కరీంనగర్‌క్రైం: ఫైనాన్స్.. ఈ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధిక వడ్డీకి అప్పు ఇస్తూ.. ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నారు. ఆ అప్పు చెల్లించలేని పక్షంలో తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రైవేట్, డైలీ ఫైనాన్స్ మాఫియాగా మారాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలను పిప్పి చేస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలకు అనుమతి అటుంచితే.. అదుపులేని వడ్డీతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. వీరి బారిన పడుతున్న పేదలు ఇళ్లు, భూములు గుల్ల చేసుకుంటున్నారు. అక్రమ వ్యాపారాన్ని నియంత్రించాల్సిన అధికారులు వ్యాపారులకే వత్తాసు పలుకుతుండడంపై అనుమానాలకు తావిస్తోంది. ఇలా అధిక వడ్డీలు వసూలు చేసేక్రమంలో పలువురి మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతం బయటకు వచ్చిందిగానీ.. అతడి స్థాయిలోకాకున్నా.. అదే పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వహిస్తూ.. పేదల కష్టార్జితాన్ని లాగేసుకుంటున్నారు.
సిరిసిల్లలో కలకలం: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలువురు వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో వడ్డీవ్యాపార బాగోతం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో పోలీసులు దాడులు చేసి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రికార్డులు స్వాధీనం చేసుకున్నా.. విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదు.
రూ.25కోట్ల పైమాటే..
ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ రూ.25 కోట్లమేర ప్రైవేట్, గిరిగిరి, డైలీ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. చాలామంది రూ.10వేలు మొదలు.. రూ.50లక్షల వరకూ అప్పు ఇస్తున్నారు. ముందుగానే రూ.10 నుంచి రూ.15 వడ్డీని పట్టుకుంటున్నారు. (రూ.వెయ్యి అప్పుగా తీసుకుంటే రూ.150 పట్టుకుని రూ.850 ఇస్తారు) ఇందుకు ఖాళీ చెక్కులు, ప్రామిసరినోట్లు, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారు. బాధితుడు సకాలంలో అప్పు చెల్లించినా.. కాగితాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. మరికొందరు భూములను తాకట్టు పెట్టుకుని దాని విలువలో 40 నుంచి 60 శాతం అప్పు ఇస్తున్నారు. అనివార్య కారణాలతో ఆలస్యమైతే.. అప్పుఇచ్చే సమయంలో రాయించుకున్న కాగితాల ప్రకారం.. యజమానికి సమాచారం ఇవ్వకుండానే అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆస్తిని హామీగా ఉంచితే 9 శాతం, హామీ లేకపోతే 12శాతం వడ్డీ తీసుకునే అవకాశం ఉంది. కానీ.. జిల్లాలో మాత్రం 40నుంచి45 శాతం వసూలు చేస్తున్నారంటే వ్యాపారుల అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. భూములు తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చేవారు కరీంనగర్ నగరంలోనే 30మంది, ప్రైవేట్ ఫైనాన్స్‌లు, డైలీ, గిరిగిరి ఫైనాన్షియర్లు 70 మంది వరకూ ఉన్నారు.
పోలీసులూ.. ఫైనాన్షియర్లే..
మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతం బయటకు రావడంతో అధిక వడ్డీలకు అప్పు ఇస్తున్నవారిలో పోలీస్ అధికారులూ ఉన్నట్లు అవగతమవుతోంది. కరీంనగర్‌లోనే పలు ఠాణాలు తీరుగుతున్న ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు కూడబెట్టడంతోపాటు పలు వెంచర్లలోనూ భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. విభజిత జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో ఉంటున్న సుమారు 20 మంది వరకూ అప్పులిస్తారని, వీరు కూడా 5 నుంచి 8 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని సమాచారం. వీరు సొంతశాఖలోని సిబ్బందికే అప్పు ఇచ్చి.. చెల్లించడంలో ఆలస్యమైతే అధికారి ద్వారా ఒత్తిడి తెచ్చి వారివేతనం నుంచి తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరిబారిన పడినవారు చాలామంది ఉన్నా.. బయటకు చెప్పుకోలేకపోతున్నట్లు సమాచారం. గతంలో పలువురు వడ్డీ విషయంలో హెడ్‌క్వార్టర్‌లోనే పలు గొడవలు కూడా జరిగాయని సమాచారం.
నిర్లక్ష్య ఫలితం..?
అప్పు తీసుకునే వ్యక్తినుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకోవడం చట్టరీత్యా నేరం. దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే ఫైనాన్షియర్లలో పోలీసులే ఉండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఒకవేళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. చిన్నచిన్న కేసులు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఫిర్యాదు చేయాలంటే జంకుతున్నారు.
ఆదాయపన్ను శాఖ ఏం చేస్తోంది..?
నిబంధనల ప్రకారం చేబదులుగా అప్పు ఇస్తే అనుమతి అవసరం లేదు. వ్యాపారంగా చేస్తే మాత్రం లైసెన్స్ ఉండాలి. కానీ.. జిల్లావ్యాప్తంగా అప్పు ఇస్తున్న ఫైనాన్స్ సంస్థలు ఎలాంటి అనుమతి లేకున్నా.. ఆదాయపన్నుశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నా.. ఐటీ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదో అంతుచిక్కని ప్రశ్నగామారింది. గతంలో అదాయపన్ను శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి అధికంగా భూములు కోనుగోలు చేస్తున్న సమాచారం సేకరిస్తుండగా.. ఓ వ్యక్తి కరీంనగర్ మండలంలో రూ.30 కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. కోట్ల రూపాయలు డైలీ, గిరిగిరి ఫైనాన్స్‌లు నడిపిస్తున్నవారిలో 95 శాతంమంది కనీసం రూ.లక్ష కూడా ఆదాయపన్ను చెల్లించడం లేదని సమాచారం.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సిరిసిల్లలో పోలీసులు దాడులు చేసి.. పలువురు వ్యాపారులను అరెస్ట్ చేయడంతో మిగిలిన మూడు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఫైనాన్షియర్ల బారినపడిన వారి వివరాలు సేకరించాలని పోలీసుల అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
Published Fri, Feb 9 2018 3:26 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment