసీ) సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఓటేశారు. దీంతో బ్యాంకుల రుణ రేట్లు కూడా దిగిరానున్నాయి. ప్రతీకార సుంకాల్లో భాగంగా దాదాపు 60 దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధించడం తెలిసిందే. భారత్‌పై కూడా 26 శాతం సుంకాలు వడ్డించారు. మరోపక్క, అమెరికాతో అమీతుమీ అంటూ చైనా కూడా దీటుగా సుంకాలతో విరుచుపడుతుండటంతో వాణిజ్య యుద్ధం అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో వృద్ధికి మరింత దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి సమీక్షలో దాదాపు ఐదేళ్ల తర్వాత (2020 మే) తొలిసారి రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఇప్పుడు మరో పావు శాతం కోతతో రెపో రేటు 2022 నవంబర్ స్థాయికి దిగొచ్చింది.వృద్ధి రేటు అంచనాలు డౌన్... ట్రేడ్ వార్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశి్చతుల ప్రభావంతో మన ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క, మాంద్యం ఆందోళనలు, ఆర్థిక మందగమనం కారణంగా అంతర్జాతీయంగా చమురు రేటు దిగొస్తుండటంతో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా 4.5 శాతానికి కుదించింది. ఇతర ముఖ్యాంశాలు... → పరపతి విధాన స్థితిని ఇప్పుడున్న ‘తటస్థం’ నుంచి ‘సానుకూలానికి’ తగ్గించింది. అంటే, ఎలాంటి తీవ్ర ప్రతికూలాంశాలు లేకపోతే, రాబోయే సమీక్షల్లో రేట్ల తగ్గింపు లేదా యథాతథ స్థితిని కొనసాగించడం జరుగుతుంది. → పర్సన్–టు–మర్చంట్ (పీ2ఎం) పేమెంట్లకు సంబంధించి యూపీఐ లావాదేవీ పరిమితిని పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి అనుమతించింది. ప్రస్తుతం పర్సన్–టు–పర్సన్ (పీ2పీ), పీ2ఎం పరిమితి రెండూ రూ. లక్షగా ఉంది. అయితే, పీ2ఎంలో కొన్ని నిర్దిష్ట వినియోగాలకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు ఇలా అధిక పరిమితులకు మినహాయింపు ఉంటోంది. అయితే, ఇప్పుడు ఆర్బీఐ అనుమతితో పీ2ఎంపై ఉన్న రూ. లక్ష పరిమితిని యూజర్ల అవసరాలకు అనుగుణంగా పెంచడానికి ఎన్‌పీసీఐకి అవకాశం లభిస్తుంది. పీ2పీ పరిమితి మాత్రం రూ. లక్షగానే కొనసాగుతుంది. → బంగారు రుణాలపై నిబంధనలను కఠిన తరం చేస్తూ ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. రుణాల మంజూరు సమయంలో తనఖాగా పెట్టే పసిడి స్వచ్ఛత, బరువు లెక్కింపు ఇతరత్రా పద్ధతులకు సంబంధించి గోల్డ్ లోన్ పరిశ్రమలోని రుణదాతలంతా ఇకపై ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను అనుసరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్రాంచీల్లోనూ ఒకే ప్రామాణిక విధానం అమలు చేయాలని ముసాయిదాలో పేర్కొంది. → తదుపరి పాలసీ సమీక్ష 2025 జూన్ 4 నుంచి 6 వరకు జరుగుతుంది.4 బ్యాంకులు బోణీ...ఆర్బీఐ రెండోసారి రెపో తగ్గింపు ప్రకటనతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు బోణీ చేశాయి. ఇందులో ఇండియన్ బ్యాంక్ అత్యధికంగా రెపో ఆధారిత రుణ రేటు (ఆర్బీఎల్ఆర్)ను 35 బేసిస్ పాయింట్లు (0.35%) తగ్గింంచి 8.7%కి చేర్చింది. శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్‌లో పావు శాతం కోతతో ఇప్పుడున్న 9.1% నుంచి 8.85 శాతానికి తగ్గించాయి. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. యూకో బ్యాంక్ గురువారం నుంచి అమలయ్యేలా ఆర్‌బీఎల్‌ఆర్‌ను 8.8%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గను న్నాయి. ఇతర బ్యాంకులు కూడా త్వరలోనే ఇదే బాట పట్టే అవకాశం ఉంది.నేను భారతంలో సంజయుడిని కాదు... వడ్డీ రేట్లు ఏ స్థాయికి చేరుతాయో చెప్పలేను. నేను భారతంలో సంజయుడిని కాదు. సంజయ్‌ని మాత్రమే. నాకు అలాంటి దివ్య దృష్టి ఏదీ లేదు. పాలసీ నిర్ణయం కస్టమర్లకు బదిలీ అయ్యేందుకు తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ)ను అందిస్తాం. తాజా ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ముడిచమురు ధరలు దిగొస్తున్నాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు తమ దేశీ ప్రాధాన్యతలను అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్గృహ రుణాలపై ఊరట ఇలా... ఆర్బీఐ వరుసగా రెండో సారీ రెపో రేటును పావు శాతం తగ్గించడంతో గృహ రుణగ్రహీతలకు మరింత ఊరట లభించనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75% వడ్డీ రేటుతో తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.44,186 చొప్పు న నెలవారీ వాయిదా(ఈఎంఐ) పడు తుంది. బ్యాంకులు ఈ పావు శాతం కోతను నేరు గా కస్టమర్లకు బదలాయిస్తే... వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గు తుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ. 43,391కి దిగొస్తుంది. అంటే నెలకు రూ.795 చొప్పున మిగిలినట్లు లెక్క. మిగతా రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పులు జరగకుండా అదే వడ్డీ రేటు కొనసాగితే మొత్తం వడ్డీ రూ. 1,90,649 ఆదా అవుతుంది. అయితే, రుణ కాల వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ నెలవారీ చెల్లించే ఈఎంఐని ఇంతకుముందు లాగే (రూ.44,186 చొప్పున) కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఎకానమీకి దన్ను... రెపో రేటు తగ్గింపుతో పాటు పరపతి విధాన స్థితిని తటస్థం నుంచి సానుకూలానికి మార్చడం అనేది దేశీ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. టారిఫ్ ప్రభావం నుంచి ఎకానమీకి చేదోడుగా నిలిచేందుకు ఈ చర్యలు తోడ్పడతాయి. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్వాహన పరిశ్రమకు సానుకూలం... ఆర్బీఐ రెపో తగ్గింపుతో వాహన కొనుగోలుదారులపై భారం తగ్గుతుంది. దీనివల్ల మళ్లీ అమ్మకాలు పుంజుకుని ఆటోమొబైల్ రంగంలో సానుకూల సెంటిమెంట్ నెలకొంటుంది. – శైలేష్ చంద్ర, సియామ్ ప్రెసిడెంట్వృద్ధికి ఊతం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రెపో కోతతో పాటు పరపతి విధానాన్ని సానుకూలానికి మార్చడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్. దీనికి ప్రభుత్వ సానుకూల ఆర్థిక విధానం కూడా తోడవ్వడంతో వృద్ధి పుంజుకుంటుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయ్... రియల్టీ రంగంలో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్ నింపేలా సరైన సమయంలో రేట్ల కోత నిర్ణయం వెలువడింది. దీనివల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొచి్చ... మధ్య ఆదాయ, అందుబాటు ధర ఇళ్ల విభాగాల్లో అమ్మకాలు పుంజుకుంటాయి. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు -
గృహ రుణం.. దిగొస్తుంది భారం!
కొండెక్కి కూర్చున్న రుణ రేటును కిందికి దింపే దిశగా ఆర్బీఐ తొలి అడుగు వేసింది. రెపో రేటును పావు శాతం తగ్గించి రుణ గ్రహీతలకు తీపి కబురందించింది. చూడ్డానికి స్వల్ప మొత్తమే అయినా.. గృహ రుణ గ్రహీతలకు లక్షల్లో మిగలనున్నాయి. తమ వంతు కృషిని కొంచెం జోడిస్తే మరింత ఆదా చేసుకోవచ్చు. రుణానికి త్వరగా గుడ్‌బై చెప్పొచ్చు. తాజా రేటు తగ్గింపుతో మిగిలేదెంత? దీనికి అదనంగా మిగుల్చుకునేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్లు ఏవి? ఈ వివరాలను అందించే కథనమే ఇది. వడ్డీ భారం తగ్గేది ఇలా.. ఏడాది క్రితం 50 లక్షల గృహ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుపై 20 ఏళ్ల కాల వ్యవధి కోసం తీసుకున్నారని అనుకుందాం. ఈఎంఐని ఇంతకుముందు మాదిరే కొనసాగించేట్టు అయితే.. పావు శాతం తగ్గింపు, అర శాతం రేటు తగ్గింపుతో ఎంత ప్రయోజనం లభిస్తుందో చూద్దాం. (టేబుల్ 2) ప్రభావం ఏ మేరకు? 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గింపు చిన్న మొత్తమే అయినా దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ మొత్తం ఆదా కానుంది. నెలవారీ చెల్లించే ఈఎంఐ ఇంతకుముందు మాదిరే కొనసాగించుకుంటూ వెళితే, పావు శాతం రేటు తగ్గింపు వల్ల రుణం త్వరగా తీరిపోతుంది. ఒకవేళ రెపో రేటు తగ్గింపును ఈఎంఐలో సర్దుబాటు చేసుకుంటే.. అప్పుడు నెలవారీ చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. రుణ కాల వ్యవధి ఇంతకుముందే మాదిరే కొనసాగుతుంది. ఈఎంఐ తగ్గించడం లేదంటే అదే ఈఎంఐ కొనసాగించి, రుణ కాల వ్యవధి త్వరగా ముగించడం.. ఈ రెండు ఆప్షన్లను బ్యాంక్‌లు కల్పిస్తాయి. రుణ గ్రహీత తనకు అనుకూలమైన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల గృహ రుణాన్ని 9 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. సవరణ తర్వాత 8.75 శాతం తగ్గుతుంది. దీంతో రూ.26,992 ఈఎంఐ కాస్తా రూ.26,551కు దిగొస్తుంది. ఈఎంఐలో రూ.480 (1.8 శాతం) మిగులుతుంది. (టేబుల్ 1)అమలుకు ఎంత సమయం?బ్యాంక్‌లు 2019 అక్టోబర్ నుంచి అన్ని ఫ్లోటింగ్ రేటు రిటైల్ రుణాలను (గృహ రుణాలు సహా) ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాయి. చాలా బ్యాంక్‌లు రెపో రేటునే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌గా అనుసరిస్తున్నాయి. కనుక రెపో రేటులో మార్పులు రుణాలపై వేగంగా ప్రతిఫలించనున్నాయి. బ్యాంక్‌లు వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షించాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణా లు, దీనికంటే ముందున్న బేస్ రేటు ఆధారిత రుణాలపై రేటు తగ్గింపు అమల్లోకి రావడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం తీసుకోవచ్చు. ‘‘రె పో లింక్డ్ రుణాలపై ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికీ ఈ మేరకు తక్కువ రేటుపై రు ణాలు లభిస్తాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలపై రే టు తగ్గింపు అన్నది సమీక్షించే తేదీపైనే ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ప్రస్తుతం మాదిరే రుణాలకు చెల్లింపులు కొనసాగించాలి’’ అని పైసాబజార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నవీన్ కుక్రెజా తెలిపారు.కొత్తగా రుణం తీసుకునే వారికీ ఊరట ఈ ఏడాది ఆర్బీఐ మరో 25–50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అర శాతం రేటు తగ్గడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంతన్నది పైనున్న టేబుల్–2లో గమనించొచ్చు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం డేటాపైనే భవిష్యత్తు రేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘మరో 50–75 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది ద్రవ్యోల్బణం స్థిరత్వం, అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని పీఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్) ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ ఎకనామిస్ట్ అర్హ మోగ్రా అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును అంచనా వేస్తున్నట్టు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు. తక్కువ రేటు రుణానికి మారిపోవడమే ఆర్బీఐ భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. ఎంసీఎల్ఆర్ విధానంలో ఉన్నవారికి ఈ రేటు తగ్గింపు ప్రయోజనం బదిలీ ఆలస్యంగా లభిస్తుంది. కనుక ఇప్పటికే ఎంసీఎల్ఆర్ ఆధారిత లేదా దీనికంటే ముందున్న బేస్ రేటు విధానంలో గృహ రుణాలు తీసుకున్నవారు రీఫైనాన్సింగ్ (వేరొక సంస్థకు మారిపోవడం) ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రముఖ బ్యాంక్‌లు రెపో నుంచి ఆఫర్ చేస్తున్నాయి. గృహ రుణ కాల వ్యవధి ఇంకా దీర్ఘకాలం పాటు ఉంటే గనుక తక్కువ రేటుపై ఆఫర్ చేసే బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. దీని ద్వారా పెద్ద మొత్తమే ఆదా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పటికే తీసుకున్న రుణాన్ని అదే బ్యాంక్ పరిధిలో రెపో రేటు విధానంలోకి మార్చి, రేటు తగ్గించాలని కూడా కోరొచ్చు. అన్ని బ్యాంక్‌లు కాకపోయినా కొన్ని బ్యాంక్‌లు ఇందుకు అనుమతించొచ్చు. రెపో ఆధారిత గృహ రుణ గ్రహీతలు సైతం మరింత తక్కువ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్/ఎన్బీఎఫ్సీకి మారిపోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. 0.35–0.50 శాతం రేటు తక్కువ ఉన్నా కానీ, బదిలీని పరిశీలించొచ్చన్నారు. పన్ను ఆదాతో కలిపితే ఆదా ఎక్కువే ‘‘రూ.25 లక్షల స్థూల ఆదాయం కలిగిన వ్యక్తి రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని (20 ఏళ్ల కాలం, 9 శాతం రేటు) 2025 మార్చి నాటికి 12 ఈఎంఐలు చెల్లించినట్టయితే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 లక్షలను ఆదా చేసుకోవచ్చు. అంటే నెలవారీగా రూ.11,461. గృహ రుణం రేటును పావు శాతం తగ్గించడం, అధిక శ్లాబుల్లోని వారికి బడ్జెట్లో ప్రకటించిన పన్ను రాయితీలతో ఈ మొత్తం మిగలనుంది’’అని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి వివరించారు. ఎప్పుడు తీసుకున్నారు..? గృహ రుణాన్ని ఐదేళ్ల క్రితం తీసుకున్న వారితో పోల్చితే ఏడాది క్రితం తీసుకున్న వారికి .. తాజా రేటు తగ్గింపుతో మిగులు ఎక్కువగా లభిస్తుంది. ఉదాహరణ: రూ.75 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు (240 నెలలు) 9 శాతం రేటుపై తీసుకున్నారు. దీనికి చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ రూ.67,479. ఇలా 20 ఏళ్ల కాలలో మొత్తం చెల్లించాల్సింది రూ.1.62 కోట్లు. ఇందులో వడ్డీ రూ.87 లక్షలు. ఇప్పుడు రుణంపై వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.75 శాతానికి దిగొచ్చింది. దీంతో గృహ రుణం తీసుకుని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తయిన వారు.. ఇంతకుముందు మాదిరిగా అదే ఈఎంఐని చెల్లిస్తూ వెళితే మిగిలిన కాలంలో ఎంత మిగులుతుంది, ఎంత తొందరగా రుణం ముగుస్తుందో టేబుల్లో చూడొచ్చు. పాక్షిక చెల్లింపుతో ఇంకా ఆదాగృహ రుణ చెల్లింపుల భారం తగ్గించుకునేందుకు అందుబాటులోని మార్గాల్లో పాక్షిక చెల్లింపులు ఒకటి. ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక గృహ రుణ ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లిస్తూ వెళ్లాలి. దీని ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. రూ.75 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 25 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. దీనిపై నెలవారీ రూ.62,940 ఈఎంఐగా చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించినట్టయితే కాల వ్యవధి పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం రూ.1.89 కోట్లు. ఇందులో వడ్డీయే రూ.1.14 కోట్లు. ఇప్పుడు ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లించడం వల్ల 25 ఏళ్లకు బదులు 13 ఏళ్లకే రుణం తీరిపోతుంది. అసలు, వడ్డీ కలిపి చెల్లించే మొత్తం కూడా రూ.1.37 కోట్లకు తగ్గుతుంది. తద్వారా రూ.52 లక్షలు ఆదా అవుతాయి. ఇలా చేస్తే అధిక ప్రయోజనం.. → క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు ప్రయతి్నంచాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు గృహ రుణాలను 0.25 శాతం తక్కువకే ఇస్తుంటాయి. → గృహ రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి ఎంపిక చేసుకోవాలి. 20 ఏళ్ల కాలం మించకుండా చూసుకోవాలి. కొత్త పన్ను విధానంలో గృహ రుణంపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. → భవిష్యత్తులో రేట్లు తగ్గే అవకాశాలే ఎక్కువ. కనుక రెపో ఆధారిత రుణం తీసుకోవడమే మంచిది. → వీలైనంత అధిక డౌన్ పేమెంట్ ముందే సమకూర్చుకుని, రుణం మొత్తాన్ని తగ్గించుకోవాలి. → రుణ కాలవ్యవధి మరో 15 ఏళ్లు మిగిలి ఉంటే, ప్రస్తుత రుణ రేటు కంటే తక్కువ రేటుపై ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడం వల్ల పెద్ద మొత్తం ఆదా అవుతుంది. → ఏటా వీలైనంత మేర ఈఎంఐ పెంచి చెల్లించడం వల్ల రుణాన్ని వేగంగా ముగించేయొచ్చు. బేరమాడడమే.. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు కొంత తక్కువ రేటును ఆఫర్ చేస్తుంటాయి. కనుక 760కు పైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారు బ్యాంక్ అధికారితో సంప్రదించి రేటు తగ్గించుకోవడంలో సఫలం కావొచ్చు. ఇప్పటికే తీసుకున్న రుణంపై రేటు తగ్గించే విషయంలోనూ రుణ గ్రహీతల డిమాండ్‌ను అధికారులు అంగీకరించొచ్చు. లేదంటే మరొక బ్యాంక్‌కు రుణాన్ని బదిలీ చేసుకుంటామంటే దానికి బదులు రేటు తగ్గింపునకు వారు మొగ్గు చూపించొచ్చు. ముఖ్యంగా బ్యాంక్‌లకు బదులు ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ రేటుపై రుణ బదిలీ చేసుకునే వారిని ప్రోత్సహిస్తుంటాయి. ఇందుకు కొంత ప్రాసెసింగ్ చార్జీలను భరించాల్సి రావచ్చు. ఆటో రుణాలపై తక్కువే రూ.10 లక్షల ఆటో రుణాన్ని ఐదేళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకుని రూ.21,247 ఈఎంఐ కింద చెల్లిస్తున్నారని అనుకుందాం. తగ్గింపు తర్వాత వడ్డీ రేటు 9.75 శాతానికి దిగొచ్చింది. ఇంతకుముందు మాదిరే రూ.21,247 ఈఎంఐ చెల్లిస్తూ వెళితే.. రుణం మూడు నెలల ముందుగా తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.15,000 ఆదా అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రుణగ్రహీతలకు శుభవార్త
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ గ్రహీతలకు తీపి కబురు చెప్పింది. రుణ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. దీనితో గృహ రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ) భారం తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవలే పావుశాతం తగ్గించిన నేపథ్యంలో (6.5 శాతం నుంచి 6.25 శాతానికి) ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్లు ఇలా...→ వివిధ రుణాలకు వర్తించే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), అలాగే రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గించింది. ఈ తగ్గింపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. → అయితే బ్యాంక్ మార్జినల్ కాస్ట్–బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్), బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ను (బీపీఎల్ఆర్) యథాతథంగా కొనసాగించింది. రెపో ఆధారిత రుణల విషయానికి వస్తే...రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రత్యక్షంగా రెపో రేటుకు అనుసంధానమై ఉంటుంది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఈ రేటు 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గుతుంది. దీనితో ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాణిజ్య రుణాలు తగ్గుతాయి. ఆకర్షణీయం..ఈబీఎల్ఆర్ లేదా ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన రుణ గ్రహీతల రుణ నిబంధనలను బట్టి వారి ఈఎంఐలు లేదా రుణ వ్యవధి తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాలను మరింత ఆకర్షణీయంగా చేస్తూ, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ను ఎస్బీఐ తగ్గించడం కస్టమర్లకు ప్రయోజనం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ తగ్గిన రుణ రేటు ప్రయోజనాలు పొందడానికి మార్జినల్ కాస్ట్ రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కస్టమర్లు తక్కువ వడ్డీరేటు రుణ విధానానికి మారవలసి ఉంటుంది. ‘రుణ’ పునఃపరిశీలనకు సూచన...తాజా రుణ రేట్లు, సంబంధిత పరిణామాల నేపథ్యంలో కొత్త రుణగ్రహీతలు రుణదాతను (బ్యాంక్) ఎంచుకునే ముందు వివిధ బ్యాంకుల రుణ రేట్లను సరిపోల్చుకోవాలని, వారి సామర్థ్యానికి అనువైన రుణ రేట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రుణగ్రహీతలు తప్పనిసరిగా తమ రుణ ఒప్పందాలను సమీక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. అవసరమైతే రీఫైనాన్సింగ్ ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ రెపో తగ్గింపు నేపథ్యంలో కెనరా బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించాయి. ఈ బ్యాంకుల నుండి గృహ రుణ గ్రహీతలు తమ ఈఎంఐలను అలాగే రుణ చెల్లింపు వ్యవధి కాల పరిమితులను సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈబీఎల్ఆర్ అంటే?ఈబీఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్. ఎస్బీఐ 2019 అక్టోబర్ నుంచి తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను అనుసంధానించడానికి ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంది. దీనితో అన్ని ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లకు వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమవుతాయి. తాజా నిర్ణయంతో గృహ రుణ ఫ్లోటింగ్ రేట్లు తగ్గుతాయన్న మాట. దీనితోపాటు ఈబీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని వ్యక్తిగత ఇతర రిటైల్ రుణాలు సైతం దిగివస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం ఈబీఎల్ ఆర్ 9.15% నుంచి 8.90 శాతానికి తగ్గింది. -
డిజిటల్ లావాదేవీల వైపు రుణగ్రహీతల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలవారీ కిస్తీల చెల్లింపు (ఈఎంఐ), వెబ్సైట్, యాప్ ఆధారిత రుణాల పట్ల దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన రుణ గ్రహీతల్లో ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలు తీసుకునే ధోరణి వేగిరమైంది. పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ రుణ గ్రహీతలు పోటీ పడుతున్నారు. గృహాల కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకునే రుణాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. పైచదువుల కోసం తీసుకునే రుణాల్లో గడిచిన నాలుగేళ్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ ‘భారత్‌లో రుణగ్రహీతల తీరుతెన్నులు –2024’అధ్యయన ఫలితాలను ఈ నెల 17న విడుదల చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, లూథి యానా, కొచ్చి, డెహ్రాడూన్ సహా 17 నగరాల్లో హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. నెలకు సగటున రూ.31 వేల ఆదాయంతో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన రుణగ్రహీతల నుంచి వివరాలు సేకరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో పెరుగుదల నిరంతరాయంగా లావాదేవీలు నిర్వహించే సౌకర్యం, డిజిటల్ సాంకేతికతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ కంటే యాప్ ఆధారిత బ్యాంకింగ్‌పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువత, మెట్రో నగరాల్లో యాప్ ఆధారిత బ్యాంకింగ్ వినియోగం ధోరణి ఎక్కువగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వినియోగం 2023లో 48 శాతం ఉండగా 2024లో 53 శాతానికి పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ ధోరణిని ఎక్కువగా మహిళలు (60 శాతం), మిల్లేనియల్స్ (59 శాతం), జెన్ జెడ్ (58శాతం)లో కనిపించింది. మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాలు (56 శాతం) ఆన్లైన్ షాపింగ్‌లో సమస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, రాంచీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న ఈఎంఐ కార్డుల వినియోగం ఒకేచోట ఇన్సూరెన్స్, లోన్లు, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలు అందించే (ఎంబెడ్డెడ్ ఫైనాన్స్) యాప్‌లు లేదా వెబ్‌సైట్లపైనా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు 64 శాతం మంది ప్రధాన ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది ప్రయాణ యాప్స్ (మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్)ను ఎంచుకుంటున్నారు. 23 శాతం మంది ఆహార డెలివరీ యాప్స్ (జొమాటో, స్విగ్గీ) ఉపయోగిస్తున్నారు. లక్నో, పాటా్న, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ వంటి నగరాల్లో ఎంబెడ్డెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.ఇదిలా ఉంటే ఈఎంఐ కార్డులు భారతదేశంలోని దిగువ, మధ్యతరగతి రుణ గ్రహీతలు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రెడిట్ సాధనంగా భావిస్తున్నారు. వేగంగా, నమ్మకంగా రుణం లభించే వేదికలుగా వీటిని పేర్కొంటున్నారు. వీటితోపాటు క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా కూడా రుణం తేలిగ్గా లభిస్తుందనే అభిప్రాయం గ్రహీతల్లో కనిపించింది. ఇదిలా ఉంటే రుణగ్రహీతల్లో ఎక్కువ శాతం మంది బ్యాంకు శాఖలకు భౌతికంగా వెళ్లడం, కొందరు ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంటున్నారు. డేటా గోప్యత కోసం డిమాండ్ రుణ గ్రహీతల్లో డేటా ప్రైవసీ మార్గదర్శకాలకు సంబంధించి పెరుగుతున్న అవగాహన అంతరాన్ని కూడా అ« ద్యయనం ఎత్తిచూపింది. రుణ సంస్థలు అమలు చేయాల్సిన డేటా గోప్యత ఆవశ్యకతపై రుణ గ్రహీతల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. దిగువ మధ్యతరగతి రుణదాతల్లో సుమారు 50 శాతం మందికి డేటా రక్షణ మార్గదర్శకాల గురించి అవగాహన లేదు. రుణ గ్రహీత ల్లో సుమారు పావుశాతం మందికి మాత్రమే రుణ యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా తమ వ్యక్తిగత డేటా వాడకం తీరును అర్థం చేసుకుంటున్నారు. సుమారు ముప్పావు శాతం మంది తమ వ్యక్తిగత డేటా వినియోగంపై స్పష్టత కోరుతూ, డేటా వినియోగంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, రుణ వెబ్సైట్లు, యాప్‌లు, చెల్లింపు వాలెట్లు, ఇతర క్లిష్టమైన ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో సహాయం అవసరమని నివేదించారు, మహిళలు, జెన్ ఎక్స్‌తోపాటు, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పెరిగిన చాట్‌బాట్స్, వాట్సాప్ వాడకం వినియోగదారుల సేవలో చాట్బాట్లకు (ఏఐ ఆధారిత మెసేజింగ్ యాప్‌లు) ఆదరణ వేగంగా పెరుగుతోంది. వీటి సేవలపై జెన్ జెడ్‌కు ఎక్కువ అవగాహన కలిగి ఉండగా, చాట్‌బాట్ వినియోగించడం సులభంగా ఉంటుందని రుణదాతలు భావిస్తున్నారు. వాట్సాప్ కూడా రుణ మార్కెట్లో కీలక మార్గంగా మారింది. 59 శాతం మంది రుణదాతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లు పొందుతున్నారు. 2023 లో 24 శాతంగా ఉన్న రుణ ఆఫర్లు 2024 లో 26 శాతానికి పెరగడం వాట్సాప్ డిజిటల్ వేదికపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అధ్యయనంలో తేలింది. -
ఎస్బీఐ వినూత్న ఐడియా! ఈఎంఐలు కట్టనివారి కోసం..
బ్యాంకులో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టనివారి నుంచి బకాయిలు రాబట్టేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినూత్న ఐడియా వేసింది. ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది. (ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు) ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకుంటున్న కస్టమర్లు.. సాధారణంగా బ్యాంక్ చేసే రిమైండర్ కాల్‌కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్బీఐ భావిస్తోంది. వడ్డీ రేట్లలో కదలికల నేపథ్యంలో ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యాలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ 2023 జూన్ త్రైమాసికంలో గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే రెండు ఫిన్‌టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్బీఐలో రిస్క్ విభాగానికి ఇన్చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ఈ ఫిన్‌టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని పేర్కన్నారు. అయితే ఆ ఫిన్‌టెక్‌ల పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ చర్య కేవలం పైలట్ దశలో ఉందని, కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని, విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) -
రూ. వేల కోట్ల చార్జీల ఎఫెక్ట్: బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2018 నుంచి జరిమానా ఛార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. ఇందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు వసూలు చేశాయి. బ్యాంకులు చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి ఇన్ని వేల కోట్లు వసూలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సురక్షిత రుణ విధానాలపై తన ఆదేశాలలో భాగంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన రుణగ్రహీతలపై జరిమానా రూపంలో అదనపు వడ్డీని విధించవద్దని బ్యాంకులను కోరింది. బ్యాంకులు జరిమానా రూపంలో విధించే వడ్డీలు, ఛార్జీలను ఆదాయ మార్గంగా చూడకూడదని, ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు వడ్డీని కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. రుణ ఖాతాలపై విధించే జరిమానా ఛార్జీలను నియంత్రించాలని ప్రతిపాదించిన ఏప్రిల్ 12 నాటి ముసాయిదా సర్క్యులర్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు ఇవే.. నిబంధనల ఉల్లంఘించినందుకు రుణ ఖాతాలపై ఎలాంటి వడ్డీ విధించకూడదు. ఒక సారి అపరాధ రుసుము విధించిట్లయితే, ఈ ఛార్జీలపై అదనపు వడ్డీ వేయకూడదు. వసూలు చేసే వడ్డీపై అదనంగా ఎటువంటి వడ్డీలు కానీ, చార్జీలు కానీ విధించకూడదు. జరిమానాలు సహేతుకంగా నిబంధనల ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా ఉండాలి. ఏదైనా నిర్దిష్ట రుణ ఉత్పత్తిపై ఇవి మరీ ఎక్కువగా ఉండకూడదు. వ్యక్తిగత రుణగ్రహీతలకు విధించే జరిమానా ఛార్జీలు.. ఇతర రుణగ్రహీతలకు విధించే దాని కంటే ఎక్కువగా ఉండకూడదు. జరిమానా మొత్తం, విధించడానికి గల కారణాలను ఆయా బ్యాంకులు, సంస్థలు స్పష్టంగా వెల్లడించాలి. సురక్షిత రుణ విధానాలకు సంబంధించిన కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే, ఇవి క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య క్రెడిట్లు, స్ట్రక్చర్డ్ ఆబ్లిగేషన్లకు వర్తించవు. ఇదీ చదవండి: Search of Unclaimed deposits: బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్‌లో చెక్ చేయండి.. -
లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్! కొత్త విధానం ప్రకటించిన ఆర్బీఐ
అధిక వడ్డీ రేటు ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న హోమ్, ఆటో, ఇతర లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారడానికి రుణగ్రహీతలను అనుమతించే ఫ్రేమ్‌వర్క్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఫ్రేమ్‌వర్క్ గురించి తెలియజేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్ త్వరలో అమలులోకి రానున్నందున లోన్ టెన్యూర్, ఈఎంఐల గురించి రుణగ్రహీతలకు స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచించారు. రుణగ్రహీతలకు సమాచారం అందించకుండానే, వారి సమ్మతి లేకుండానే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్ల టెన్యూర్‌ను అసమంజసంగా పొడిగించిన అనేక ఉదంతాలు తాము చేపట్టిన పర్యవేక్షక సమీక్షలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడయ్యాయన్నారు. రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అనుసరించేలా సరైన కండక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. లోన్ టెన్యూర్, ఈఎంఐ మార్పుల గురించి రుణగ్రహీతలకు బ్యాంకులు స్పష్టంగా తెలియజేసేలా, ఫిక్స్డ్ రేట్ లోన్లకు మారడం లేదా లోన్లను ఫోర్క్లోజర్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ల గురించి సమాచారం అందించేలా ఈ ఫ్రేమ్‌వర్క్ నియంత్రిస్తుందన్నారు. అలాగే వివిధ ఛార్జీలను పారదర్శకంగా బహిర్గతం చేసేలా చేస్తుందన్నారు. దీనికి సంబంధించి సవివరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా? -
ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు!
లోన్ కోసం బ్యాంకుల వద్ద ఉంచిన రుణ గ్రహీతల ఒరిజినల్ ఆస్తి పత్రాలను పోగొడితే బ్యాంకులు రుణగ్రహీతలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలలో కస్టమర్ సేవా ప్రమాణాలను సమీక్షించడానికి గత ఏడాది మేలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంగీకరిస్తే ఇది త్వరలో అమల్లోకి రానుంది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో నేతృత్వంలోని ప్యానెల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యాంక్‌కు తన నివేదికను సమర్పించింది. ప్యానెల సిఫార్సులలో ఈ సూచన కూడా ఉంది. కమిటీ సిఫార్సులపై వాటాదారుల అభిప్రాయాలను ఆర్బీఐ కోరింది. జూలై 7లోగా తమ అభిప్రాయాలను వాటాదారులు తెలియజేయాల్సి ఉంటుంది. లోన్ అకౌంట్‌ను మూసివేసిన అనంతరం రుణగ్రహీతకు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి బ్యాంకులకు కాల పరిమితిని నిర్దేశించడాన్ని ఆర్బీఐ పరిగణించవచ్చని ప్యానెల్ సూచించింది. లేని పక్షంలో ఆలస్యమైన మేరకు జరిమానా లేదా పరిహారం చెల్లించేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించింది. పరిహారం చెల్లించాల్సిందే! ఆస్తి పత్రాలు బ్యాంకులు పోగొట్టిన సందర్భంలో పత్రాల సర్టిఫైడ్ రిజిస్టర్డ్ కాపీలను తమ ఖర్చుతో అందించడమే కాకుండా, ఈ క్రమంలో కస్టమర్లు కోల్పోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా పరిహారం చెల్లించడానికి బ్యాంక్ బాధ్యత వహించాలని ప్యానెల్ సూచించింది. సాధారణంగా లోన్లు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఒరిజినల్ ఆస్తి పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి. రుణాలు పూర్తిగా తిరిగి చెల్లించాక వాటని కస్టమర్లకు ఇస్తాయి. అయితే, రుణాన్ని సకాలంలో చెల్లించినప్పటికీ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు చాలా సమయం తీసుకుంటున్నాయని ఆర్బీఐకి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సిఫార్సులు వచ్చాయి. ఇదీ చదవండి: Aadhaar-based UPI: ఆధార్‌తో యూపీఐ పేమెంట్: గూగుల్‌పేలో కొత్త ఫీచర్ -
అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే?
దేశ వ్యాప్తంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఆ నివేదికలో వరుసగా మూడో సారి దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది. ఆర్ధిక సంవత్సరం-2023 అంటే ఏప్రిల్ 1,2022 నుంచి మార్చి 31, 2023 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం తమిళనాడు తీసుకున్న రుణాలు (స్టేట్ డెవలప్మెంట్ లోన్- ఎస్డీఎల్) రూ. 68,000 కోట్లకు చేరినట్లు నివేదించింది. రాష్ట్రాల వారీగా గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 - 2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. మహరాష్ట్ర , వెస్ట్ బెంగాల్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉండగా ..ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నాయి.తెలంగాణ, గుజరాత్, హర్యానాలు 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. అప్పుల జాబితా ప్రకారం.. తమిళనాడు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్ధిక సంవత్సరం 2021లో రూ. 87,977 కోట్లు, ఆర్ధిక సంవత్సరం 2022లో రూ.87,000 కోట్లను అప్పుగా తీసుకుంది. అయితే, గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఆర్ధిక సంవత్సరం 2023 సమయానికి రుణాల శాతం తగ్గింది. ఆర్బీఐ నివేదికలో ఆర్ధిక సంవత్సరం 2023 ముగిసే సమయానికి దేశంలో అప్పులు తక్కువగా తీసుకున్న 10 రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఆర్ధిక సంవత్సరం 2022లో ఉత్తర ప్రదేశ్‌కు రూ.62,500 కోట్లు ఉండగా.. కేవలం 11 నెలల్లో ఆ మొత్తం కాస్త రూ. 33,500 కోట్లకు తగ్గింది. సొంత పన్ను, రాబడి వంటి ఇతర కారణాల వల్ల రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితా ఇలా ఉంది ఆర్బీఐ నివేదికలో 2023 ఏప్రిల్ - జూన్ సమయానికి 22 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు రూ.1.99-లక్షల కోట్ల రుణాలు తీసుకోవచ్చని అంచనా వేసింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి (క్యూ1) నాటికి మహరాష్ట్ర (రూ.25,000కోట్లు), తమిళనాడు (రూ.24,000 కోట్లు) మొత్తం రూ.2లక్షల కోట్లు రుణాలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
వారి వాదన కూడా వినండి: బ్యాంకులకు సుప్రీంకోర్టు కీలక సూచన
న్యూఢిల్లీ: ఒక అకౌంట్‌ను మోసపూరితమైనదిగా ప్రకటించేముందు సంబంధిత రుణ గ్రహీత తన వాదనను వినిపించుకునేందుకూ తగిన అవకాశం కల్పించాలని బ్యాంకింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు 2020లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!) ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించడం వల్ల ఆ నేర విచారణను దర్యాప్తు సంస్థలు చేపట్టడమే కాకుండా, అది ఇతర క్రిమినల్, సివిల్ చర్యలకూ దారితీస్తుందన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించే చర్య.. రుణగ్రహీత వ్యాపారం, సద్భావనపై (గుడ్‌విల్) మాత్రమే కాకుండా కీర్తి ప్రతిష్టలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రుణగ్రహీతలకు తప్పనిసరిగా నోటీసు అందించాలని, ‘మోసపూరితమైనదిగా ప్రకటించడానికి దారితీస్తున్న పరిస్థితులకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక లోని తీర్మానాలను వివరించడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీం సూచించింది. (ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) ‘‘తన అకౌంట్‌ను నేరపూరితమైనదిగా ప్రకటించడం కూడదని రుణగ్రహీత విజ్ఞప్తిచేస్తే, ఆ అభ్యంతరాలను తోసిపుచ్చాల్సిన పరిస్థితుల్లో... అందుకు సంబంధించి సహేతుకమైన ఉత్తర్వు జారీ చేయవలసి ఉంటుంది‘ అని బెంచ్ స్పష్టం చేసింది. 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకులు, నిర్ధిష్ట ఆర్థిక సంస్థలు మోసాల వర్గీకరణ రిపోర్టింగ్) ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అభ్యర్ధనలపై సుప్రీం తాజా తీర్పు వెలువరించింది. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్ ) -
వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్బీఐ ఉక్కుపాదం!
ముంబై: రుణ వసూళ్ల ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు చెల్లించాలంటూ రుణ గ్రహీతలను బెదిరించడాన్ని నిషేధించింది. అలాగే, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్ చేయడం కూడా కుదరని స్పష్టం చేసింది. తన నియంత్రణలోని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (ఆర్ఈలు), ఏఆర్సీలకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) రుణాలను వసూలు చేసే ఏజెంట్లు భౌతికంగా లేదా మాటల రూపంలో వేధింపులకు పాల్పడకుండా ఆర్ఈలు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంపకూడదని, గుర్తు తెలియని కాల్స్ రూపంలో వేధించకూడదని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లు ఇటీవలి కాలంలో ఆమోదనీయం కాని చర్యలకు పాల్పడుతున్నట్టు తెలియడంతో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ -
దివాలా చట్టంతో రుణ వ్యవస్థలో మార్పు
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ)తో రుణ వ్యవస్థలో పెను సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టంతో రుణ దాతలు, రుణ గ్రహీతల వైఖరిలో కూడా మార్పు చోటుచేసుకుందని అన్నారు. ఇచ్చిన రుణం తిరిగి వస్తుందన్న భరోసా రుణదాతకు, తీసుకున్న రుణం తప్పనిసరిగా తీర్చాలన్న అభిప్రాయం రుణ గ్రహీతకు కలిగినట్లు పేర్కొన్నారు. ఆయా అంశాలు దేశంలో సరళతర వ్యాపార వృద్ధికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దోహదపడుతున్నట్లు వివరించారు. రుణ వ్యవస్థకు సంబంధించి ఐబీసీ ఒక పెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. రుణ పరిష్కారానికి గతంలో దశాబ్దాలు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి దశ దివాలా వ్యవహారం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తయ్యే వ్యవస్థ ప్రస్తుతం నెలకొందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఐసీఏఐ (ఐఐఐపీఐ) ఐదవ వ్యవస్థాపక దినోత్సవంలో గోయెల్ ఈ కీలక ప్రసంగం చేశారు. రానున్న కాలంలో భారత్ విశ్వసనీయత, దేశ ఫైనాన్షియల్ నిర్మాణం మరింత బలపడతాయని గోయెల్ అన్నారు. ఐఐఐపీఐకు ఐదు మార్గదర్శకాలు... పనిలో సమగ్రత, నిష్పాక్షికత, వృత్తిపరమైన సామర్థ్యం, గోప్యత, పారదర్శకత అనే ఐదు మార్గదర్శక సూత్రాలను అనుసరించాలని మంత్రి ఐఐఐపీఐ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఐదు సూత్రాలను అనుసరిస్తే, నిపుణులు ఆశించే వృత్తిపరమైన ప్రవర్తన మరింత ఇనుమడిస్తుందని అన్నారు. వీటితోపాటు మరే ఇతర తరహా విధినిర్వహణ తమ సామర్థ్యాన్ని, పనితీరును పెంచుతుందన్న విషయాన్ని సభ్యులు గుర్తించాలన్నారు. మొండి బకాయిల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని అన్నారు. వ్యాపార సంస్థల ఏర్పాటు, నిర్వహణలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఐఐఐపీఐ తనవంతు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కోవిడ్–19 కాలంలో వ్యాపారాలను కష్టాల నుండి రక్షించడానికి, 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు డిఫాల్ట్‌ల నుండి ఉత్పన్నమయ్యే దివాలా చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. -
గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ మార్కెట్లో భారీ వాటా దక్కించుకోవడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు తగ్గింపు సహా రుణ గ్రహీతలకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుంది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ► ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. వీరి మధ్య రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్బీఐ తొలగించింది. ► రుణ బ్యాలన్స్ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది. ► ప్రాసెసింగ్ ఫీజునూ బ్యాంకింగ్ దిగ్గజం రద్దు చేసింది. రిటైల్ రుణాలపై బీఓబీ ఆఫర్లు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని రిటైల్ రుణాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్ రుణ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గాయి. కారు రుణ రేటు 7 శాతం వద్ద ప్రారంభమైతే, గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుంది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ తగ్గించింది. బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌పై కూడా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. -
రుణాలు : తీసుకున్నది తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావైపోతారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాలు తీసుకోవడంలోనే కాదు ఇవ్వడంలోనూ యూత్ సత్తా చాటుతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) మధ్య జరిగిన రుణ లావాదేవీలపై లెన్‌డెన్‌క్లబ్ విడుదల చేసిన 2020-21 అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 12 లక్షల మంది సర్వేలో పాలుపంచుకున్నారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో.. రుణాలు తీసుకున్నవారు 56 శాతం ఉంటే.. రుణాలు ఇచ్చినవారు 54 శాతం మంది ఉండడం విశేషం. లోన్స్ కోసం దరఖాస్తులన్నీ దాదాపు యాప్ ద్వారానే జరుగుతున్నాయి. అత్యవసర వైద్యానికి ఎక్కువగా అప్పులు చేశారు. అదికూడా రూ.25,000 వరకే. హైదరాబాదీయులు రుణాలు తీసుకోవడంలో మూడవ స్థానంలో, ఇవ్వడంలో రెండవ స్థానంలో నిలిచారు. విశేషమేమంటే రుణాలు ఇచ్చినవారిలో 19 శాతం మంది మహిళలు ఉన్నారు. -
క్రెడిట్ స్కోరును గుడ్డిగా అనుసరించొద్దు
న్యూఢిల్లీ/గువాహటి: రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. ‘‘బ్రాంచ్ బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలి. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదు. డేటా విశ్లేషణ, బిగ్ డేటా వినియోగాన్ని కోరుకుంటున్నప్పటికీ.. శాఖల స్థాయిల్లో కస్టమర్లు మీ నుంచి వ్యక్తిగత స్పందనను కోరుకుంటారు’’ అని ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో గురువారం జరిగిన సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. ఆర్బీఐ కానీ, ప్రభుత్వం కానీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను గుడ్డిగా అనుసరించాలంటూ ఎటువంటి ఆదేశాన్ని జారీ చేయలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కస్టమర్లతో వ్యక్తిగత అనుసంధానత, డేటాను వినియోగించుకోవడం అవసరమన్నారు. శాఖల స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనలను విని, వారిలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాలని బ్యాంకు ఉన్నతోద్యోగులకు సూచించారు. రుణ వితరణను పెంచాలి.. రుణాల పంపిణీని మరింత పెంచాలని బ్యాంకుల చీఫ్‌లను మంత్రి సీతారామన్ కోరారు. వ్యవస్థలో తగిన డిమాండ్ లేదంటూ వారు చెప్పినా.. రుణ వితరణ పెంపు దిశగా తగిన విధానాలను చేపట్టాలని ఆమె కోరడం గమనార్హం. పెట్టుబడులపై ‘సీఏఏ’ ప్రభావం ఉండదు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన హింసాత్మక చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఇటీవల తాను భేటీ అయిన ఇన్వెస్టర్లు భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారన్నారు. ఇప్పటిౖMðతే కరోనా వైరస్ ప్రభావం మన దేశంపై లేదన్నారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడకపోతే పరిశ్రమకు చేదోడుగా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. 1.18 లక్షల రుణ దరఖాస్తులను పరిష్కరించాలి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద పెండింగ్‌లో ఉన్న 1.18 లక్షల దరఖాస్తులను మార్చి 15వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. రుణ సాయంతో స్వయం ఉపాధి కింద వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడమే పీఎంఈజీపీ పథకం ఉద్దేశ్యం. ఎంఎస్ఎంఈ రంగ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఎంఎస్ఎంఈ రుణాల పునరుద్ధరణపై కూడా చర్చించారు. -
రుణ రేట్ల సమీక్షకు బ్యాంకర్లు ఓకే
న్యూఢిల్లీ: ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో అందించని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో సోమవారం చర్చించారు. రుణ రేట్లను సమీక్షించేందుకు బ్యంకర్లు అంగీకారం తెలిపారు. గత డిసెంబర్ నుంచి ఆర్బీఐ ఇప్పటి వరకు 75 బేసిస్ పాయింట్ల మేర రుణ రేట్లను తగ్గించినప్పుటికీ, ఆ స్థాయిలో రుణాలపై రేట్లు తగ్గని విషయం తెలిసిందే. ‘‘బ్యాంకులు రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని రుణాలకు బదలాయించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ రేట్లను సమీక్షించి చర్యలు తీసుకుంటామని బ్యాంకులు సమావేశంలో అంగీకరించాయి’’అని మంత్రి అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లు, ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, సిటీ బ్యాంకు తదితర బ్యాంకుల సారథులతో సమావేశం అనంతరం మంత్రి నుంచి ప్రకటన వెలువడింది. ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్ రంగాలకు రుణ వితరణ వృద్ధితోపాటు సకాలంలో రేట్ల తగ్గింపు ప్రయోజనాల బదిలీ, డిజిటైజేషన్, సేవల పన్ను సంబంధిత అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. పలు రంగాల ప్రతినిధులతో సమావేశమవుతా పలు రంగాల ప్రతినిధులతో తాను సమావేశమై, సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం బ్యాంకుల చీఫ్‌లతో భేటీ అయినట్టుగానే... ఈ వారంలోనే ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, ఆటోమొబైల్ రంగం, వాణిజ్య సంఘాలు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను విని, తగురీతిలో, సత్వరమే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎఫ్‌పీఐ ప్రతినిధులతో మాట్లాడుతా న్యూఢిల్లీ: అధిక ఆదాయ వర్గాలపై బడ్జెట్లో సర్‌చార్జీ భారీ పెంపు అనంతరం నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత క్యాపిటల్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగిస్తుండడంతో, ఎఫ్‌పీఐ ప్రతినిధులతో త్వరలోనే చర్చలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. సౌర్వభౌమ బాండ్ల జారీకి సంబంధించి బడ్జెట్లో ప్రకటన మినహా దానికి సంబంధించి అదనంగా ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ రెండు నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడినట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఆర్థిక శాఖ పరిధిలోని ఎకనమిక్ అఫైర్స్ విభాగం కార్యదర్శి అతను చక్రవర్తి ఎఫ్‌ఫీఐల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘వారు (ఎఫ్‌పీఐలు) చెప్పదలుచుకున్నదాన్ని వినేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ప్రకటించారు. ఈ నెల మొదటి రెండు రోజుల్లోనే ఎఫ్‌ఫీఐలు డెట్, ఈక్విటీల నుంచి రూ.2,985 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. -
అక్కడ అందరికీ అప్పులే..
లండన్ : సంపన్న దేశం అనగానే అందరికీ కళ్లుచెదిరే భవంతులు, ఖరీదైన కార్లు గుర్తొస్తుంటాయి. అయితే ఇవన్నీ ఉన్నా బ్రిటన్‌లో ప్రజలందరూ నిండా అప్పుల్లో మునిగారు. పదేళ్ల పాటు అతితక్కువ వడ్డీరేట్లు కొనసాగిన క్రమంలో ప్రజల్లో పొదుపు రేట్లు పడిపోయి రుణాలు పెరిగిపోయాయి. ప్రజలు పొదుపు చేసిన మొత్తం కన్నా తీసుకున్న రుణాలు పెరిగిపోవడంతో 1987 తర్వాత తొలిసారిగా బ్రిటన్ ప్రజలు 2017లో నికర రుణగ్రహీతలుగా మారారు. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన డేటాతో ఈ దిగ్భ్రాంతికర సమాచారం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల కోసం ప్రజలు పొదుపు చేసే మొత్తాలు 1963 తర్వాత అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయాయని నివేదిక వెల్లడించింది. గత ఏడాది బ్రిటన్ పౌరులు తాము సంపాదించిన మొత్తం కంటే 1440 కోట్ల యూరోలు అధికంగా ఖర్చు చేశారు. బ్రిటన్ కుటుంబాలు తాము పొదుపు చేసిన మొత్తం కంటే 460 కోట్ల యూరోలు అధికంగా అప్పు చేశారని నివేదిక తెలిపింది. 1963లో పొదుపు వివరాలు మదింపు చేస్తున్నప్పటి నుంచి అతితక్కువగా 2017లో బ్రిటన్ పౌరుల సంపాదనలో కేవలం 4.9 శాతమే పొదుపు చేశారని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభానికి ముందు వడ్డీరేట్లు 5 శాతం ఉండగా, అనంతరం వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బేస్ రేట్ కేవలం 0.5 శాతమే. కారుచౌకగా రుణాలు లభిస్తుండటంతో బ్రిటన్ పౌరులు విపరీతంగా రుణాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వీటిని తిరిగి చెల్లించే క్రమంలో కుటుంబ ఖర్చులను అధిగమించి పొదుపు చేయడం బ్రిటన్ పౌరులకు సంక్లిష్టంగా మారింది. మారుతున్న పరిస్థితుల్లో బ్రిటన్ పౌరులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదుపు దేశంగా వర్థిల్లిన బ్రిటన్ ఇప్పుడు రుణ గ్రహీతల దేశంగా మారిందని ప్రజలు తిరిగి పొదుపును అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. -
నడ్డి విరుస్తున్న వడ్డీ!
కరీంనగర్‌క్రైం: ఫైనాన్స్.. ఈ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధిక వడ్డీకి అప్పు ఇస్తూ.. ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నారు. ఆ అప్పు చెల్లించలేని పక్షంలో తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రైవేట్, డైలీ ఫైనాన్స్ మాఫియాగా మారాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలను పిప్పి చేస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలకు అనుమతి అటుంచితే.. అదుపులేని వడ్డీతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. వీరి బారిన పడుతున్న పేదలు ఇళ్లు, భూములు గుల్ల చేసుకుంటున్నారు. అక్రమ వ్యాపారాన్ని నియంత్రించాల్సిన అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతుండడంపై అనుమానాలకు తావిస్తోంది. ఇలా అధిక వడ్డీలు వసూలు చేసేక్రమంలో పలువురి మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతం బయటకు వచ్చిందిగానీ.. అతడి స్థాయిలోకాకున్నా.. అదే పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వహిస్తూ.. పేదల కష్టార్జితాన్ని లాగేసుకుంటున్నారు. సిరిసిల్లలో కలకలం: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలువురు వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో వడ్డీవ్యాపార బాగోతం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో పోలీసులు దాడులు చేసి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రికార్డులు స్వాధీనం చేసుకున్నా.. విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదు. రూ.25కోట్ల పైమాటే.. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ రూ.25 కోట్లమేర ప్రైవేట్, గిరిగిరి, డైలీ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. చాలామంది రూ.10వేలు మొదలు.. రూ.50లక్షల వరకూ అప్పు ఇస్తున్నారు. ముందుగానే రూ.10 నుంచి రూ.15 వడ్డీని పట్టుకుంటున్నారు. (రూ.వెయ్యి అప్పుగా తీసుకుంటే రూ.150 పట్టుకుని రూ.850 ఇస్తారు) ఇందుకు ఖాళీ చెక్కులు, ప్రామిసరినోట్లు, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారు. బాధితుడు సకాలంలో అప్పు చెల్లించినా.. కాగితాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. మరికొందరు భూములను తాకట్టు పెట్టుకుని దాని విలువలో 40 నుంచి 60 శాతం అప్పు ఇస్తున్నారు. అనివార్య కారణాలతో ఆలస్యమైతే.. అప్పుఇచ్చే సమయంలో రాయించుకున్న కాగితాల ప్రకారం.. యజమానికి సమాచారం ఇవ్వకుండానే అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆస్తిని హామీగా ఉంచితే 9 శాతం, హామీ లేకపోతే 12శాతం వడ్డీ తీసుకునే అవకాశం ఉంది. కానీ.. జిల్లాలో మాత్రం 40నుంచి45 శాతం వసూలు చేస్తున్నారంటే వ్యాపారుల అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. భూములు తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చేవారు కరీంనగర్ నగరంలోనే 30మంది, ప్రైవేట్ ఫైనాన్స్‌లు, డైలీ, గిరిగిరి ఫైనాన్షియర్లు 70 మంది వరకూ ఉన్నారు. పోలీసులూ.. ఫైనాన్షియర్లే.. మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతం బయటకు రావడంతో అధిక వడ్డీలకు అప్పు ఇస్తున్నవారిలో పోలీస్ అధికారులూ ఉన్నట్లు అవగతమవుతోంది. కరీంనగర్‌లోనే పలు ఠాణాలు తీరుగుతున్న ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున రియల్ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు కూడబెట్టడంతోపాటు పలు వెంచర్లలోనూ భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. విభజిత జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో ఉంటున్న సుమారు 20 మంది వరకూ అప్పులిస్తారని, వీరు కూడా 5 నుంచి 8 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని సమాచారం. వీరు సొంతశాఖలోని సిబ్బందికే అప్పు ఇచ్చి.. చెల్లించడంలో ఆలస్యమైతే అధికారి ద్వారా ఒత్తిడి తెచ్చి వారివేతనం నుంచి తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరిబారిన పడినవారు చాలామంది ఉన్నా.. బయటకు చెప్పుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలో పలువురు వడ్డీ విషయంలో హెడ్‌క్వార్టర్‌లోనే పలు గొడవలు కూడా జరిగాయని సమాచారం. నిర్లక్ష్య ఫలితం..? అప్పు తీసుకునే వ్యక్తినుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకోవడం చట్టరీత్యా నేరం. దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే ఫైనాన్షియర్లలో పోలీసులే ఉండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఒకవేళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. చిన్నచిన్న కేసులు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఫిర్యాదు చేయాలంటే జంకుతున్నారు. ఆదాయపన్ను శాఖ ఏం చేస్తోంది..? నిబంధనల ప్రకారం చేబదులుగా అప్పు ఇస్తే అనుమతి అవసరం లేదు. వ్యాపారంగా చేస్తే మాత్రం లైసెన్స్ ఉండాలి. కానీ.. జిల్లావ్యాప్తంగా అప్పు ఇస్తున్న ఫైనాన్స్ సంస్థలు ఎలాంటి అనుమతి లేకున్నా.. ఆదాయపన్నుశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నా.. ఐటీ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదో అంతుచిక్కని ప్రశ్నగామారింది. గతంలో అదాయపన్ను శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి అధికంగా భూములు కోనుగోలు చేస్తున్న సమాచారం సేకరిస్తుండగా.. ఓ వ్యక్తి కరీంనగర్ మండలంలో రూ.30 కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. కోట్ల రూపాయలు డైలీ, గిరిగిరి ఫైనాన్స్‌లు నడిపిస్తున్నవారిలో 95 శాతంమంది కనీసం రూ.లక్ష కూడా ఆదాయపన్ను చెల్లించడం లేదని సమాచారం. వివరాలు సేకరిస్తున్న పోలీసులు సిరిసిల్లలో పోలీసులు దాడులు చేసి.. పలువురు వ్యాపారులను అరెస్ట్ చేయడంతో మిగిలిన మూడు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఫైనాన్షియర్ల బారినపడిన వారి వివరాలు సేకరించాలని పోలీసుల అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
బాకీ డబ్బు అడిగితే చెవి కోశాడు!
తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్: అప్పుగా ఇచ్చిన డబ్బు అడిగిన నేరానికి ఓ మహిళపై దాడి చేసి ఆమె చెవి కోశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం జరిగింది. ఇస్లావత్ తండాకు చెందిన లక్ష్మి అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ బూబులుకు ఏడాది క్రితం రూ.10 వేలు అప్పుగా ఇచ్చింది. తన బాకీ తీర్చాలని లక్ష్మి కొద్ది రోజులుగా అడుగుతుంటే బూబులు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతడి ఇంటికి వెళ్లి తన బాకీ చెల్లించాలని తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన బూబులు అతడి తల్లి బాజి కలిసి లక్ష్మిపై దాడి చేశారు. తల్లి లక్ష్మిని పట్టుకోగా బూబులు కత్తితో ఆమె చెవి కోశాడు.