వెంకన్నకు కూడా దయ లేదాయె! | 4 Died And 11 Members Injured In Road Accident In Karnataka While Returning From Visiting Tirumala Venkanna | Sakshi
Sakshi News home page

వెంకన్నకు కూడా దయ లేదాయె!

Published Sun, Dec 22 2024 12:26 PM | Last Updated on Sun, Dec 22 2024 12:52 PM

Road Accident In Karnataka

దారికాచిన మృత్యువు

మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం 

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న  టెంపో ట్రావెలర్‌  

నలుగురు మృత్యువాత..   11 మందికి తీవ్ర గాయాలు 

మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు 

తిరుమల వెంకన్నను దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఘటన

వెంకన్న దర్శనం చేసుకుని తిరిగివస్తున్న వారిని మృత్యువు కాటేసింది. రెప్పపాటులో నలుగురిని బలితీసుకుంది. మరో 11 మందికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మరో 45 నిమిషాల్లో ఇళ్లు చేరతారనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ఉండటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మడకశిర రూరల్‌:  శ్రీసత్యసాయి  జిల్లా మడకశిర  రూరల్‌ పరిధిలోని బుళ్లసముద్రం గ్రామ సమీపంలో  544ఈ– జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఆగి ఉన్న లారీని టెంపోట్రావెలర్‌ వెనుక నుంచి ఢీ కొనడంతో ఈ  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా... 
గుడిబండ మండలం కేఎన్‌ పల్లి గ్రామానికి చెందిన శివరాజు, ప్రేమకుమారి(30) దంపతులకు అథర్వ (2) సంతానం. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శివరాజు కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించేందుకు కుటుంబీకులు, బంధువులతో కలిసి గురువారం సాయంత్రం ఓ టెంపోట్రావెలర్‌లో తిరుమల వెళ్లారు. శుక్రవారం తిరుమలలో అథర్వ నామకరణం, తలానీలాల కార్యక్రమం ముగించుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామం కేఎన్‌ పల్లికి తిరుగు పయనమయ్యారు. వీరి వాహనం శనివారం తెల్లవారుజామున మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోకి రాగానే 544ఈ– జాతీయ రహదారిపై ముందు నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో ప్రేమకుమారి, అథర్వతో పాటు అమరాపురానికి చెందిన శివరాజు పెద్దమ్మ రత్నమ్మ(65)తో పాటు పావగడ తాలుకా కొండపురం గ్రామానికి చెందిన డ్రైవర్‌ మనోజ్‌(32) మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంతో పాటు మడకశిర ఫోర్‌ వీలర్‌ అసోసియేషన్‌ వాహనాల్లో మడకశిర ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ఈ ఘనటపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నామకరణమే చివరి సంబరం.. 
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... అందులో శివరాజు భార్య ప్రేమకుమారి(30), కుమారుడు అథర్వ (2)తో పాటు శివరాజు పెద్దమ్మ రత్నమ్మ (65) ఉండటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు అథర్వకు నామకరణం చేసి గంటలు గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శివరాజు దుఃఖసారగంలో మునిగిపోయారు. భార్యను, బిడ్డను కోల్పోయి అతను రోదించిన తీరు స్థానికులనూ కంటతడిపెట్టించింది. మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చిన్నారి అథర్వ మృతదేహం చూసిన వారంతా ‘అయ్యే ఎంత పని చేశావ్‌... దేవుడా అంటూ’ కన్నీరుమున్నీరయ్యారు.  

ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు.. 
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అమరాపురం మండలం శివరం గ్రామానికి చెందిన నాగమణి,  గుడిబండ మండలం కేఎన్‌పల్లి గ్రామానికి చెందిన  గీతమ్మ, శ్రీదేవి, టీచర్‌ సుజాతమ్మ, కమలమ్మ, గంగమ్మ, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హరిబ్బి గ్రామానికి చెందిన శ్వేత, పావగడ తాలుకాలోని హర్తికేరే గ్రామానికి చెందిన గిరిజమ్మ, ఉమే‹Ù, అమ్మాజామ్మ, చిత్రదుర్గ జిల్లాకు చెందిన రవీంద్రలను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, కుటుంబీకులు, బంధువులు, గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న తమవారిని చూసి తల్లిడిల్లిపోయారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 10 మంది మెరుగైన వైద్య చికిత్సల కోసం తుమకూరు ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రత్న.. 
రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఎస్పీ రత్న, డీఎస్పీ వెంకటేశ్వర్లు వెంటనే మడకశిరకు వచ్చారు. నేరుగా ఘటన స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అనంతరం మడకశిర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల పరామర్శించారు.  

నిద్రమత్తే కొంపముంచిందా?.. 
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శివరాజు శనివారం బెంగళూరుకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వెంకన్న దర్శనం కాగానే కుటుంబంతో కలిసి  స్వగ్రామం బయలుదేరారు. తెల్లవారుజాము కంతా ఇంటికి చేరాలన్న ఆలోచనలో ఎక్కడా వాహనం నిలపలేదు. రాత్రంతా వాహనం నడిపి అలిసిపోయిన డ్రైవర్‌ మనోజ్‌(32)కు నిద్రమత్తు వచ్చింది. దీంతో ఆతను గోరంట్లలో వాహనం నిలిపి టీ కూడా తాగాడు. ఓ గంటలో వాహనంలోని వారిని స్వగ్రామం చేరిస్తే తన పని అయిపోయిందని భావించి వెంటనే బయలు దేరాడు. ఇదే క్రమంలో బుళ్లసముద్రం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. 

నేనేట్లా బతికేది దేవుడా... 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ మనోజ్‌ ఆరేళ్ల క్రితం డ్రైవర్‌గా బెంగళూరులో పనిచేసే వాడు. అక్కడే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వినుతను ప్రే­మించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం స్వ­గ్రామం పావగడ తాలుకా కొండాపురం  వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతదేహాన్ని మడక­శిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా,  విగతజీవిగా చూసి భార్య వినుత బిగ్గరగా రోదించారు. ‘‘నాకు దిక్కెవరు దేవుడా...నేనెట్టా బతికేది’’ అంటూ ఆమె చేసిన రోదించిన తీరు అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement